Facebook Twitter
మనసు లోతు తెలిసిన కవి శ్రీ శ్రీ

మనసు లోతు తెలిసిన కవి  శ్రీ శ్రీ

 

 

మాటలకందని భావాలని పాటల రూపంలో పలికించటం అంత తేలికైన పని కాదు. కాని గుండె లోతుల్లో దాగి ఉన్న అతి సున్నితమైన భావాలని కూడా తెరకెక్కించి  ప్రతి ఒక్కరు ఈ బాధ అంతా నేను పడ్డదే అనేట్టు ఆలోచింపచేసేవి శ్రీశ్రీ పాటలు. మనసు పొరల్లో ఎక్కడో ఉన్న బాధని, ఆవేదనని, ఆక్రోశాన్ని బయటకి తీసి మనకి తెలియని మనసు ఆరాటాన్ని మన కాళ్ళ ముందే ఉంచేవాడు శ్రీశ్రీ.


నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో....అంటూ గొప్పింటి వాళ్ళ అందాలు పేదింటి వారి కష్టాలు ఒకేసారి కళ్ళ ముందుంచారు శ్రీశ్రీ.  నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు..... నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని ప్రతి మనసు కోరుకునే ప్రేమ తత్వాన్ని అత్యంత సున్నితమైన మాటలతో మన ముందు నిలిపారు ఆయన.


విప్లవకవిగా పేరు పొందిన ఆయన పాటల్లో విప్లభావల వెనక దాగి ఉన్న ఆవేదనని గమనిస్తే శ్రమజీవుల గురించి, శ్రామిక దోపిడీ గురించి ఎంతలా అర్ధం చేసుకుని వాళ్ళ తరఫున గళం విప్పి కలం కదిపి బాహ్య ప్రపంచానికి తెలియచేసారా అని అనిపిస్తుంది.


శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించారట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. చిన్న వయసులోనే రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టిన శ్రీశ్రీ  తన పద్దెనిమిది ఏట ప్రభవ అనే కావ్యసంపుటాన్ని కూడా ప్రచురించారు. సంప్రదాయ శైలిలో రాసిన ఒకేఒక్క సంపుటం ఇది. తరువాత రాసిన రచనలన్నీ వాడుక భాషలో ఉండటం మొదలుపెట్టాయి.


శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం ఎంతటి చరిత్ర సృష్టించిందో మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఈ పుస్తకం చదివి - కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ అని చెప్పారు చలం. అలాగే మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం అని అభివర్ణించారు పురిపండా అప్పలస్వామి.  శ్రీశ్రీ 'అనంతం' అనే పేరుతో తన ఆత్మకథను రాసారు. అందులో తన సమకాలిన రచయితలూ, కవులు గురించి కూడా ప్రస్తావించారు. శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పడిన విరసం ఎన్నో పుస్తకాలని ప్రచురించింది.


వ్యక్తిగత జీవితానికొస్తే అతనిది ముక్కుసూటి మనస్తత్వం. మనసులో ఒకటి బయటకి ఒకటి మాట్లాడటం చేతకాని శ్రీశ్రీ తన ధోరణి వల్ల చాలాసార్లు అపవాదులు పొందాల్సివచ్చింది. అయినా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అలవాటుని మార్చుకోలేదు. అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైన చురుకైనవాడనీ అభివర్ణించారు బూదరాజు రాధాకృష్ణ. కొంచెం ఆలోచించి చూస్తే అది అక్షరాల నిజమనే అనిపిస్తుంది ఆయన గురించి తెలిసిన ఎవరికైనా.


రైల్వే స్టేషనులో కనపడిన ఒక స్నేహితుడు ఆయనను అడిగాడు, "ఊరికేనా?" అని. దానికి శ్రీ శ్రీ  "ఊరికే" అన్నాడు. అలాగే ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన ఇంకో మిత్రుడితో  "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా" అని అన్నాడట. ఇలాంటి చెణుకులు అతని హాస్య భరితమైన వాక్స్చాతుర్యానికి కొన్ని మచ్చుతునకలు మాత్రమే.

వివిధ దేశాలలో ఎన్నో సార్లు పర్యటించి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ఇంకా మరెన్నో అవార్డులు పొందిన ఆయన ఎప్పటికి సాహితీ ప్రియుల గుండెల్లో తన రచనల రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు.

....కళ్యాణి