Facebook Twitter
నాయని కృష్ణకుమారి స్పెషల్ స్టోరీ

 నాయని కృష్ణకుమారి

 

 


      తండ్రి నాయని సుబ్బారావు సాహిత్య వారసత్వాన్ని ఆమె పుణికి పుచ్చుకున్నారు. కవిత్వం, కథ, నవల, నాటిక, పాట, విమర్శ, పరిశోధన లాంటి భిన్న ప్రక్రియలలో తనదైన సొంత ముద్రను వేశారు. ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారు. ఆదర్శ మూర్తిగా నిలిచి, ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు ఆచార్య నాయని కృష్ణకుమారి.
    ప్రకాశం జిల్లాలోని నర్సరావు పేటలో మార్చి 14, 1930లో నాయని సుబ్బారావు, హనుమాయమ్మకు జన్మించారు కృష్ణకుమారి. ఆ రోజుల్లో నాయని సుబ్బారావుకు 'భావకవి'గా మంచి పేరుండేది. వారి ఇల్లే 'సాహితీ సమితి'కి పుట్టినిల్లులా ఉండేది. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, అడవి బాపిరాజు, శివశంకరశాస్త్రి లాంటి ఉద్దండులైన సాహితీ వేత్తలు నాయని సుబ్బారావు ఇంట్లో సాహిత్య చర్చలు జరిపేవాళ్లు. చిన్నప్పుడే కృష్ణకుమారి ఆ విషయాలను ఆసక్తిగా వినేది. కృష్ణకుమారి ఏడో తరగతి చదువుకునే రోజుల్లోనే 'రంగైన ఒకపూవు కంటికేమింపు హంగుమీరా మాలలల్లితే సొంపు' అనే పాట రాసింది. ఇది ఆమెలోని సృజనాత్మకతకు బీజం లాంటిది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు పొందింది.
     విశాఖపట్నం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్సు చదివింది. అక్కడే ఆమెలోని పరిపూర్ణ కవయిత్రి వెలుగులోకి వచ్చింది. కవిత్వం, కథలు రాయడమే కాదు గ్రంథాలయంలో ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ గడిపేది. తరగతి గదిలో విన్న చరిత్ర పాఠాలనే 'ఆంధ్రప్రభ' పత్రికలో 'ఆంద్రుల కథ' పేరిట సీరియల్ గా రాసింది. 'కథల కడలి'  పేరుతో దారావాహికంగా కథలు ప్రకటించింది. బి.ఎ. ఆనర్సు పూర్తి కాగానే మద్రాసు ఎతిరాజు మహిళా కళాశాలలో, ఆ తర్వాత హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బాలికల కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. తెలుగు చదివింది.
      1954లో న్యాయవాది మధుసూదన రావును వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు జానపద గేయగాథలు' అనే అంశం పై పరిశోథన చేసి డాక్టరేటు పొందారు. ఊరూరా తిరుగుతూ జానపదులను కలిసి వారి గాథలు, కథలు సేకరించారు. 'నల్లగొండ జిల్లా ఉయ్యాల పాటల'ను సమీక్షించారు. జానపద సాహితీ ఉద్దండుడు బిరుదురాజు రామరాజుతో కలిసి 'జానపద గేయాలు - సాంఘిక చరిత్ర' రచనలో పనిచేశారు.
      ఒకవైపు జానపద సాహిత్యం పై కృషి చేస్తూనే మరోవైపు సృజనాత్మక రచనలను సాగించారు. 'గౌతమి' నవల, 'అగ్నిపుత్రి' కవితా సంకలనం, 'ఆయుధ' కథా సంపుటి ముద్రించారు. కృష్ణకుమారి కాశ్మీరు దర్శించి అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధురాలై 'కాశ్మీరదీప కళిక'ను తెలుగు వారికి అందించారు. 'పరిశీలన', 'పరిశోధన', 'మనము-మన పూర్వులు' అనే వ్యాస సంపుటాలను వెలువరించారు. ప్రముఖ కవయిత్రులు సి. ఆనందారామం, తురగా జానకీరాణి, వాసిరెడ్డి సుజాతాదేవిలతో కలిసి 'అపరాజిత' గొలుసు నవలను రచించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికోసం 'జైమినీ భారతా'నికి, 'శృంగార శాకుంతలా'నికి సంపాదకత్వం వహించారు. 'తోరదత్' ను ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. 'మెకన్జీ కైఫీయత్ లు - విమర్శా పరిణామం' గ్రంథాన్ని, 'ఏమి చెప్పను నేస్తం' కవితా సంపుటాన్ని ముద్రించారు. ఆకాశవాణి, టీవీలలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
       కృష్ణకుమారి తెలుగు వాచకాలకు సంపాదకత్వం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. విద్యావేత్తగా, సాహితీ వేత్తగా అనేక గౌరవాలు, సన్మానాలు పొందారు. 1996లో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి (వి.సి.) గా పని చేశారు. 1979లో కేసరీ కుటీరం వారు కృష్ణకుమారిని స్వర్ణకంకణంతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రిగా గుర్తించింది. 1988లో సుశీలా నారాయణరెడ్డి పేరిట ఉత్తమ రచయిత్రిగా సత్కరించ బడింది. 1989లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహితీ వేత్తగా సన్మానించింది.
    నాయని కృష్ణకుమారికి ఇలా ఎన్నో అవార్డులు, ఉన్నత పదవులు దక్కాయి. అయినా నేటికీ వినమ్రంగా జీవిస్తూ, నిత్యం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ప్రశాంత చిత్తంతో జీవిస్తున్నారు.

...డా. ఎ.రవీంద్రబాబు