Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 24వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 24వ భాగం

ఎప్పుడెప్పుడా అని పద్మావతి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వరదయ్య మంత్రి కాంచీపురం వచ్చేశాడు.

  ఏ వార్త తెచ్చారో.. తండ్రిగారు తన మనోహరునికిచ్చి ఎప్పుడు పరిణయం చేస్తారో! పురుషోత్తమ దేవుని తలచుకుని ఊహలలో తేలిపో సాగింది.

  సభలో..

  వరదయ్య వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు.

  తెర చాటునుండి చూస్తున్న రాకుమారికి కుడి కన్ను అదిరింది. ఈ అశుభ సూచన లెందుకో.. కలవర పడుతూ చూసింది. వరదయ్యగారి మోము ప్రసన్నంగా లేదెందుకనో!

  “వరదయ్య గారూ! సంతృప్తులయ్యారా మీరు గజపతుల రాకుమారుని సమర్ధతతో, రాచ కుటుంబపు వివరములతో? పురుషోత్తమ రాకుమారుని గురించి ఇప్పటి వరకూ మంచి మాటలే విన్నాము. మీ యాత్రా విశేషములేమి? మీ అనుభవమ్మెట్టిది?”

  రాకుమారి ముందుకు వంగింది, ఉత్సుకతతో.

  “ప్రభూ! గజపతుల ఐశ్వర్యమ్మునకూ, వారి గుణగణాలకూ సాటి ఎవరూ లేరు. ఎన్న దగిన వంశమే. కానీ..” సందేహముతో ఆగి పోయాడు వరదయ్య.

  “ఏం జరిగింది వరదయ్య మంత్రీ.. నిస్సంకోచంగా చెప్పండి. పురుషోత్తముడు పిరికి వాడా? చదువులు నేర్వలేదా? కోపతాపముల నియంత్రించుకోలేడా? స్త్రీ లోలుడా? మదిర మత్తులో తేలుతుంటాడా? భయం లేదు.. చెప్పండి.” మహరాజు మరీ మరీ అభయ మివ్వగా మొదలు పెట్టాడు వరదయ్య.

  “రాకుమారునికి ఎటువంటి అవలక్షణాలూ లేవు.. ఐతే..

         

              సీ.   ఇన వంశమున నెంతొ యింపుగా జనియించి

                              గజపతి పేరుతో గణుతి కెక్కె

                    పురుషోత్తముడనుచు పురజను పేర్మిని

                              కూర్మిని గ్రహియించె కోరి తాను

                    నారాయణు రథము నడిపించు సమయాన

                               మిన్నంటె సంబరం మేలు గాను

                    వంశ మర్యాదయే పాటించ లేకనే

                               ఛండాలుని వలెతా జాడు చేసె

 

           ఆ.వె.     క్షత్రియుడతడేను గాని పౌరుషమేమి

                       చేవ లేక తాను చిదియు పోయె

                       పరువు తక్కువైన పనిచేసి నదెగాక

                       భక్తి యనుచు నెంతొ బాగ నుడివె.

 

  ఇదే ప్రభూ, నేను వీక్షించి సిగ్గుతో తలదించుకుని తిరిగి వచ్చేశాను. ఇంక మన ఆడపడుచుని ఆ ఛండాల కార్యము చేసిన వాని చేతికిచ్చెదరో లేదో.. మీ చిత్తము.”

వరదయ్య తాను చెప్పదలచినది చెప్పేసి, ఏదో భారం దించుకున్నట్లు తేలిగ్గా కూర్చున్నాడు.

  రాకుమారి పద్మావతికి గుండె దడగడలాడ సాగింది.

  అయి పోయింది.. తన కలలన్నీ కల్లలై పోయాయి.

  “ఏ విషయమైననూ విశ్లేషించే వారి చాతుర్యము మీద ఆధారపడి మంచో చెడో నిర్ణయింపబడుతుంది. పోయి పోయి ఈ నిత్యశంకితుడి చేత పడింది తన కళ్యాణం జరిపించడం. భగవంతుని సేవకు కూడ ఇంత వక్ర భాష్యం చెప్పగలవాడు ఇతడే ఈ జగాన.. తండ్రిగారే విధంగా స్పందిస్తారో! జగన్నాధా నీవే దిక్కు.” పద్మావతీదేవి మనసులో వేయి మొక్కులు మొక్కుకుంది. రాజును అనుకూలంగా ఆలోచించేలా చెయ్యమని.

  కానీ.. జగన్నాధుని సంకల్పం వేరుగా ఉంది.

  రాజు స్పందన ప్రతికూలంగా ఉంది. కన్నులు ఎర్రవారాయి. ముక్కుపుటాలు అదురుతున్నాయి. చెయ్యి కత్తిపిడి మీదికి చేరింది.

