Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఇందిరా గోస్వామీ అస్సామీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఇందిరా గోస్వామీ అస్సామీ

ఇందిరా గోస్వామీ పేరు మోసిన అస్సామీ రచయిత్రి, జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత, సాహిత్య ఎకాడమీ ఎవార్డు గ్రహీత, ఇంకా Principal Prince Clause Laureate (Prince Clause of the Netherlands, given in the name of Prince Clause) గా గౌరవింపబడింది. రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా. ULFA అనే అస్సాంలోని ఉగ్రవాద సంస్థకీ, ప్రభుత్వానికీ మధ్యవర్తిత్వం నడిపింది. ఆమె పాత్ర People's Consultative Committee ని ఏర్పాటు చేయడానికి దోహదపడింది. Words from the Mist అనే సినిమాను ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసారు. ఆమె రాసిన నవల అడజ్య అనే సినిమాగా తీస్తే దానికి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలొచ్చాయి.

ఎనిమిదో క్లాసు చదువుతున్నపుడే ఆమె రాసిన కధ అచ్చయ్యింది. ఇరవై ఏళ్ళకే ఆమె తన మొదటి కధా సంకలనన్ని అచ్చేసింది. పువ్వు పుట్టగానే పరిమళించటం అంటే ఇదేనేమో. అయితే ఆమె జీవితంలో చాలానే విషాదం ఉంది. ఎప్పుడూ ఆమె Chronic Depressionతో బాధ పడేది. ఎన్నో సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసిందట.

పెళ్ళయిన రెండేళ్ళ లోపు ఆమె భర్త చనిపోయాడు ఆమెకు జీవితానికంతా సరిపడా దుఖాన్నీ కష్టాల్నీ ఇచ్చి వెళ్ళాడు. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమెను అస్సాం లోని గోపాల్పురాకి తీసుకొచ్చారు, అక్కడ ఆమె సైనిక్ స్కూల్లో టీచర్ గా చేరింది. అప్పటినుంచి తిరిగి రాయటం మొదలుపెట్టింది. కేవలం బ్రతికుండటం కోసమే తను రాసానని లేకపోతే ఎప్పుడో చనిపోయుండేదాననని చెప్పేదట. అప్పుడే ఆమెను మనశ్శాంతి కోసం బృందావనం లోని విధవాశ్రమానికి వెళ్ళి ఉండమని సలహా ఇస్తారు ఆమె గురువు. అక్కడ ఆమె వారి జీవితాలపై, వారు జీవిస్తున్న దుర్భర పరిస్తితులపై పరిశోధన చేసి, తన జీవితానుభవాల్నీ తను చూసిన దానిని ఇంగ్లీష్ లోకి అనువదించబడిన " The Blue necked God (1976)” అనే నవలలో వివరిస్తుంది. సాధారణంగా ఆమె నవలల్లో ప్రొటాగనిస్ట్ ఆమే. కల్పన వాస్తవికత కలగలిపి ఆత్మకధలా సాగే ఈ నవల అనాధలయిన విధవలు మతం విధించిన జీవన విధానం పేరిట ఎలా దోపిడీకి గురవుతారో, ఆదుకునేవారు, ఆదరించేవారు లేక ఒంటరి జీవితాల్లో ఏరకమైన రక్షణ లేక దారిద్ర్యంలో ఎలా బతుకుతున్నారో వివరిస్తుంది. కృష్ణుడు పెరిగిన బృందావనంలో ఉండే గుళ్ళలో భజనలూ, కీర్తనలూ పాడి, ఒక్కోపూట కడుపు కట్టుకుని దాచుకున్న డబ్బు, దేనికో కాదు, చనిపోయిన తరవాత శవ సంస్కారం లేకుండా వీధిన పారెయ్యకుండా ఎంతో కొంత సంస్కారం జరగాలనే ఆశతో దళారులకి ఇవ్వడం కోసమని తెలిసినప్పుడు హృదయం ద్రవిస్తుంది. ఇదంతా అయిన వాళ్ళుండీ వీరిని కేవలం భర్త చనిపోయిన కారణంగా వారి ఖర్మకి వారిని వదిలేస్తే బ్రతకాలనే ఆశ చావక ఇలాంటి దుర్భరమైన బ్రతుకీడ్చడం మన మతం కల్పించిన పరిధుల్లోనే ఉన్న సాంప్రదాయాలకు అనుగుణంగా ఇదంతా జరగడం నిజానికి విచారకరం. ఇంత అవస్త పడ్డా వారాశించిన విధంగా వారికి దహన సంస్కారాలు జరగవు, ఆ డబ్బు మాత్రం పుచ్చుకుని ఆ దళారులు ఉడాయించడం సర్వ సాధారణం. గాలి వెలుతురు లేని చీకటి గుహల్లో ఉండటానికి డబ్బిచ్చుకుని, అది ఇవ్వలేనప్పుడు తమ బట్టలమూటతో రోడ్డు పక్కన పడుకున్న స్త్రీలు సర్వ సాధారణ దృశ్యం. మంచి ఉద్దేశ్యాలతో, సానుభూతితో నడిపే విధవాశ్రమాలు కూడా అక్కడ లేకపోలేదు. అయితే అలాంటివి కొన్నే కదా ఉంటాయి, అవి అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి సరిపోవు.

