Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా తంపి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా తంపి

అనితా తంపి మలయాల కవయిత్రి. అలతి అలతి పదాల్లో ఆమె కవితలు మన కళ్ళ ముందొక దృశ్యాన్ని నిలబెడతాయి. చదువుతూ చదువుతూ మెల్లిగా అడుగులేసుకుంటూ మనం ఆ దృశ్యంలోకి, ఓ చిక్కని పనస చెట్టు చల్లని నీడ లోకో, పచ్చని పొలాల్లో వీచే పైరగాలికి రేగి పోయే వెంట్రుకలు సర్దుకుంటూనో, ఆ గాలి చల్లగా తాకుతున్న హాయిలో మైమరచిపోయి ఆ అందమైన సాయంకాలంలో తనువుని మరచి గాలిలో సుగంధం కలిసిపోయినట్టుగా తన్మయిత్వం పొందుతాము. సైన్సు, ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైన అనిత పాఠకుణ్ణి తను వర్ణించే దృశ్యంలోకి తీసుకెళ్ళే ప్రతిభకి కారణం తన చదువే అంటుంది.

కవిత్వం చేసే నేర్పుంటే జీవితంలోని ఎంత చిన్న ఘటన అయినా అనుభవమైనా కవితయి కూర్చుంటుందనటానికి Writing అనే ఈ కవిత ఉదాహరణ.

Writing

అకస్మాత్తుగా
నీటి ప్రవాహం ఆగింది
స్నానం చేస్తూండగా.

తుప్పు పట్టిన కొళాయీ
ఆగింది
ఈల వేస్తూ.

నగ్నంగా ఉన్న
శరీరం వణికింది
జలదరిస్తూ.

వణికించే గాలి
కిటికీ లోంచి
దాని వేళ్ళు
చాచింది.

చల్లగా
ఉండాలనిపించింది
ఓ క్షణం నాకు.

తడితనపు
వలువ
దూరంగా ఎగిరిపోయింది

సిగ్గు
నే మరచాను
కావరపు వేసవిని
కప్పుకుని.

వర్షిస్తూ
వృక్షంలా
జుట్టు పాయలు.

శరీరంపై
రాస్తాయి
స్మృతిపధంలోంచి

నీటితో
కేవలం ఒకటో
లేక
రెండు లైన్లు.

మలయాలీ ఆడవారికి ప్రతిరోజూ తలంటుకునే అలవాటు ఎంత పెద్ద జుట్టున్నా, చలికాలమైనా. ఇంట్లో అయితే పరవాలేదు, ఆఫీసుకైనా వారు జుట్టు ఆరబెట్టుకోకుండా, నీళ్ళు కారే జుట్టుకి ఒక రబ్బరు బేండ్ తగిలించి వచ్చేస్తారు. ఆ జుట్టు నీరు కారుతూ వెనక బట్టలు తడిచినా వారు అలానే పనిచేయడం నా అనుభవం. కాకపోతే చెట్టు నీరు కారుస్తున్నట్టు నీటితో జడపాయలు ఒకట్రెండు లైన్లు స్మృతిపధంలోంచి రాస్తాయనడం కొసమెరుపు.

