Facebook Twitter
" ఏడు రోజులు " 12వ భాగం

" ఏడు రోజులు " 12వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 


 

కాసేపటి తర్వాత అందరూ కలిసి సమీపంగా వున్న చాయ్ బండి దగ్గరకు వెళ్ళారు. అక్కడ చాయ్ మాత్రమే కాకుండా ఇతర వంటకాల్ని కూడా తయారుచేస్తున్నారు.
    
    "చాయ్ బండీ చపాతీ
    
    జర జూడరా జిలేబీ..."
    
    అలవాటుగా ఎప్పుడూ పాడే సిరాజ్ కు బదులుగా జోసెఫ్ అందుకున్నాడు ఆ పాటను.
    
    పాట వింటూ అందరూ తమలో తామే నవ్వుకోసాగారు. "నవ్వారు లేరా" అంటూనే తనూ నవ్వాడు భవానీశంకర్.
    
    "ఏందన్నా గట్ల నగుతుండరు" కాసేపు చూసి తర్వాత అడిగాడు చాయ్ బండి అమ్ముతున్న వ్యక్తి.
    
    "ఏం లేదన్నా! మా వాడి అత్తవారికి కూడా నీలాగే చాయ్ బండి వుంది. కట్నం అదే అనుకో! కాని మా వాడేమో అమ్ముకోడానికి నామోషీగా ఫీలౌతున్నాడు" భవానీ శంకర్ భుజం చరుస్తూ చెప్పాడు జోసెఫ్.
    
    "గట్ల అనుకుంటే ఎట్ట తమ్ముడు కట్టపడాలా.... కట్టపడితేనే రెండు దుడ్లు ఒస్తయి" భవానీశంకర్ వైపు చూస్తూ అన్నాడు చాయ్ బండి వ్యక్తి.
    
    మిత్రులంతా జోసెఫ్ కే వంతపాడారు. దీంతో అందరివైపు ఉక్రోషంగా చూస్తూ "వచ్చే నెల నుండి అమ్ముతుంటాను. తప్పేముంది?" అన్నాడు.
    
    "గదీ మాట" అన్నాడు చాయ్ బండి వ్యక్తి.
    
    "నోర్ముయ్యరా" మనసులో అనుకుని "ఏందిబై చాయ్ ఇట్ల జేసినవు?" అడిగాడు భవానీశంకర్.
    
    "ఇస్పెషల్ టీ" అన్నాడు చాయ్ బండి వ్యక్తి.
    
    "సర్లేగాని పంచదార తక్కువినా ఫర్వాలేదుగాని టీ పొడి కాస్త ఎక్కువెయ్యి" చెప్పాడు భవానీశంకర్.
    
    అంతలో ఆ రోడ్డెంబడి జనాలు గుంపులు గుంపులుగా పరుగెట్టసాగారు. చూస్తున్న మిత్రబృందానికి ఏమీ అర్ధం కాలేదు. పరుగెడుతున్న జనాలవైపు కంగారుగా చూడసాగాడు.
    
    చాయ్ బండి వ్యక్తి మాత్రం అదేం పట్టనట్టుగా తన పనేదో తను చేసుకుపోతున్నాడు.
    
    "ఏందన్నా ఈ జనాలు" జోసెఫ్ అడిగాడు.
    
    "గీ జనాలు ఎర్ర బస్సునా కొడుకులు. సూటింగులు సూడ్డానికి వచ్చి గిట్ల అందర్నీ పరేషాన్ జేస్తుంటరు" అంటూ బర్నాల్ స్టౌకి గాలికొట్టి "గవతలగా గుట్టకాడ మోన్ బాబుగాడి సూటింగ్ వుంది. గది సూడ్డానికే ఈ ఎర్రి జనాలు గిట్ల ఉర్కుతుండరు" చెప్పాడు చాయ్ బండి వ్యక్తి.
    
    "ఓర్నీ" ఆశ్చర్యంగా పరుగెడుతున్న జనాలవైపు చూశారు మిత్రులంతా.
    
