Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సునీతీ నామ్ జోషీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సునీతీ నామ్ జోషీ

 

 

ముంబయిలో 1941 పుట్టిన సునీతి తన పన్నెండవ ఏటనే పైలట్ అయిన తండ్రిని విమాన దుర్ఘటనలో పోగొట్టుకుంది. హిమాలయాస్ దగ్గర ఉన్న అమెరికన్ మిషన్ స్కూల్లోనూ ఆ తరవాత మదనపల్లి లోని ఋషివేలీ స్కూల్లోనూ చదువుకుంది. ఏడదికోసారి రెండునెలల పాటు స్కూలు పిల్లలతో గడిపే జిడ్డు క్రిష్ణమూర్తిగారి ప్రభావం ఆమెపై ఉంది. 1964 లో IAS కి సెలెక్ట్ అయ్యింది కాని 1972 నుంచి 1987 వరకు యూనివర్సిటి ఒఫ్ టొరొంటో లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పని చేసింది.

ఆమె కవిత్వం ముఖ్యంగా gay sex and lesbianism గురించి రాసినది కొంత విమర్శకి గురయ్యింది. పితృస్వామ్యంలోని లింగ వివక్షకి అధికారం, ఆధిపత్యం మగవాడి చేతుల్లోనే ఉండటం, స్త్రీ పురుష సంబందాలెప్పుడూ అధికార రాజకీయాలతో ముడిపడి ఉండటం గమనించి ఆ పరిస్తితి నుంచి తనని తాను రక్షించుకోడానికి ఆమె స్వలింగ సంపర్కం వేపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. ఇవే భావాలు ఆమె కవితల్లో కనిపిస్తాయి. స్వదేశాన్ని వదిలి విదేశాల్లో పర్యటించి, London లో స్థిరపడ్డ ఆమె తన దేశం మీద ప్రేమ వ్యక్తం చేస్తూ కూడా కవిత్వం రాసింది. ఎన్నో కవితా సంకలనాలు, నాటకాలు చిన్నపిల్లల పుస్తకాలు, కధా సంకలనాలు రాసింది. ఆమె రచనలు ఎన్నో ఫారిన్ భాషల్లోకి అనువదించబడ్డాయి.

Bedside Book of Nightmares అనే ఒక కవితా సంకలనం, నిజానికి గుర్తు చేసుకోవడానికి కూడా బాధపడే సంఘటనలు, అనుభవాల గురించి రాసినది. ఇందులో నిరాకరణ, నిరాదరణ, ప్రేమ పొందాలన్న, ప్రేమించబడాలన్న కాంక్ష, తన అస్తిత్వాన్ని గురించిన ఆందోళన గురించిని కవతలు ఉన్నాయి. ఈ కవితలు రాయడమే ఎంతో బాధ పెట్టిన విషయం ఆమెకు. మచ్చుకు వెంటాడే వేదన ఉన్న ఒక చిన్న భాగాన్ని ఇక్కడ ఇస్తాను మేకోసం.

‘Biped’


But I am that dog.
It was I who howled,
I who was hurt.
I felt the pain.
And it is I
Who despised myself.

మన దేశంలో ఎవర్నేనా బాగున్నారా అని పలకరిస్తే ఒక కధ వినాలి, మన దేశం కధల దేశం అందుకనే నేను కధలను ఎంచుకున్నాను అని ఆమె ఒక సారి అన్నది. అతి విలక్షణమైన ఈ రచయిత్రి కధలు కూడా అలాగే ఉంటాయి. ఫెమినిస్ట్ ఫేబుల్స్ అనే ఒక వంద కధల సంకలనంలో ఆమె పురాణాల్లోని కధల్ని, పంచతంత్ర కధల్ని, ఆఫ్రికా, గ్రీక్, యూరోప్, అరేబియా, ఏసోప్ (క్రిస్టియనిటీ) కధల్నీ వాడుకుని ఆడవారికి జరిగే అన్యాయాల్నీ, పితృస్వామ్య ఆధిపత్యాన్నీ, సంఘంలో ఆడవారి స్థానాన్నీ వివరంగా చూపిస్తుంది. అన్ని వర్గాల స్త్రీల జీవితాల్లోని వివక్షనూ ఆమె ఎండగడుతుంది. ఈ కధలన్నీ కూడా ఒకటి రెండు పేజీల్లోనే ఉంటాయి, తమ సందేశాన్ని పాఠకుడికి చాకచక్యంగా చేరవేస్తాయి. ఈ కధలు చదువుతూ, ఆమె మేధస్సును మెచ్చుకోకుండా ఉండటం కష్టం. ఈ ఫెమినిస్ట్ ఫేబుల్స్ లోని కొన్ని ఆసక్తికరమైన కధల్ని మీకు చెప్తాను.

