Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కమలా దాస్ మలయాలం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కమలా దాస్ మలయాలం

 

కమలా దాస్ గురించి చెప్పాలంటే ఆమె ఒక పద్మభూషణ్ ఎవార్డ్ గ్రహీత అయిన తల్లి నాలపట్ బాలామణియమ్మ అనే రచయిత్రికి వారసురాలిగా పుట్టింది. జననం కేరళ లోని త్రిసూర్ డిస్ట్రిక్ట్ లో. మేనమామ నారాయణ మీనన్ ప్రఖ్యాత మలయాల కవి. కనుక కవిత్వం ఆమె రక్తంలోనే ఉంది. తల్లిని ఆమె రచనలనీ అమితంగా ప్రేమించి, సహకరించే తండ్రి. ఇంట్లో అద్భుతమైన వాతావరణం అయినా దురదృష్టం ఆమెని బాల్య వివాహం రూపంలో వెన్నాడింది. 15 ఏళ్ళకి ఒక బేంక్ ఆఫీసర్ని పెళ్ళి చేసుకొంది. అయితే ఇతను మొదట్లో కమల రచనలు చెయ్యడానికి బాగానే ప్రోత్సహించాడు. 15 ఏళ్ళప్పట్నుంచే కమల ఇంగ్లీష్లో పోయెంస్, మలయాలంలో కధలూ రాయడం మొదలు పెట్టింది.

1984 లో నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ కి నామినేట్ అయి షార్ట్ లిస్ట్ అయ్యింది. కేరళ సాహిత్య ఎకాడమీకి, కేరళ ఫోరెస్ట్రీ బోర్డ్కీ చైర్ పెర్సన్ గా ఉంది. చిల్డ్రెన్స్ ఫిల్మ్ సొసైటీకి ప్రెసిడెంట్ గా, ఎడిటర్ పొయెట్రీ మేగజిన్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పొయెట్రీ ఎడిటర్ గా కూడా పని చేసింది. ఆమెని మదర్ ఒఫ్ మోడర్న్ ఇంగ్లీష్ పొయెట్రీ అని కూడా అంటారు. కమలా దాస్ డిగ్రీ కూడా పూర్తిచెయ్యని ఇంగ్లీష్ రచయిత్రిగానే ఉండిపోయారు. తరవాత poetry అధ్యయనం చెయ్యడానికి చాలా దేశాలు, పేరుపడ్డ Universities తిరిగారు అది వేరే సంగతి.

కమలా దాస్ syndicated colouminst కూడా. ఇంకా ఎన్నో Awards including Sahitya Acadamy Award 1985 ( Her maiden volume “The Summer in Calutta) కి, Kerala Sahitya Academy Award గెలుచుకున్నారు. ఇతర Awards వివరాలు.

Asian Poetry Prize-1998
Kent Award for English Writing from Asian Countries-1999
Asian World Prize-2000
Ezhuthachan Award-2009
Sahitya Academy Award-2003
Vayalar Award2001
Kerala Sahitya Academy Award-2005
Muttathu Varkey Award

కేరళ రాయల్ ఫామిలీకి చెందిన ఈమె 65 ఏళ్ళ వయసులో 38 ఏళ్ళ ముస్లిం యువకుడిని పెళ్ళి చేసుకోవడానికి మతం మార్చుకుని కమలా దాస్ సురయ్యా గా పేరు మార్చుకుంది. పైగా మతం ఇచ్చే ప్రొటెక్టివ్ ఫీలింగ్ కోసం తను మతం మార్చుకుని బురఖా వేస్కున్నాననడం అదీ 65 ఏళ్ళ వయసులో మొదటినుంచీ కూడా ఉన్న చపల చిత్తాన్ని సూచిస్తుందేమో. మతం మార్చుకుని చాలా విమర్శకీ, నిందలకీ గురయ్యింది. వివాహ బంధంలో దొరకని పరిపూర్ణమైన ప్రేమనీ, అనుభూతినీ వెతుక్కుంటూ సాగిన ఆమె వివాహేతర సంబంధాలనీ, దేన్నీ ఆమె ప్రపంచం నుంచి దాచలేదు. ఈ కారణంగా ఆమెకూ ఆమె రచనలకూ తీవ్రమైన ఏవగింపుతో కూడిన స్పందనా అదే సమయంలో ఆమె నిజాయితీని, నిర్భీతినీ కొనియాడే విమర్శకులనూ, పాఠకులనూ ఆమె పొందింది. ఈమె గురించి చదువుతుంటే నాకు చలం గారు గుర్తుకు వస్తారు. వారి వారి వ్యక్తిగత జీవితాలు వదిలేస్తే, వారి రచనల వల్ల అణిచిపెట్టిన స్త్రీ లైంగికత, స్వేఛ్చ లేని జీవితాల్లో మగ్గుతున్న స్త్రీలు తాము కోల్పోతున్న దేంటో తెలుసుకునేందుకు నిశ్చయంగా సహాయపడ్డాయనయితే చెప్పొచ్చు. అయితే ఒక ఫెమినిస్ట్ గా ఆమెను ఆమె ఎప్పుడూ అభివర్ణించుకోలేదు.

