Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 27వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 27వ భాగం

 కాంచీపురంలో కోవెలలన్నిటిలోనూ పూజలు జరిపించి వచ్చాడు పురుషోత్తమ దేవుడు. చక్రవర్తికి జరిగే మర్యాదలన్నీ జరిగాయతడికి.

  విజయోత్సాహంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు కళింగ సైనికులు. కాంచీ పురంలో తమ ‘ప్రతీక్ష’ నొకరిని పెట్టి, బంధించిన కంచిరాజుతో, పద్మావతితో, వరదయ్యతో. కంచి నుంచి భారీగా కప్పం వసూలు చేశాడు పురుషోత్తముడు.

  ముఖ్యంగా.. కాంచీపురంలో ఉన్న గజబలాన్నంతటినీ గ్రహించి వేశాడు.

                        

            సీ.      ఇనుమడించిన యట్టి యిభ బలగమ్ముతో

                                 కన్నుల వెలుగొంద కాంతులెన్నొ

                      దేవుని యండనే దివ్యముగా నుండ

                                 నాత్మవిశ్వాసమే నతిశ యింప

                      కాంచీపురము యంత కైవశ మవగానె

                                 ధీరత్వమున తాను దీటు గాను

                      వీధులందు కవాతు సాధనమున చేయ

                                 ఓఢ్ర వీరులు యంత నొలయ గాను

  

          తే.గీ.       విజయ భేరిని మోగించి వెడలె నపుడు

                        రమ్య పురుషోత్తముడతడు రాకొమరుడు

                        మాధవుడతని వెనువెంటె మౌనముగను

                        కదల సైన్యము తోడనే కటకమునకు.

 

  కటకము చేరిన వెంటనే, మహరాజు నేనా కలవకుండా.. కంచిరాజునీ, వరదయ్యనీ కారాగారంలో పెట్టమని ఆజ్ఞ ఇచ్చి తన మందిరానికి వెళ్లిపోయాడు పురుషోత్తముడు. మహరాజుగారేమంటారో!

  మరి పద్మావతి?

  “మొదటగా కనిపించిన ఛండాలునకిచ్చి పెళ్లిచేసి పంపించు..” తన మందిరానికి వెళ్తూ పురుషోత్తమ దేవుడు, వెనుతిరిగి చూడకుండా అని వెళ్లి పోయాడు.

  మాధవుడు నిశ్చేష్టుడై నిలబడి పోయాడు.

  ఏ పాపం ఎరుగని రాకుమారి ఏం చేసింది? రాజుల ఆగ్రహాలు ఇంత అర్ధంలేకుండా ఉంటాయా? కంచిలో ఏదో ఆవేశంలో అనేశాడనుకున్నాడు కానీ.. ఇంత లాగ మనసుకు పెట్టుకున్నాడా రాకుమారుడు?

  ఏమైనా.. తనకి చేతనయింది చెయ్యాలి. రాకుమారునిది తాత్కాలికమైన కోపం. కొన్ని రోజులైతే మరచిపోతారు. అప్పటి వరకూ, తనే బాధ్యత వహించాలి.

  పురషోత్తముడన్న మాటలు, పద్మావతి వరకూ వెళ్ల కూడదు. మరి ఆవిడనెక్కడ ఉంచాలి? రక్షణ ఏది?

  ఒక నిశ్చయానికి వచ్చి, పద్మావతీ దేవి మేనా వద్దకు నడిచాడు మాధవుడు.

                                     ………………

  “మాధవా! వచ్చావా నాయనా! ఉండు.. దిష్టి తీసేస్తాను. అంత పెద్ద యుద్ధం చేసి గెలిచి వచ్చావంటే ఎంత మంది కళ్లు పడుంటాయో!” సీతమ్మ వాకిట్లోనే నిలిపేసి, చాటలో ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి, పెరటి లోపల, దూరంగా..  మూలగా ఉన్న పొయ్యిలో వేసింది.

