Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నళినీబాలాదేవి అస్సామీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? 

నళినీబాలాదేవి అస్సామీ

 

ఇంతవరకూ రాసిన రచయిత్రులను గురించిన వ్యాసాలు తిరగేస్తుంటే అనిపించింది, అస్సాంకి చెందిన ఒక్క రచయిత్రిని కూడా పరిచయం చెయ్యలేదేంటా అని. వెంటనే వెతికితే కనిపించింది, నళిని బాలా దేవి. బ్రిటిష్ వారు వచ్చే వరకూ అస్సాం లో స్త్రీలు రాసిన దాఖలాలు లేవు. ఎందుకంటే వారికి చదువుకునే యోగ్యత లేదు. అంటే వేరే చోట్ల అవకాశం ఉందని కాదు. ఒక్క మన దేశంలోనే కాకుండా, ప్రపంచం అంతటా అదే పరిస్తితి. అస్సాంలో మరింత వెనుకబాటుతనం స్త్రీలకి. బ్రిటిష్ వారు వస్తూ వస్తూ వారి మత ప్రచారం కోసం ప్రింటింగ్ ప్రెస్స్ తెచ్చారు. అయితే ఆ మత ప్రచారం అస్సామీ భాషలోనే చేస్తే సులువుగా ప్రజలకి చేరుతుందని భావించి అరుణోదయ్ అనే దిన పత్రిక ప్రారంభించారు. మొదట ఆ పత్రికలో క్రిష్టియన్ మతం పుచ్చుకున్న స్త్రీలు ఒకరిద్దరు మత సంబంధ సాహిత్య రచనలు చేసారు. అస్సామీ భాషని అధికార భాషగా కార్యాలయాల్లోనూ, కోర్టుల్లోనూ ప్రవేశ పెట్టారు. స్కూల్స్ తెరిచి అస్సామీ భాషలో బోధించారు. ఈ మార్పులు ప్రజలకి సాహిత్యానికి దగ్గరవడానికెంతో ఉపయోగపడ్డాయి. మెల్లి మెల్లిగా సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. భావ కవిత్వం మొదల
యింది. 1850 లు దాటాకా స్త్రీలు కూడా కొద్దిమందైనా చదువుకుని రచనలు చెయ్యడం మొదలుపెట్టారు.

గువాహాటి లో పుట్టిన నలినీ బాలా దేవి తండ్రి నబిన్ చంద్ర బార్డోలోయ్ కూడా ఒక పేరు మోసిన రచయిత స్వతంత్ర పోరాట యోధుడు. స్వతంత్ర పోరాటంలో పాల్గోటమే కాకుండా స్త్రీ హక్కుల గురించి కూడా పోరాటం చేసిన జ్ఞాని తండ్రి. నళినీబాలాదేవి పదేళ్ళవయసులో "పిత" అనే కవిత రాసింది. నళినీబాలా దేవి కవయిత్రి మాత్రమే కాదు, మంచి పైంటర్ కూడా. ఆమెకు ప్రేమా, సేవా తత్పరతా కూడా ఎక్కువే. రోగులకు శ్రద్ధగా సేవ చెయ్యడం అంటే ఇష్టముండి ఆమె హొమియో వైద్యం నేర్చుకుందిట. పన్నెండేళ్ళ వయసుకే పెళ్ళయ్యింది. ఆమెకిరవై ఏళ్ళు వచ్చేసరికే భర్త చనిపోయాడు. అయిదుగురు పిల్లలతో తండ్రి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె దుఖాన్ని తగ్గించటం కోసం తండ్రి ఆమెకు భగవద్గీత, ఉపనిషత్తులు ఇచ్చి చదవమన్నాడు. అలా చిన్నప్పటునుంచే ఆమెకు జీవితాన్ని తాత్విక కోణంలోంచి చూడటం అలవాటు చేసుకుంది. తండ్రి స్వతంత్రం కోసం జైలుకెళ్ళినపుడు ఆమె ఒక కొడుకు మంటల్లో కాలి చనిపోయాడు. ఆ దుఖమ్నించి బయట పడకుండానే తండ్రిని, తన ఇంకొక కొడుకునీ కూడా ఆమె పోగొట్టుకుంది. రచయిత్రిగా ఎదగడానికి ఆమె దుఖభరిత జీవితం అడ్డురాలేదు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ దుఖాన్ని తట్టుకునేందుకు కావల్సిన తాత్వికత, వేదాంతం ఆమెకు ఉపనిషత్తులలోని వేదాంతం రూపంలో లభించింది. ఒక మహత్తర శక్తి ఎదో ఆమెనెప్పుడూ నిలబడేట్టు చేసిందని ఆమె నమ్మకం. అదే వేదాంతం, తాత్వికత ఆమె రచనల్లో ప్రతిబింబించేది. రబింద్రనాత్ ఠాగోర్ రచనలు ఆమెకెంతో ఇష్టం. ఆయన ప్రభావం, ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

