Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మీరా నందా


అసలు మతమంటే ఏంటి, కొందరు కలిసి అలోచించి నిర్వచించిన, ప్రవర్తనా నియమావళి, వేషధారణ, వస్త్రధారణ, నిర్వర్తించాల్సిన కొన్ని వ్యక్తిగత, సామూహిక/సామాజిక క్రతువుల సారాంశమా? ఆ రకంగా జీవించే వారంతా ఆ మతానికి చెందినట్టేనా? మతం ద్వారా సత్యాన్ని శోధించడం సాధ్యమా? అసలు మతంలో సత్యం లేకపోతే ఇక సత్యశోధన ఏంటి. మనుషుల్ని హిందువులుగా, ముస్లింస్గా, క్రిష్టియన్స్గా విడదీసి ఒకరినొకరు చంపుకునే స్తితికి మనుషుల్ని తెచ్చిన మతంలో నిజంగా సత్యం ఉందా? ఒక మత సమూహం పెరగడం కోసం, తమని తాము ఇతరుల దాడినుంచి రక్షించుకోవటం కోసం, ఆధిపత్యం నెరపడం కోసం మతం పుట్టినప్పట్నుండీ ఉపయోగపడుతోంది. చరిత్ర మైదానం నిండా మతం చిందించిన రక్త బిందువులే గడ్డి పరకలై మొలిచి పచ్చగా ఈనాటికీ కళకళ లాడుతున్నాయంటే అతిశయోక్తి ఏమైనా ఉందా. సంఘర్షణ మతాల మధ్యనే కాదు, మతాలన్నిటిలోను ఉంది. సహజంగా మనుషులకి ఉన్న మానసిక దౌర్బల్యం, అభద్రతా భావం, దేనికోదానికి చెందాలన్న గుర్తింపు సంబంధిత కారణాల వల్లా ప్రపంచంలో 84% మంది క్రిష్టియన్, ఇస్లాం, హిందూ, బౌద్ధం ఇంకా అనేక ఇతర మతాలకీ చెందినవారే.

స్థూలంగా చెప్పాలంటే వ్యక్తుల జీవితాల్లో క్రమశిక్షణ, నీతీ నియమాలూ, నైతికతా, దైవ భక్తి, పాపభీతి ఉండాల్సిన, పుణ్య కర్మలు చెయ్యాల్సిన అవసరాన్ని, ఇవన్నీ ఉన్న జీవన విధానం తెలియపర్చాల్సిన మతం నిజంగా ఇవన్నీ చెయ్యగల్గిందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి మతమూ తమను తాము బలపరుచుకోడానికి, హేతువాదుల నుండీ, సంస్కర్తలనుండీ రక్షించుకోవడానికి చాలానే తప్పుదారులూ తొక్కింది, దుర్మార్గాలూ చేసింది, చేస్తోంది. మనిషి నుండి మనిషిని, మనిషి నుండి మనసునీ కూడా వేరు చేసేది మతమైంది ఈరోజు, ఎంత గొప్ప ఆశయాలు, ఉద్దేశ్యాలు తమవిగా మతాలు చెప్పుకున్నా కూడా. మత ధర్మాలూ, సూత్రాలూ పురుషులు ఏర్పరచడం వల్ల ఏమతమూ స్త్రీలకు సమాన దర్జా నివ్వలేకపోయింది.

మతం పుట్టు పూర్వోత్తరాలమీదా, మనుషులపై దాని ప్రభావం మీదా రిసెర్చ్ చేసిన మీరా నందా గురించిన వివరాలు ఇవి. మీరా నందా చదివింది Science and Philosophy, PhD in Biotechnology from IIT, Delhi and a PhD in Sceince Studies form Renseller Polytechnic Institute, John Templeton Fellow in Religion and Science , Fellow in Jawaharlal Nehru Institute of Advanced Study in Jawaharlal Nehru Univrsity for research in Science, Post Modernism and Culture. చేసింది. ప్రస్తుతం visiting faculty in history and philosophy of science, Indian Institute of Science Educaion and Research, Mohali లో పని చేస్తోంది. స్థిర పడింది US లో.