  ఎంత ధైర్యం.. ఛండాలురి పని చెసే రాజు, తన కుమార్తెను కోరడమా!

  “వెంటనే కటకం రాజుకి వర్తమానం పంపండి. మా రాకుమారిని అటువంటి వారికివ్వడానికి ఇష్టం లేదని. పెండ్లి అయ్యాక మా ఆడపడుచుని కూడా చీపురు పట్టుకుని రహదారిని ఊడవమంటారేమో! ఆ రాకుమారునికి, సేవకుల కూతురైతే సరి పోతుంది.” రాజు లేచి విసవిసా నడిచి వెళ్లి పోయాడు.

  పెనుముప్పు సంభవించ బోతోంది. ఏ విధంగా ఆపగలుగుతుంది తాను?

  మరి పురుషోత్తమ రాకుమారుని మీద పెంచుకున్న మమత? తన మదినిండుగా అతని రూపే.. అతడే యరుదెంచి సమస్యని పరిష్కరించవలె కాదా..

 

            కం.        తలకించెను మది నిన్నే

                         తలచి తలచి యేమరగను తలపున నీవే

                         తలవాకిట నీవే కద

                         తలరారగ వచ్చి నా వెతల మాన్పనుగా.

 

  కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన మందిరానికి చేరుకుంది పద్మావతి.

  తన వలపు సఫలమవకపోయినా ఫరవాలేదు.. ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండి పోగలదు. ఆ వరదయ్య సంకుచితత్వం అంతా పదాలలో తెలుపుతూ లేఖ పంపుతే ఎంత ప్రమాదం?

  అసలు, ఆలయాలకి కాణాచి యైన కాంచీపురంలో నివసిస్తూ, జగన్నాధుని సేవలో రాజూ, పేదల తారతమ్యాలుండవని.. ఆ మాత్రం గ్రహింపు ఆ మంత్రికి కానీ, ఈ రాజుకి కానీ లేకపోవడం ఎంత ఆశ్చర్యం? ఆవేదనలో తండ్రినే పరాయివానిగా భావన వచ్చింది పద్మావతికి. అది సహజమే.. తన వారనేది ఎవరయ్యా అంటే ఆ పరాత్పరుడే కద..

  ఎంతటి పుణ్యం చేసుకుంటే, ఆదివిష్ణువు సేవ లభ్యమవుతుంది. ఆ పుణ్యాత్మునికి ఇల్లాలుగా వెళ్లి అటువంటి సేవలో పాలు పంచుకొనగలగడం ఎంతటి అదృష్టం?

  తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు తండ్రి.

  పద్మావతీదేవి భయాందోళనలు నిజం చేస్తూ, కళింగదేశానికి రాయబారి లేఖను తీసుకుని వెళ్లిపోవడం జరిగి పోయింది.

  

  కాంచీపురంనుంచి మంచి వార్త కోసం ఎదురు చూస్తున్న మాధవునికి ఆశాభంగం కలిగించిందా లేఖ. వార్తాహరుడు మాధవునే కలిశాడు కటకం రాగానే. అతడే కద మరి కంచి రాజు సభకి రాయబారిగా వెళ్లిన వాడు.

  ఈ లేఖ చదివి పురుషోత్తముడే విధంగా స్పందిస్తాడో తలచుకుంటే వెన్నులోంచీ చలి వేసింది మాధవునికి. రాకుమారుడు అంత కోపిష్టి కాదు. పోన్లే అని వదిలేసినా వదిలెయ్య వచ్చు. అలా అని పట్టించుకోకుండా ఉండగలిగేటట్లు లేదు ఆ లేఖ.

  వరదయ్య చాలా అవమానం కలిగించేట్లు రాశాడు.

  కంచి రాజుగారి సభలో చెప్పిన పద్యం లాగే.. అంతకంటే ఇంకా కఠినంగా.. జుగుప్స కలిగించే పదాలని వాడాడు. ఎందుకో గానీ వరదయ్య మంత్రికి గజపతుల మీద ఆగ్రహం ఉందేమో అనిపించేలాగ ఉంది ఆ లేఖ.

  అది నిజమే కూడా.. గాంగేయరాజు భానుదత్తుడి ఆస్థానంలో ఉండి అతడి పరివారంతో పాటుగా, కపిలేంద్రుడిచే వెళ్లగొట్టబడ్డాడు వరదయ్య. రాజ్యం కోల్పోయి, అజ్ఞాతంగా కాలగడుపుతున్న రాజు దగ్గర ఉండలేక, కాంచీపురం రాజు ఆస్థానంలో, తన తెలివితేటలతో స్థానం సంపాదించి నిలదొక్కుకున్నాడు. ఏ మాత్రం అవకాశం దొరికినా గజపతుల పతనాగ్నికి ఆజ్యం పొయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.