Fruit As It Is, Sweeping The FronT Yard అనే కవితల్లో మొదటిది ఒక స్త్రీ శరీరాన్ని అసభ్యత లేకుండా పనస పండు తో పోలుస్తుంది. చదువుతుంటే బాగా మగ్గిన పనస తొన వాసన రావాల్సిందే. అలాగే రెండవ కవిత చదువుతుంటే తెల్లవారకుండానే చీపుళ్ళతో వాకిలి శుభ్రం చేసే చప్పుడు వినపడాల్సిందే. ఎక్కడికక్కడ ఫ్లాట్స్ కల్చర్ వచ్చి ఇప్పుడు ఆ శబ్దాలు అపురూపం అయిపోయాయనుకోండి. వాకిలి శుభ్రం చేసే అతి సామాన్యమైన పనిలో ఎవరూ గమనించని విషయాన్ని ఆమె ప్రస్తావిస్తుంది. రాత్రంతా వానపాము నిద్రపోకుండా మట్టిని తొలిచి చిన్న చిన్న ఇళ్ళు కడుతుందట తెల్లారేటప్పటికి చీపురు పుల్లల బారిన పడి కొట్టుకు పోతాయని తెలియక. పని పిల్ల గానీ, ఇల్లు గానీ, తెల్లారాకా తలుపుని తాకే పేపర్, కాఫీ తాగుతూ చదెవే వారు గానీ ఎవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకోరు. అలా మనుషులతో పాటు వస్తువులన్నిటికీ ఆమె ప్రాణం పోస్తుంది. ఈ ఒక్క ప్రస్తావన వల్ల ఆ కవితలో ముఖ్యంగా పైకి కనిపించేదానికన్నా ఎక్కువే ఆమె చెప్తుందనిపిస్తుంది. ఒకరికి రొటీన్ పని వేరొకరికి ప్రాణ సంకటం. మొన్నటి కొల్కత్తా బ్రిడ్జ్ కూలిన సంఘటన గురించి కంపెని అధికారులు వ్యాఖ్యానిస్తూ ఇలాగే అన్నారు. ఇప్పటికి 27 ఏళ్ళుగా మేమిదే చేస్తున్నాము, 59 పిల్లర్లు కూడా ఇలాగే కట్టాము, 60 వ పిల్లరు కూలిందంటే, ఎలా కూలిందో మాకు మాత్రం ఏంతెలుసు అని.

ఈ రోజుల్లో ఏదీ స్వఛ్చంగా లేదు. గాలి, నీరు, నేల, శబ్దం, నిశ్శబ్దం, పరిసరాలు ఏదీ కూడా. ఇక ఇప్పుడు ఏ నదీ తీరానికో, సముద్ర తీరానికో పారిపోయినా స్వఛ్చత దొరకదు. మనిషి వెళ్ళిన ప్రతి చోట తన మలినాల్ని గుర్తులుగా వదిలి వస్తాడు. నదులూ చెరువులూ కలుషితమై నీరు నల్లగా డ్రైనేజ్ వాటర్ లాగే కనపడుతుంది. దానికి కోల్పోయిన పవిత్రతని ఇవ్వడం పోయి రకరకాలుగా కలుషితం చేస్తూనే ఉన్నాం మనం. ఎటు వెళ్ళినా వెక్కిరిస్తూ గాలికి ఎగిరే ప్లాస్టిక్ కవర్లూ, దుమ్ము పొగతో నల్లబడి పోయిన గోడలూ, ఆఖరికి వానపడితే తప్ప చెట్లు కూడా గ్రీన్ గా కనపడవు. ఎప్పుడైనా ఒక గంట కరెంటు పోతే మనం ఏంచేస్తాం. కొంచం సేపు ఏం చెయ్యాలో తెలియదు, విసుక్కుటాం, తిట్టుకుంటాం, ఆ తరవాత ఏం చెయ్యొచ్చని ఆలోచిస్తాము. అప్పుడు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడటం, లేదా ఏదైనా పుస్తకం చదవడం, ఇల్లు సర్దుకోవటం, ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడటం, పాత విషయాలు, లేదా గతించిన పెద్దల్ని గుర్తు చేసుకోవటం, రాత్రనుకోండి అలా చల్ల గాలికి బయటికి వెళ్ళి, నక్షత్రాలు కొలువుతీరిన ఆకాశం చూసి, చందమామ కూడా ఉంటే ఇంకొంచం బోనస్ అనుకోండి, ఇంత ప్రశాంతతని, మనసు విప్పి మాట్లాడుకోవడంలోని ఆనందాన్ని, కరెంటుండటంవల్ల కోల్పోతున్నామా అని ఆశ్చర్య పడక మానం.

In The Palm

వేళ్ళ పక్కల నుంచి
పోతూ మనుషులు చెమటలు కక్కుతూ, రొప్పుతూ

మురుగుకాల్వల ఒంపుల్లో
ఉద్యానవనాలు కాలేని పచ్చదనం
కాల్చబడుతుంది

వీటిపైన
నిటారుగా నిలబడి
ఎండలో మెరుస్తున్న సైన్ బోర్డులు
అన్ని దిక్కులా పరిగులెత్తుతూ
వాహనాలు రొదపెడుతూ

జనం కళ్ళనుండి దాచేసిన
ఆకాశపు తునకలు,
వేలిగోర్ల దగ్గర నల్లని నెలవంకలు

ధమనుల చిత్రపటంలో
గిలగిలలాడుతూనే సరిహద్దులు

అకస్మాత్తుగా
చేయి చేయి కలిసిన
ఓ మెరుపు కదలిక

వస్తువులపై కోపంతో
వస్తువులతో నిండిన భవనాలు
కుప్పకూలాయి.