కమలా దాస్ గారి extremely, self analysing and daring expression of her sexualityకి ఎంతమంది admirers ఉన్నారో అంత మంది critics కూడా ఉన్నారు. మొదంట్నుంచి చివరవరకూ కమలా దాస్ రాసిన poetry అంతా direct గానో అంతర్గతం గానో sex, love, erotism and its associated guilt గురించి ప్రస్తావిస్తూ ఉంటాయి. My Grandmother's House అనే పొయెం లో ఆవిడ అడుగుతుంది ......

“you cannot believe, darling,
Can you, that I lived in such a house and
Was proud, and loved…. I who have lost
My way and beg now at strangers' doors to
Receive love, at least in small change? “ అని.

భార్య తన sexual preferences ని భ ర్తతో కూడా పంచుకోలేని timesలో ఆవిడ పొయెంస్ కొన్ని (The Maggots, The looking Glass) bold attemptsఅని చెప్పొచ్చు. Sexపరంగా స్త్రీ స్వేచ్చని మగవాడు శాసించే పితృ స్వామ్య సమాజం మీద ఆవిడ ధ్వజమెత్తుతుంది. The maggots అనే పొయెం లో రాధ తిరస్కృత మనోగతాన్ని ఆవిష్కరించడం ద్వారా దేవతా మూ ర్తులకీ అలాంటి భావాలున్నపుడు సాధారణ స్త్రీలందరికీ అలాంటి భావనలు కలగడం చాలా సహజం, అభ్యంతరకర మైనది కాదు అన్న విషయాన్ని ఆవిడ చాలా strong గా ప్రతిపాదించుతుంది. అయితే sexuality ఒకటే స్త్రీల సమస్యా? వారికి ఇతర సమస్యలు లేవా అన్నది Critics వాదన.

ఒక మలయాల పత్రికలో సీరియల్గా వచ్చిన ఆమె అత్మ కధ "ఎంటె కధా" మొదలయిన 15 రోజుల్లోనే ఆ పత్రిక సర్కులేషన్ని 50,000 కాపీలు పెంచేసి పాఠకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. చాలా ఆసక్తి కిలిగించే సబ్ హెడింగ్స్తో రాసేదట. అయితే అందులోని నిజాలు తట్టుకోలేక ఆమె దగ్గర బంధువులు ఆ ప్రచురణ ఆపెయ్యాలని విపరీతంగా ప్రయత్నించారట కానీ కమల ధైర్యంగా నిలబడి రచన కొనసాగించిందట. మై స్టోరీ అని ఇంగ్లీషులో రాసినది మలయాలంలోకి ఆమే అనువదించింది. అయితే ఆమె తన కధలో చాలా కల్పన కూడా ఉందని తరవాత అంగీకరించింది.

