Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? శశి దేశ్పాండే


మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? శశి దేశ్పాండే

శశి దేశ్పాండే కర్ణాటకలోని ధర్వాడ్ లో శ్రీరంగ అనే ప్రఖ్యాత కళాకారుడు, రచయితకు పుట్టింది. ఆమె ఆర్ధిక న్యాయ శాస్త్రాలే కాకుండా జర్నలిజంలో కూడా పట్టభద్రురాలై ఆన్ లుకర్ మేగజిన్లో కొన్నాళ్ళు జర్నలిస్ట్ గా చేసింది. ఆ తరవాత ఆమె రచనలు చెయ్యడం ప్రారంభించింది. ఆమె మొదటి కధల సంకలనం 1978 లో వెలువడింది. 1980 లో ఆమె తన మొదటి నవల The Dark Holds no Terrors రాసింది.

1990 లో రాసిన That Long Silence అనే నవలకి సాహిత్య ఎకాడమీ ఎవార్డు వచ్చింది. 2009 లో ఆమెకు పద్మశ్రీ ఎవార్డు ఇచ్చింది ప్రభుత్వం. 2014 లో ఆమె రాసిన 2014 లో The Shadow Play అనే నవల The Hindu Literary Prize కి నామినేట్ అయింది. శశి దేశ్పాండే భారత దేశంలోని ఇంగ్లీషులో రాసే ఆరుగురు అత్యంత ప్రతిభాశాలులైన రచయిత్రులలో ఒకరు.

ఆమె ఇంగ్లీష్లో రాస్తుంది కానీ వెస్ట్ కోసం ఇండియాని అద్భుతంగా చిత్రించే పని చేయదు. కేవలం ఆ పాఠకులను తృప్తి పరచడం కోసం రాయదు. ఆమె స్త్రీ పాత్రలు ఒక శూన్యమైన సెల్ఫ్ ఇమేజ్ నుంచి సెల్ఫ్ రియలైజేషన్ వరకూ ప్రయాణం చేస్తాయి. ఇది అత్యవసరం స్త్రీ విద్యావంతురాలైనా కాకపోయినా, ఆర్ధికంగా స్వతంత్రురాలైనా కాకపోయినా. నేను ఫెమినిస్ట్ నే కానీ నేను ఎటువంటి ఇజం ని ప్రతిపాదించను సమర్ధించను అంటుందామె.

శశి 4 చిన్న పిల్లల కధల పుస్తకాలు, 9 నవలలు, ఎన్నో వ్యాసాలు, ఇప్పుడు ఇవి ఒక సంకలనంగా Writing from the Margin and Other Essays లభ్యమవుతున్నాయి. ఆమె ఇప్పటికీ ఇంగ్లీష్ పత్రికల్లో ఎన్నో సామాజిక, సమకాలిక అంశాలపై వ్యాసాలు రాస్తూనే ఉంది. కలబుర్గి హత్యపై స్పందిస్తూ ఆమె తన ఎవార్డులను తిరిగి ఇచ్చివేసింది. ఎకాడమీ మౌనం వహించడాన్ని నిరసిస్తూ, సాహిత్య ఎకాడమీ జెనెరల్ కౌన్సిల్లో తన హోదాకి కూడా ఆమె స్వస్తి చెప్పింది . ఆ సందర్భంగా ఆమె రాసిన వ్యాసాన్ని ఒకదాన్ని నేను తెలుగులోకి అనువదించాను, దాన్ని Face Book లో షేర్ చేసుకున్నాను కూడా.

