Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కృష్ణ సోబ్తీ

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కృష్ణ సోబ్తీ హింది

 

ద గ్రాండ్ డేం అఫ్ హిందీ లిటరేచర్ గా పేరు పొందిన రచయిత్రి కృష్ణ సోబ్తీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో పుట్టింది. హష్మత్ అనే కలం పేరుతో కూడా రాసేది. ఆమె రాసిన ప్రతి కధా, నవలా సాహిత్య ప్రపంచంలో ఓ ముఖ్య సంఘటన అయిపోయేదిట. ఈరోజుల్లోలాగా ఇంత పబ్లిసిటీ స్టంట్లు అప్పుడు లేవు గానీ ఆమె కోరుకోపోయినా, కావాలని చేయకపోయినా ఆమె సృష్టించిన ప్రతి స్త్రీ పాత్రా ఒక స్వేఛ్చ కోరుకునే వ్యక్తిగా తనకు నచ్చిన జీవితాన్ని కావాల్సినట్టుగా మలుచుకోగల పాత్రలు. మరి సహజంగానే అలాంటి పాత్రలు వివాదాస్పదమవుతాయి.

పార్టీషన్లో భూములన్నీ పాక్ లోని పంజాబ్లోకెళ్ళిపోతే కృష్ణ గవర్నెస్ గా చేరింది అప్పటి మౌంట్ ఆబూ మహరాజా అయిన తేజ్ సింగ్ కి. రెండేళ్ళ తరవాత ఢిల్లి అడల్ట్ లిట్రసీ ఎడ్మినిస్టేషన్లో ఎడిటర్గా చేరింది.

ఇరవయ్యొవ శతాబ్దం స్త్రీ రచయిత్రులకి చెందింది. పురుషాధిక్యతని, కుటుంబ పరిధుల్ని, సామాజిక ఆంక్షల్ని దాటుకుని తమ బాధల గాధల్ని, స్త్రీల పట్ల పురుష సమాజ దాస్టీకాల్ని, సంస్కృతి సంప్రదాయాల పేరిట జరిగే అన్యాయాల్నీ వారిదైన శైలిలో, ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నంలో మొత్తం ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకోవడంలో స్త్రీ రచయిత్రులు విజయం సాధించిన శతాబ్దమిది. ఇది ఒక్క భారత దేశానికి సంబంధించిన విషయమే కాకుండా ప్రపంచం మొత్తంలో స్త్రీ రచయితలికి సంబంధించిన విజయం. వారి వారి భాషల్లో అద్భుతమైన రచనలు చేసిన ఆషాపుర్ణా దేవి, మహాస్వేతా దేవి, కమలా దాస్, అమృతా ప్రీతం, అనితా దేశాయ్,కుర్రతుల్ ఐన్ హైదర్, ఇస్మత్ చుగ్తయ్, శివాని, శోభా డే లాంటి లింగ వివక్షని ఛేదించి తమకంటూ ఒక పేరు ఏర్పరుచుకున్న రచయిత్రుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రచనలు భావితరాల రచయిత్రులకి స్పూర్తిదాయకం అయ్యాయంటే అందులో అతిశయోక్తి లేదు. హింది అత్యంత ఎక్కువమంది పాఠకులున్న భాష. ఆమె రచనలలో, అత్యంత ఆసక్తి కరంగా ఇండియా పాకిస్తాన్ విభజన ముందు పంజాబు గ్రామీణ వాతావరణంలో రైతుల జీవితాలను ఆవిష్కరించిన రచయిత్రి. సామాన్యుల జీవితాల్లో కొట్టుకున్న అప్పటి కాలం నాడిని ఒడుపుగా పట్టుకుని పాఠకుల ముందుంచడల్లోనూ, వారి కధలను చెప్పడంలో తను సృష్టించిన పాత్రల పట్ల సానుభూతిని చూపిస్తూనే రచయిత్రిగా తన వ్యక్తిత్వాన్ని విడిగా చక్కగా కాపాడుకోగల నేర్పూ ఆమె రచనల్లో కనపడుతుంది. 1958 లో ఆమె మొదటి నవల అచ్చయ్యేటప్పటికే క్రిష్ణ మంచి షార్ట్ స్టోరీ రైటర్ గా పేరు తెచ్చుకుంది. ఇతర రచయితలు రాయడానికి వెరచిన అంశాలన్నిటిమీదా ఆమె చాలా బలంగా రాసింది. స్త్రీవాదం పరిధిలో మనకు తెలిసిన అర్ధంలో ఆమెను స్త్రీవాద రచయిత్రిగా ముద్ర వెయ్యడానికిలేదు. స్త్రీవాదం ఇంకా బలం పుంజుకోని అరవైల్లోపలే ఆమె ఒక బలమైన గొంతుకగా స్థిరపడింది.

