Facebook Twitter
" ఏడు రోజులు " 5వ భాగం

" ఏడు రోజులు " 5వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

అప్పట్లో కొందరు ముస్లిం మతపెద్దలు తమ మత వ్యాప్తికోసం పాటుబడుతూ, అన్నివిధాలా సరైన వ్యక్తుల్ని ఎంపికచేసి ఆయా చోట్లకు పంపించేవాళ్లు. ఆ విధంగా వెళ్లే వ్యక్తులకు నెలసరి జీతాలు ఉండేవి. ఆయా చోట్లకు వెళ్లినప్పుడల్లా వాళ్ల ఖర్చుల్ని కూడా భరించేవాళ్లు కాబట్టి వాళ్లల్లో తను ఒకడిగా ఉండాలని తెగ ప్రయత్నించేవాడు సాయిబు. కానీ అతడికి చదువుసంధ్యలు లేవుకాబట్టి, మత ప్రచారానికి అంతగా పనికిరాడనే ఉద్దేశ్యంతో కాబోలు మతపెద్దలు అతడ్ని పెద్దగా పట్టించుకోకపోయేవాళ్లు.

అదే అతడ్ని ఉసిగొల్పింది. మతపెద్దలు తనని ఏంచేస్తే పట్టించుకుంటారోనని పరివిధాలా ప్రయత్నించడం మొదలెట్టాడు. అందుకు అతడి పేదరికం కూడా ఒక కారణం కావొచ్చు. ఇట్లాంటి తరుణంలోనే ఓ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి టీజ్ చేయడం, దాన్ని ఆసరాగా తీసుకొని సాయిబు పెద్ద ఎత్తున ఆవేశపడటం, క్రమంగా హిందూముస్లింల మధ్య గొడవలు తలెత్తడం జరిగింది.

ఇక్కడ స్వార్ధం సాయిబు ఒక్కడిదేకాదు, బాలస్వామిది కూడా! ఎలా అంటే అప్పట్లో పిట్టలరాజు అనేవాడు ఈ ప్రాంతం మొత్తానికి దాదాగా వ్యవహరించేవాడు. మనుషుల్ని పిట్టల్ని చంపినట్టుగా చంపించేవాడు. కాబట్టి వాడికి ఆ పేరు వచ్చింది. వాడి దగ్గర యువకుడిగా ఉన్న బాలస్వామి ఒక తొత్తు.

అయితే పిట్టలరాజు పథకం ప్రకారం.. "హిందూముస్లింల మధ్య చాపకిందనీరులా ప్రవర్తించి గొడవలు రేపాలి. గొడవలు జరుగుతుంటే ఇరువురి మధ్యా సయోధ్యకు ప్రయత్నించాలి. ఇరువురితో మంచితనాన్ని నటించాలి. ఇందువల్ల రెండుమతాల అండదండలు తనకు లభిస్తాయి" అని యోచించి బాలస్వామిని అందుకు ఆసరాగా మలుచుకొని, లక్షల రూపాయలతో కాంట్రాక్టు మాట్లాడుకున్నాడు. డబ్బుకోసం మానవతను మరిచిన బాలస్వామి, తనకు తెలిసిన అబ్బాయిని ఉసిగొల్పి ముస్లిం అమ్మాయిని కావాలని టీజ్ చేయించాడు.

ఈ గొడవల్లో ఆ అబ్బాయి మరణించాడు. అమ్మాయి కూడా ఆతరువాత మరణించింది. వీళ్లిద్దరూ మరణించారు అని చెప్పేకంటే చంపబడ్డారు అని చెప్పడమే బాగుంటుంది.

తన స్వార్థంకోసం పడగవిప్పిన పిట్టలరాజు మాత్రం క్షేమంగా ఉండిపోయాడు. సాయిబు, బాలస్వాములుకూడా హాయిగా ఉన్నారు కదా" చెప్పి భవానీశంకర్ పై చూసాడు అతడు.

" ఈ గొడవల గురించి నాకు మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది" అని, " అవును అంకుల్! పిట్టలరాజు నరరూపరాక్షసుడు అని అందరికీ తెలుసు. మరి అతడు మంచి వాడుగా నటిస్తూ హిందూముస్లింల మధ్య సయోధ్యకు ప్రయత్నించినంతమాత్రానా అతడ్ని ఈ ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నాడు?" అడిగాడు భవానీశంకర్.

నవ్వాడు అతడు, నవ్వి, " డబ్బు బాబు డబ్బు! డబ్బు... ఉన్నవాడికి ఈ ప్రపంచం సలాం అంటుంది. వాడెవ్వడైనప్పటికీ డబ్బు గల వాడు కాబట్టి, వాడితో గులాంగా ఉంటే తమ పనులు నెరవేరుతాయేమో అని ఈ వెర్రి జనాలు భావిస్తారు. కాబట్టే అట్లాంటి గూండాల దగ్గర నేటికినీ ఎందరో యువకులు తొత్తులుగా చేరుతున్నారు అన్నాడు.

" అవును అంకుల్ ! తమ పనులు సులువుగా నెరవేరుతాయని, తాము కూడా ఏదో ఒకరకంగా డబ్బు సంపాయించుకోవచ్చని, గూండాల దగ్గరఉంటే ఈ సమాజాన్ని కూడా బెదిరించవచ్చని, నాలాంటి యువకులు చాలామంది భావిస్తున్నారు" అన్నాడు భవానీశంకర్.

