Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? టెమ్సుల ఎ ఒ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? టెమ్సుల ఎ ఒ

ఉన్నత విద్యార్హతలతో ఇంగ్లీషు ప్రొఫెసర్గా పనిచేసిన టెమ్సులా తన రచనల్లో నాగా జాతుల జన జీవితాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది. ఆమెకు పద్మశ్రీ ఎవార్డ్ 2007 లోనూ, Governor's Gold Medal 2009 లోనూ సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ 2013 లోనూ వచ్చాయి. రాత పూర్వకంగా లేని నాగా జాతుల చరిత్రనీ, సంస్కృతినీ, జీవన విధానాల్నీ, ఆమె పుస్తక రూపంలో పెట్టింది. ఆమె రాసిన పుస్తకం మాత్రమే నాగా జాతుల గురించిన విషయాలు బయటి ప్రపంచానికి తెలుసుకునే మార్గం. నార్తీస్ట్ నుండి ఇంగ్లీషులో వినిపించిన అతి కొద్దిమందిలోని ఒక కవి గళం. ఆమె రచనలు, జెర్మన్, ఫ్రెంచ్, హిందీ, బంగాలీ, అస్సామీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆమె 5 కవితా సంకలనాలూ, 2 కధా సనకలనాలూ, The Ao-Naga Oral Tradition అనే నాగా జాతుల చరిత్ర గురించిన పుస్తకాన్నీ రాసింది. ఆమె కవితలూ, వ్యాసాలూ ఎన్నో పత్రికల్లో అచ్చయ్యాయి.

నాగాలాండ్ ఒక పదహారు భిన్న సంస్కృతుల, భాషల, తెగల ప్రజలు జీవించేపర్వతప్రాంత భూమి. ఈ జాతులు తెగలు తమలో తాము ఘర్షణ పడటమే కాకుండా, ఇటు అస్సాం తోనూ, మణిపూరి ప్రజలతోనూ అటు బర్మా లోని రాజ్యాలతోనూ నిరంతరం యుద్ధాలతోనే గడుపుతూ వచ్చాయి కొన్ని శతాబ్దాలుగా. బ్రిటిషువారినుంచి కూడా వీరు స్వతంత్ర ప్రతిపత్తినే కోరుకున్నారు. అలాగే బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తరవాత స్వతంత్ర భారతంలోకి రావడానికీ వారికి ఇష్టం లేకపోయింది. అయితే వారికి వీలయినంత స్వతంత్రాన్నీ, స్వేఛ్చనీ ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలాగానే నెహ్రూ ప్రభుత్వం కూడా చేసుకుని వీరిని ఒప్పించి భారత దేశంలో అంతర్భాగమైన రాష్త్రంగా వీరిని చేర్చుకుంది. చాలానే తెగలు దీనికి సుముఖంగా ఉండి హింసనీ ప్రతిఘటననీ మానుకున్నా, కొన్ని నాగా తెగలు మాత్రం ప్రభుత్వాలకి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి స్వతంత్రం వచ్చిన ఒక ఏభై ఏళ్ళ వరకూ కూడా. అత్యధికంగా క్రిష్టియన్లు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నాగాలాండ్ కూడా ఒకటి. ఈ జాతుల భాషలూ జీవన విధానాలు ఎంత భిన్నమంటే ఒకరి భాష ఇంకొక తెగకి అర్ధం కానంతగా.

నాగా జాతుల వేర్పాటు వాదుల గెరిల్లా యుద్ధాల్నీ అణిచివేసేందుకు జరిగిన సైనిక చర్యల్లో జరిగిన హింస ప్రతిహింసల్లో జనజీవితం గానుగలో నువ్వుగింజల్లా నలిగిపోయింది. హింస జీవన విధానంగా ఎన్నుకున్న నాగా వేర్పాటు వాదులు, వారిని అణిచేసే ప్రయత్నంలో సైనికులు, ప్రశాంత జీవితాన్ని కోరుకున్న వారినెవరినీ కంటి నిండా నిద్రపోనియ్యలేదు. వీరివరకూ అందరూ శత్రువులే. ప్రగతిలేదు, శాంతిలేదు, ప్రాణాలకు భరోసాలేదు, రెక్కలు విరిగిన పక్షుల్లా అల్లాడి పోయారు అర శతాబ్దానికి పైగా. తరతరాలుగా, తమ ఆస్థులు, భూములూ, బ్రతుకు తెరువులూ పోగొట్టుకుని, కుటుంబాలు కుటుంబాలు ప్రాణ మానాలు కోల్పోయి, ప్రతిరోజూ దోపిడీకి, హింసకి గురౌతూ, గడిపిన దుర్భర జీవితాలు. గత పదేళ్ళలో కొంత ప్రశాంతత సీస్ ఫయర్ వల్ల నెలకొన్నా, గత జ్ఞాపకాలు ఇంకా వారి హృదయాలని కాలుస్తూ వేధిస్తూనే వున్నాయి. These Hills called Home అనే సంకలనం కానీ, Stories from the War Zone అనే కధా సంకలనం కానీ ఇటువంటి నాగా ప్రజల జీవిత కధలని వెలికితెచ్చే ప్రత్నమే. సైనికులు వీరిపై జరిపిన అరాజకాలూ, అమానవీయ అత్యాచారాలూ చదువుతుంటే హృదయం ద్రవించాల్సిందే.

