Facebook Twitter
" ఏడు రోజులు " 16వ భాగం

" ఏడు రోజులు " 16వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 ముంబాయిలో విమానం దిగాక ఆమెను ఒక పెద్ద హోటల్లోకి తీసుకెళ్ళాడు షేకు అక్కడ గదుల్లో షేకులాంటి వ్యక్తులు దాదాపు పదిమంది వరకు కనిపించారు. వాళ్ళల్లో కొందరి గదుల్లో అమ్మాయిలు కనిపించారు. ఆ అమ్మాయిలు తనలా బాధపడకుండా ఎంతో ఆనందంగా కనిపించడంతో గౌసియాబేగం ఆశ్చర్యపోయింది.
    
    కేవలం అందమైన స్త్రీలను అనుభవించడంకోసం పనిగట్టుకుని గల్ఫ్ దేశాలనుండి షేకులు వస్తారని, నెలల వారిగా తిష్టవేస్తారని, వాళ్లకి కావాల్సినంత సుఖాన్ని అందిస్తూ భారతీయ వేశ్యలు దండిగా డబ్బు సంపాయించుకుంటున్నారని గౌసియా బేగానికి తెలియదు అందుకే తను కూడా వాళ్ళలా ఆనందంగ కనబడాలి కాబోలు అనుకుంది.
    
    "చూశావా? ఆ అమ్మాయిలు ఎంత చక్కగా సహకరిస్తున్నారో?" తమ గదిలోకి వెళ్ళాక తలుపులు దగ్గరగా వేస్తూ అన్నాడు షేకు.    
    
    "..."
    
    "నువ్వుకూడా అలాగే వుండాలి. ఇలా ఏడుస్తూ వుంటే నేను ఒప్పుకోను" అంటూ వచ్చి ఆమెను తన మీదకు లాక్కున్నాడు.
    
    తన ప్రియుడు కూడా ఎప్పుడూ అలా చేయలేదు. తమ మధ్యన కొనసాగింది స్నేహబంధంలాంటి ప్రేమ! అందుకే పురుషుడి తాలూకు బలమైన తొలి స్పర్శకు ఆమె దాదాపుగా అదిరిపడింది.
    
    కిటికీలోంచి బయట అంతా స్పష్టంగా కనబడుతోంది. కిటికీకి చేరువగా వున్నా వేపచెట్ల కొమ్మలమీద బుల్ బుల్ పిట్టలు స్వేచ్చగా కూర్చుని వున్నాయి. వాటిని చూసిన ఆమె మనసు 'మరి నాకెందుకు ఈ పంజర జీవితం? వాటిలా స్వేచ్చగా నేనెందుకు ఉండలేకపోతున్నాను? నా శరీరం నా అనుమతి లేకుండా ఎవ్వరికోసమో ఎందుకు అంకితమైపోతోంది? వద్దు బలవంతంగా నేను బలికావద్దు' నాటో ఆక్రోసించింది. ఆ తర్వాత ఆవేశపడింది.
    
    తనను ముద్దాడబోయిన అతడి మొరటుపెదాలు ఆమెలో జుగుప్సని కలిగిస్తుంటే వెల్లువెత్తిన ఆవేశంతో అతడిని చప్పున నెట్టేసింది.
    
    ఆమె తన బలాన్నంతా ఉపయోగించడం వల్ల అతడు ఎగిరి బెడ్ మీద పడ్డాడు. తక్షణమే తమాయించుకుని ఆమెవైపు దెబ్బ తిన్న పాములా చూశాడు.
    
    ఆమె గజగజా వణికిపోయింది.
    
    "నిన్ను సుల్తానీ చేయాలనుకున్న నన్నే నెట్టేస్తావా? నీకెంత పొగరు?" పళ్ళబిగువున అంటూ లేచి ఆమెవైపు వచ్చాడు.
    
    ఆమె అప్రయత్నంగా అడుగులు వెనక్కి వేసింది.
    
    "రాత్రే నిన్ను అనుభవించాలనుకున్నాను. ఖుషీఖుషీగా నీ శరీరాన్ని నలిపివేయాలనుకున్నాను. కాని మా షేకులకి మందు పార్టీ ఇచ్చేసరికే తెల్లవారిపోయింది. అప్పటికే నేను నీరుగారిపోయాను. అందుకే ఇప్పుడు నన్ను కాదని నాకు కోపాన్ని తెప్పించవద్దు" అంటూ ఆశగా కళ్ళు పెద్దవిచేసి ఉన్మాదిలా ఆమెవైపు నడిచాడు అతడు.
    
    ఆమె అలాగే అడుగులు వెనక్కి వేస్తోంది. తన మీద అతడు పళ్ళు నూరగానే తనని కొడ్తాడేమో అనుకుంది. కాని అంతలోనే అతడిలో తన మీద కోరిక కనబడగానే మరింత భయపడిపోయింది.
    
    "నన్నేం చేయొద్దు" చేతుల్ని అడ్డం పెట్టుకుంది.
    
    అతడు కోరలు చాచిన పాములా ఆమె వైపుకు వస్తున్నాడు. ఆమెకు ముచ్చెమటలు పట్టేశాయి. ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నీళ్ళు ఆమె చెక్కిళ్ళమీదుగా కిందికి ప్రవహించసాగాయి.
    
    "నీవు నాకు తాతలా వున్నావు. నన్నేం చేయొద్దు" అంటూ అలాగే అడుగుల్ని వెనక్కి వేస్తూండగా అనూహ్యంగా అక్కడ వున్న టీపాయ్ ని తాకింది. ఆమె బలంగా తగలడంతో టీపాయ్ కదిలి దానిమీద వున్న ఫ్లవర్ వేజ్ కిందపడి భళ్ళున పగిలిపోయింది.
    