  ఈసంగతులేమీ తెలియని మాధవునికి ఆలేఖనీ, అది తెచ్చిన వార్తాహరునీ ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.

   కానీ మిత్రునికి ఇవ్వకుండా ఉండలేడు. ఇస్తే ఫలితమెట్లుండునో. రాకుమారుడు కూడా వార్త కోసం ఆతృతగా యెదురు చూస్తున్నాడు. తప్పదు..

  గుండె చిక్క బట్టుకుని పురుషోత్తమదేవుని మందిరానికి వెళ్లాడు.

  “మాధవా రా..రా. ఇప్పుడే అనుకుంటున్నా నీ గురించి. వార్తేమైనా వచ్చిందా?”

  వచ్చిందన్నట్లుగా నిలువుగా తలాడించాడు మాధవుడు.

  “ఏదీ లేఖ?” చెయ్యి చాచాడు రాకుమారుడు.

  నెమ్మదిగా పత్రం విప్పి చేత పెట్టాడు మాధవుడు.

  ఉత్సాహంగా చదవడం ఆరంభించిన పురుషోత్తముడి కన్నులు నెమ్మదిగా ఎర్రవారడం మొదలయ్యాయి. పూర్తిగా పఠించిన పిదప, ఆగ్రహావేశాలతో లేచి నిలుచున్నాడు.

 

       సీ.       ఘనుడా యతడు లేక గార్దభ జన్మము

                       నెత్తిన మూర్ఖుడా నేమి తలతు

                 ఆది దేవుని సేవ యందులీన మగుట

                       యంత హీనమగునా యకట, నేమి

                 యీ కండ కావరం, యే మహరాజుని

                       ఛండాలు డననెంత జాడ్య మౌగ

                 నుచ్ఛము నీచమును రవంతయును లేదు

                       నాలుక తిరిగన నట్ల నుటయె

 

         తే.గీ.  ఇచ్చటను నే ప్రతిన పూని యీక్షణమును

                  చెప్పు చున్నాడ వినుమదే చేకొనియెద

                  సమరమున రాకుమారిని సాధనమున

                  పెండ్లి చేయ ఛండాలుతో పెంపు గాను.

 

  మాధవుడు భయపడినంతా అయింది. ఏం చెయ్యాలిప్పుడు..

  “రాకుమారా! తెలియక రాసిన లేఖ అయుంటుంది. నేను వెళ్లి విషయం వివరించి వస్తాను. మీ పైననే అనురాగం పెంచుకుని, ఆశలు పెట్టుకున్న రాకుమారిని మధ్యలో శిక్షించ వద్దు. చేతులు పట్టి ప్రాధేయ పడుతున్నా దేవా. కనీసం తండ్రిగారు వచ్చే వరకూ ఆగండి.” బ్రతిమాలాడు పురుషోత్తముని.

  “అదేమీ తెలియక రాసిన పత్రం కాదు. ఒడలంతా పొగరు పట్టి రాసినది. అటువంటి తండ్రికి జన్మించినందుకు పద్మావతి అనుభవించ వలసిందే. నువ్వు చెప్పినట్లు తండ్రిగారు వచ్చు వరకూ ఆగెదను. వారైననూ ఉపేక్షించెదరనుకోను. ఇది ఘోరమైన అవమానం. కోరి వధువు నడుగుతే.. ఇటువంటి లేఖయా”

  “దేవా! ఊరట చెందండి. జరిగేది జరుగక మానదు. మనం మహానదీ తీరమునకు వెళ్లి కాసింత ధ్యాన మగ్నుల మవుదాము. నేను వెళ్లి అశ్వములను తీసుకుని వచ్చెదను.” మాధవుడు నమస్కరించి, మందిరం వెలుపలికి వచ్చి, కాంచీ పురం నుంచి వచ్చి వార్తా హరుని పంపి వేశాడు.

  “ప్రభూ! మీరేమీ లేఖ ఇవ్వరా?” వార్తాహరుడు అడిగాడు. కనీసం ఆహారం సదుపాయం కూడా చెయ్యకుండా పంపేస్తున్నారని కినుకగా ఉందతడికి.

  “త్వరలో జాబుకి ఎదురు చూడమని మీ రాజుకి మనవి చెయ్యి.”

  వింతగా చూస్తూ వెను తిరిగాడు వచ్చినవాడు. వానికి అక్షరాలు చదవడం రాదు. తమ రాజుగారిని మన్నించకుండా సంబోధిస్తుంటే ఆశ్చర్యం కలిగింది.. లేఖలో ఏముందో తెలియని రాయబారికి. కావాలనే అటువంటి వానిని పంపాడు, వరదయ్య మంత్రి.