  ఎంత దూరమైతే మాత్రం, మిరపకాయలు పొయ్యిలో పడ్డాక ఊరుకుంటాయా… పొగ, గొట్రు ఇల్లంతా పాకి పోయాయి. వంట చేస్తున్న పని వాళ్లు, ఆజమాయిషీ చేస్తున్న నంద, గౌతమిలు.. అందరూ ఖళ్లు ఖళ్లున దగ్గుతూ, ముక్కుకు నోటికీ అంగోస్త్రాలు అడ్డు పెట్టుకుని వచ్చారు.

  ఆ రోజు.. యుద్ధం నుంచి వచ్చే సైనికుల కోసం, అరవై మందికి పైగా భోజనం సిద్ధం చెయ్యమని నందునికి ఆదేశం వచ్చింది. అప్పుడే అనుకున్నారు గౌతమీ, సీతమ్మా, మాధవుడు వచ్చేస్తున్నాడని.

  “ఈ రోజు మాధవునికి ఇష్టమైన సన్న బియ్యం పాయసం చేస్తా.. అందరికీ చేద్దామా నందా?” సీతమ్మ నందుడిని అడిగింది ఆత్రంగా.

  “తప్పకుండా చేద్దామమ్మా! విజయోత్సాహంతో వస్తున్నారు సైనికులు. యుద్ధం అవగానే అఘ మేఘాల మీద చారులు వార్త తీసుకొచ్చేశారు. మరి ఆ సంబరాలు చేసుకోవాలి కదా!”

 “అమ్మమ్మా! మన తూరుపు చావడిలో రెల్లిల్లు ఖాళీగానే ఉంది కదా!” సీతమ్మని దూరంగా తీసుకెళ్లి అడిగాడు మాధవుడు.

  “ఉంది. కానీ.. దాని వెనుకే పశువుల పాక ఉంది. బాగుంటుందా?”

  “ఫరవాలేదమ్మమ్మా! చుట్టూ పూల తోటుంది కదా.. కంచి నుంచి ఒక యువతిని తీసుకొచ్చాను..”

  “యువతినా?” మాధవుని మాట పూర్తి కాకుండానే సీతమ్మ సంభ్రమంగా అంది.

  “అబ్బెబ్బే.. ఏవో ఊహించుకోకు. ఆమె రాకుమారుని వరించింది. కొన్ని రోజులు, ఎవరికీ తెలియకుండా మన దగ్గర ఉంచుకోవలసిన పరిస్థితి. అక్కడైతే, ఏకాంతంగా ఉంటుందని. అటుపక్కకి ఎవరూ వెళ్లరుకద! అందుకే..”

  “రాకుమారుని వరించిందా? కంచి రాకుమారి కాదు కద..” సీతమ్మ ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేస్తుంది.

  “అవునమ్మమ్మా! కానీ ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు. అమ్మకీ, నాయనగారికీ చెప్తాను. ఇంకొక రెండు ఘడియల్లో మేనా ఇక్కడికి వస్తుంది. కొంచెం శుభ్రం చేయించి, పానుపు వేయిస్తావా?”

  “మరి.. రాకుమారి అంటే, ఎంతో సుకుమారంగా పెరిగి ఉంటుంది. ఈ పాకలో ఉండగలదా? గవాక్షాలు కూడా లేవు. హంసతూలికా తల్పాలు లేవు.. మెత్తని బూరుగు దూది పరుపుందనుకో. కానీ.. ఈ మట్టి ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది?” సీతమ్మకి సందేహాల పరంపర వచ్చేస్తోంది.

  “తప్పదమ్మమ్మా! కొన్ని రోజులు.. దమయంతీ దేవి, సీతమ్మవారిలాగ ఉండాలి. మంచి రోజులు వచ్చాక మహారాణీ అవుతుంది. ఆ మహా తల్లులు కానల్లో ఉన్నట్లుగా, పద్మావతీ దేవి మన వద్ద ఉండాలి.”

  “ఓ.. వనవాసమన్నమాట. ఘడియలో సదుపాయాలు చేయించెయ్యనూ..”

