Facebook Twitter
రెండో బాల్యం (కథ)

 

రెండో బాల్యం

 

 

“అమ్మా, మెల్లగా దిగు...” కారు దిగి, తిరిగి వచ్చి, తల్లి కూర్చున్న వైపు డోర్ తెరచి పట్టుకున్నాడు శ్రీకర్.
అతని చేయి అందుకొని కారు దిగిన అంబుజమ్మ, ఆ పెద్ద చెరువునూ, దాని ఒడ్డున శాఖోపశాఖలుగా ఊడలతో విస్తరించి ఉన్న మఱ్ఱి చెట్టునూ చూసి, మనసు పులకరించగా ఆ గాలిని గుండెల నిండుగా పీల్చుకుంది.
“సిరీ, చూసావురా ఎంత బాగుందో? మా అమ్మా వాళ్ళు ఈ చెరువుకి మంచినీళ్ళకు వస్తే, వాళ్ళ వెంట వచ్చిన పిల్లలమంతా ఈ చెరువు గట్టున ఆడుకునే వాళ్ళం. ఈ చెట్టు కిందే కూర్చుని కథలు, కబుర్లూ చెప్పుకునే వాళ్ళం. సెలవులకి వచ్చినప్పుడు దీపూ గాడిని ఇక్కడికే తీసుకు వచ్చి ఆడించే దాన్ని. పెళ్ళయ్యాక, మీ నాన్నా నేనూ అదిగో, ఆ రేవులో కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. చిన్నప్పుడు నేను ఈ నీటిలో దిగి ఈత కొట్టేదాన్ని తెలుసా? ఇప్పుడు తగ్గిపోయాయి కాని, కలువలూ, తామరలూ నిండా విరగబూసి ఉండేవనుకో!” తన్మయత్వంతో చెప్పుకుపోతోంది. ఆమె కనురెప్పల యవనికలపై ఎన్ని దృశ్యాలో...
“అమ్మా, బాగా  ఎండగా ఉంది కదా... ఇంకా చాలా ప్రదేశాలు తిరగాలి అన్నావుగా?”
“అవునురా... పద పద....అరేయ్ సిరీ... నా మనసు నిండా నింపేసుకుంటానురా ఈ తీయదనాన్ని...”
కారును మెలమెల్లగా పోనిస్తూ, తల్లి చూపిన చోట్ల ఆపుతున్నాడు శ్రీకర్.
“ఇదిగోరా ఇదే మా బడి! దీన్ని సత్రం బడి అనే వాళ్ళు. మాకు బెంచీలు ఉండేవి కాదు. అదిగో, ఆ చెట్ల కింద కూర్చుని చదువు నేర్చుకున్నాం. ఆ...ఆ...
దిగో చూడు... ఇది వేణుగోపాలస్వామి ఆలయం... శిథిలావస్థలో ఉందిరా నాలాగానే... ఆ, అదిగో అల్లక్కడ పెద్ద బజారు అని ఉండేది, అక్కడికి పోనీరా చిన్నా...”
పెద్ద బజారు చేరగానే, అక్కడి పూల దుకాణాల దగ్గరకు వెళ్లి, “ఇక్కడ ఆదెమ్మ అనే ఆవిడ ఉండేది కదా?” అని అడిగింది అంబుజమ్మ, పూలు మాల కడుతున్న ఓ పాతికేళ్ళ యువతిని.
“అవునమ్మా, ఆమె మా అమ్మమ్మే... మీరు?”
“నేను ప్రతీరోజూ ఆవిడ దగ్గరే పూలు కొనుక్కునే దాన్ని తల్లీ... అబ్బో, నలభై సంవత్సరాల పైమాట! ఇంతకూ ఆవిడ ఎలా ఉంది, ఎక్కడ ఉందీ?”
“అమ్మమ్మ చనిపోయి అది సంవత్సరాలు దాటిపోయిందమ్మా...” ఎంతో నమ్రతగా చెప్పిందా అమ్మాయి.
“అయ్యో, అలాగా? నీ పేరేమిటి తల్లీ?”
“కాళింది అమ్మా...”
“ఇదిగోమ్మా ఈ డబ్బు తీసుకుని పండక్కి కొత్తచీర కొనుక్కో...” కాళింది వద్దు వద్దని అంటున్నా వినకుండా ఆమె చేతిలో ఐదు వందల రూపాయల్ నోటు పెట్టి కారెక్కింది అంబుజమ్మ.
“అమ్మా, ఇక మనం వెళదామా?” మృదువుగా అడిగాడు శ్రీకర్.