                                      …………………

 

                          

 

  “కొత్త మార్గాన తీసుకొస్తున్నావు మాధవా?”

  పురుషోత్తమ దేవుడు ఉదాసీనంగా అడిగాడు.

  “అవును ప్రభూ! కాస్త ఎక్కువ దూరం సవారీ చేస్తే మనసు స్థిమిత పడుతుందని. చుట్టు తిరిగి గుట్టల దారిలో తిప్పాను అశ్వాన్ని.”

  “చూశావా! మన మనోగతంలాగే ఉంది ప్రకృతి కూడా. ఎక్కడా పచ్చదనం లేదు.” నిర్వేదంగా అన్నాడు రాకుమారుడు.

  “దాందేముంది ప్రభూ.. ఒక క్రోసు వెళ్లామంటే పచ్చదనం వచ్చేస్తుంది. ఓరిమి వహించాలంతే.”

  హూ.. ఓరిమి. ఎంత కష్టం.. అనుకున్నాడు పురుషోత్తమదేవుడు! పడ్డవాడికి తెలుస్తుంది బాధ.. పక్కనున్నవాడికేమి? ఎన్నైనా నీతులు చెప్పగలడు.

  మాధవుడికి అర్ధమయింది. కానీ ఏమి చేయగలడు? కాస్త గుడ్డిలో మెల్ల.. కపిలేంద్ర దేవులు త్వరలో రానున్నారు.. అదీ, కొంత వంగ దేశాన్ని స్వాధీనం చేసుకుని. వారు అనుభవజ్ఞులు. ఏనిర్ణయం తీసుకున్నా సరైనదే అవుతుంది.

  “మాధవా!”

  “ప్రభూ..”

  “కత్తి యుద్ధం చేద్దామా? ఆవిధంగా ఆవేశం తగ్గించుకోవచ్చేమో!”

  “అవశ్యం ప్రభూ. ఇక్కడే.. దగ్గర్లో మైదానం ఉంది. అక్కడ చేద్దాం. చాలా రోజులయింది మనిద్దరం చేసి.”

  ఇద్దరూ, మహానది ఒడ్డునే.. ఇసకలో ఉన్న మైదానం లోకి వెళ్లారు. గుర్రం దిగి, సర్దుకుని కత్తి ఝళిపిస్తున్న రాకుమారుని చూసి మాధవుడికి గుండె దిగజారి పోయింది. అంతటి రౌద్రం ఆ మొహంలో.. ఆ విదిలింపులో..

  సంధ్య కాంతిలో మరింత.. ప్రళయకాల రుద్రుడి లాగనే ఉన్నాడు.

  “ప్రభూ! భయం వేస్తోంది మిమ్ము చూస్తుంటే..”                       

                                    

                      

                           

 

  “ఫర్లేదు మాధవా! గురుకులంలో అభ్యాసం చేసినట్లే.. కాకపోతే కాస్త ఆవేశం జోడించి..”

  మాధవుడు కూడా కిందికి ఉరికి కత్తి పట్టాడు.

  మొదట్లో ఆటలాగ మొదలైన యుద్ధం.. పోను పోను భీకరంగా సాగుతోంది.

  మాధవుడు, రాకమారుని విసుర్లని తప్పించుకుంటూనే దీటుగా చేస్తున్నాడు. రెండు ఘడియలు పోరాటం అయ్యాక.. రాకుమారుడు కంఠం మీదికి విసిరిన వేటు అతి కష్టం మీద తప్పించుకుని, కిందికి పడిపోయి దండం పెట్టాడు.

  “ప్రభూ! ఇంక చాలు.”

  కత్తి కింద పడేసి, పురుషోత్తముడు కూడా, నేల మీదికి వాలి పోయాడు.

  “రేపటి నుంచీ, ఇదే అభ్యాసం. గజసైన్యం, అశ్వ దళం.. అందరినీ అప్రమత్తులని చేసి, యుద్ధానికి సన్నిద్ధులని చెయ్యాలి. గురుకులాలలో మిగిలిన విద్యార్ధులనందరినీ సైన్యంలోనికి తీసుకోవాలి. అందరం అదే పని మీదుందాం.”

  “నదికి వెళ్లి అర్ఘ్యం సమర్పిద్దామా దేవా?” మాధవుడు వినమ్రంగా అడిగాడు.

  పురుషోత్తముడు నవ్వుతూ లేచి, మాధవునికి చెయ్యందించాడు.

  కానీ.. ఆ నవ్వు పేలవంగా ఉంది.

                                          ……………..

 

 

......మంథా భానుమతి