కరెంటు, శబ్దాలు, దృశ్యాల
బరువుతో అలిసిన ప్రకటనలు
వాకౌట్ చేసాయి.

జ్ఞానమంతా వదిలిపెట్టి
తీగలన్నీ
చిక్కుబడిపోయాయి

ఒక్క క్షణంలో
చిన్నపిల్లల బొమ్మల్లోలా
కొండలు,
మధ్యన సూర్యుడు
కనపడ్డాయి
ఇక వచ్చాయి
నదులు, వరిపొలాలూ
మేఘాలూ, చెట్లూ,
నల్లని మనుషులు, పశువులూ,
గోమయ పోషణతో,
పచ్చని గడ్డిదారులు

ఒకే ఒక్క క్షణంలో
అంతా జరిగిపోయింది
విత్తటం, పంట కొయ్యటం
కోత కోసిన వరిపొలంలో
ఎండిన వరికంకుల్ని పొడుస్తూ
పక్షులు తిరుగాడుతున్నాయి

చేయి చేయి గట్టిగా కలిసింది
అన్వేషణ మొదలయింది
సంకేతాల మూలాల కోసం
ఎక్కడ రక్తం మొలకెత్తుతుందని.

విద్యుత్తూ, కంప్యూటర్లూ, ఇంటర్నెట్లూ తెచ్చిన విప్లవాత్మక మార్పులు మార్కెటింగూ, కస్యూమరిస్మ్. దేన్నైనా అమ్మతగిన వస్తువుగా మార్చేసే గ్లోబల్ మార్కెట్ వ్యవస్థ ఇనుప గొలుసుల్లో చిక్కుకుపోయి మనిషి ఇప్పుడు గిల గిలా కొట్టుకుంటున్నాడు. ఈ పరిస్తితి నుంచి ఒక్కసారిగా, ఒక్క క్షణంలో తిరిగి పాత స్వఛ్చ్మైన పరిసరాల్లోకి వెళ్ళిపోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇదే కోరికని అనిత ఈ పోయెంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్తితి కలగా తప్ప రావడం సులభమా? అలా అని ఆమేమీ అనుకోవట్లేదని ఆఖరి రెండు లైన్లూ చెబ్తాయి. ఈ పరిస్తితులు తిరగబడాలంటే పోరాటం చెయ్యాలి అందుకే రక్తం మొలకెత్తే మూలాల్ని అన్వేషిచాలి అంటుంది.

2004 లో పబ్లిష్ అయిన సంకలనం Sweeping the Courtyard ని ప్రముఖ మలయాల పత్రిక కేరళలో The Best Poetry Book of the Year గా ఎంపిక చేసింది. ఆమె రచనలు ఇంగ్లీష్, స్వీడిష్, ఫ్రెంచ్, జెర్మన్ భాషల్లోనికీ ఇంక ఇతర భారతీయ భాషల్లోకీ అనువదింపబడ్డాయి. ప్రతి కవితా ఒక సంపూర్ణ భావ చిత్రం. రాజకీయ అవగాహనతో రాసిన ఈ పోయెం చూడండి.

Emblem
The sickle
Joined
The crescent in the sky
The star
Returned
To the eyes of children
The hammer
Alone
- pained by its unromantic origins -
Started pounding
On the nail-heads
That were yet to hang
History
As pictures.

ఈ పోయెంలో రెండవ భాగం హైలైట్. సుత్తి తన unromantic image వల్ల బాధపడి ఇంకా చరిత్ర చిత్రాలని వేలాడగట్టుకోవాల్సిన మేకులన్నిటి నెత్తి మీదా బాదుతోందట. అద్భుతమైన సటైరు కమ్యూనిస్ట్ పార్టీ emblem మీద.

- Sharada Sivapurapu