“ఒక్కసారి నేను చిన్నప్పుడు ఉన్న ఇంటికి వెళదాం సిరీ...”
“అలాగేమ్మా...”
తల్లి చెబుతున్న గుర్తుల ప్రకారం కారు నడిపిస్తున్న శ్రీకర్ కి పదిరోజుల క్రితం తన ఇంట్లో జరిగిన సంభాషణ గుర్తు వచ్చింది.
***
“ఆనందపురమా? అబ్బా... ఇప్పుడు అక్కడికెందుకమ్మా?” అనుకోకుండా కించిత్ విసుగ్గా అన్నాడు శ్రీకర్.
“నేను పుట్టి పెరిగిన ఊర్రా అది. మీ నాన్నని అక్కడే పెళ్ళి  చేసుకున్నాను. ఆయన దగ్గరకి వెళ్ళిపోయేలోగా ఒక్కసారి ఆ ఊరు చూసి రావాలిరా...” ఆయాసంగా ఆగింది, అంబుజమ్మ.
“ఓకే ఓకే... ఇంద, మంచినీళ్ళు తాగి కాసేపు పడుకోమ్మా... మందులు వేసుకున్నావ్ గా? నెమ్మదిగా వెళదాంలే...” అనునయించాడు. నీరసంగా కళ్ళు మూసుకుంది అంబుజమ్మ. ఫాన్ వేసి, స్పీడు తగ్గించి, పలుచని దుప్పటి కప్పి, గదిలోంచి బయటకు నడిచాడు.
“ఏమిటండీ ఆవిడ చాదస్తం?” విసుగుతో కూడిన కోపంతో అంది పల్లవి, శ్రీకర్ కి మజ్జిగ గ్లాసు అందిస్తూ.
“ఎందుకు పల్లవీ, అంత కోపం? ఇప్పుడేమైంది?” నిశితంగా ఆమె ముఖం లోకే చూస్తూ అన్నాడు శ్రీకర్.
పల్లవి కొద్దిగా కంగారు పడుతూ, “అబ్బే, ఆవిడకి ఆరోగ్యం బాగుండలేదు కదా... ఇప్పుడు ఊరికి...” నసిగింది.
“కొన్ని కోరికలు ప్రగాఢంగా ఉండిపోతాయి గుండెల్లో... కొడుకుగా వాటిని తీర్చడమే నా ధర్మం. తను కొంచెం కోలుకోగానే తీసుకు వెళతాను...”
“ఎందుకూ, అక్కడేం ఉందని?”
“ఆవిడ బాల్యపు తీపి గురుతులు... యవ్వనపు సంబరాలు... నవ వధువు కొత్త కాపురం... అసలు ఆవిడ మనసంతా అక్కడే ఉంది... మనకి అర్థం కావులే...” నిట్టూర్చాడు శ్రీకర్.
అతని వైపు అదోలా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది పల్లవి.
మజ్జిగ తాగేసి, ఆ గ్లాసును వంటింటి సింక్ లో తొలిచి పక్కగా పెట్టేసి, హాల్లోకి వచ్చి కూర్చుని ఆలోచనలో పడ్డాడు శ్రీకర్.
గత నాలుగు సంవత్సరాలుగా అంబుజమ్మ ఆరోగ్యం ఏమంత బాగుండటం లేదు. భర్త పోయినప్పటి నుండీ ఆ బెంగతో కొంతా, ఒంటరితనం వలన కొంతా మరింత దిగులు.
శ్రీకర్ ఉద్యోగానికీ, పిల్లలు స్కూలుకీ వెళ్ళిపోతే ఇంట్లో తను, కోడలూ మాత్రమే ఉంటారు. పల్లవికి టీవీ ఛానల్సూ, సీరియల్సూ, అందులోని పాత్రలూ, యాంకర్లు, వాళ్ళు పెట్టుకున్న నగలూ, చీరాల కబుర్లూ తప్ప వేరే ప్రపంచమే లేదు. అత్తగారితో మాట్లాడే తీరిక ఆమెకి లేదు.
పిల్లలకి బామ్మ చెప్పే కథలూ, కబుర్లూ వినటానికి ఆసక్తి లేదు. వాళ్ళ చదువులూ, వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్ ఇవి చాలు. పెద్దరికంగా ఏదైనా చెప్పబోతే కసురుకుంటారు. అసలు పల్లవి పిల్లలతో మాట్లాడనీయదు. ఆమెకి అత్తగారంటే ఉన్న చిన్న చూపు పిల్లలకీ ఉంది.
