Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? పద్మా సచ్ దేవ్ - డోంగ్రి

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?

పద్మా సచ్ దేవ్ - డోంగ్రి

 

 

జమ్మూలో పుట్టిన పద్మా డోంగ్రీ భాషలో ఆధునిక కవిత్వం రాసిన మొదటి రచయిత్రి. తండ్రి సంస్కృత అధ్యాపకుడు. మొదట వేద్ పాల్ దీప్ అనే కవిని పెళ్ళి చేసుకుంది. కాని తరవాత ఆమె జమ్ము రేడియోలో పనిచేసినప్పుడు పరిచయమయిన సురీందర్ సింగ్ అనే గాయకుడిని రెండవ వివాహం చేసుకుంది.

ఈమెకు మేరి కవితా, మేరీ గీత్ అనే కవితా సంకలనానికి సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. భారత ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. కబీర్ సమ్మాన్ ఎవార్డ్ ఆమె కవిత్వానికి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది 2007-08 లో. ఆమె డోంగ్రీలోనే కాకుండా హిందీలో కూడా రాసింది. అంతే కాకుండా ఉర్దూ, మరాఠీ, ఒరియా, కొరియన్ భాషల్లోంచి అనువాదాలు కూడా చేసింది. డోంగ్రీ భాషాభివృద్ధికెంతో కృషి చేసింది.

మచ్చుకి ఆమె కవితల్లో ఒకటైన The Raja's Palaces కవితలో దోపిడీకి, అణిచివేతకి, పాలకుల నిర్లక్ష్యానికి గురయిన ఒక చూపు మందగించిన వయసు మళ్ళిన స్త్రీ బాధని ఈ విధంగా ప్రకటిస్తుంది.


ఈ రాజసౌధాలు మీవేనా?
నిలువ గూడు లేక తిరుగుతున్నా....
ఎన్నో ఏళ్ళ క్రితమే నా కంటి వెలుగు పోయింది
వాళ్ళు వచ్చారు, దోచుకున్నారు, నిశ్చేష్టనై నే నిలిచాను
నా తోటలో ఇంకా విరియని చిన్ని మొక్కను కూడా పెరికారు
నా మనిషి ఇంకా ఎంతో దూరం వెళ్ళకముందే
వణికిపోతున్న కొమ్మల్ని నరికి వేరు చేసారు
ఈ మానభంగాలు, ఈ రంపాలు, గొడ్డళ్ళు మేవేనా?
ఈ రాజసౌధాలు మేవేనా?

నా పెదవులకంటుకున్న మెతుకునూ లాక్కున్నారు,
నా నాళాల్లో ప్రవహించే రక్తాన్నీ పీల్చారు
నా దుఖం కన్నీళ్ళూ, బాధలూ అన్నీ కూడా
అనవసరమైన విషయాలు మా ప్రభువులకు
వణుకుతున్న చేతులపై కొరడా ఝళిపించారు
మా కళ్ళముందే
మా ఇంట్లోని చివరి ఇత్తడి ముక్కనూ లాక్కున్నారు
అన్ని డబ్బాలూ, పెట్టెలూ ఖాళీ చేసారు
ఈ బరువులు మోసే గుర్రాలు మేవేనా?
ఈ రాజ సౌధాలు మేవేనా?

ఆకాశాన్ని ముద్దాడే ఎత్తైన గోడలు
లోపల దాచిన గొప్ప నిధులు,
చక్కని ఎర్రని పరదాల అందాలు
మా రక్తాన్నీ, దరిద్రాన్నీ గుర్తు చేస్తాయి
మా భుజాలు మోసిన బండరాళ్ళు
మా చెమట తడిపిన ఈ నేల
మా శ్రమ వల్ల పైకి లేచిన గోడలు
ఈ ఎత్తైన కట్టడాలిప్పుడు మీవేనా?
ఈ రాజ సౌధాలు మీవేనా?

ఈ రోజు నా వినలేని చెవులు విన్నాయి
ఫిరంగి ప్రేలిన శబ్దం
బలవంతపు ప్రసవపు ఘడియలు ముగిసాయి
ఇది సమయం నా ప్రేమికుడు తిరిగి రావడానికి
కానీ దారిలో ఎటువంటి చప్పుడు లేదు
నా కాళ్ళు పరుగులు పెట్టడం లేదు
ఎదురువెళ్ళి పలకరించడానికి
అతని గొంతు ఇంకా నా చెవుల్లో మారు మ్రోగుతూనేఉంది
అతన్ని దారిలోనే కట్టి పడేసిన
నా బాధలు, భయాలు -
ఈ సంకెళ్ళు మేవేనా?
ఈ రాజ సౌధాలు మేవేనా?