ఆమె చేసిన రచనల వివరాలకొస్తే,
Ayurveda Today: A Critical Look,
Post Modernism and and Religious Fundamentalism: A Scientific Rebuttal to Hindu Science,

Breaking the Spell of Dharma and other Essays, A collective of three essays,
Prophets Facing Backward: Postmodern Critiques of Science and the Hindu Nationalism in India,
Wrongs of the Religious Right: Reflections on secularism, science and Hindutva,
The God Market

ఆయుర్వేదం గురించిన రచనలో ఆమె రామదేవ్ బాబాని తీవ్రంగా విమర్శిస్తుంది. ఉచితంగా యోగాసనాలు నేర్పి, జనానికొచ్చిన రోగాలకి వారాల్లో తగ్గిపోయే అద్భుతమైన మూలికౌషధాలతో తను తయారుచేసిన మందుల్ని వారికమ్మి వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్న రామ్దేవ్ బాబా ఇప్పుడు తన వ్యాపారాల్ని ఎలా విస్తరిస్తున్నాడో మనందరికీ తెలుసు. అక్కడ తయారయ్యే మందుల్లో జంతువుల, మనుషుల పుర్రెల, ఎముకల పౌడరుందని తేలినా వ్యతిరేకించిన వారిని పాశ్చాత్య సంస్కృతిని సమర్ధిస్తూ, హిందూ సంస్కృతిని నీచంగా చూపించే తొత్తులుగా చిత్రిస్తూ, అందుకు పూర్తి మద్దతును ప్రభుత్వం తరపునిండీ పొందుతున్నాడు. తమని తాము దైవ దూతలుగా కాకుండా, దేవుళ్ళుగానే చలామణీ చేసుకుంటూ, ప్రజల నమ్మకాల్ని సొమ్ము చేసుకుంటూ, విద్యా సంస్థల్నీ, కళాశాలల్నీ నడుపుతూ ప్రభుత్వం నుంచీ అనేక రాయితీలు, పన్ను రాయితీలూ పొందుతూ, ప్రజల వద్ద నుంచి మాత్రం అధిక మొత్తంలోనే డబ్బు రాబట్టుకునే గాడ్ మెన్లు ఇప్పుడు కోకొల్లలు. సాయి బాబాలు, ఆశారాం బాబాలూ, రామ్రహీంలూ, వీరి కొమ్ము కాసే మంత్రులూ ఇతర ప్రభుత్వ అధికారులూ. ఇవే నమ్మకాల్ని ప్రోత్సహిస్తూ, పారిశ్రామికవేత్తలు కట్టే అతి ఖరీదైన గుళ్ళూ. అసలు చూస్తే లోకికవాదాన్ని రాజ్య విధానంగా రాజ్యాంగంలో రాసుకుని, మతాన్నీ భక్తినీ పౌరుల వ్యక్తిగత విషయంగా పరిగణించాల్సిన మన ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ప్రభుత్వమే ఒక మతం, మతమే ఒక ప్రభుత్వ విధానంగా మారుతోంది. ఇతర ఇస్లామిక్ దేశాల్లాగానే, అమెరికా, ఇండియాల్లో కూడా మతమే రాజకీయాన్ని శాసిస్తోంది. ఇవన్నీ ఆమె చర్చించిన విషయాలు.

The God Market అనే వ్యాసంలో ఆమె కొన్ని ఆసక్తి కరమైన వివరాలిస్తుంది. భారత దేశంలో 2.5 మిల్లియన్ పూజా స్థలాలుంటే 1.5 మిల్లియన్ పాఠశాలలు, కేవలం 75 వేల్ ఆసుపత్రిలు మాత్రమే ఉన్నాయట. మరుగుదొడ్డి కన్నా మొబైలు ముఖ్యమైనపుడు, ఆసుపత్రికన్నా, పాఠశాల కన్నా పూజా స్థలానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండటంలో ఆశ్చర్యం లేదు కదా. ఇప్పుడున్నది రెలిజియస్ టూరిజం . Hindustan Times and CNN-IBN సమ్యుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తేల్చింది, ముప్పై శాతం ప్రజలు గత ఐదేళ్ళలో తాము చాలా రెలిజియస్ అయ్యారని. చెప్పారని. ఇప్పుడు ప్రభుత్వాలే, యగ్న యాగాదుల పేరుతో కోట్లు కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక రక రకాల వ్రతాలు, మత సంబంధిత కార్యాలు చేసే పండితుల సప్లై కన్నా కూడా డిమాండ్ ఎక్కువై, వారికి ప్రతి చిన్న పూజకి వేలల్లోనే సమర్పించాల్సి వస్తోంది. అయినా ఎవరూ ఆలోచించట్లేదు. వాస్తు పేరిట ప్రభుత్వాలు పచ్చని పొలాల్ని, తోటల్నీ కాంక్రీట్ మయం చేస్తుంటే, మరి ప్రజలకి కూడా షార్ట్ కట్లంటే మక్కువ పెరుగుతుంది.