దాంతో తనకిష్టమైన పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేస్తోంది అంబుజమ్మ. సంగీతమన్నా, పాటలన్నా తగని ప్రీతి కనుక, రేడియో చిన్న సౌండ్ తో పెట్టుకుని వింటూ ఉంటుంది. సమయానికి కావలసినవి అన్నీ యాంత్రికంగా అమరుస్తుందే కాని, ఏనాడు పల్లవి ఆమెతో మనసు విప్పి మాట్లాడదు. శ్రీకర్ ఎన్ని సార్లు చెప్పినా అంతే. “ఆవిడతో కబుర్లు ఏముంటాయండీ నాకు? ఆవిడ టీవీ చూడరు, నేను పుస్తకాలు చదవను...” అని ఒక్క ముక్కలో తేల్చేస్తుంది.
అంతర్లీనంగా తల్లి మనసులో ‘వాడు’ కూడా మెదులుతూ ఉంటాడని తెలుసు శ్రీకర్ కి.
***
“నాన్నా సిరీ...”
“ఏమిటమ్మా, ఇంకా పడుకోలేదూ?” తల్లి మంచం మీద పక్కగా కూర్చుంటూ మార్దవంగా అడిగాడు శ్రీకర్.
“రేపు ఐదో తారీఖే కదా, ఇది మార్చి నెలే కదురా?” ఆరాటం గొంతు నిండా...
“అవును...”
“రేపేరా వాడి పుట్టినరోజు!” ఉద్వేగంతో అంది అంబుజమ్మ.
“తెలుసమ్మా, బావ ప్రదీప్ పుట్టినరోజు రేపే...”
“సిరీ, వాడి నంబరు సంపాదించరా ఎలాగైనా... మనం ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాలి...” బ్రతిమాలుతున్నట్టు చెప్పింది అంబుజమ్మ.
“అమ్మా, నువ్వు పిచ్చి అమ్మవి... బావ ఇంకా నీ చిన్నారి దీపూ కాడు...” శ్రీకర్ మాటలకు దిగులుగా చూసింది.
“ఇక పడుకోమ్మా, చాలా రాత్రి అయింది. పోనీ, నేను కూడా ఇక్కడే పడుకోనా?” పక్కనే ఉన్న దివాన్ కాట్ మీద నడుము వాల్చాడు, శ్రీకర్.
“అమ్మా, వచ్చే నెలలో వెళదామా మన ఊరికి? అక్కడి విశేషాలు చెప్పు...” అనడంతో ఉత్సాహంగా చెప్పటం మొదలు పెట్టింది. కాసేపు విన్నాక, “అమ్మా, చాలా రాత్రైంది కదా, ఇక పడుకుందామా?” అన్నాడు శ్రీకర్.
“సరేరా, దీపు గాడి అడ్రెస్, ఫోన్ నంబర్ కనుక్కోవడం మరచిపోకు...” అంది కళ్ళు మూసుకుంటూ...
***
అంబుజమ్మ ‘అంబుజ’ గా ఉన్నప్పుడు వాళ్ళన్నయ్యకి పెళ్లై కొడుకు పుట్టాడు. వాడే దీపూ అనబడే ప్రదీప్. వాడిని తన పెళ్లి అయ్యేంత వరకూ కళ్ళల్లో పెట్టి పెంచింది అంబుజ. తల్లి దగ్గర కన్నా మేనత్త దగ్గరే ఎక్కువ చేరిక ఉండేది ప్రదీప్ కి. వాడితో ఆడుకుంటూ, వాడికి అన్నం తినిపిస్తూ, కథలు చెబుతూ, తన ప్రపంచమంతా దీపు చుట్టూ నిర్మించుకుంది అంబుజ. వాడు స్కూలుకు వెళ్ళటం మొదలయ్యాక, అంబుజకి పెళ్లి అయింది. భర్తకి కూడా ఆనందపురంలోనే ఉద్యోగం అవటంతో తన పుట్టింటికి దగ్గరగా ఉండవచ్చనీ, దీపూని ఇక మిస్ కాననీ చాలా సంబరపడిపోయింది ఆ పిచ్చి తల్లి. ప్రతీ ఆదివారం పుట్టింటికి వెళ్లి వాడితో గడిపి వచ్చేది. తన కొడుకు తనకు దూరమౌతున్నాడని, ఆడపడుచుకు దగ్గర అవుతున్నాడని అసూయతో రగిలిపోయిన ఆమె వదిన మెల్లగా కొడుకును, అంబుజకు దూరం చేయటం మొదలు పెట్టింది.