ఒక పేద బ్రాహ్మణుడు, తనకొక కొడుకు కావాలని తపస్సు చేస్తే, శ్రీమహా విష్ణువు ప్రత్యక్షమై వరమిస్తాడు కానీ పొరపాటున కొడుకు బదులు కూతురిని ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ ప్రత్యక్షమైన విష్ణువు నీకు వచ్చే జన్మలో కొడుకు పుడతాడని చెప్తాడు. ఆ వచ్చే జన్మలో, ఈ బ్రాహ్మణుడు ఒక స్త్రీగా పుట్టి ఎనిమిది మంది కొడుకులను కంటుంది. కానీ ఆ బ్రాహ్మణ స్త్రీ మళ్ళీ తపస్సు చేసి ఈసారి నాకు మనిషి స్టేటస్ ఇవ్వమని ప్రార్ధిస్తుంది . కానీ ఏమీ చేయలేని విష్ణువు ఒక కమిటీని వేస్తాడు ఏంచెయ్యాలని. సో అదండీ ఒక స్త్రీకి మనిషిగా బ్రతికే పరిస్తితి కల్పించాలంటే సాక్షత్తూ శ్రీమహావిష్ణువు కూడా ఏమీ చెయ్యలేడు.

చిన్న పిల్లలకి కధలు చెప్పినట్టు ఆమె కధల్లో, బాతులు, పాములు, కోతులు, మొసళ్ళు, బల్లులు, గాడిదలు, గుర్రాలు అన్నీ ఉంటాయి. కొన్ని సార్లు అవి మనుషులకి పాఠాలు కూడా చెప్తాయి. ఆమె పాత్రల వేషాలు వేస్తాయి.
ఆడవాళ్ళపై మగవారి ఆధిపత్యం, తిరగబడే ఆడవాళ్ళు, ఆ తిరుగుబాటుల పర్యవసానాలు అన్నీ ఉంటాయి. ఇలా కధలెందుకు రాస్తావని నన్నడుగుతారు, సమాధానాలివ్వడానికి నేను ప్రయత్నిస్తాను కానీ అవి నా దగ్గర లేవని నాకు తెలుసు అంటుందామె.

The Princess అనే story లో ఒక సుకుమారమైన స్త్రీకి ఒక అద్భుతమైన మంచం ఒక బఠాణీ గింజ ఇవ్వబడతాయి. అయితే ఆమె అతి సుకుమారి కాబట్టి ఏడు పరుపుల కింద ఉన్న ఆ బఠాణీ గింజ వల్ల నిద్ర పోలేదు. తన చుట్టూ ఎవరికి అన్యాయం జరిగినా ఆమె బాధ పడి రోజుల తరబడి మంచంపట్టేది. ఇంత సున్నితమైన మనసూ శరీరమూ ఉన్న ఆమె చివరికి ఈ చెడ్డ ప్రపంచంలో బ్రతకలేక, జలుబు చేసి అది తగ్గక చనిపోతుంది. ఆమెని కాపాడటానికి ఆమె తల్లితండ్రులు శతవిధాల ప్రయత్నించిన ఏమీ చెయ్యలేకపోతారు. మనకు తెలిసిన ఈ కధని ఆమె ఎంత అద్భుతంగా అన్వయించిందో చూడండి.