    "ఏం నాష్టగావాలన్నా?" అడిగాడు చాయ్ బండి వ్యక్తి.
    
    "దమాక్ గాని కరాబ్ అయ్యిందా బై? చాయ్ తాగి నాష్ట చేస్తాడా ఎవ్వడైనా?" అంటూ ఖాళీ గ్లాసును అక్కడున్న ఓ కుర్రాడికి అందించి "షూటింగ్ కి మనం కూడా వెళ్దాం" మిత్రుల్ని ఉద్దేశించి చెప్పాడు జోసెఫ్ తర్వాత అందరి తరఫునా థానే డబ్బు చెల్లించాడు.
    
    భవానీశంకర్ గుండెలో రాయిపడింది. ఎట్లాగయినా సరే షూటింగ్ కి వెళ్ళడం క్యాన్సిల్ చేసి ఇంటికి వెళ్ళి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుంటూ "దయచేసి నన్ను వదిలిపెట్టండిరా నేను వెళ్ళిపోతాను" అన్నాడు.
    
    "మోహన్ బాబును చూసి వెళ్ళిపోదాం" అన్నాడు జోసెఫ్.
    
    "ప్చ్... వద్దురా" అన్నాడు భవానీశంకర్.
    
    విన్పించుకోలేదు మిత్రులు. అందరూ కల్సి షూటింగ్ కి బయలుదేరబోయారు.
    
    "వద్దురా!" గట్టిగా అన్నాడు భవానీశంకర్.
    
    "నువ్వు ఇట్లా చేస్తే మేము నీకు హెల్ప్ చేసేదిలేదు"
    
    "అవును హెల్ప్ చేయం"
    
    "అందుకే షూటింగ్ కి వచ్చేయ్"
    
    "షూటింగ్ కి రావల్సిందే వస్తేనే లవ్వులో నీవు సక్సెస్"
    
    "ఆపండ్రా" మిత్రుల్ని ఇంకేం మాట్లాడనీయకుండా వాళ్ళ వెంటే చేసేది లేదు అన్నట్లుగా బయలుదేరి వెళ్ళాడు భవానీశంకర్.
    
    వాళ్ళు వెళ్ళేసరికి షూటింగ్ కి ఏర్పాట్లు జరగసాగాయి ఎంతో దూరం నుండి వచ్చిన అభిమానులు, తాము చూడబోయేది మహా సంఘటనని అన్నట్లుగా కనబడుతున్నారు.
    
    "వాళ్ళకంటే మనం తీసిపోలేదు అచ్చు అదే క్యాటగిరీ" తనలో తనే అనుకుంటూ మిత్రులతోపాటుగా అక్కడున్న ఒక చింత చెట్టు నీడన రాళ్ళకుప్పమీద కూర్చున్నాడు భవానీశంకర్.
    
    మనిషి ఒక చోట, మనసు ఒక చోట అన్నట్లుగా వుంది అతడి పరిస్థితి. అందుకే అక్కడ వుండటం ఇష్టంలేని వాడిగా వున్నట్టుండి మోకాళ్ళలో తలపెట్టుకుని నేలని దీర్ఘంగా చూడసాగాడు.
    
    కొన్నాళ్ళక్రితం సంఘటన అనుకోకుండా గుర్తొచ్చింది. ఒక రోజు తను అమ్మమీద అలిగి చార్మినార్ దగ్గరకి వెళ్ళాడు. అనూహ్యంగా అక్కడికి గౌసియా వాళ్ళు కూడా వచ్చారు.
    
    చార్మినార్ నీడలో కూర్చుని వాళ్ళు  క్యారియర్ తీసుకు తింటున్నారు. తనేమో ఉదయం నుండి తినలేదు. అందుకే వాళ్ళు తింటుంటే లాక్కొని తినాలనిపిస్తోంది.
    
    వాళ్ళకు సమీపంగా కూర్చుని వున్నాడు తను. గౌసియా తనను మధ్యమధ్యలో గమనిస్తోంది. తను కూడా గౌసియాను చూస్తున్నాడు.
    
