Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మీనా కందస్వామి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? 

మీనా కందస్వామి - తమిళ్, ఇంగ్లీష్

 

భక్తి తత్వంతో తిరుగుబాటు చేసిన స్త్రీలు తమ కష్టాలన్నీ దేవుడికి వెళ్ళబోసుకున్నారు తమదైన కవిత్వ శైలిలో. తరవాత స్త్రీ వాద కవిత్వం మగవారే రాసారు స్త్రీల కష్టాలు వారికర్ధమైన విధంగా. అలాగే దళితుల తరపున వారి కష్టాలను చూసి అర్ధం చేసుకున్న కొందరు వారి తరపునా రాసారు. కానీ ఈ రెండు కవిత్వాలూ విమర్శకు గురయ్యాయి. ఎందుకంటే ఎవరి కష్టాలను, అనుభూతులను వారు కవిత్వీకరిస్తేనే అది మరింత శక్తిమంతంగా ఉంటుందని. మెల్లి మెల్లిగా స్త్రీలనుంచి స్త్రీవాద కవిత్వమూ సాహిత్యమూ వచ్చాయి. అలాగే దళితులని నుంచి కూడా కొందరు చదువుకున్న వారు వారి కధలను జీవితాలనూ, వివిధ సాహిత్య ప్రక్రియల్లో ప్రజలు ముందుకు తెచ్చారు. అడిగితేనే కానీ అమ్మయినా అన్నం పెట్టదని, వారి కష్టాలూ, సమాజంలో వారనుభవించే దుర్భర జీవితాల్నీ, హేయమైన పరిస్తితిల్లో గడుస్తున్న జీవితాల్నీ చూస్తూ కూడా వారు గొంతు విప్పి చెప్పకపోతే వారు సుఖంగానే ఉన్నారన్నట్టు సమాజం నటిస్తుంది.

ఇటాలొ కెల్వినో, Italian కవీ, జర్నలిస్ట్ మాటల్లో, “Literature is necessary to politics above all when it gives a voice to whatever is without voice, when it gives a name to whatever is without name, to what as yet has no name, especially to what the language of politics excludes or attempts to exclude ---- literature is like an ear which can hear things beyond colour spectrum provided by politics”.

ఒక దళిత మహిళ ఒక పెద్ద రాష్ట్రానికి సీ ఎం అయిన దేశంలో, స్వాతంత్రం తరవాత రిసర్వేషన్ అమలు వల్ల ఎంతో కొంత మేలు జరిగినా ఇంకా వారి స్తితిగతుల్లో ఎంతో మార్పు రావాల్సిన అవసరం ఉంది. వర్ణాశ్రమ ధర్మం, వృత్తిని బట్టి మనుషుల్ని విభజించినా అన్ని వృత్తుల వారికీ సమాన గౌరవాన్నీ, ఆర్ధిక సమానతనీ ఇవ్వ లేక పోయింది. అసలు ఆ విభజన లోనే అగ్రవర్ణాల అవకాశవాదం, స్వార్ధం ఉండి, ఒకరి కష్టంతో ఇంకొకరు సుఖపడటం జరిగింది. వేల ఏళ్ళ సంవత్సరాలుగా అలాగే జరుగుతూ వస్తోంది. దళితులు కూడా వేల ఏళ్ళ వెనుకబాటుతనంలోనే ఇప్పటికీ జీవిస్తున్నారు. కారంచెడు, చుండురు సంఘటనలు, దళిత స్త్రీలపై మానభంగాలు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంత ముందుకెళ్తున్నా అందులో భాగస్వామ్యం మాత్రం వీరికి లేదనిపిస్తుంది.