Next Time Around అనే కధలో ఒక స్త్రీ వెయ్యేళ్ళు నిద్ర పోతుంది. ఆమె అసలు పురుషుడి ఆధిక్యతతో విసిగిపోతుంది. వెయ్యేళ్ళలో అయినా స్త్రీలలో సామాజిక, రాజకీయ చైతన్యం వస్తుందని ఆశించి నిద్ర పోతుంది. ఆమె ఆవలిస్తూ లేవంగానే డాక్టర్స్ పరిగెట్టుకుంటూ వచ్చి నీ పేరేంటి, వయసెంత, పెళ్ళయిందా, స్టేటస్ ఏంటి అని అడుగుతారు. సమాజం ఏం మారలేదా అలాగే ఉందా, అంటే లేదు చాలా అభివృద్ధి చెందింది, మనిషి స్పేస్ లోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రతి పెళ్ళి కాని అబ్బాయికి ఒక ఇల్లు, ఉద్యోగం ఉన్నాయి కాని స్త్రీకి మాత్రం చోటు లేదు అని చెప్తారు. ఇక్కడ మగాడే ముఖ్యం, స్త్రీకి చదువూ, సంపాదనా, ఆస్తి లేదు, ఆధారపడాలి కాబట్టి ఆమె ముఖ్యం కాదు పురుషుడికున్న స్వేఛ్చ లేదు, బానిసే అని చెప్తారు. ఆమె ఉద్దేశ్యంలో వెయ్యేళ్ళలో కూడ స్త్రీల జీవితాల్లో ఎటువంటి మార్పూ లేదు.

ఒక కధలో ఒక కోతి పిల్లకి నదిలో ఉండే రెండు మొసళ్ళు స్నేహితులు. ఈ కోతికి ఆ నది మొదలు వరకూ వెళ్ళి చుడాలనిపించి వీరిని కూడా తోడు రమ్మంటుంది. కాని ఆ మొసళ్ళు అందుకు ఒప్పుకోక నువు కూడా వెళ్ళకు, పొడుగ్గా లావుగా పెద్ద పెద్ద కోరలతో ఉండే జంతువులు నీళ్ళలో ఉంటాయి, వెళ్ళొద్దు అంటాయి. అయినా కోతి పిల్ల వినకుండా ఒక్కతీ వెళ్ళి కొన్నాళ్ళ తరవాత తిరిగొస్తుంది. తిరిగొచ్చిన కోతికి తోక పోతుంది, ఒక కన్ను పోతుంది, కాలు విరిగి ఒంటినిండా దెబ్బలతో తిరిగొస్తుంది. అప్పుడు ఈ రెండు మొసళ్ళు అడుగుతాయీ, మేము చెప్పిన జంతువులు నీకు కనిపించాయా అని. అవును కనిపించాయి అవి కూడా మీలాగే ఉంటాయని మీకు ముందే తెలుసుకదా అంటుంది. అవునని చెప్పి కోతికళ్ళలోకి చూడలేక తల తిప్పుకుంటాయా మొసళ్ళు. ఇంట్లో ఉండే రక్షణ ఆడదానికి బయటలేదు. బయటకెళితే వెళ్ళిన పరిస్తితిలోనే తిరిగి రావటం కుదరదు. బయట ఉండే దుష్టులకి ఇంట్లోని వాళ్ళకీ రూపంలో తేడా లేదు. కాబట్టి అప్పుడప్పుడు హాని వీరివల్ల కూడా జరగొచ్చు.