అయితే బ్రతికున్నంత వరకూ తండ్రి ఇచ్చిన ధైర్యం, అండగా నిలబడటం ఆమెను ప్రతి దుఖం నుంచి బయటపడి జీవితాన్ని ఆశావహ ధృక్పధంతోనే చూసే అలవాటు చేసాయి. వ్యక్తిగత జీవితంలోని కష్టాలు కొందరిని నిర్వీర్యుల్ని చేస్తే కొందరిని కార్యోన్ముఖుల్ని చేస్తాయేమో. నళినీ బాలా దేవి కూడా తన జీవితంలోని దుఖాన్ని మర్చిపోవడానికి, తనలోని కవయిత్రిని వాడుకుంది. నిజానికి అదే ఆమెకు జీవనాధారమైంది తండ్రి చనిపోయాకా. ఈ క్రింది నాల్గు లైన్లు చాలేమో జీవితమంటే ఆమెకున్న పాసిటివ్ ఔట్లుక్ తెలియడానికి.

“Eyes that wander for unbound beauties of earth,
Heart that pines for sweet pleasures of senses,
These are not trivial, meaningless in our momentary life;
They are steps upwards,
For realisation of the self and the Absolute.

ఆమె కవిత్వం ఎప్పుడూ రెండు అంశాలని ప్రస్తావించేది. దేశభక్తి, వేదాంతం లేదా తాత్వికత. దేశభక్తి అంటే ఆమెకు మనుషులూ మానవత్వం. ప్రాంతీయ తత్వం లేని దేశభక్తి. రాష్ట్రం, దేశం అనే రాజకీయం లేని దేశభక్తి. జన్మభూమి అనే కవిత ఆమె దేశ ప్రేమకి మచ్చుతునక అని చెప్తారు. ఇంకొంచం విశాల ధృక్పధంతో చెప్పాలంటే ఆమె తాత్విక ధోరణి వల్ల ప్రపంచమంతా ఆమెకు ఒకటే, జగదైక కుటుంబం. ఆమె వేదాంత ధోరణి మత సంబంధమైనది కాదు, విజ్ఞత, జ్ఞానం, అనుభవాల వల్ల వచ్చినది.

అలకానంద అనే కవితా సంకలనానికి సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. పల్టన్ బజార్, గువాహాటి లో ఆమె విగ్రహం ప్రతిస్టించారు. కాటన్ కాలేజీ హాస్టల్కి "పద్మశ్రీ నళినీబాలాదేవి గర్ల్స్ హాస్టెల్" అని పేరు పెట్టారు. All India Sanskrit Sanjeevni Sabha ఆమెకు "కాబ్యభారతి" అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆమె ఎన్నో కవితా సంకలనాలు, వ్యాసాలు, రాసింది. ఎందరో ప్రముఖ స్త్రీల జీవితకధలు, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జీవిత చరిత్ర, The Days Passed అనే తన ఆత్మకధ రాసింది.

ఆమె రచనల అనువాదాలు ఏమీ లభ్యమవలేదు చదవడానికి, కాకపోతే అస్సామీ భాషలో కూడా ఒక గొప్ప రచయిత్రి గురించి తెలుసుకున్నామన్న సంతోషం మాత్రం ఉంది.

 

 

-Sharada Sivapurapu