1984 లో పుట్టిన ఇలవేనిల్ కందస్వామీ మీనా అనే కలంపేరుతో రాసింది. కవిత్వం ఇంగ్లీష్లో రాసిన మొదటి దళిత రచయిత్రి. పదిహేడేళ్ళనుంచే రాయటం మొదలు పెట్టింది. ఇంగ్లీష్లో ఆమె మొదటి కవితా సంకలనం " టచ్" 2006 లో కమలా దాస్ గారి ముందు మాటతో అచ్చయ్యింది. ఎన్నో ఏళ్ళ తరవాత నిజాయితీ గల కవిత్వాన్ని చదివే అవకాశం కలిగిందని చెప్పింది. ఈ పుస్తకం అచ్చవగానే అయిదు భాషల్లోకి అనువాదం అయ్యింది. అయితే ప్రముఖ తమిళ రచయితల రచనలు చాలానే ఆమె ఇంగ్లీష్ లోకి అనువదించింది. ఆమె మొదటి సంకలనం "Touch” వస్తు పరంగా చాలా విలక్షణంగా, బలంగా ఉన్నా భాషా పరంగా చాలా బలహీనంగా, తప్పులు తడకలతో, ఒక్కోసారి ఆమె ఏంచెప్పదలుచుకుందో తెలియనంత ఘోరంగా ఉందని విమర్శ. అయితే 2007 లో అచ్చయిన ఆమె రెండో సంకలనం మిస్ మిలిటెన్సీ చాలా వరకూ భాషాపరంగా మెరుగ్గా ఉన్నా వస్తు పరంగా, కంటెంట్ పరంగా బలహీనంగా ఉండి మళ్ళీ విమర్శకి లోనయ్యింది.

ఇక ఆమె కవితలు Mascara, My Lover Speaks of Rapeఅనేవి International Poetry Competition లో మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఆమె International Writing Program at the University of Iowa in 2009 లో పాల్గోటానికి మన దేశతరపున ఆహ్వానిచబడిన యువ రచయిత్రి. రెండేళ్ళ తరవాత Charles Wallace India Trust Fellow at the University of Kent లో ఫెల్లోగా నియమించబడింది. ఎన్నో అంతర్జాతీయ కవి సమ్మేళనాల్లో ఆమె పాల్గొంది. ఆమెను దక్షిణ ఆసియాలోని 40 ఏళ్ళ లోపు 21 మంది కధా రచయితల్లో ఒకరిగా ఎన్నుకుని ఆమె రచన జుబాన్, ధిల్లీ (మన దేశపు మొదటి స్త్రీవాద బుక్ పబ్లిషింద్ హౌస్) వారు అచ్చేసిన సంకలనంలో వేసారు. ఆమె 2014 లో Kilvenmani Massacre గురించి ఒక నవల "Gypsy Goddess” అనే పేరుతో పబ్లిష్ చేసింది.

దళిత రచయిత్రిగా తన సామాజిక బాధ్యతని నిర్వర్తించే దిశగా మీనా తనకు తెలిసిన దళిత జీవితాన్ని తన రచనల్లో ప్రతిబింబిస్తూ, వారిపై జరుగుతున్న అన్యాయాలని ప్రతిఘటిస్తూ గొంతు విప్పలేని ఆ నిస్సహాయుల గొంతుకగానే కాక వారి తరపున వరిపై అత్యాచారాలు చేస్తున్న అగ్ర కులాల పట్ల సిమ్హ గర్జనగా మారింది. తన కలాన్ని ఒక పెన్నులా కాకుండా ఒక గన్నులా వాడింది. ఒక్క మాటలో సినిమా స్టైల్లో చెప్పాలంటే ఆమె ధైర్యం విసిరిన రాకెట్టు. దేశంలో దళితులపై జరుగుతున్న అణిచివేత సంఘటనల్లో అక్రమార్కుల పేర్లు ఆమె రాసే వ్యాసాల్లో బయట పెట్టడానికి ఆమెకు పిసరంత కూడా భయం ఉన్నట్టు కనపడదు. వాళ్ళ నేర చరిత్రలు, వాటి లింకులు అన్నీ ఇచ్చి మరీ ప్రతిఘటించే ఆమె సాహసం చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది.