 

  “ఇక్కడ ఏలోటూ ఉండదు కన్నయ్యా! వాల్మీకి ఆశ్రమంలో జానకమ్మని చూసుకున్నట్లుగా చూసుకుంటాము. రాకుమార్తెని మన ఇంటి ఆడపడుచుని చూసుకున్నట్లు గౌరవించుకుందాము.” నందుడు, గౌతమీ హామీ ఇచ్చారు, మాధవుడు విషయం వివరించగానే.

  పద్మావతీ దేవిని తమ ఇంటికి తీసుకొని రావాలని, మాధవుడు ఎప్పడో నిర్ణయించుకున్నాడు. ఊరూ పేరూ తెలియని అనాధని తనని ఆదరించి, కన్న బిడ్డలాగ చూసుకుంటున్న నంద, గౌతమిలు పద్మావతీ దేవిని ఆదరించరేమోనన్న శంక అతనికే మాత్రమూ లేదు.

  అయినా.. అవునని పించుకునే వరకూ అనుమానం తప్పదు కదా! తేలిక పడిన మనసుతో, రెల్లు గృహాన్ని శుభ్రంచెయ్యడంలో సీతమ్మకి సహాయం చేసి, మేనా కోసం ఎదురు చూడ సాగాడు.

  మేనా వచ్చింది.

  బోయీలు కిందికి దింపగానే, మాధవుడు పరుగెత్తినట్లుగా దగ్గరగా వెళ్లాడు.

  తెరలు తప్పించి, పద్మావతీ దేవి కిందికి దిగింది. దాదాపు పది హేనురోజులు ప్రయాణం.. రాత్రిళ్లు మజిలీలు చేసినా, పగలంతా మేనాలో కూర్చొనుటే.

  మొహం వాడిపోయి, వలువలు చెదిరి పోయి, ముంగురులు రేగి పోయి.. రాకుమారి అలసటగా నిలబడి చుట్టూ గమనించింది.

  మాధవుడిని ఎరిగున్నదే కనుక సంకోచం పెట్టుకోలేదు.

  తమ సభలో అతడు రాయబారిగా ఎంతటి ప్రజ్ఞ చూపించాడో స్వయంగా చూసింది. తమ విధి ఈ విధంగా ఉంటే, వరదయ్య రూపంలో దురదృష్టం వెన్నాడుటలో వింత ఏమి లేదు.

  “అమ్మా! మీరు కొద్ది దినములు, ఈ పేదవాని ఆతిధ్యము స్వీకరించ వలసిందిగా కోరుతున్నాను.” మాధవుడు విధేయుడై అన్నాడు.

  “అంత మాట వద్దు సోదరా! కారాగారము తప్పించి నీ ఇంటికి.. పుట్టింటికి తీసుకొని వచ్చావు. అంత కంటే ఏం కావాలి ఈ శాపగ్రస్తకి? అమ్మా, నాన్నలని చూపించవా?” మధుర స్వరంతో, హుందాగా అంది పద్మావతి.

  “మడిలో ఉన్నారు. ఈ రోజు అతిధులు చాలా మంది వస్తున్నారు. మీరు లోనికి వచ్చి, స్నాన పానాదులు చేశాక, పలుకరిస్తారు. రండి రాకుమారీ!”

  “నేనిప్పుడు రాకుమారిని కాదు సోదరా! మీ సోదరిని. ఆ విధంగానే సంబోధించండి.” పద్మావతి పలుకులను విని తలెత్తి చూశాడు మాధవుడు. కానీ.. ఆవిడ మోములో గాంభీర్యం ఏ మాత్రం సడలలేదు.

  “ఇటు రండి సోదరీ!” మాధవుడు తూరుపు చావడి వైపుకి తీసుకెళ్లాడు.

  అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వసతిగృహంలో వచ్చే పోయే వారికి అటు ప్రక్కకి ప్రవేశం లేదు.

  రెల్లుగడ్డితో వేసిన పర్ణ కుటీరం.

