Facebook Twitter
" ఏడు రోజులు " 6వ భాగం

" ఏడు రోజులు " 6వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 


అప్పటికి మసకమసగ్గా తెల్లవారసాగింది. నమాజు ఎప్పుడో పూర్తయింది. భక్తిగీతాలు మాత్రం ఇంకా ఆగలేదు.

" ప్చ్! గౌసియా నాకు ఎందుకు నచ్చిందో ఆమెకు నేనెందుకు నచ్చానో..." మనసులోనే విచారంగా అనుకుంటూ నెమ్మదిగా అడుగులు ముందుకు వేయసాగాడు భవానీశంకర్.

అతడికి గతం క్రమంగా గుర్తుకు రాసాగింది.

అప్పట్లో రామజన్మభూమి గొడవలు జరిగినప్పుడు తను బాగా చిన్నవాడు . రేగుతున్న మతకలహాలు బాగా అర్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో అంతకుముందు నుండే మత బేధాలు ఉన్నందున రామజన్మభూమి గొడవలు  అక్కడ తీవ్రతరంగా చెలరేగాయి. ఫలితంగా అమాయక ప్రాణాలు నేలకు ఒరిగాయి. ఇందుకు పూర్తిగా భయకంపితులైన తన తల్లదండ్రులతో పాటుగా చాలామంది కుటుంబాలు ఆ ప్రాంతాన్నే వదలిపెట్టడం జరిగింది. అప్పుడు తాము నల్లగొండ జిల్లాలో ఉన్నారు.

హిందువుల దేవాలయాలపైనే కాదు, ఊళ్లోకి వచ్చిన రామపాదుకలపై కూడా ముస్లీంలు దాడి చేశారు. పొలాల్లోనూ కోన్ని ఇళ్లముందరనూ, భక్తిపూర్వకంగా కట్టుకున్న మహ్మద్ హుస్సేన్ దర్గాలపైనే కాకుండా... మసీదులపై కూడా హిందువులు దాడిచేశారు. ఆ గొడవల్లోనే బాలస్వామి తమ్ముడు చనిపోయాడు. సాయిబు అన్న కూడా చనిపోయాడు.

గొడవలు సద్దుమణిగాక ఇంటికి రావడం జరిగింది. అప్పటికి  గౌసియాతో తనకు పరిచయం లేదు. కాకపోతే కలహాల్లో గౌసియా గాయపడింది. ఆమెకు ఒళ్లంతా కట్లుకట్టి ఉన్నారు. తనకు పాపం  అన్పించింది. అందుకే ఓ రోజు ఇంటిముందు కూర్చున్న గౌసియా దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అప్పుడు మళ్లీ గొడవలు చెలరేగాయి. గొడవల్లో తన తండ్రి గాయపడ్డాడు.

ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మరి తమ ప్రేమను తను ఎలా గెలుచుకోగలడు? గెలవకపోతే తను బ్రతకగలడా..? తనే కాదు, గౌసియా కూడా బతకలేదు.

" రేయ్ శంకర్...." ఉన్నట్టుండి సురేష్ గొంతు మళ్లీ వినిపించింది.

ఆగి తిరిగి చూశాడు భవానీశంకర్.

" రేయ్ ... ఎప్పుడూ కూడా నీ మాటను, నీ ప్రేమను నేను లక్ష్యపెట్టలేదు కదా! కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి సలహా ఇవ్వడానికి వచ్చాను " దగ్గరగా వస్తూనే అన్నాడు సురేష్.

" ఏంట్రా? " ఆసక్తిగా కళ్లింత చేశాడు భవానీశంకర్.

" ఇదిగో ! మన హిందువుల్లో మతం మార్చుకునే ఆత్మాభిమానం తక్కువ వెధవలు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో నువ్వొకడివి అయిపోతే చాలు ! నీకు ఇష్టమైన పిల్లను నువ్వు హాయిగా చేసుకోవచ్చు " చెప్పి ఆ వెంటనే వెనుతిరిగి వెళ్లిపోయాడు సురేష్.

" వీడు నన్ను ఎత్తిపొడుస్తున్నాడా లేక నిజంగా ప్రోత్సహిస్తున్నాడా?" అర్దం కాలేదు భవానీశంకర్ కు. అందుకే వెళ్లిపోతున్న స్నేహితుడివైపు ఎగాదిగా చూస్తుండి పోయాడు.

