Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? నాలపట్ బాలామణి అమ్మ మలయాళం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?

నాలపట్ బాలామణి అమ్మ మలయాళం

 

బాలామణి అమ్మ త్రిసూర్ కేరళలో పుట్టింది. ఆమెను 'Grandmother of Malayalam Poetry " అంటారు. ప్రఖ్యాత రచయిత్రి కమలా దాస్ తల్లి. ఈమెకు ఎటువంటి విద్యా లేదు. మలయాళం, ఇంగ్లీష్ ఇంట్లోనే నేర్పిచ్చారు. ఈమె తండ్రి చిత్తనూర్ కోవిలకం, కున్ హున్ని రాజా - పండితుడూ, కళల పట్ల ఉన్నతమైన అభురుచులు కలవాడు. కేరళ నాయిర్ తరవాడు సాంప్రదాయం ప్రకారం ఆడవారు చదువుకోవడానికి వీలు లేదు. ఇంట్లో ట్యూటర్ని పెట్టడమే ఎంతో గొప్ప విషయం. తండ్రి అభిరుచులవల్ల, మామ నారాయన మీనన్ కవి అవటం వల్లా, మామ ఇంట పెట్టిన పెద్ద గ్రంధాలయం లాంటి పుస్తక సేకరణ ఒక మేధావిగా ఎదగడానికి ఆమెకెంతో ఉపయోగపడ్డాయి. ఆమె మామ నారాయన మీనన్ ప్రభావం ఆమె మీద చాలా ఉంది. పదిహేడేళ్ళ వయసులో ఆమె తన మొదటి కవిత అర్ధాంతరంగా చనిపోయిన తన స్నేహితురాలికోసం దుఖంతో రాసింది. అది చూసినప్పటినుంచి ఆమె మామ ఆమెనెంతో ప్రోత్సహించాడు. ఆయనకు ఆమెలో ఒక గొప్ప రచయిత్రి కనిపించింది. ఇంటికి వచ్చే మామ స్నేహితులూ ఆసమయంలో ఉన్న గొప్ప కవులూ, సంభాషణలు, సమావేశాలు ఆమెకు ఒక గొప్ప అక్షర ప్రపంచ వాతావరణాన్నిచ్చాయి. ఇరవై ఏళ్ళకు ఆమెకు వివాహమైంది. భర్త కలకత్తాలోని ఒక యూరోపియన్ కంపెనీలో అత్యున్నత పదవిలో ఉండేవాడు. తరవాత మాతృభూమి అనే పత్రికకు ఎడిటర్గా కూడా పని చేసాడు. ఆయన రచనలో భార్య ఆసక్తి గమనించి ఆమెనొక రూంలో కూర్చొని రాసుకో, ఇంటివిషయాలన్నీ నేను చూసుకుంటానని ఆమెకు పూర్తి స్వేఛ్చనిచ్చేవాడట. ఆఖరికి చాకలి పద్దు కూడా తనే చూసి ఇచ్చేవాడట. అది ఆమె అదృష్టం. అంత ప్రోత్సాహానికి ఆమె పూర్తి న్యాయం చేసింది. అది ఆమెకొచ్చిన బిరుదులు, పురస్కారాలూ చూస్తే తెలుస్తుంది. అంతే కాదు, ఆయన ప్రతిరోజూ సాయంత్రం ఆమె రోజంతా ఆమె రాసిన కవితలను బిగ్గరగా చదివి అందరికీ వినిపించేవాడట. ఇదొక సాంప్రదాయం ఆ ఇంట్లో ప్రతి సాయంత్రం. ఎంతో కష్టపడి, ఎవరికీ తెలియకుండా, లేకపోతే నరకప్రాయమైన జీవితాన్ననుభవించిన రచయిత్రులనే మనం ఇంతవరకూ చదువుకున్నాము. దానికి భిన్నంగా ఇంత ప్రేమించే, సహకరించే, భార్య అభిరుచిని గౌరవించి ప్రోత్సహించిన భర్త గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది. ఆడవారికన్నా, మగవారు సంతోషించాల్సిన విషయం ఏమొ.