Art of Living నేర్పే రవి శంకర్ ఆశ్రమానికి కర్ణాటక ప్రభుత్వమే స్థలాల్ని ఉచితంగా కేటాయించింది. ఆయన నేర్పే ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంకి కూడా వెళ్ళాలంటే భారీ మొత్తాలే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ సంపన్నులకి మాత్రమే కావాల్సినవి. ఇంకొక విషయం ఇలా వసూలు చేస్తున్న మొత్తాల్ని కేవలం దాన ధర్మాలకీ పుణ్య కార్యాలకే వాడతారా, పేద ప్రజలకి ఎంత మేలు జరుగుతోంది అన్నది ఎవరూ పట్టించుకోరు, ముఖ్యంగా పట్టించుకోవల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్లు ఊర్కుంటారు. బహిరంగంగా వారి కాళ్ళకు మొక్కే ఈ నేతలు ఆ పని ఎంత వరకూ చేస్తారో మనం ఊహించచ్చు.

ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంవల్ల సాధ్య పడిన ప్రతీదీ ఎప్పుడో రాసిన మన వేదాల్లో ఉన్నదే అని శాస్త్ర పరిశోధననీ, విజ్ఞానాన్నీ హేళన చేసే చాందస వాదులు, సైన్సు కాలానుగుణంగా తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందన్న విషయాన్నీ, మత గ్రంధాల్లో ప్రతిపాదించిన ఎటువంటి శాస్త్రీయమైన విషయాలకీ ఎటువంటి దిద్దుబాట్లనీ మత చాందసవాదులు ఒప్పుకోరనే విషయాన్ని వారు విస్మరిస్తారనీ ఆమె అంటుంది. మనిషికి ఏనుగు తలని అమర్చిన హిందువులు సైన్సు పరంగా ఎంతో అభివృద్ధి చెందారని గొప్పగా చెప్పి ప్రధాని విమర్శకి గురవడం ఈ రకమైన చాందసవాదానికి ప్రతీక.

ఒక్క హిందూ మతాన్నే మీరు ఎందుకు విమర్శిస్తారన్న ప్రశ్నకి ఆమె జవాబిస్తూ, తను పుట్టిన మతం, తనకు తెలిసిన మతం కాబట్టి దాని లోపాలను ఎత్తి చూపానని అయితే చాలా సందర్భాలలో, నా విమర్శలు ఇస్లాం, క్రైస్తవ మతాలకి కూడా వర్తిస్తాయని ఆమె అంటుంది. ఆమె ప్రతిపాదనలు చాలా వరకు అంబేద్కరిసం ని సమర్ధిస్తున్నట్లు కనపడినా, రాడికల్ బుద్ధిసమ్ని ఆమె ఒక సమాధానంగా ప్రతిపాదించనందుకు, దళిత మేధావులు కొంచం బాధ పడ్డారు.

ప్రశ్నలకీ, తర్కానికీ, మార్పులకీ తావియ్యనివే అన్ని మతాలూనూ. ధనం, మతం, రాజకీయం అధికారం ఎలా ఒక దానితో ఒకటి పెనవేసుకుపోతున్నాయో ఆమె చాలా లోతుగా విశ్లేషిస్తుంది. నేను చెప్పగలిగింది చాలా స్థూలంగా మాత్రమే. నిజంగా ఆమెను డీప్ గా అర్ధంచేసుకోవాలంటే, ఆమె వ్యాసాలు చదవ వల్సిందే. కుటుంబం, అతి చిన్ని సరిహద్దులో ఇమిడిపోయే సమాజంలో జరిగే విషయాల చుట్టూ కధలూ కల్పనలు అల్లుతూ చేసే రచనలు కాకుండా వాటి పరిధి దాటి విస్తృత పరిశోధనలు చేసి, దేశాల రాజకీయాలు మొదటినుంచి మతంతో ఎలా ముడి పడ్డాయో, ప్రజలని మత మౌఢ్యంలో ఎలా పెట్టాయో తన రచనల ద్వారా చెప్పిన ఆమె స్త్రీలు గర్వించదగ్గ రచయిత్రి. ఇలాంటి విషయాల్ని స్త్రీలు ధైర్యంగా చర్చిస్తే విమర్శ కూడా ఎంత ఘాటుగా ఉంటుందో మనకు తెలుసుకదా. ఈమె రచనలూ అందుకు అతీతం ఏమీ కాదు.

 

-Sharada Sivapurapu