ఆమె సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. రూపురేఖలు, వేషధారణ, భాషా, సంస్కృతులు మిగతా దేశవాసుల 'కన్నా భిన్నమైనంత మాత్రాన ఇంత వివక్షకి వారు గురవవల్సిందేనా. భిన్నత్వాన్నీ గౌరవించే సంస్కృతి, బాధ్యత ఈ మారుమూల రాష్ట్రాలు కలిసుండాలన్నపుడు, దేశవాసులకి లేదా అని. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పవలిసిన బాధ్యత దేశవాసులందరిపైనా, కేంద్ర ప్రభుత్వం పైనా ఉంది. కర్ణాటకలోను, దేశ రాజధానిలోనూ జరిగిన హింసాత్మక ఘటనలు, వీరంటే ఇతర రాష్ట్రాల వారికున్న చిన్నచూపును చెప్పక చెప్తున్నాయి. ఇంచుమించు ఇవే పరిస్తితుల్లో ప్రజలు కాశ్మీరయినా, శ్రీలంకయినా, సిరియా అయినా అఫ్గనిస్తానయినా కదా. ప్రజలూ, ప్రాణాలూ, మానాలూ, కష్టాలూ అందరూ ఒక్కటే కదా. ఇలాంటి కధలే కదా అందరివీ. రాజకీయంగానో, మతాన్ని ఆధారంగా చేసుకునో మనకు పట్టనట్టుండటం అమానవీయమే.

Stories from A War Zone సంకలనంలో కదిలించే ఒక కధ The Last Song . అపెన్యోకి సంగీతం అంటే చిన్నప్పట్నుంచి విపరీతమైన పిచ్చి. చిన్నపిల్లగానే తన సొంత మాటలతో, సంగీతంతో పాటలు పాడుకుంటూ ఉండేది. చంటిపిల్లపుడే తండ్రి చనిపోతే ఇంకో పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకుని ఎన్నో కష్టాలు పడి అపెన్యోని పెంచుతుంటుంది తల్లి. ఈ సంగీతం పిచ్చి ఆమెని ఇబ్బంది పెట్టినా, తండ్రి పోలిక అని సరిపెట్టుకుంటుంది. అపెన్యో పెరిగి పెద్దవుతుంది. ఊళ్ళోని చర్చి కోయిర్లో లీడ్ సింగర్గా ఎంపికవుతుంది. ఆరోజు తల్లి కూతుళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. తన కష్టం ఫలించిందని ఎంతో తృప్తి పడుతుంది తల్లి లిబెని. ఇలా ఉండగా ఊళ్ళో కొత్త చర్చి బిల్డింగ్ కడతారు. దాని ప్రారంభోత్సవానికి అపెన్యో పాడాలి. అయితే సైనికులు కూడా ఈ ప్రారంబోత్సవం రోజే ఊరిమీద దాడి చెయ్యాలని నిశ్చయించుకుంటారు. ఊరి వాళ్ళు అండర్గ్రౌండ్ ఉగ్రవాదులకి పన్ను కడుతున్నారని ఆరోపణ. అపెన్యో తన కోయిర్తో పాడుతుండగానే సైనికులు కొత్త చర్చి బిల్డింగ్ లో విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలు పెడతారు. అపెన్యో మాత్రం తన పాట ఆపదు. కెప్టైన్ దృష్టి అందమైన అపెన్యో మీద పడుతుంది. అంతే ఆమెను జుట్టు పట్టి పాత చర్చి బిల్డింగ్లోకి ఈడ్చుకెళతాడు. అపెన్యో మాత్రం పాట ఆపదు. అపెన్యోని రక్షించడానికి తల్లి లిబెని విశ్వ ప్రయత్నం చేస్తూంటుంది. చివరకి అపెన్యోని, లిబెనినీ సైనికులు సామూహిక మానభంగం చేస్తారు. మానభంగం చేయబడుతున్నా, చనిపోతున్నా అపెన్యో మాత్రం పాట ఆపదు. ఆతరవాత చాలామంది ఆ పరిసరాల్లో అపెన్యో పాటని వింటూ ఉండేవారట. ఈ కధని అమ్మమ్మలూ , తాతాయ్యలూ తమ మనవలకి చెప్పే వారట. ఇదే కధని చెప్తూ ఒక ఆమె ఈ కాలం యువత చాలా మొద్దుబారిపోయారు. ఈ మట్టి, గాలి వినిపించే అపెన్యో పాటని వినలేకపోతున్నారని బాధపడుతుంది. అప్పుడు ఆ యువకులు కధ మాత్రమే వింటున్నందుకు సిగ్గుపడి జాగ్రత్తగా విన్నపుడు వారికీ అపెన్యో పాట వినిపిస్తుంది.

ఇన్ఫార్మర్స్గా పనిచేస్తున్నారనో, వేర్పాటువాదులకి ఇతరత్రా సహాయం చేస్తున్నారనో ప్రజలు సైనికుల ఆగ్రహానికో, ఇవే కారణాలతో ఉగ్రవాదుల ఆగ్రహానికో గురవుతూ ఇరువురి మధ్యా నలుగుతూ ప్రశాంత జీవనం కోల్పోయ్యారు. అమాయకమైన ఆడపిల్లలు వీరి ప్రేమలో పడి మోసపోవడం, మాన ప్రాణాలు కోల్పోవడం, కుటుంబాల్లో చిన్నపిల్లలూ, ముసలివాళ్ళూ ఆడవాళ్ళూ తప్ప, మగవారు మిగలని నిస్సహాయ జీవితాలూ నాగాలాండ్ లో కొన్ని దశాబ్దాల పాటు సాగింది.

టెమ్సులా రచనలు ప్రపంచం ముందు నాగాలాండ్ లోని ప్రజల పరిస్తితులకు అద్దం పట్టి చూపించాయంటే అతిశయోక్తి కాదు. ఆమె కధలు ఇన్ని భాషల్లోకి తర్జుమా అవడమే ఇందుకు నిదర్శనం.

 

-Sharada Sivapurapu