కనీసం ఒక పది సంకలనాలైనా ఆమె మాతృత్వం అనే అంశం మీదే రాసింది. ఈ కింది కవిత మాత్రం కమలా దాస్ తీవ్ర అస్వస్తతతో ఆసుపత్రిలో చేరినప్పుడు రాసిందట. మలయాళంలో రాసిన తన పోయెమ్ని ఆమే ఇంగ్లీష్లోకి అనువదించింది.


In this dew-wet courtyard, reading your poems
I wonder, did your spirit which causes life to flower
Hurt you more than the body which grew in me
like a blossom.
These cocoons you formed to put to sleep
The worms gnawing at your core, burst open.
And wings, rising, fluttering and jostling,
Swarm my mind.
Your mind may grow restless with sad thoughts,
Your body may be weary of household tasks,
But about you I hold no fear.
Your power of turning worms into butterflies
Comforts me.

ఆమె ఒక 20 కవితా సంకలనానలు రాసింది. మొత్తం 500 కవితలు. తరవాత ప్రపంచంలోని కుళ్ళు, హింస, ద్వేషం గురించి స్పందిస్తూ తన కవితల్లో వాటికి సమాధానాలని సూచించే ప్రయత్నం చేసింది. చివరిగా రాసిన Mazhuvinte kathe ( The Story of the Axe ) పురాణకాలంలోని పరశురామిని కథను ఇప్పటి కాలపరిస్తితులతో పోల్చి పరిశీలించి హింస ఎల్లవేళలా సమాధానం కాదని చెప్పే ప్రయత్నం. కవితలే కాకుండా, ఇతర వచనం, అనువాదాలు కూడా చేసిందట. ఏమైనా ఇంటివద్ద భాషలు నేర్చుకుని, ఇంట్లో ఉన్న పుస్తకాలనుంచే ప్రపంచం చూసి అర్ధం చేసుకుని, తనకంటూ ఇంత గొప్ప స్థానాన్ని పురుషులు మాత్రమే ఏలుతున్న ఆనాటి మలయాల సాహిత్య ప్రపంచంలో ఏర్పరుచుకోగలగటం, ఏ రకంగా చూసినా మలయాళ స్త్రీ ప్రపంచమే కాకుండా మొత్తం భారత దేశంలో స్త్రీలు గర్వించదగ్గ విషయమేమో.

కేంద్ర, రాష్ట్ర సాహిత్య ఎకాడమీ ఎవార్ద్స్, కేరళ ప్రభుత్వ అత్యున్న సాహిత్య పురస్కారమయిన Ezhuttachan పురస్కారం, సరస్వతి సమ్మాన్, వల్లతొల్ పురస్కారం, వల్లతొల్ సాహిత్య సమితి నుండి, ఇంకా పద్మభూషణ్ ఆమెను వరించాయి ఆమె ప్రతిభకు తార్కాణంగా. ఆమె ముథాసి (Grandmother) అనే సంకలనానికి ఆమెకు సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చింది. తరవాత సాహిత్య ఎకాడమీ ఫెల్లోషిప్ ఆమె స్వఛ్చమైన పారదర్శకమైన అదే సమయంలో ఎంతో లోతైన భావాలతో, గాఢతతో రాసిన కవిత్వానికి పొందిన అత్యున్నత కీర్తి కిరీటం. కొన్ని మలయాళంలో రాసిన కవితల్ని ఆమే ఇంగ్లీష్ లోనికి అనువాదం చేసింది. కానీ ఆమె కున్న ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అద్భుతమైన కవితల్ని అనువదించడానికి సరిపోలేదని విమర్శకుల అభిప్రాయం.

Alzheimersతో ఐదేళ్ళు బాధపడి 2004 లో కన్ను మూసింది.

-Sharada Sivapurapu