    తత్తరపాటుగా పగిలిన ఫ్లవర్ వేజ్ వైపు చూసిన గౌసియాబేగానికి చటుక్కున ఒక ఆలోచన మెదిలింది. ఆమె ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వంగి పగిలిన గాజు ముక్కను చేతిలోకి తీసుకుని అతడివైపు భయంగా చూస్తూ "నావైపు రావొద్దు" అంది గట్టిగా.
    
    ఈ అనూహ్య పరిణామానికి అతడు బిత్తరపోతూ ఆగిపోయాడు. ఆమె గాజు ముక్కను అలాగే పట్టుకుని గుమ్మంవైపు అడుగులు వేస్తూ "నా దగ్గరకి వస్తే నిన్ను పొడిచి చంపేస్తాను" అంది.
    
    అతడు కొన్ని క్షణాలు ఆమెవైపు విస్మయంగా చూసి ఆ తర్వాత చప్పున తన కుర్తాజేబులోంచి పిస్టల్ బయటికి తీసి "ఆ గాజుముక్కను పక్కకు పెట్టేయ్ లేదంటే కాల్చేస్తాను" అంటూనే పిస్టల్ని ఆమెకు గురి పెట్టాడు.
    
    ఆమె భయపడిపోయింది. అతడివైపు భీతిల్లిన నేత్రాలతో చూస్తూ నెమ్మదిగా వెళ్ళి గాజుముక్కను టీపాయ్ పై పెట్టేసింది.
    
    "శహభాష్" నవ్వుతూ అని పిస్టల్ని తిరిగి తన కుర్తా జేబులో పెట్టుకుంటూ "రా బేగం రా! నా కోసంరా" పిలుస్తూ ఆమెవైపు వచ్చాడు.
    
    ఆమె అక్కడే నిలబడిపోయి వుంది.
    
    "నీవు చిన్నపిల్లవి నీకు సుఖం గురించి తెలీదు. అందుకే అనవసరపు వేషాలు వేసి నన్ను విసిగిస్తున్నావు. ఒక్కసారి సుఖాన్ని రుచిచూస్తే ఇలాంటి వేషాలు ఇక వేయకుండా బుద్దిగా వుంటావు" అంటూ ఆమె వైపు వచ్చి ఆమె భుజాలపై చేయివేసి బిగించి పట్టుకున్నాడు.
    
    ఆమె అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది అతడు కూడా ఆమె కళ్ళల్లోనే చూస్తున్నాడు. కాకపోతే ఆమె కళ్ళల్లో భయం, అతడి కళ్ళలో కామం.
    
    అతడు ఆమె ముఖంమీదకు తన ముఖాన్ని పోనిచ్చి ఆమె పెదవుల్ని ఆబగా అందుకోబోయాడు.
    
    సరిగ్గా అదే క్షణంలో తన చేయిని వెనక్కిపోనిచ్చి టీపాయ్ మీద గాజుముక్కను అందుకుని వెనకాముందు ఆలోచించకుండా అతడి కడుపులోకి బలంగా పొడిచింది గౌసియాబేగం.
    
    "మా" అతడు బిగ్గరగా  అరుస్తూ వెనక్కి తుళ్ళాడు. అతడు తమాయించుకునే లోపు అదే గాజు ముక్కతో మరోసారి కసిగా గుచ్చింది. ఈసారి అతడు లుంగలు చుట్టుకుపోయాడు. ఆమె ఇక ఆగలేదు. ఇష్టం వచ్చినట్టుగా అతడిని పొడవసాగింది. అతడు భీకరంగా అరుస్తూనే తన కుర్తాజేబులోని తుపాకీని బయటకి తీయబోయాడు. కాని అది అతడివల్ల కాలేదు. తుపాకిని అందుకోబోయేలోపే అతడి చేతుల్లో శక్తి క్షీణించింది.
    
    ఆమెవైపు భయంకరంగా చోసోతూ "బేగం" అంటూ గర్జించాడు. ఎగజిమ్మిన రక్తపు మరకలతో తడిసిపోయిన గౌసియా బేగానికి తను చేసింది ఏమిటో అర్ధం కాగానే కాళ్ళూ చేతులు వణకనారంభించాయి.
    
    ఏడుస్తూ అతడివైపు చూస్తూ గాజుముక్కని చేతుల్లోంచి వదిలేసింది.
    
    అతడు కిందపడి మెలికలు తిరిగిపోతూ క్రమంగా తన చైతన్యాన్ని కోల్పోతున్నాడు ఫలితంగా అతడిలో కదలికలు నెమ్మదిగా ఆగిపోతున్నాయి.
    
    ఆమెకు అర్ధంకాలేదు అటూ ఇటూ చూసింది "అల్లా" అంటూ ఏడుస్తూ గుమ్మంవైపు పరుగెట్టి అతడివైపు ఒకసారి తిరిగి చూసింది.
    
    అతడు రక్తపు మడుగులో గింజుకుంటున్నాడు. అతడిని అలా చూడగానే ఆమెకు మరింత భయంవేసింది.
    
    "అల్లా అల్లా" గుండెలు బాదుకుంటూ గిరుక్కున వెనుతిరిగి తలుపు తీసుకుని వేగంగా బయటకి నడిచింది.
    
    అటూఇటూ వరసగా వున్న గదులన్నీ మూసుకుని వున్నాయి. బయట ఒక్కరు కూడా కనబడ్డంలేదు. ఆమె ఎటూ చూడకుండా పరుగున ముందుకు నడుస్తూ తల మీదనుండి తొలగిన బురఖాని సరిచేసుకుంది.