టచ్ సంకలనంలో అదే శీర్షిక గల పోయెంలో ఇలా అంటుంది.

“You will have known almost
Every knowledgeable thing about
The charms and the temptations
That touch could hold.

But, you will never haven known
That ---touch ---- the taboo
To your transcendence,
When crystalized in caste
Was a paraphernalia of
Undeserving hate.”

నిజమే స్పర్శకి మానవ సంబంధాల్లో ఉన్న అనేక కోణాలు అందరికీ ముఖ్యంగా మీనా ప్రకారం అగ్రవర్ణాలవారికి తెలుసు కాని ఎంతమందికి అదే స్పర్శ దళితులకేంటో ఎలా అర్ధమవుతుంది.

ఏకలవ్యుడి కధని తీసుకొని ఇప్పటి ఏకలవ్యుడైతే గురుదక్షిణ కోరికకు ఎలా ప్రతిస్పందించాలో చెబుతుంది.

“You can do a lot of things
With your left hand,
Besides, fascist Dronacharyas warrant
Left handed treatment,

Also,
You don't need your right thumb,
To pull a trigger or hurl a bomb”.

ఇంకొక కవితలో, బ్రహ్మ సరస్వతులమీద సటైర్ వేస్తూ ఇలా అంటుంది. పురాణాల్లో చదువుకున్న దేముళ్ళే ఇలాంటి సంస్కారంతో ఉన్నపుడు, మీరింక మంచి సంస్కారంతో ఎలా ప్రవర్తిస్తారు అని భావన/వాదన.

We understand
Why upper caste Gods
And their “good girl” much married, father fucked,
Virgin, Vegetarian oh-so-pure Goddesses,
Borne in thier golden chariots
Don't come to our streets”.

దళిత బాలిక పై అత్యాచారం అనే వార్తను మనం చాలా కామన్ గా పేపర్లో చదువుతుంటాము. కానీ ఆ వార్త వెనుక ఆ బాలిక అనుభవించే బాధ అందరికీ అర్ధం కానిది. ఆ బాధని ఆమె ఈ పోయెం లో పాఠకుడి అనుభవంలోకి తెస్తుంది. ఇంకా బాధించే విషయం ఏంటంటే నేరం చేసిన వాడు తప్పించుకుని సంఘంలో గౌరవంగా బ్రతికేస్తుంటే, బలయిన బాలిక మాత్రం అవమానభారంతో సిగ్గు పడుతూ జీవశ్చవంలా బ్రతుకుతుంది,

“Dalit girl raped”
Is much too commonplace,
Humiliation gnaws,
The sixteen year old,
Gory scars on a wrecked body,
Serve as constant reminders
Of disgrace, helplessness.

అందుకే ఈ అత్యాచారాలన్నీ ప్రతిఘటించడానికి ఏం చెయ్యడానికైనా ఆమె సిద్ధమే. బలైపోయే స్త్రీలందరూ ఎలా ప్రతిఘటించాలో కూడా ఆమె చెప్తుంది ఈ కవితలో.

“I fancy myself being a witch
Broomstick borne and black as pitch,
Thin, stark-naked with fire for eyes
Killing men whom I despise ----

Haunting oppressors to shave their heads
Cutting all their holy threads
Experiencing joy as they bleed”.

వర్ణాశ్రమాన్ని వెనకేసుకుని వచ్చినందుకు గాంధీని కూడా విమర్శించడానికి ఆమె వెనుకాడదు. ఒక్క అంటరానితనం తప్ప గాంధీకి హిందూ మతంలో అంతా సవ్యంగానే కనిపించింది. అంటరానితనమొక మచ్చ హిందూ మతానికి అని బాపూ అభిప్రాయపడ్డాడు. తన కవితలో ఎలా దుయ్యబడుతుందో చూడండి. కుల వ్యవస్థని నిర్మూలించగలిగి ఉండి కూడా గాంధీ ఆ దిశగా ఏమీ చెయ్యలేదని ఆమె అభిప్రాయం. అంటరానితనం వద్దన్నాడే కానీ వర్ణాశ్రమాన్నీ, కులాల్నీ కుల వృత్తిల్నీ వాటి ఆధారంగా జరుగుతున్న అన్యాయాన్నీ ఆయన ఖండించలేక పోయాడు.