ఒక స్త్రీ చదువుకుంటే తన కుటుంబమంతటికీ ఆమె విద్య ఉపయోగపడుతుందనీ, ఆమె పెంపకంలో పిల్లలపై ఆమె విద్య ప్రభావం సమాజాన్ని పురోగమనం వైపుకి నడిపిస్తుందని అంటారు. కానీ అది కేవలం విద్య నభ్యసించి, జ్ఞాన సముపార్జనవరకే, అంటే కుటుంబాన్నినడిపించడంలో తన బాధ్యతను ఇంకొంచం తెలివిగా చురుకుగా నిర్వర్తించడానికే. అంతకంటే ఏ స్త్రీ అయినా ఎక్కువ ఆశిస్తే ఆమెకు ఎదురయ్యేది సాధారణంగా భంగపాటే.. ఈ భంగపాటునీ, చదువుకుని, ఉద్యోగస్తులైన స్త్రీల సమస్యలనీ శశి తన The Dark holds no Terrors అనే నవలలో ఎంతో చక్కగా చిత్రిస్తుంది. సరిత ఆకా సరు తన చిన్నప్పట్నుంచి తన తల్లి నుండే విపరీతమైన వివక్ష ఎదుర్కొంటూంటుంది. ఇదేంటి అని ఆశ్చర్యపడక్కరలేదు. స్త్రీలకి పురుషుల వల్ల మాత్రమే కాదు సాటి స్త్రీల వల్ల కూడా చాలా కష్టాలొస్తాయి చాలా సందర్భాలలో. కొడుకునొకలాగా కూతుర్నొకలాగా చూడటానికి తల్లులు కూడా ఎలా indoctrinate అవుతారో వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరు తమ్ముడు ఏడేళ్ళపుడు నీళ్ళల్లో మునిగిపోయి చనిపోతాడు అదీ సరూ చూస్తూండగానే. కేవలం మూడేళ్ళు పెద్ద అయిన సరు తమ్ముడ్ని రక్షించుకోలేక పోతుంది. ఇదే కారణంగా ఆమెను అప్పట్నుంచీ తమ్ముడిని చంపిన అక్క గానే చిత్రించి సూటీ పోటీ మాటలతో తల్లి హింసిస్తూంటుంది. వాడు పోయాకా నువ్వు మాత్రం బ్రతికుండటం ఎందుకు? నువ్వూ పోతే ఒక ఏడుపు ఏడ్చి ఊర్కుంటాను లాంటి మాటలతో ఆమెను ఒక శత్రువుగానే చూస్తుంది తప్ప కూతురిలా ఎప్పుడూ చూడదు. కొడుకూ కూతురూ సమానం కారు, కొడుకు పోయాకా, అతని చావుకి కారణమని అనుకునే కూతురుకి విలువ ఏముంటుంది? ఆమెకు కూతురిగా దక్కాల్సిన ప్రేమ ఎలా దక్కుతుంది? ఈ రకమైన వాతావరణంలో ఇంటరు వరకూ చదువు అయ్యాకా, మెడిసిన్ చెయ్యాలని అనుకుంటుంది సరు. తల్లి ఇందుకు ఒప్పుకోదు, డిగ్రీ చేసిన తర్వాత పెళ్ళి చేసి పంపాలని ఆమె ఉద్దేశ్యం. కానీ సరు పట్టు పడుతుంది. తల్లిని ఎదిరిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తండ్రి ఆశ్చర్యకరంగా సమర్ధిస్తాడు. అలా ఆమె మెడిసిన్ చేస్తుంది. తల్లీ కూతుళ్ళ మధ్య ద్వేషం గొడవల వల్ల సరు తన తల్లిని కొడుకుతో పాటు కూతురిని కూడా పోగొట్టుకున్న ఫైల్యూర్ లాగా ట్రీట్ చేస్తుంది. తల్లి ఇంట్లోంచి ఒకసారి బయటికెళితే మళ్ళీ తిరిగి రాకూడదని అనుకుంటుంది. కానీ చిత్రంగా అనుకోని పరిస్తితుల్లో ఆమె తన తల్లి చనిపోయిందని తెలిసిన తరవాత తండ్రిని చూసే నెపంతో 15 ఏళ్ళ తరవాత పుట్టింటికి రావడంతో కధ మొదలవుతుంది.

మెడిసిన్ చేస్తూనే సరు మనోహర్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తల్లి తండ్రులకిష్టంలేకపోయినా ఎదిరించి పెళ్ళి చేసుకుంటుంది. కొన్నేళ్ళ పాటు అంతా బాగానే ఉంటుంది. సరూ ఒక మంచి డాక్టరుగా ఎదిగి సమాజంలో గౌరవింపబడుతుంటే మనోహర్ ఒక మామూలు కాలేజీ లో లెక్చరర్గా పనిచేస్తూ భార్య కున్నంత గుర్తింపు గౌరవం పొందలేక పోతాడు. ఒక పేరున్న డాక్టరుగా ఆమె సంపాదనా హోదా అనుభవిస్తూనే, ఒక లేడీ డాక్టరు భర్తగా చెలామణి అవడాన్ని ద్వేషిస్తూ ఆమెపై కసి ఒకలాంటి పగా పెంచుకుంటాడు. ఇది అతను బయటికి వ్యక్తం చెయ్యకపోయినా ప్రతి రాత్రి ఆమెను సెక్స్ పేరిట బలవంతంగా హింసిస్తూ తన పురుషాధిక్యతను చూపిస్తుంటాడు. పగలు ఒక మంచి డాక్టరుగా పనిచేస్తూ రాత్రుళ్ళు మాత్రం భర్త పశుత్వానికి బలవుతుంటూ రెండు రకాల జీవితం మధ్య చెప్పలేని మానసిక సంఘర్షణ అనుభవిస్తుంది. ఒకప్పుడు ఆమె తన భర్త తనకిచ్చే భౌతిక సుఖాన్ని తన తల్లితండ్రుల వద్ద నుంచి పొందలేని ప్రేమతో ఈక్వేట్ చేసుకుని ఆనంద పడేది. కానీ ఇప్పుడు అదే ప్రేమలో ఏదో లోటు కనిపిస్తుంది. భర్త చెప్పక పోయినా అతను ఎందుకు అలా మారాడో ఆమెకు తెలుస్తూనే ఉంటుంది. కానీ సరూ ఉద్యోగం విడిచిపెట్టి ఇంట్లోనె ఉంటానంటే అందుకు ఒప్పుకోలేక ఆమెను తన తియ్యటి మాటలతో బులిపిస్తాడు.

