Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మీనా అలెక్సాండర్

 

మీనా అలెక్సాండర్

 

 

మీనా ఒక అంతర్జాతీయంగా పేరు మోసిన రచయిత్రి. కేరళ నుంచి వచ్చిన ఒక కుటుంబంలో అలహాబాద్ లో పుట్టింది మీనా. తండ్రి ఉద్యోగరీత్యా మీనాకి 5 ఏళ్ళ వయసులో సూడాన్ లో స్థిరపడ్డారు. అక్కడ యూనివర్సిటీలో చదువుకుని, ఇంగ్లీష్లో పీ ఎహ్ డీ ఇంగ్లాండ్లో చేసింది. ఆతరవాత ఇండియాకి వచ్చింది. మీనా ఒక పది పొయెట్రీ సంకలనాలు రాసింది. Fault Lines అనే ఆత్మ కధ, Nampally Road and Manhattan Music అనే రెండు నవలలు రాసింది. ప్రస్తుతం న్యూ యార్క్ సిటీ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. ఎన్నో సాహిత్య విమర్శా వ్యాసాలు రాసింది.

ఏకారణంగానైనా దేశం వదిలి బయటకెళ్ళినవాళ్ళు సాధారణంగా తమ దేశం అంటే ఎంతో ఉన్నతమైన అభిప్రాయాలతో ఉంటారు. దేశం అంటే వారికున్న జ్ఞాపకాలని మరువలేక, వారున్న దేశాన్ని స్వంతమని అనుకోలేక తమ అసలు అస్తిత్వంపై అనుమానంతో ఉంటారు. తన దేశమంటే ఉన్న అదే అభిప్రాయంతో, ఎంతో ఉన్నత ఆదర్శాలతో, వివాహం చెయ్యాలన్న తల్లి ఆలోచనల్ని కాదని ఏదో సాధించాలని ఇండియా వస్తుంది. ధిల్లీ ఇంకా హైదరాబాదు యూనివర్సిటీల్లో ఇంగ్లీష్ ప్రొఫెస్సర్గా పనిచేస్తుంది. స్వతంత్రం వచ్చిన నాల్గేళ్ళ తరవాత పుట్టి, అయిదేళ్ళ వయసులో దేశం వదిలేసిన ఆమె తన మూలాల్ని వెతుక్కుంటూ తిరిగి దేశానికి వస్తే ఇక్కడి సామాజిక రాజకీయ వాతావరణం, పరిస్తితులు ఆమెను నిరాశ పరుస్తాయి. బ్రిటిషు పాలన తరవాత స్వయం పరిపాలన ఎంతో గొప్పగా ఉంటుందని ఆశించి తన భావి జీవితాన్ని దేశంలో గడపాలని, గత జీవితాన్నీ వర్తమానంతోటీ భావితోటీ ముడివేసుకోవాలన్న ఆమె ఆశ నిరాశ అవుతుంది. ఆమె కవిత్వంలో ముఖ్యంగా ఈ రకంగా మైగ్రేట్ అవడంవల్ల కలిగే అస్తిత్వ రాహిత్యం గురించి రాసినవే. ఆమెకు మంచి పేరు తెచ్చిన Nampally Road నవల కూడా ఇదే రకమైన థీంతో నడుస్తుంది.

1978 లో రమీజాబీ మానభంగం కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. రమీజాబీ ఆమె భర్త అహ్మద్ హుస్సేన్ యమగోల రాత్రి రెండో ఆట సినిమా చూసి వస్తూ నల్లకుంట పొలీస్ స్టేషన్లో నల్గురు తప్ప తాగిన పోలీసుల సామూహిక మానభంగానికి బలైపోయింది. భర్త పోలీసుల దెబ్బలకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రజల ఆగ్రహానికి గురైన పోలీసులు రమీజాబీ వేశ్య అనీ విటులని అసభ్యంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నామని, వెంట ఉన్నది భర్త కాదని మొదట వాదిస్తారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా రమీజాబీపై ఎటివంటి మానభంగం జరగలేదని, భర్త దెబ్బల వల్ల కాక గుండెపోటుతో మరణించాడని ఇప్పించి తప్పు దారి పట్టించే ప్రయత్నం చేసారు.. అయితే ఈ కేసులో నిజానిజాలు బయటపెట్టింది ముక్తదర్ కమిషన్. అంతే కాదు ఫోరెన్సిక్ డాక్టర్ని తీవ్రంగా తప్పుబట్టింది, తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చినందుకు. ఎప్పటిలాగే అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాలు ఈ కేసును ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వాడుకుంటున్నాయని అరోపించింది.