  పాలరాయి భవంతులలో నివసించిన సుకుమారి.. పేడతో అలికిన కుటీరంలో ఉండగలదా? రాకుమారికి చూపించడానికి మాధవుడు సంకోచించాడు. కానీ, పరుల కంట పడకుండా ఉండగలిగే చోటు అదే వారింట. అది కూడా, యాత్రలకు వచ్చే ఘోషా స్త్రీల కొరకు వేయించాడు నందుడు.

  ఇంటి లోపల అన్ని సదుపాయాలూ ఉన్నాయి. అయినా.. గాలీ, వెలుతురూ తక్కువే అనుకోవచ్చు. ఐతే ఆరు బయట ఆహ్లాదమైన వనం.. చల్లని గాలి ఏ లోటున్నా తీర్చేస్తుంది.

                                        

 

  పూలవనంలో వెలిసినట్లున్న ఆ ఇంటిని చూడగానే రాకుమారి పద్మావతి, చెంగు చెంగున పరుగెత్తి, ఇంటిలోకీ, వెలుపలికీ వెళ్లి, అంతా పరిశీలించింది.

  “చాలా బాగుంది సోదరా! ఇంతకంటే ఇంకేమి కావాలీ? ప్రస్థుత పరిస్థితులలో నా అంత అదృష్టవంతులెవరూ ఉండరనుకుంటున్నాను.” కళ్ల నిండా నీళ్లతో, నవ్వుతూ అంది పద్మావతి.

  మాధవుని మోము మ్లానమయింది. తనేదో తప్పు చేసినట్లు తల పక్కకి తిప్పాడు.

  “నిజం అన్నా! వేరెవరి పాలైనా పడితే.. అంతఃపుర స్త్రీలని యే విధంగా అవమానిస్తారో కథలు కథలు వింటూనే ఉంటాము. మీరు నా గౌరవాన్ని కాపాడుతున్నారు. పిదప విధి నిర్ణయమేవిధంగా ఉందో అట్లే జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవి ఆనంద భాష్పాలు.” బుగ్గల మీదుగా నీరు కారి పోతోంది.

  “అయ్యో.. ఎందుకు తల్లీ ఆ కన్నీరు.. మంచే జరుగుతుంది. నేనిక్కడుండగా నిన్ను చీమ కూడా కుట్టదు.” అప్పుడే అక్కడి కొచ్చిన సీతమ్మ, తన కొంగుతో పద్మావతి కన్నీరు తుడిచి.. చటుక్కున వెనక్కి నడిచింది, సంకోచిస్తూ..

  రాకుమారి.. తను తాకచ్చో లేదో! సహజ సిద్ధమైన మాతృ హృదయంతో ఓదార్చ బోయింది. పద్మావతి సంభ్రమంగా చూసింది సీతమ్మని.

  “మా అమ్మమ్మ. సీతమ్మ.” మాధవుడు పరిచయం చేశాడు.

  సీతమ్మ రెండడుగులు వెనక్కి వేసింది.

  “అమ్మమ్మా! మరి ఆ తడబాటెందుకు?” పద్మావతి, చెంగున ముందుకొచ్చి గాఢంగా కౌగిలించుకుంది సీతమ్మని.

  సీతమ్మ మురిసి పోతూ, పద్మాలతి వీపు మీద వాత్సల్యంగా రాసింది.

  మాధవుడు నిట్టూర్చాడు, హృదయం తేలిక అవగా. రాకుమారి ఈ పరిసరాల్లో సర్దుకు పోగలదో లేదో అని సంశయించాడు అప్పటి వరకూ. భారమంతా దించేసినట్లయింది.

  పది మాసములు పైగా పద్మావతిని కాపాడాలి. ఆ తరువాతే ఏమైనా చెయ్య గలుగుతే. పద్మావతి తమ గృహములో, తమ కుటుంబంలో కలిసి మెలసి తిరిగేటట్లే కనబడుతోంది. ఇంక భయం లేదు. మేనాలోని వస్తువులను కుటీరంలో పెట్టమని బోయీలకి చెప్పాడు మాధవుడు.

  ఎక్కువేమీ లేవు.. ఐదు పావడాలు, వానికి సరిపోయే కంచుకము, వల్లెవాట్లు. అంతే. ఇంకేమీ లేవు.