Bird Woman అనే కధలో, ఒక పాప రెక్కలతో పుడుతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా భయపడి వెంటనే ఆ రెక్కలు కట్ చెయ్యమని సలహా ఇస్తారు, చాలా pressure కూడా పెడతారు. కానీ తల్లి తండ్రులు మాత్రము లొంగక ఈ పాప వింతగా ఉన్నా సరే, రెక్కలున్నాయి కాబట్టి ఎగరడం నేర్పిద్దామనుకుంటున్నామంటారు. ఆడపిల్లలు వాళ్ళకెన్ని టేలంట్స్ ఉన్నా ఎదగడం కష్టం, ఎంతో వ్యతిరేకత, చిన్న చూపు, అణిచివేతని ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సొస్తుంది. అదే సాంప్రదాయ రీతుల్లో, ఒదిగి ఉంటూ స్వేఛ్చగా స్వతంత్రంగా అలోచించకపోతే చాలా ఆదరణ ఉంటుంది. ఒక టీనేజ్ అమ్మాయి హేతువాద సాహిత్యం చదవడం కన్నా, ఏ కాలక్షేపం చేస్తూఅయినా సమయం గడపడం తల్లి తండ్రులకి ఇష్టంగా ఉంటుంది.

The Blue Donkey Fables అనే సంకలనంలోని “The Blue Donkey” అనే కధలో, ఒక బ్లు కలర్ ఉన్న గాడిద ఒకటి రెడ్ బ్రిడ్జ్ అనే చోట ఉంటుంది. ఇదేంటి, గాడిదలన్నీ బూడిద రంగులోనో, తెల్లగానో ఉండాలి తప్ప ఈ నీలం రంగు ఏంటీ అని అక్కడున్న కౌన్సిలర్స్ అందరూ కలిసి నువు రంగు మార్చుకుంటే తప్ప ఇక్కడ ఉండటానికి వీలు లేదంటారు. కానీ ఆ గాడిద నిరాకరిస్తుంది. ఈ విషయమై అక్కడ అందరూ రెండు గ్రూపులుగా విడిపోయి వాదించుకుంటుంటారు. అయితే ఆ ఆడ గాడిద తెచ్చుకున్న ఆ నీలం రంగుతో తన స్వేఛ్చని ప్రకటించడానికి వాడుకునే ప్రయత్నం చేసింది, అందుకే ఆ రంగు మాత్రమే అభ్యంతరం సమాజానికి. అలాగే Lesbianగా, Feminist గా తనను తాను నిస్సంకోచంగా ప్రకటించుకున్న సునీతి పురుషాధిక్య సమాజానికి ఇచ్చే ఒక సంకేతంగా భావించవచ్చు.

లింగ వివక్ష, అధికార రాజకీయాలు ఎలా కలిసి పోయి ఉంటాయో The Bride అనే ఈ కధలో చెప్తుంది. ఒక రాజు తన అందగాడైన, అన్నివిధాలా వీరుడు, యోగ్యుడైన తన కొడుకు కోసం ఒక చక్కటి భార్య కోసం వెతుకుతుంటాడు. అందుకోసం అతను ఒక పోటీ నిర్వహిస్తాడు, బాగా చదువుకుని, అందంగా ఉండి, విలువిద్య, సంగీతం లాంటి అనేక కళల్లో ప్రావీణ్యం ఉన్న వారి మధ్య. ఈ పోటీలో నెగ్గినవారిని చూసి తనకు నచ్చిన అమ్మాయిని ఎన్నుకోమంటాడు. అయితే యువరాజు వారందరినీ పరీక్షించిన మీదట వారిలో కొందరు తనకన్నా చురుకైన వారని గ్రహించి, తన పురుషాహంకారం దెబ్బతిని, తండ్రికి ఇలా చెప్తాడు. వారంతా బాగున్నారు కాని వాళ్ళల్లో స్త్రీత్వం లేదు అని. అయితే పోటీల్లో నెగ్గని వారిలోంచి ఎన్నుకోమంటాడు తండ్రి. పితృస్వామ్యంలో పురుషుడి కన్నా చురుకైన వారికి ముఖ్యమైన పదవులు ,బాధ్యతలు ఇవ్వబడవు. వారినెప్పుడూ, అధికారానికి దూరంగానే పెడతారు.

ఇలా ఎన్నో అద్భుతమైన కధలు. ఎన్నిటినో ఇక్కడ ఉటంకించవచ్చు. సునితీ జోషీ రచనల్లు చదవాలనిపించడానికి ఇవి చాలేమో.

 

-Sharada Sivapurapu