“అత్తా వాళ్ళు పేద వాళ్ళు... మనం ఆస్తి పరులం... వాళ్ళతో నువ్వు ఎక్కువగా చనువుగా ఉండకు...” అని తరచుగా చెప్పేది. ఎప్పుడైనా దీపూ అత్తా వాళ్ళ ఇంటికి వెళదామని పేచీ పెట్టినా, తమ ఇంట్లో ఉండే సౌకర్యాలు అక్కడ ఉండవనీ, వద్దనీ చెప్పి, మానిపించేసేది.
అంబుజకు నెలతప్పి శ్రీకర్ కు జన్మనిచ్చినా, దీపు మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. పుట్టింటి ఆదరణ అంతంత మాత్రమే అయినా, ఆదివారాలు అక్కడికి వెళ్లి అరగంటైనా గడిపి వచ్చేది. శ్రీకర్ పుట్టిన ఆరు నెలలకే అన్నయ్యా, వదినా చెన్నై వెళ్ళిపోవటం, అంబుజ భర్త సుధాకరానికి కూడా కాకినాడ బదిలీ అవటంతో పుట్టింటికి పూర్తిగా దూరమైపోయింది అంబుజ. అమ్మానాన్నలు చనిపోయాక మళ్ళీ ఆనందపురంలో అడుగు పెట్టలేదు.
దీపూ పుట్టినరోజును గుర్తు పెట్టుకుని, భర్త ఎంత వారిస్తున్నా వినకుండా ప్రతీ సంవత్సరం వాడికి బట్టలో, బహుమతులో పంపిస్తూ ఉండేది.
“అంబుజా, ఊరికే అలా మమతలు పెంచుకోకు. దీపూ నీ అన్న బిడ్డ... ఇదుగో, ఈ శ్రీకర్ నీ కన్నబిడ్డ...” అంటూ సుధాకరం భార్యకి నచ్చజెప్పినా ఆమె వినేది కాదు.
దీపూ పై చదువులకు అమెరికా వెళ్ళాడని, తర్వాత డాక్టర్ అయ్యాడని తెలిసి ఎంతగానో సంబరపడిపోయిన అంబుజ ఆ సంబరాలలో తనకు స్థానం కల్పించని అన్నా వదినల ప్రవర్తనకు చాలా దుఃఖించింది.
శ్రీకర్ పెద్దవాడై, చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకున్నాక, సుధాకరం మరణించాడు. అప్పటినుంచే అంబుజకు అనారోగ్యం మొదలైంది.
***
“బావా, నేను శ్రీకర్ ను...”
“శ్రీకరా? ఎవరు??”
“నేను మీ అత్తయ్య అంబుజ గారి అబ్బాయిని. అమ్మకి ఆరోగ్యం బాగుండటం లేదు. ఎప్పుడూ నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంటుంది బావా...”
“ఓ... ఆ విషయం చెప్పటానికి ఈ అర్థరాత్రి పూటే వీలైందా నీకు?” దీపూ గొంతులో విసుగు.
“అయామ్ సారీ... ఉదయం నుంచీ చాలా సార్లు చేసాను. మీరు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారని చెప్పారు...”
“సరే, సరే, ఏమైంది ఆవిడకి?”
“హార్ట్ ప్రాబ్లెం...” సమస్య వివరించాడు శ్రీకర్.
“మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది...”
“సారీ, నాకు తీరిక ఉండదు...”
“మీరు రావద్దు, నేనే మీ దగ్గరకు...”
“వద్దు...” ఫోన్ కట్ అయిపోయింది.
మ్రాన్పడిపోయాడు, శ్రీకర్. మిత్రుల ద్వారా తెల్సింది, ప్రదీప్ ఆనందపురంలోనే హాస్పిటల్ కట్టుకుని స్థిరపడ్డాడని. కాని తల్లికి చెప్పకుండా, అతను అమెరికా లోనే ఉండిపోయాడని అబద్ధం చెప్పాడు.
***
“సిరీ, ఇదిగో ఈ ఎడమ వైపు వీధిలోకి తిప్పు... ఆ... అదిగో ఆ చివరి ఇంటి దగ్గర ఆపు...” తల్లి మాటలతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు శ్రీకర్.
అప్పట్లో అది అమ్మానాన్నలతో తాము చిన్నప్పుడు ఉన్న ఇల్లనీ, ఆ తర్వాత తామది అమ్మేసామని చెప్పింది ఇద్దరూ కారు దిగిన తరువాత. పక్కింట్లోకి తొంగి చూస్తూ, “సరోజినీ...” అని పిలిచింది అంబుజమ్మ.