ఇక ఆమె అతి ముఖ్యమైన రచన ఇంకొకటి తప్పక చదవాల్సింది ఉంది. అది ఆమె ఈ బృందావనం నుంచి ఢిల్లి యూనివర్సిటీలో లెక్చరర్గా చేరిన తరవాత రాసింది. “Pages Stained with Blood” అనే ఈ నవల ఇందిరా గాంధి హత్య తరవాత సిక్కులపై జరిగిన ఊచకోత గురించి రాసినది. ఇందులో ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ఆమె చూసినది, అల్లర్లు ఇంకా జరుగుతుండగానే ఆమె ఆ ప్రాంతాలకి వెళ్ళి బాధితులతో మాట్లాడి రాసిన నవల. ఇది కూడా ఒక ఆత్మకధలాగే సాగుతుంది. ఈ నవల లోని ప్రొటాగనిస్ట్ కి ఒక రిక్షావాడిపైన, కలిగిన భౌతికాకర్షణ గురించి రాయడం అస్సామీ ప్రజల ఆగ్రహానికి గురి చేసింది. అల్లర్లు జరుగుతున్నపుడు, కర్ఫ్యూ అమలులో ఉన్నపుడు ధైర్యంచేసి ఆమెను తీసుకెళ్ళిన ఒకే ఒక్క రిక్షా అతనిపై కలిగిని ఆకర్షణ గురించి ఆమె నిజాయితీగా, నిర్భయంగా రాయడం నిజాయితీగా అదికూడా ఆ పాత్ర చాలావరకూ ఆమెనే తలపిస్తున్నపుడు. తరవాత ఇచ్చిన ముఖముఖీల్లో ఈనవలలో వాస్తవికతకీ, కల్పనకీ మధ్య చాలా కనపడీ కనపడని రేఖ మాత్రమే ఉంది అని ఆమె స్వయంగా చెప్పింది.
The Moth Eaten Howdah of a Tusker అనే నవలలో అస్సాంలోని సత్రాలలో విధవల దుర్భర పరిస్తితుల గురించి రాస్తుంది. The Masterpieces of Indian Literature అనే anthology లో చేర్చారు. ఈనవలని టీ వీ లో సీరియల్గా కూడా వేసారు. The Man from Chinnamasta అనే నవలలో అస్సాంలోని శక్తి టెంపుల్స్లో వేల ఏళ్ళుగా సాగుతున్న జంతుబలి గురించి రాస్తే అది చాలా వివాదాస్పదమై, ఆమెకు ప్రాణం మీదకి వచ్చింది. ఈ నవల సీరియల్గా అచ్చయినప్పుడు చాలానే గొడవలు జరిగాయి. నవలగా అచ్చేస్తానన్న ప్రచురణకర్త వెనక్కితగ్గి ఈ నవల బదులు వేరే ఏదైనా అచ్చేస్తానన్నడట. జంతుబలి శాస్త్రాల్లో చెప్పిన పూజా విధానం కాదని నిరూపించడానికి ఆమె ఎన్నో పురాణ గ్రంధాల్లోని విషయాలని కోట్ చేస్తుంది. చివరకి ఈ నవల అమ్మకాల్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది.

The Journey అనే నవల అస్సాంలోని బార్డర్ ఏరియాల్లో స్వతంత్రం వచ్చినప్పట్నుంచి ఉన్న మిలిటెన్సీ, వేర్పాటు వాదాల గురించి రాసింది. ఆమె నవలలు చాలా భాషల్లోకి అనువాదం అయ్యాయి. పాఠ్యాంశాలుగా కూడా ఎంపిక చేయబడ్డాయి.

ఈమె ఢిల్లీలో ఉన్నపుడు ఆమె తన ముఖ్యమైన రచనలన్నీ చేసింది. ఆమె ఫోకస్ అంతా స్త్రీవాదం, పితృస్వామ్యం, అస్సాం సమాజం యొక్క సాంస్కృతిక, రాజకీయ స్వరూపం, నిర్మాణం. దాదాపుగా ఒక ఇరవై నవలలు రాసింది. ఎన్నో కధలూ, కవితలు, అన్నిటికన్న ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నపుడు తులసీదాస్ రామాయణన్ని, 14వ శతాబ్దంలో మాధవ కండలి రాసిన అస్సామీ రామాయణాన్ని పోలుస్తూ రాసిన పరిశోధనా గ్రంధం Raamaayanaa from Gangaa to Brahmaputra.

ఆమెకు జ్ఞానపీఠ, సాహిత్య ఎకాడమీ ఎవార్డులతోపాటు ఒక ఇరవైదాకా అత్యున్నత పురస్కారాలు లభించాయి. పద్మశ్రీ ఆమె తిరస్కరించింది.

-Sharada Sivapurapu