తన పిల్లలకు ప్రేమలో ఎటువంటి లోటూ రాకూడదని వారిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. కానీ తన పరిస్తితి ఆమెకు అగమ్య గోచరంగా ఉంటుంది. తండ్రి ఇంట ఆమెకు ఎటువంటి స్నేహ పూరిత ఆతిధ్యమూ దొరకదు. ఇష్టం లేని అతిధిని విధిలేక ఇంట నుండనిచ్చినట్టుంటుంది తండ్రి వ్యవహారం. అయితే అక్కడ ఆమె తన తమ్ముడు, తల్లి, తండ్రి, భర్తలతోటి తన సంబంధాలని రెవ్యూ చేసుకునే అవకాశం లభిస్తుంది. తన భర్తతో సంబంధం తెంచుకున్నా తనకు తండ్రి సమర్ధనా, ఆదరణా లభిస్తాయన్న నమ్మకం ఉందదు.

తన జీవితంలోని మనుషులతో తన సంబంధంలోని ప్రేమనీ, ప్రేమ రాహిత్యాన్నీ, దానికి కారణాలనూ అర్ధం చేసుకున్నాకా ఆమెకు తన జీవితంలోని అనిశ్చిత పరిస్తితిపై భయం పోతుంది. ఏమైనా సరే, ఎలాగైనా సరే, అదే జీవితంలోకి పూర్తి ధైర్యంతో understanding తో ఆమె తిరిగి వెళ్తుంది.

స్త్రీ వ్యక్తిగత ప్రగతి తన కుటుంబ ప్రగతి, కుటుంబ లక్ష్యాలతో ముడిపడి ఆ పరిమితుల్లోనే ఉన్నంత కాలం ఎవరికీ అభ్యంతరం ఉండదు. అంతకంటే పెద్ద కోణంలోంచి ఆమె తనను తాను ఆవిష్కరించుకోదల్చుకుంటే మాత్రం ఎక్కడో అసాధారణమైన సందర్భాలలో తప్ప సామాన్యంగా సాధ్యపడదు. స్త్రీ ప్రగతికి వ్యక్తిత్వ వికాసానికి ఆత్మానందం పొందడానికీ ఉన్న పరిమితులు, అవరోధాలూ పురుషుడికి లేవు, రావు కుటుంబం నుంచి గాని బయటి సమాజం నుంచి గానీ. ధనిక కుటుంబాల్లోని స్త్రీలకు ఈ పరిమితులు వర్తించక పోవచ్చు కొంతవరకూ కానీ లేవనుకోవడానికి లేదు.

సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చిన నవల That Long Silence కూడా తప్పక చదవాల్సినది. అందులో ఆమె పాత్ర 'జయ' ఒక ఆదర్శ గృహిణిగా పేరు తెచ్చుకుని టైప్ కాస్ట్ అయ్యే ప్రయత్నంలో ఎంతో సంఘర్షణననుభవిస్తూ చివరికి తన గొంతు విప్పి తను చెప్పదల్చుకున్నది చెప్పి, చెయ్యదల్చుకున్నది చేసే దశకి ఎదుగుతుంది. ఆమె ప్రయాణం నిశ్శబ్దం నుంచి శబ్దంలోకి, అంతులేని సహనం చూపే పాతివృత్యపు ముసుగు తీసేసి, తన అసహనాన్ని చూపగలిగే మానసిక ధైర్యాన్ని పొందే స్తితికి వస్తుంది. ఆమె భర్త అభిప్రాయంలో శబ్దం చెయ్యడం, కోపాన్ని ప్రదర్శించటం స్త్రీత్వం కాదు. తన ఆయుధంగా ఆమె రచనని ఎన్నుకుంటుంది. ఏ మగ పాత్రని సృష్టించినా ఆమె భర్తకి అందులో తనే కనిపిస్తాడు. తన గురించే తన భార్య రాస్తే తాము తెలిసినవాళ్ళంతా ఏమనుకుంటారని అతను గొణుగుతుంటాడు. అలాగే ఏ స్త్రీ పాత్రని సృష్టించినా అందులో అతనికి తన అమ్మో చెల్లో కనిపిస్తారు. స్వానుభవంలోంచి కొంత చుట్టూ ఉన్న వారి అనుభవాలనుంచి కొంతా, కొంత కల్పనా కలిసి కధలవుతాయి సహజంగానే. ఈ విచిత్ర పరిస్తితి ఏ రచయితకైనా, రచయిత్రికైనా తప్పదేమో. సాహిత్య ఎకాడమీ ఎవార్డు తెచ్చిన ఈ నవల చలా ఆసక్తికరంగా సాగుతుంది.
అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ రచయిత్రులందరూ మనకి గర్వకారణం.

-Sharada Sivapurapu