ఆమె సృష్తించిన పాత్రలన్నీ చాలా విలక్షణమైనవె. మిత్రొ మరజానీ అనే నవలలో మిత్రొ ఒక తండ్రి లేని పిల్ల. తల్లి పెంపకంలో ఏవిషయమైనా నిస్సంకోచంగా తన ఆభిప్రాయాలని వ్యక్తపరచడానికి అలవాటుపడుతుంది. ఆ అమ్మాయి, పెళ్ళి తరవాత ఒక మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో ఉన్నా కూడా, తన తోటికోడలు ఎంతో గుణవంతురాలిగా ఉన్న నేపధ్యంలో కూడా తన లైంగికపరమైన కోరికలు తీర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించని ఒక స్త్రీ పాత్ర. ఈనవల ఆరోజుల్లోనే కాదు ఇప్పటికీ చర్చించబడుతూనే ఉంటుందట. డార్ సే బిచూరి అనే కధలో పాషొ అనే అమ్మాయి తన వాళ్ళనుంచి బలవంతంగా వేరుచేయబడి, మానభంగం చేయబడి, ఆ తరవాత పశువులా పోరాటాల్లో నలుగుతున్న ఆఫ్ఘనిస్తాన్లో అమ్మబడినా చివరకు బ్రతుకుతుంది తను కన్న బిడ్డను సాకడానికి. ఇది దేశం, మత సరిహద్దుల్ని దాటి, మన దేశ విభజన తరవాత కేవలం ఒక మతానికి చెందడం వల్ల స్త్రీలు ఎన్ని అత్యాచారాలకు గురయ్యారో, ఇలాంటి ఘర్షణలు స్త్రీల జీవితాల్ని ఎంత నరక ప్రాయం చేసాయో చెప్పే కధ. తల్లీ కూతుళ్ళ మధ్య సంభాషణలా సాగే ఒక కధలో, కూతురికి తల్లి చేసినవన్నీ తప్పుల్లానే కనిపిస్తాయి. అలాంటి తప్పుల్ని తను తన జీవితంలో మాత్రం చెయ్యననుకుంటుంది. కానీ చిత్రంగా ఆమె తన జీవితంలో తల్లి ఇరుక్కున్నలాంటి పరిస్తితిలోనే తానూ ఇరుక్కుంటుంటుంది. ఆమె చూపెట్టిందెపుడూ, ఉత్సాహంతో, ధైర్యంతో, స్వేఛ్చగా జీవించాలనుకునే స్త్రీని, సమాజం స్త్రీకి గీసిన సరిహద్దుల్ని లెక్కచేయని, భర్త కోపాన్నీ, అత్తగారి ఆరళ్ళని పట్టించుకోని స్త్రీని, పెళ్ళి పిల్లల్ని కనడం ఇవన్నీ కూడా తనకున్న నిర్ణయాధికారాలని నమ్మి, తన ఇష్టప్రకారం చెయ్యాలనుకునే ఒక స్త్రీని. ఇలా చెప్పాలంటే ఆమె ప్రతి నవల, కధా ఇతివృత్తాలు అతి విలక్షణంగా శక్తివంతంగా, అతి మితమైన భాషలో చెప్పబడి నిజ జీవితానికి అతి దగ్గరగా ఉంటాయట. ఆమె రచనలు చాలా ఇంగ్లీష్ లోనూ లభ్యమవుతున్నాయి. చదవచ్చు. ఆమె కధలూ, నవలలూ ఎన్నో ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబు భాషల్లోకి అనువాదం అయ్యాయి.

ఆమె మాటల్లో చెప్పాలంటే " I have always been my own person. It is easier to exaggerate or simplify the difference between people. My biological history says I am a woman. History and individuals cannot ignore each other. I believe that your individuality embraces our innermost uniqueness. And this individuality could be qualitatively different from person to person, not necessarily from male to female. I am a writer who happens to be a liberal, middle class woman. I need to have my freedom for the smooth flow of my creativity. I see in myself a creative writer who has total commitment to her creativity and art." అందుకనే ఆమెను ఫెమినిస్ట్ అనే చట్రంలో బంధించలేము.

జిందగీనామా అనే నవలకి, సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. 1996 లో సాహిత్య ఎకాడమీ ఫెల్లోషిప్ వచ్చింది.
శిరోమణి ఎవార్డ్ 1981 లో, హిందీ ఎకాడమీ ఎవార్డ్ 1982 లో, షలాకా ఎవార్డ్ హింది ఎకాడమీ, ఢిల్లీ వారిది 2008 లో, ఆమె నవల సమయ్ సర్గం కి వ్యాస సమాన్, కె కె బిర్ల ఫౌండేషన్ వారిచ్చినది వచ్చాయి.
ఆమెకు మొట్టమొదటి కధా చూడామణి ఎవార్డ్ 1999 లో వచ్చింది ఆమె చేసి సాహితీ సేవకు గుర్తింపుగా.
ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఉంది క్రిష్ణ సోబ్తీ గురించి చెప్పడానికి. కవులూ కళాకారులూ సాహిత్య ఎకాడమీ ఎవార్డులనీ ఇతర పురస్కారాలనీ మత అసహనానికీ, వివక్షకీ నిరసనగా తిరిగిచ్చేస్తున్నారు ఇప్పుడు. తిరిగిస్తే ఇచ్చారనీ, అసలెలా వచ్చినవనీ, ఎందుకు పుచ్చుకున్నారనీ, ఇవ్వకపోతే ఇవ్వలేదనీ విర్శలకు గురవుతున్నారు. కానీ క్రిష్ణ సోబ్తీ 2010 లోనే పద్మభూషణ్ ఎవార్డుని తీస్కోవడానికి నిరాకరించింది. పైగా సాహిత్య ఎకాడమీ ఫెల్లోషిప్ ద్వారా తన ప్రతిభకు వచ్చిన గుర్తింపు చాలనీ, తను అలాంటి ఉచ్చుల్లో ఇరుక్కోదల్చుకోలేదనీ నిర్ద్వందంగా చెప్పేసింది.

 

-Sharada Sivapurapu