    ఆప్పట్లో ఆమెకూ తనకూ మధ్య ప్రేమ లేదు కాని తనకు మాత్రం ఆమెపట్ల ఆకర్షణ మొదలయ్యి కొంతకాలం అయ్యింది ఆ ఆకర్షణ ప్రేమ అన్న సంగతి తనకు ఇంకా తెలీదు.
    
    "ఈ అమ్మాయి బాగుంది" అనుకుంటున్నాడు తను.
    
    కాసేపటి తర్వాత భోజనం పూర్తిచేశారు వాళ్ళు. అంతలో మరెవరో ముస్లిం కుటుంబం అక్కడికి వచ్చింది. గౌసియా వాళ్ళకు ఆ కుటుంబం పరిచయం వున్నట్లుగా వుంది. రాగానే "సలాం వాలేకుం చెప్పుకుంటూ మాటలు కలిపారు.
    
    అందరూ కలిసి మాట్లాడుతూనే చార్మినార్ నుండి మక్కా మసీదువైపు వెళ్ళారు.
    
    వెళ్తున్న వాళ్ళవైపు చూస్తుంటే తనక్కోపం ముంచుకు వచ్చింది. ఇంటిముందు కుర్రాడ్ని అని కూడా చూసి పలకరించని వాళ్ళమీద ఎంత కోపం వచ్చిందో! ఆ కోపం తన పిడికిళ్ళలోనే నలిగిపోయింది.
    
    "పలకరించి నాక్కాస్త కడుపు చల్లగ చేసి వుంటే మీ అల్లా మెచ్చేవాడు మీరు ఇప్పుడు మసీదుకు వెళ్ళి కూడా దండగే, మీ అల్లా మెచ్చడు" మనసులోనే శపించుకుంటూ తను కూడా చార్మినార్ వెలుపలికి వచ్చాడు.
    
    అంతలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అర్ధగంట గడిచినా వాహనాలకి విముక్తి లేనట్లుగా కనబడింది.
    
    "ఎందుకు ఇంతగా జామ్ అయ్యింది?" ట్రాఫిక్ ను చూస్తూ అనుకుంటూ ముందుకు నడిచాడు తను.
    
    కొంతదూరం వాహనాల్ని తప్పించుకుంటూ ముందుకు నడిచాక అనుకోని పరిస్థితి ఎదురయ్యింది.
    
    "జరుగుబే" అంటూ ఎవ్వరో యువకులు తనను నెట్టేస్తూ ముందుకు వేగంగా కదిలారు.
    
    "ఏంట్రా ఇదంతా?" భయంగా అనుకుంటూ మరికొంత ముందుకు నడిస్తే అక్కడ రోడ్డుమీద రక్తపు మడుగులో పడివుంది ఎవరో వ్యక్తిశవం.
    
    అతడు హిందువో ముస్లీమో అర్ధంకాని పరిస్థితి అందుకే ఇంకా గొడవలు జరగాలేదు. ముఖ్యంగా శవం దగ్గరికి ఎవ్వరినీ రానివ్వలేదు ట్రాఫిక్ పోలీసులు. కాబట్టే అక్కడ ప్రశాంతత ఇంకా సడలలేదు.
    
    ఆ విషయం అక్కడున్న కొందరి మాటల ద్వారా తెలిసింది. తనకు భయమేసింది. అక్కడ్నుంచి వీలైనంత త్వరగా వెళ్ళాలని అటూ ఇటూ చూశాడు.
    
    జామ్ అయిన ట్రాఫిక్ కూడా పక్కనున్న సందుల్లోంచి తప్పుకుంటోంది అలా వెళ్ళడానికి కూడా కదిలే వీలులేని వాహనాలు మాత్రం హారన్ మోతలతో అలాగే నిలబడిపోయాయి.
    
    భయంతో తను వెనుతిరిగి కొంతముందుకు నడిచాడో లేదో గౌసియా ఒంటరిగా కనబడింది.

 

....... ఇంకా వుంది .........