అంతలోనే అన్పించింది కూడా... "నిజమే! నాకు తెల్సీ మతం మార్చుకున్న ముస్లీంలు ఎవ్వరూ లేరు. ఎక్కడైనా ఉన్నారేమో తెలియదు కానీ.. తనకు తెల్సి సంగీత దర్శకుడు రెహమాన్ ముస్లీం మతాన్ని తీసుకున్నవాడే.. సరూర్ నగర్ లో తమకు తెల్సిన బ్రాహ్మణ స్ర్తీ ముస్లీంను పెళ్లిచేసుకొని రజిత పేరును కాస్తా రజియాగా మార్చుకుంది. ఇంకా సినిమా నటి ఐశ్వర్య, ఆమని ముస్లిం మతాన్ని తీసుకున్నవాళ్లే. మరి వీళ్లంతా వాడు సురేష్ అన్నట్టుగా ఆత్మాభిమానం లేనివాళ్లా? కాదు! ఆ మతంలో వాళ్లకు ప్రేమతత్వం కనబడింది. అందుకే అంత గొప్ప త్యాగం  చేశారు. మరి నేను కూడా ముస్లీం మతం తీసుకుంటే ఎలా ఉంటుంది?"

" రేయ్ శంకర్!" అంతలోనే మళ్లీ వచ్చాడు సురేష్.

" మళ్లీ ఏం మాటరా?" అడిగాడు భవానీశంకర్.

" ఇతర మతస్థులు హిందూమతాన్ని స్వీకరిస్తే పెద్ద హంగామా ఉండదు కాని, తమ మతాన్ని స్వీకరించే ఇతర్లను ముస్లీంలు మాత్రం ఆనందంగా ఆహ్వానిస్తారు. అంతేకాదు, అట్లాంటి వాళ్లను పరిపూర్ణ ముస్లీంగా కూడా భావిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఎందుకంటే.. చెల్లేళ్ల చేయిని కూడా పట్టుకునే " చెడిన మతం" కదా అది అని తిరిగి ఆ వెంటనే వెళ్లిపోయాడు సురేష్.

" వీడికేం వచ్చింది? నిమిషానికి ఒకమాట మాట్లాడి వెళ్తాడు. ముస్లీం మతం చెడిన మతం అయితే హిందూమతం కూడా చెడిన మతమే! వీళ్లు మేనకోడల్ని చేసుకోవడంలేదా? అబ్బ తమ్ముడు అబ్బనే అవుతాడు. అమ్మ చెల్లి అమ్మనే అవుతుంది. అమ్మ తమ్ముడు మాత్రం మొగుడు ఎందుకు అవుతాడు. ఇది హిందువుల అనంగీకార పద్దతి కాకపోతే మరేం అవుతుంది?" అనుకుంటూ ఇంక అక్కడ ఆగకుండా ఇంటివైపు వడివడిగా అడుగులు వేయసాగాడు భవానీశంకర్.

ఇంటికి సమీపంగా వెళ్లేసరికి చేతిపంపు దగ్గర నీళ్లు పట్టుకుంటూ కనిపించాడు సాయిబు.

అతడితో పాటుగా ఒక హిందూవ్యక్తి కూడా ఉన్నాడు. అయితే హిందూ వ్యక్తి సాయిబు ఉనికిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సాయిబు మాత్రం ఆ వ్యక్తి ఉనికిని సహించలేనట్టుగా ముఖమంతా గంటులా పెట్టుకుని పంపుకొడుతున్నాడు.  

పంపుకింద ఉన్న బిందె నిండగానే తన బిందెను తీసుకొని పంపుకు సమీపంగా వెళ్లాడు హిందూవ్యక్తి.

" ఏం.. జర దమాక్ కరాబ్ అయ్యిందీ? ఇవి పీనేకే పానీ! నీవు ఇట్లా మీదికి ఉర్కివస్తే మేము నీళ్లను ఎట్లా తాగాల?" ఆ మాత్రానికే కోప్పడిపోయాడు సాయిబు.

" సర్లే సర్లే..." హిందూ వ్యక్తి శాంతంగా అన్నాడు.