మండే మా నెత్తురు
మీ దీపాల్లో చమురు
అమావాస్య రాత్రుల్ని
వెన్నెల రాత్రులు చేస్తుంది
ఈ వెలిగే రాత్రులు
దూరమ్నుంచే మమ్మల్ని వెక్కిరిస్తాయి
ఇది దీపావళి రాత్రి
మీ టపాసులు ఆకాశంలో ప్రేలతాయి
మా గుండెలు ముక్కలై చిన్ని చిన్ని తారలవుతాయి
మా పిల్లలు ఆశ్చర్యంగా ఆకాశంకేసి చూస్తుంటారు
ఈ అందమైన దీపావళి రాత్రులు మీవేనా?
ఈ రాజ సౌధాలు మేవేనా?

నేలంతా తవ్వి, ఎరువు వేసింది
మురికి నీరు తాగైనా
మాడ్చేసే ఎండల్లో విత్తనాలు తడిపింది మేము
మొక్క మొలిచినపడు మాకు సంతోషం
పూతకొచ్చినపుడు మాకు దీపాల పండగ
కానీ దుర్భుద్ధితో మీరు చూసినపుడు మేమడిగామూ
ఈ పంట మీదేనా?
ఈ రాజ సౌధాలు మేవేనా?
xx

ఆమె కధల్లో కాశ్మీరు ప్రజల జీవనం ప్రతిబింబిస్తుంది. వాటిలో కలిసి మెలిసి సహజీవనం చేసే హిందువులు, ముస్లిములూ ఉంటారు. ఎంతో ఇష్టంగా, ఎంతో అమాయకంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ బ్రతికేసే సామాన్యులు ఉంటారు. తమ బ్రతుకుల్లో ఇంత హింస, దౌర్జన్యం, ఎప్పుడు ఎలా ప్రవేసించిందో తెలియక, తాము ప్రేమించే తమ పిల్లలు ఇంత హింసాత్మకంగా ఎప్పుడు ఎలా తయారయ్యారో తెలియక సతమతమవుతుంటారు. ఆమె కధలన్నీ కూడా రెండు దేశాల సైన్యాల మధ్యా, రాజకీయాలమధ్యా మత రాజకీయాల మధ్యా టెర్రరిస్టుల ప్రతీకార హింసల మధ్య ఎలా నలిగిపోతున్నాయో చూపిస్తుంది. కశ్మీరు ప్రజలు ప్రేమించిన, గర్వపడిన అందమైన స్వఛ్చమైన ప్రకృతి అందాలు అక్కడ జరుగుతున్న హింస వల్ల ఎలా రక్త వర్ణాన్ని పూసుకుని వికారంగా కనిపిస్తున్నాయోనని బాధ పడుతుంది. ఆమె రాసిన కధలు చాలానే ఇంగ్లీషులోకి అనువాదం అయ్యాయి. అందువల్ల కశ్మీరు జన జీవితం బాహ్య ప్రపంచానికి తెలిసే వీలు కలిగింది.