  “తేలికగానే తెచ్చాను.. మేనాలో బరువుంటే కష్టమని.. ఐనా ఇంక నేను సాధారణ యువతినే కదా!” పద్మావతీదేవి మాటలకి హృదయం కలచి వేసింది మాధవునికి.

                                     ………………

  పద్మావతీదేవి నందుని గృహంలో బాగా కలిసి పోయింది. తను కూడా వారికి వంట వద్ద సహాయం చేస్తుంది. చీని చీనాంబరాలు కట్టకుండా మామూలు వలువలే ధరిస్తోంది. వచ్చిన వెంటనే తన దగ్గరున్న నాణాలుపయోగించి పావడాలు, చోళీలు కుట్టించింది.

  సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, పూజకి పువ్వులు సమకూరుస్తుంది. మంచిరోజులు వస్తాయని ఆశతో నిరీక్షిస్తోంది.

  పురుషోత్తమదేవుని మనసారా వరించింది.. ఒక రకంగా యుద్ధం జరగడం మంచిదే అనుకుంది. లేకున్న, స్వయంవరంలో వేరెవరినో వరునిగా ఎన్నుకోవాలి.. తండ్రిగారెలా ఉన్నారో? పూజకి పూలు కోస్తూ చింతిస్తుంది.

  అప్పుడప్పుడు మనసంతా ఆందోళనతో తల్లడిల్లుతుంది. తలపుల నిండుగా పురుషోత్తమదేవుడు. ఎప్పటికైనా అతడి చెంతకి చేర గలుగుతానా అనుకుంటుంది.

  మనసులోనే కామాక్షీదేవిని వేడుకుంటుంది.

 

 మధ్యాక్కర..    “పరమశివుని పొంద నీవు పవలురేయి తపస్సు చేయ

                         హరుడు కళ్లు తెరవడాయె అతివ వేదన నాపగాను

                         విరివింటిదొర తానె వచ్చి విషధరుని పతిని సేయ

                         పురహరుని ముదము మీర పొందితీవు, కృపను జూపు.

 

  అమ్మా! నీకు అనంగుడు చేసినట్లే, నాకు మాధవుడు సాయపడ బోతున్నాడు. కానీ మన్మధునికి, నీ పతి చేసినట్లు ఇక్కడ జరుగకుండా చూడు. పురుషోత్తమదేవుడే.. మనసా వాచా కర్మణా, నా పతి కాగలడని నిన్నే నమ్మి యున్నానమ్మా! నన్ను, నన్నాదరించిన వారిని కాచుకొనుమమ్మా!”

  చిన్ననాటి నుంచీ ప్రేమగా నన్ను పెంచుకున్న తండ్రి, వివాహం కోరుకున్న వానితో జరుపుటకు సంశయించడమా! అంతా విధి రాత కాకపోతే! పదేపదే వాపోతుంది, తను తెచ్చుకున్న చిన్న కామాక్షీదేవి విగ్రహం ముందు కూర్చుని.

  ఎవరైనా పిలవగానే నవ్వుతూ పరుగెత్తి వెళ్తుంది.. తన విచారం లోలోనే దాచుకుని పైకి కనిపించనియ్యకుండా!

  “మాకు ఆడపిల్లలలు లేని లోటు తీరుస్తున్నావమ్మా!” గౌతమి, దగ్గరకు తీసుకుని బుగ్గ మీద చిన్న ముద్దిస్తుంది.

  “మరీ అంత ప్రేమ పెంచుకోవద్దు! ఆడపిల్ల మనింట్లో ఎంత కాలం ఉంటుందమ్మా? పెళ్లైతే అత్తగారింటికి వెళ్లిపోతుంది కద!” మాధవుడు వారించాడు.

  “అత్తవారింటికి…” పద్మావతి గొంతు గద్గదమయింది.

  “తప్పకుండా వెళ్తావు తల్లీ. నాదీ బాధ్యత.”

  “పుట్టింటి ప్రేమనే ఆడపిల్లా మరువదన్నా!” పద్మావతి సర్దుకుని అంది.

......మంథా భానుమతి