" ఈ సూదరి జనాలకు ఎవ్వరితో ఎట్లుండాల్నో గూడా తెల్వదు" అనుకుంటూ బిందె ఎత్తుకుని వెళ్లిపోయాడు సాయిబు, ( మాములు ఊళ్లల్లో హిందువులు అందర్నీ ' సూదరి జనాలు' గా పేర్కొంటుటారు ముస్లీంలు)

హిందూ వ్యక్తి సహజంగా పంపుకింద తన బిందెను పెట్టి, పంపుకొట్టసాగాడు. అంతసేపూ అంతా గమనిస్తూ ఎక్కడ ఉన్నాడో మరి బాలస్వామి.. పరుగున వచ్చి పంపుకింద బిందెతీసి, పంపును కడిగినట్టుగా నీళ్లను ఒక్కసారిగా గుమ్మరించాడు.

" అదేంటన్నా?" విస్తుపోయాడు ఆ వ్యక్తి.
" నీకు సిగ్గూ శరం లేదురా! నీ కార్జానికి చేదు లేదురా? వాడు నువ్వేదో అంటరాని వాడివి అన్నట్టుగా మాట్లాడిపోతే, నువ్వు పౌరుషం లేనివాడిగా ఉండిపోవడమేనా?" ఆవేశంగా అని " ఇంకొక్కసారి పంపును కడిగి నీళ్లు పట్టుకో " చెప్పి వెళ్లిపోయాడు బాలస్వామి.

అంతా చూస్తున్న భవానీ శంకర్ కు తల తిరిగినట్టయింది. " ఇంకేమైనా పనీపాట ఉంటేకదా" తనలో తను గొణుక్కుంటూ వెళ్లిపోతున్న బాలస్వామివైపు గుర్రుగా చూశాడు.

ఉదయం పదవుతుండగా సాయిబు ఇంటిముందుకు తెల్లని అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. కారు ఆగీ ఆగగానే వెనుక డోరు తీసుకొని అరబ్బుషేకు దిగాడు.

అప్పటికే బయటకి పరుగెట్టుకొచ్చిన సాయిబు, అరబ్బుషేకుకు సలాం చెప్పి, సాదరంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు.

చెక్క స్టూలును దులిపి "కూర్చోండి మహరాజ్" వినయంగా చెప్పాడు.

అరబ్బుషేకు స్టూలుమీద కూర్చుని ఇల్లంతా కలియచూశాడు.

"చాయ్ తీసుకుంటారా మహరాజ్"  ఈమారు చేతులు కట్టుకున్నాడు సాయిబు.

" నాకు చాయ్ వద్దు ఏమీ వద్దు. శుక్రవారం రోజు నీకు యాభైవేలు ఇచ్చాను. ఇచ్చి ఈ రోజుకి ఐదురోజులు కావొస్తోంది. ఐదు నా అదృష్టసంఖ్య. అందుకే ఈరోజు మిగతా డబ్బులు ఇచ్చేసి, పిల్లను నిఖా చేసుకొని వెళ్లిపోవాలనుకుంటున్నాను"

" మంచి మాట" చిరునవ్వుతో తలాడించాడు సాయిబు.

ఆ మాటల్ని వింటుండగానే లోపలిగదిలో కూర్చుని ఉన్న గౌసియాబేగం నిలువెత్తున వణికిపోయింది.

" అల్లా" గుండెలపై చేయివేసుకుని భయంగా తల్లివైపు చూసింది.

" ఎందుకు భయపడ్తున్నావు? షేకు ముసలివాడైనా నీకు సుఖం దక్కుతుంది. ఈ గరీబు జీవితాన్ని భరించేకంటే అట్లాంటి సంపన్న జీవితమే మేలు " గౌసియాకు మాత్రమే వినబడేలా అంది తల్లి.

" వొద్దమ్మా.. నాకా జీవితం వొద్దు" గౌసియాకి కళ్లలో నీళ్లు తిరిగాయి.

" అట్లా అనొద్దు బేటా! నీవు మహారాణివి అయిపోతున్నావు. ఇక కోరింది కొనుక్కోవచ్చు. ఈ చిరిగిన బట్టలు, ఈ గడ్డితిండి, ఈపాత ఇల్లు, ఇవేమీ నీకు ఉండవు"

" పట్టెమంచాలు, జరీచీరలు, పెద్ద పెద్ద గదులు ఉన్న బంగళా, అన్నీ నీ సొంతమైపోతాయి. అందుకే ఆనందంగా ఉండు " ఆశ పెంచే ప్రయత్నం చేసింది తల్లి ఖతీ జాబీ.

 

....... ఇంకా వుంది .........