Where is My Gulla Gone అనె కధ ఆమె ఒక భయంకరమైన కల కనడంతో మొదలవుతుంది. తెల్లని పసుపు పచ్చని తామరలు పూసే దాల్ సరస్సు తెల్లని గాజు ముక్కలా గడ్డ కట్టి ఉన్నపుడు, దానిపై రక్తపు మరకలు ఉన్నట్లు, నగ్నంగా ఉన్న ఒక చిన్న పిల్ల ఎర్రని తామరలు, నీరు బదులు రక్త కారుతూన్న వాటిని కొనమని అడుగుతున్నట్లు. ఆ కలలోని భయంకర దృశ్యాలు చూడలేక బలవంతంగా కళ్ళు తెరిచి ఆమె గుల్లా గుల్లా అని కలవరిస్తుంది, కానీ గుల్లా ఎక్కడా కనపడడు, పలకడు. అప్పుడు ఆమెకు ముప్పైముప్పైఐదేళ్ళ
క్రితం తనకు తెలిసిన గుల్లా గుర్తుకొస్తాడు. కశ్మీరులోని ముస్లింస్లో చాలా మందికి గులాం మొహమ్మద్ అనే పేరు ఉంటుంది. అందరూ పెరిగి పెళ్ళి చేసుకునే వరకు గుల్లాలే. ఆమె ఒకసారి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నపుడు, అక్కడ పనిచేసే ఒకతను గుల్లా. తనకంటే రెండుమూడేళ్ళు చిన్నదే అయినా ఆమెను మాజి అనే సంబోధిస్తాడు. మాజి అని అంటాడు కాబట్టి అదే గౌరవాన్నీ, ఆప్యాయతనీ పంచిస్తాడు. అదే ఆసుపత్రిలో ఇంకొక చిన్న గుల్లా, అయిదేళ్ళ అబ్బాయి. ఈ చిన్న గుల్లా అతి అమాయకంగా నువు బిస్కట్లిస్తే నీతో స్నేహం చేస్తా అంటూ రోజూ ఈమె దగ్గరకు వచ్చి బోలెడు కబుర్లు చెబుతుంటాడు. ఈ చిన్న గుల్లాకు చికెన్ తినటం ఇష్టం అయినా దాన్ని చంపడం చూడలేడు, అందుకని కోడిని చంపే సమయానికి పారిపోతాడు. ఇక పెద్ద గుల్లా కూడా అంతే అమాయకుడు. అందరికీ ఎప్పుడూ ఆనందాన్ని మాత్రమే పంచేవాడు, ఎటువంటి భేదం లేకుండా సేవ చేసే వాడు. ఆవు మీకు అమ్మ లాంటిదా మాజి అని అమాయకంగా అడుగుతాడు. దానికి ఈమె అంతకన్నా అమాయకంగా, అవును అమ్మ లాగే పాలిస్తుంది కదా అంటుంది, పాలిచ్చే వేరే జంతువులు చాలానే ఉన్నా. ఈ ముగ్గురి మధ్యా జరిగే చిన్న చిన్న సంఘటనలని ఎంతో ఆసక్తి కరంగా వివరిస్తుంది కధ. చివరికి పేపర్లో పెద్ద గడ్డంతో నల్లటి మాస్కులతో, ఏ కే 47 గన్నులతో వచ్చేది ఏ గుల్లా ఫొటో అని ఆమె ఆశ్చర్య పోతుంది. తనకు తెలిసిన ఏ గుల్లాకీ అంత ధైర్యం లేదే, ఈ రక్తం అంటే భయపడని గుల్లా ఎవరా అని నిస్పృహతో పేపర్ విసిరేస్తుంది.

ఇంకొక కధలో, ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ మీద ఉన్న బావి. అందులోని నీళ్ళు రెండువైపుల నించీ ఆడవాళ్ళు తోడుకునే వారు. వారితో బాటుగా వచ్చే వారి పిల్లలు అక్కడే ఆడుకునే వారు. అక్కడే ఉన్న ఒక రేగిపళ్ళ చెట్టు కాపుకొస్తే ఇస్టంగా తినే రెండువైపుల పిల్లలూ. అలాగే బావి పక్కనే గుబురుగా పెరిగిన గోరింటాకు చెట్టు ఇరు దేశాల ఆడవారి చేతులూ ఎర్రగా పండించేది. అక్కడే కలిసి కలబోసుకునే ఆడవారి కష్టాలు, జీవితాలు. ఇంత సందడిగా ఉండే ఆ బావిని రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణల వల్లా, రాజకీయాల వల్ల మూసేయాల్సొస్తుంది. చుట్టు పక్కల నుంచి బాంబుల మోతలు వినిపిస్తాయి. అవి ఏ పక్షం సైనికులవో ఈ బావి దగ్గరకొచ్చే వారికి అనవసరం, పట్టదు. వారి బాధల్లా ఆ బావి మూసేసారనే. ఇలా రెండు పక్షాల సైనిక ఘర్షణల్లో చనిపోయే వారు, కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అందరినీ పోగొట్టుకుని కేంప్స్ లో ఉంటూ, మాన భంగాలకి గురయ్యే ఆడవారి కధలూ, సైనికులకు ఆకర్షణీయంగా కనపడకుండా ఉండటం కోసం మొహాలకు మసి పూసుకుని పాట్లు పడటం, తప్పించుకోగల్గితే దొరికిన వాళ్ళని పెళ్ళిచేసుకుని తిరిగి ఒక కుటుంబాన్నీ, జీవితానికొక లక్ష్యాన్ని పొందే వారి కధలూ ; ఇరు దేశాల రాజకీయ ఉద్దేశ్యాలతో సంబంధం లేకుండా, ప్రశాంతంగా కుటుంబ జీవనం సాగించాలనుకునే సామాన్యుల కధలు ఆమె రాసినవన్నీ.

అనువాదాలు లభ్యమయితే, దేశ సరిహద్దుల్లో స్థిరపడిన కారణంగా అక్కడి ప్రజలు పోగొట్టుకున్నదేంటో, ఎంత దుర్భర పరిస్తితుల్లో వారి జీవనం సాగుతోందో తెలుసుకోడానికి తప్పనిసరిగా చదవ వలసినవి ఆమె కధలు.

 

-Sharada Sivapurapu