“bapu; bapu, you big fraud, we hate you,”

“That trash is long overdue
You need a thorough review,
Your tax free salt stimulated our woulds,
We gonna sue you, the Cogress shoe.

You knew, you bloody well knew,
Caste won't go, they wouldn't let it go
It haunts us now, the way you do
with a spooky stick, an eerie laugh or two”.

కుల రహిత సమాజాన్నీ, అన్ని వర్గాల ప్రజలకీ సమాన అవకాశాల్నీ, సమాన గౌరవాన్నీ ఇచ్చే, ఆర్ధిక అసమానతలు లేని సమాజం ఆమె కల. అదినిజం కావాలంటే నిమ్న కులాలుగా గుర్తింపబడుతూ, అణిచివేతని సహిస్తూ వస్తున్న వాళ్ళందరూ వారి కనీస మానవ హక్కుల కోసం సంఘటితపడి పోరాడితేనే తప్ప సాకారమవని కల. అది చాలా కష్టమని నిజానికి అంత తేలికగా సాధ్యమయ్యేది కాదనీ అమెకూ తెలుసు. ఇదే విషయన్ని ఆమె ఇచ్చిన అనేక పత్రికా ముఖాముఖీల్లో ఆమె చెప్పినదే. కులవ్యవస్థకి స్త్రీలు ముఖ ద్వారాల్లాంటివారని అంబేద్కర్ అన్నారట. ఎందుకంటే సంస్కృతయినా, సాంప్రదాయమైనా పాటించాల్సింది, నిలబెట్టాల్సింది స్త్రీలే. అలాగే పురుష/కుల ఆధిపత్యానికి ఆయుధాలుగా మారేది కూడా వారే, వారి శరీరాలే. Downtrodden of the downtrodden, దళితుల్లో దళితులు స్త్రీలు. ఏ కారణంగానైనా మగవాడిలోని పశువాంఛకి బలయ్యేది ఇరువర్గాల్లోని స్త్రీలే. అందుకే ఆమె స్త్రీల పక్షం. స్త్రీవాదమే ఆమె ఎజెండా, వారి బాధలే ఆమె వస్తువులు, వారి బాగు ఆమె తపన, వారి ధైర్యం ఆమె పరిశ్రమ. ఆమె కవిత్వంలో ఆగ్రహం, దుఖం, తిరుగుబాటు, స్త్రీలపై హింస లేని ఒక నూతన సమాజంపై కాంక్ష ఇవన్నీ కనిపిస్తాయి. ఆమె కవిత్వం గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది. ఇంత రాసినా ఇంకా రాయాల్సిన కవితలు చాలా ఉన్నాయనిపిస్తోంది. సహిస్తూ పోతే దుర్మార్గాలు చేస్తూనే ఉంటారు, తిరగబడు, తిరగబడటం ఒక్కటే మార్గం, అంటూ తనకు చేతనైన, చెయ్యగల్గిన తిరుగుబాటు తను చేస్తున్నానని చెప్పుకుంది.

హైదరాబాదు బీఫ్ ఫెస్టివల్లో పాల్గొని ఈమధ్య న్యూస్లోకి వచ్చిన ఈమెకు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ, సామాజిక కార్యకర్త కూడా అయిన ఆమె వల్ల ఆమె రచనల వల్ల స్త్రీల, ముఖ్యంగా బడుగు వర్గాల స్త్రీల పరిస్తితుల మెరుగవుతాయని ఆశిద్దాం. 

 

-Sharada Sivapurapu