Facebook Twitter
సుస్వర పదాల సుమధుర రచయిత


సుస్వర పదాల సుమధుర రచయిత

వేటూరి పాటకు ప్రతికొమ్మా చిగురించి ప్రతి పువ్వూ పులకించి సన్నాయి రాగాలు పాడుతుంది. ఆయన పేరు వినగానే ఒక వైపు ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరిహరి గుర్తొస్తే, మరోవైపు ఓంకారనాదాను సంధానమౌ గానమే, శంకరాభరణము గుర్తొస్తాయి. ఎలాంటి సందర్భానికి అలాంటి పాట రాయటమే ఆయన గొప్పతనం. బాణీలు కట్టి సినిమా పాటకు రంగుల ఓణీలు కట్టించారు వేటూరిగారు.

జర్నలిస్టుగా కొనసాగుతూ దాసరథిగారి ప్రోత్సాహంతో సినీరంగంలో కాలు పెట్టిన వేటూరికి చిత్తూరు నాగయ్యగారు నటుడిగా అవకాశాన్ని ఇచ్చారు. చిత్రం ప్రారంభానికి రెండు రోజుల ముందే, నేను నటించలేనని క్షమాపణ కోరుతూ నాగయ్యగారికి ఉత్తరం రాసిన వేటూరి నటుడిగా కన్నా, రచయితగా తనని తాను రూపుదిద్దుకోవాలని అనుకున్నారు. నిజానికి ఆయన నటన వైపు మొగ్గు చూపించి ఉంటే, మనం ఎన్నో ఆణిముత్యాల్లాంటి ఎన్నో సుమధుర గీతాలను కోల్పోయేవాళ్ళమేమో.

పండితుల నుండి పామరుల వరకు అలాగే, వయసులో ఉన్నవారి నుండి వయసు మళ్ళిన వారి వరకు అందరికీ నచ్చే విధంగా ఎన్నో స్వరాలకి పదాలు సమకూర్చారు వేటూరి. ఆడజన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో అనే పాటలో తల్లిప్రేమను సాక్షాత్కరించారు. అలాగే ఆకాశదేశాన ఆషాఢమాసాన అనే పాటలో ఒక ప్రియుడి విరహవేదనని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ప్రతీ పాటలోనూ తనదైన శైలి చూపిస్తూ అందంగా లేనా అసలేం బాలేనా అంటూ కవ్వించే పాటలే కాదు, అత్తమడుగు వాగులోన అత్తకోడుకో అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించారు.

ఏ పాట రాసినా తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకొని ఈ పదాలు బాగోలేదు..... ఇంకొకలాగా రాస్తే బాగుండునేమో అని ఎవరితోనూ చెప్పించుకోకుండా ఎన్నో దశాబ్దాలు చిత్రసీమలో ఒక వెలుగు వెలిగారు వేటూరి.

'నువ్వు ఎడాపెడా పాటలు రాసి పారేస్తున్నావట, చాలా స్పీడుగా రాస్తున్నావట' అని ఆత్రేయ అక్షింతలు వేస్తే,  'గురువుగారు ! మీ అంత గొప్పగా ఎలాగూ రాయలేను మీకంటే తొందరగా రాయకపోతే, నా బ్రతుకుతెరువు ఎలాగండి' అని చమత్కారంగా బడులిచ్చారట వేటూరి. నూటికో కోటికో ఒక్కరు అనే పాటలో తన గురుభక్తిని చాటటమే కాదు, అదే పాటలో ఈ యువత తాత గాంధీజీ మీలో మిగిలారు, మీ నవతకు నేతాజీ మీలో రగిలారు, అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారధులు అనే మాటలతో యువతరాన్ని నిద్రలేపారు. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన - ఈ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన, అని మన కంటికి నేరుగా కనిపించని జీవిత సత్యాన్ని చూపించారు.

వేటూరికి ఉన్న స్నేహితులలో జంధ్యాల ఒకరు, ఆయన వేటూరిని ఒక నటుడిగా చూడాలని తపనపడేవారు. అందుకే తన చిత్రం మల్లెపువ్వులో కకుంభంజకం స్వాములవారుగా వేషం వేయించి మురిసిపోయారు. జంధ్యాలగారి సినిమాలకి వేటూరి అందించిన సాహిత్యం సినీ జగత్తులో చెరగని ముద్ర వేసింది. చినుకులా రాలి నదులుగా సాగి, అలివేణీ ఆణిముత్యమా నీకంట నీటి ముత్యమా, నీలాలు కారేనా, మనసా తుళ్ళిపడకే, అలాగే మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి, కాస్తందుకో దరఖాస్తందుకో, ఇలా ఎన్నో మధురమైన పాటలని అందించి జంధ్యాల అంటే తనకి ఎంత అభిమానమో చూపించారు వేటూరి.

మహదేవన్ ను తన గురువుగా చెప్పుకునే వేటూరి, వారిద్దరిమధ్య ఉన్న అనుబంధం మాటలలో చెప్పలేనిది అనేవారు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలు తలమానికాలు.

మనుషులతోనే కాదు, వేటూరికి నదులతో కూడా విడదీయలేని అనుబంధం ఉంది. నదుల గురించి సిరిసిరిమువ్వలో గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే, ఆశాజ్యోతి ఎరేళ్ళిపోతున్నా నీరుండి పోయింది - నీటిమీద రాతరాసి నావెళ్ళిపోయింది, అంతేకాదు నావలుజాడ కృష్ణవేణి నాసిగపూలు ఎన్నెలా గోదారి, అని ఎన్నో ప్రయోగాలు చేస్తూ నదుల మీద ఉన్న గౌరవభావాన్ని పదాల రూపంలో చూపించారు వేటూరి.

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు 1994 లో జాతీయ పురస్కారం ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగుభాషకు ప్రాచీనభాషా హోదాను ఇవ్వనందుకు నిరసన తెలుపుతూ తిరిగి ఇచ్చేసి తన మాతృభాషాభిమనాన్ని చాటుకున్నారు వేటూరి. అక్షరo తో అనంత భావాలని పలికించిన ఆ పద చక్రవర్తికి తెలుగు పాట  నీరాజనాలు పడుతూనే వుంటుంది...ఆయన పాట మన గుండె గదులను తట్టినంత కాలం.

------కళ్యాణి