ఆమె మలయాలంలో ఎన్నో నవలలు, కధా సంకలనాలు, వ్యాసాలూ రాసింది. ఆమె వ్యాసాలు రాజకీయాల్నుంచి, కరెంట్ ఎఫ్ఫైర్స్, మలయాలీ ఆడవారికి బ్యూటీ టిప్స్ వరకూ ఇదీ అదీ అని లేకుండా దేని మీదైనా రాసేదట. ముఖ్యంగా ఆమె రచనలన్నీ కవిత్వం, కధలూ నవలలూ, ఇంకా మెమోయిర్స్ అనే మూడు ప్రక్రియల్లోనూ ఉంటూ ఎంతో ఎఫ్ఫెక్టివ్ గా ఉండేవట. ఇంగ్లీషులో ఎన్నో కవితా సంకలనాలూ, ఆమె ఆటో బయొగ్రఫీ రాసింది. ఆమె కధల్లోని స్త్రీ పాత్రలు, పురుష సమాజం వేసిన ముగ్గులో అలంకార ప్రాయంగా కూర్చునే గొబ్బెమ్మలు కారు. ప్రేమలోనైనా, భక్తిలోనైనా, పరాకాష్టకి చేరడానికి, జీవన సాఫల్యం కోసం పితృస్వామ్య సమాజం స్త్రీకి గీసిన లక్ష్మణ రేఖల్ని దాటుకుని, తమని బంధించిన వంట గృహాల పొగచూరిన పఠిష్టమైన గోడల్ని చేదించుకుని తాము కోరుకున్న జీవన శైలినవలంభించగల ధైర్యం గలవి. అందుకే మగాడెటూ తిరుగుబోతు, ఆడది కూడా తిరుగుబోతయితే, ప్రస్తుత పురుషాధిక్య సమాజంకి మూలస్థంభమైన కుటుంబ వ్యవస్థ ఏమైపోవాలని సంప్రదాయవాదులంతా ఆమెని దుమ్మెత్తి పోసారు.

సాండల్ ట్రీస్ అని ఇంగ్లిష్లో నెట్లో లభ్యమవుతున్న కధ ముఖ్యంగా ఇద్దరు స్త్రీ పాత్రమధ్య నడుస్తుంది. సంతోషం లేకపోయినా దాంపత్య జీవితంలో చివరి వరకూ భర్తతో కలిసే ఉన్న ఒక స్త్రీ, పోటీకి వెళ్తే ఆదర్శ దంపతులుగా సమాజం భావించి గెలిపించే దంపతులు ; వర్సెస్ ఆమె స్నేహితురాలుగా చిన్నప్పటినుంచి ఉంటూ ఈమె పట్ల శారీరిక ఆకర్షణ కూడా ఉండి జీవితాంతం కలిసి గడపాలనుకునే ఆ స్నేహితురాలు ; చివరకు ఆ స్నేహితురాలె ఆమె తండ్రికి ఇంకొక స్త్రీ ద్వారా పుట్టినది అనీ, తన భర్త కూడా ఆమెను ప్రేమ బిక్ష పెట్టమని కోరాడని తెలిసాకా, అంతవరకూ జీవితంలో సంతోషం లేకపోయినా, దాంపత్యం వల్ల పిల్లలు లేకపోయినా, తనకంటే 21 ఏళ్ళు పెద్దయిన భర్తని ఎప్పుడూ భర్తలా అంగీకరించలేక అతనంటే ఏవగింపూ, అసహ్యం ఉన్న ఆమెకు, తన స్నేహితురాలికంటే తను మెరుగ్గా ఉందని అనుకుంటూ వచ్చిన ఆమె, అందగాడైన, ప్రేమించే భర్త నుంచి విడాకులు తీసుకుని, ఇంకొక డబ్బున్న ఫారినర్ని పెళ్ళి చేసుకుని అతను చనిపోయాకా మళ్ళా ఇండియా వచ్చి ఇంకొ పెళ్ళి చేసుకుని పిల్లలతో ఉన్న మాజీ భర్తను మళ్ళీ కలవాలనుకున్న, ఒకప్పుడు తన మీద ఆర్ధికంగా ఆధరపడిన స్నేహితురాలు ఇప్పుడు బాగా డబ్బున్న విడొవర్ అయికూడా తన కన్నా అందంగా, చిన్నదానిలా కనిపిస్తుంటే, తను జీవితంలో పొందిందేంటొ తెలియక బాధపడుతుంది. చాలా విలక్షణమైన థీం, కధ నడిచే విధానం ఎంతో కొత్తగా, ఆడవారి జీవితంలో ఉండే రొటీన్ కష్టాలు కాకుండా, కధా, కధలోని పాత్రలూ ఎక్కడా అనుచితంగా, అసహజంగా ప్రవర్తిస్తున్నట్లు లేకుండా, ఏకబిగిని చదివించింది. అందుకే ఆమె వ్యక్తిగత జీవితంపై ఎంత విమర్శ ఉన్నా ఒక రచయిత్రిగా ఆమె ప్రతిభని మెచ్చుకోకుండా ఉండడం కష్టమయ్యింది పాఠకులకి.

 

-Sharada Sivapurapu