ఈ కేసును తన నవలతో కలుపుతూ తన జీవితాన్నీ, తనలోని సంశయాల్నీ తన నవలలోని ముఖ్య పాత్ర ద్వారా వ్యక్తం చేస్తూ సాగుతుంది. చివరికి తన జీవితంలోని confusions, మిగిలిన స్త్రీ పాత్రల జీవితాలనుంచి నేర్చుకున్న గమనించిన విషయాల ద్వారా క్లియర్ చేసుకున్నట్లు చూపిస్తుంది. నవలలోని ముఖ్యపాత్ర మీరా కన్నడికల్ ఇంగ్లాండ్లో చదువు ముగించి ముక్కలుగా మోస్తున్న తన ఆత్మను తిరిగి ఒకటిగా కుట్టుకోవాలన్న ఆశతో , తన అసలు మూలాల్ని వెతుక్కుంటూ తన జీవితానికో అర్ధం, తను ఊహించుకున్న భారత దేశంలో a sense of belongingness కోసం హైదరాబాద్ యూనివర్సిటీ లో ఇంగ్లీష్ చెప్పడానికి వస్తుంది. హైదరాబాదులో ముఖ్యమంత్రి లింకా గౌడా 60 వ పుట్టిన రోజు ఉత్సవాలు అట్టహాసంగా, అర్భాటంగా బోల్డు ప్రజా ధనం ఖర్చు చేస్తూ జరుగుతుంటాయి. ప్రశాంతంగా ఉండే నాంపల్లీ రోడ్ లో ఇలా చాలానే హడావిడి జరుగుతుంటుంది. పళ్ళు కూరలూ, ఇతర చిల్లర సామాను అమ్ముకునే వ్యాపారులు పన్నుల భారం తగ్గించమని ఆందోళన చేస్తుంటారు. పేదరికం ఇంకా పెనుభూతమై బాధిస్తోందని కనిపిస్తూంటుంది. మీరాకి ఒకప్పుడు తను ఎంతో అభిమానించి చదివిన కవిత్వం, తను రాసుకున్న కవిత్వం, తనకు జీవితం మీదున్న అవగాహన ఇవన్నీ అర్ధంలేనివిగా కనిపిస్తాయి. తన ఫేకల్టీ రూం పక్కనే ఉన్న జైలు లోంచి ఖైదీలను కొడుతుంటే బాధతో వాళ్ళరిచే అరుపులు వినిపిస్తుంటాయి. ఇండియాలో విద్యార్ధులు వోర్డ్స్ వర్త్ ని చదవటం ఎందుకో ఆమెకర్ధం కాదు. ఇలాంటి పరిస్తితుల్లో ఆమె కవిత్వం ఎవరు చదువుతారు, ఎవరికి ఉపయోగపడుతుంది, దానివల్ల జరిగే మేలు, మార్పు ఏంటని ఆమె నిరాశ చెందుతుంది. ఇలా ఉన్నపుడే ఆమెకొక స్నేహితురాలి రూపంలో తన చిన్నప్పట్నుంచి ఉచితంగా వైద్యసేవలందించే డాక్టరు దుర్గాబాయి అనే పెద్దవిడ దొరుకుతుంది. రాము అనే ఆమె ప్రేమికుడు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమస్యలపైకి ఆమె దృష్టి మళ్ళిస్తాడు. సరిగ్గా అప్పుడే రమీజాబీ మానభంగం సంఘటన కలకలం రేపుతుంది. రాము ప్రతిఘటనల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు. మీరా దుర్గాబాయి ఇద్దరూ రమీజాబీకి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నవలలో ప్రజలు పోలీస్ స్టేషన్ని తగలబెడతారు. సిటీ అంతా అల్లర్లు చెలరేగుతాయి. లింకా గౌడా ప్రజల ప్రతిఘటనల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాడు. ఈసంఘటనలు, పాలన ఆమెను కలవరపరుస్తాయి. ఆమె రాసిన కవిత ఒకటి పత్రికకు అచ్చేయడానికి పంపితే అందులో అన్నీ బ్లాంక్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెన్సార్షిప్ ని సూచిస్తూ. చివరికి మీరా రమీజాబీకి ఎడ్వొకేట్ అవుతుంది ఆమెకు న్యాయం కోసం జరిగే పోరాటంలో భాగం పంచుకోవటానికి. తన చుట్టూ మనుషులని అర్ధం చేసుకుంటూ, చుట్టూ ఉన్న జీవితంలో తన జీవితాన్నీ చూస్తూ ఆమె ప్రజలతో కలిసిపోతుంది.

సామాజిక స్పృహ లేని రచనలు, ప్రజల సమస్యలు, జీవితాల్తో సంబంధం లేని కవిత్వం వృధా అని ఆమె తన నవల రూపకంగా చెప్తుంది. సామాజిక స్పృహ లేని రచనలు, ప్రజల సమస్యలు, జీవితాల్తో సంబంధం లేని కవిత్వం వృధా అని ఆమె తన నవల రూపకంగా చెప్తుంది.

ఈ కింద ఇచ్చినది Migrant Memory అనే పొయెం లోని మొదటి పార్ట్ వలస వెళ్ళిన వారి మనస్తితిని వివరిస్తూ. తమ దేశం, సంస్కృతి, సంప్రదాయాలకీ, విలువలకీ వారు నివసిస్తున్న చోట్ల ఉన్న విలువలకీ మధ్య ఉన్న అంతరాల వల్ల అనుక్షణం సంఘర్షణకి లోనవుతూ కొంత మార్తూ కొంత మారలేక వారు పడే అవస్థని చక్కగా వర్ణిస్తుంది ఆమె కవిత్వంలో. అందరూ ఇలాగే బాధపడతారని కాదు, కానీ ఎంతో కొంత అంతఃసంఘర్షణ అయితే తప్పదు.

Migrant Memory

I try to remember a desert town,
Mirages at noon, at dusk a dusty lawn
Bottles of gin and scotch, a mathematician
To whom I spoke of reading Proust all summer long.
His mistress stood on tiptoe wiping his brow with her pent up silk,
Her sari, hot green rivaling the neem leaves.
Watching her, amma whispered in the wind– Be real.
Take a husband of good stock. As for love, it’s blind.
Appa’s voice low – No dowry. You’re all you need,
Your own precious self.

 

-Sharada Sivapurapu