" శభాష్! నువ్వు ఈ మాట అంటున్నావంటే నీవు బుద్ధిమంతుడివి అన్నమాట" భవానీశంకర్ భుజం చరిచాడు అతడు. అతడి పొగడ్తకు భవానీశంకర్ పెదిమలపై చిరునవ్వులు పూశాయి.

" ఒక్క నిమిషం అంకుల్" అని కాసేపు తటపటాయించి, " మీరు హిందూముస్లింల మధ్య సఖ్యత అన్నారు కదా! ఈ సఖ్యతను ఎలా సాధించాలి?  హిందూ ముస్లిం ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఐక్యత వస్తుందా?" అడిగాడు భవానీశంకర్.

 భవానీశంకర్ వైపు చిత్రంగా చూస్తూ నవ్వుతూ, " మరీ ఇంత అమాయకత్వం పనికిరాదు.." అంటూ భుజం చరిచాడు అతడు.

"..."

" హిందూ ముస్లింలు పెళ్లిచేసుకోవడంతో ఐక్యత రాదు బాబూ? అసలు ఆ ఆలోచనే తప్పు! ఎలా అంటే.. మతానికి సామాజిక విలువ ఉంది. ఎవరి మతం మీద వాళ్లకు అపారమైన అభిమానం ఉంటుంది. మతాభిమానం లేనివాళ్లు కూడా ఉన్నారు. ఇదంతా ఏమైనప్పటికీ రెండు మతాల మధ్య భేధభావాన్ని తొలగించి, మనుషులంతా ఒక్కటే అన్నట్లుగా మెలగాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో శ్రమపడాలి.

మంచి మనసుతో మెలుగుతూ, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఓర్పూ నేర్పూ పాటించాలి. ఇంతేకాని పెళ్లిళ్లు చేసుకుంటేనే ఐక్యత వస్తుందనుకోవడం పొరపాటు. మతాంతర వివాహం తప్పుకాదు. కానీ ఐక్యత విషయంలో అట్లాంటి ఆలోచన రావడం తప్పు"అన్నాడు అతడు.

సరే అన్నట్టుగా తలాడించారు భవానీశంకర్.

"వస్తాను బాబూ..." అంటూ ఎడంగా ఉన్న సందువైపు బయలుదేరాడు అతడు.

భవానీశంకర్ నెమ్మదిగా తమ ఇంటివైపు అడుగులు వేయసాగాడు.

" శంకర్" వెనకనుండి పిలుస్తూ వచ్చాడు స్నేహితుడు సురేష్. ఆగాడు భవానీశంకర్.

" అంకుల్ నీకు ఏదో క్లాస్ తీసుకున్నట్టు ఉన్నాడు?" అడుగుతూ దగ్గరగా వచ్చాడు సురేష్.

" తీసుకున్నాడులేగాని, నాకు భయంగా ఉందిరా" ముందుకు నడుస్తూ అన్నాడు భవానీశంకర్.

" ఎందుకు?" అడిగాడు సురేష్.

"గౌసియా విషయంలో"

" ఉదయాన్నే ఏంట్రా ఈ తలనొప్పి?" అన్నాడు సురేష్.

" తలనొప్పి కాదురా, పరిస్థితుల్ని తల్చుకుంటే బాధ" అన్నాడు భవానీశంకర్.

నవ్వాడు సురేష్. ఆనవ్వులో తేలిక భావం

" నువ్వెప్పుడూ ఇంతేరా! నన్ను అస్సలు అర్ధం చేసుకోవు" భవానీశంకర్ గొంతులో బాధ.

" లేకపోతే ఏంట్రా? ఆపిల్ల ఏంటీ.. ఆ పిల్లకోసం ఇంత బిల్డప్ ఏంటీ?" వెక్కిరింతగా అన్నాడు సురేష్.

 భవానీశంకర్ ఇంకేం అనలేదు. సురేష్ ఎప్పుడూ అంతే. అతడి ప్రేమను మాటవరసకు కూడా ఆమోదించడు. అందుకే అతడు సురేష్ తో వీలైనంతవరకు తన ప్రేమగురించి చెప్పుకోడు. ఎప్పుడైనా చెప్పుకున్నా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది.

" ఆ చెప్పరా! వ్యాయామశాల దగ్గర్నుండి ఆ ముసలి అంకుల్ తో ఏమేం బాతాఖానీ కొట్టావు?" తనే అడిగాడు సురేష్.

" ఏం లేదురా! హిందూ ముస్లీంల మధ్య సామరస్యం కోసం యువత పాటుపడాలి అని చెప్పాడు" అన్నాడు భవానీశంకర్.

ఫకాలున నవ్వాడు సురేష్.

" ఎవ్వడి బతుకు వాడే బతకలేక చస్తుంటే, ఆయనగారు నీతిబోధనలు చేస్తున్నాడా? సరేలే... ఆయనగారు చెప్పినట్టే బాగుపడదాం. మరి రేపొద్దున్న మన పెళ్లాం పిల్లల్ని ఎలా పోషించాలో ఒకసారి అడుగు" నవ్వాక అన్నాడు సురేష్.

" అంటే స్వంత పనులన్నీ సామరస్యం కోసం వదులుకోవడం కాదు.." అన్నాడు భవానీశంకర్.

"పోరా" నిర్లక్ష్యంగా చేయి విదిల్చి ఆ పక్కనే ఉన్న సందు వెంబడి సాగిపోయాడు సురేష్.

" నువ్వు సామాన్యుడివి కాదురా!నీలో ఉన్న స్వార్ధం భయంకరమైనదిరా" వెళ్తున్న స్నేహితుడ్నే చూస్తూ మనసులో అనుకున్నాడు భవానీశంకర్.

....... ఇంకా వుంది .........