“ఎవరండీ? రండి... లోపలికి...” ఒక ముప్పై ఐదేళ్ళ స్త్రీ లోపలినుంచి వచ్చి సాదరంగా ఆహ్వానించింది.
“అమ్మా, ఇక్కడ సరోజినీ...”
“ఆవిడ మా అత్తగారేనండి... రండమ్మా, కూర్చోండి... “ ఆమె కుర్చీలు చూపించి, లోపలికి వెళ్లి అత్తగారిని తీసుకు వచ్చింది.
“ఎవరూ? ఎవరదీ? అంబుజం... నువ్వా... నువ్వేనా? ఇలా అయిపోయావేమిటే...” అంబుజమ్మ వయసే ఉన్న సరోజిని ఆదరంగా చేయి పట్టుకుంది.
“బాగున్నావా సరూ? ఇదిగో వీడే నా కొడుకు శ్రీకర్. నువ్వు చూడలేదు కదూ? సుధాకర్ నన్ను విడచి వెళ్ళిపోయారు...” అంబుజమ్మ కన్నీరు పెట్టుకుంది... ఆప్యాయంగా ఆమె తలను గుండెకు చేర్చుకుంది, సరోజిని.
“అమ్మా, మంచి నీళ్ళు తీసుకోండి...” చల్లని మంచి నీళ్ళు అందించింది కోడలు.
“ఇదిగో, ఇది నా కోడలు విజయ... విజ్జీ, ఈమె అంబుజ...నా ఫ్రెండ్.... చెప్పాగా చాలా సార్లు?” నవ్వింది సరోజిని.
“నమస్తే అమ్మా, అత్తయ్య మాటల్లో వినటమే కాని ఎప్పుడూ చూడలేదు... సరే, లేవండి... కాళ్ళూ చేతులూ కడుక్కుని వస్తే భోజనాలు వడ్డించేస్తాను...” నవ్వుతూ చెప్పింది విజయ.
“అయ్యో, వద్దండీ, ఫర్వాలేదు...” మొహమాటంగా అన్నాడు శ్రీకర్.
“తమ్ముడూ, అలా అనొచ్చా? మేము పరాయి వాళ్ళం కాదుగా? ఆ స్నేహితురాళ్ళు ఇద్దరూ ఇన్ని దశాబ్దాల తరువాత కలుసుకున్నారు కదా... కలబోసుకుని చెప్పుకోవటానికి ఎన్ని కబుర్లుంటాయి? సిటీ నుంచి కారులో వచ్చినట్టున్నారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే, మళ్ళీ సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోవచ్చులే...” ఆప్యాయంగా చెప్పింది విజయ.
తల్లి వైపు చూసాడు శ్రీకర్. ఆమె నవ్వుతూ తలపంకించింది...
“మీ అక్క చెప్పింది కదా అల్లుడూ? దాని మాటంటే మాటే మరి!” కోడలిని బలపరుస్తూ చెప్పింది సరోజిని.
“కానీ అక్కయ్యా, మీకు అనవసరమైన శ్రమ...” వినీ వినబడనట్టు అన్నాడు.
“శ్రమేమీ లేదు... ఒక్క పది నిమిషాలు అంతే... ఈలోగా మీరు ఫ్రెష్ అవండి...” అని పక్కనే ఉన్న గది చూపించింది విజయ. అంబుజమ్మ, సరోజిని కూర్చున్న చోటు నుండి కదలక ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు.
ఆప్యాయత, అనురాగం కలగలసిన మృష్టాన్న భోజనం చేసిన తరువాత శ్రీకర్ కళ్ళు వాలిపోవటం మొదలైంది. కాసేపు మొహమాటంగా కూర్చున్నా, విజయ మరీ మరీ చెప్పటంతో నిద్రను జయించలేక, గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు.
తల్లి ముఖంలో చిందులేస్తున్న ఉత్సాహం, ఉల్లాసం చూస్తుంటే తనింట్లో ఆమెకి ఏమి కొరవడిందో స్పష్టంగా గోచరించింది, శ్రీకర్ కి.
***
ఒక గంటన్నర విశ్రాంతి తరువాత నిద్ర లేచేసరికి హాలంతా ఒకటే సందడి... అంబుజ, సరోజినిలతో పాటుగా మరో ఇద్దరు ఆంటీలు, ఒక అంకుల్ ఉన్నారు. ఒకటే నవ్వులూ, జోకులూ... వంటింట్లోంచి బజ్జీల ఘుమఘుమలు! శ్రీకర్ వచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు.
“శ్రీకర్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నాన్నా... ఇదిగో ఇది శారద... ఇక్కడే పిల్లలకి వీణ నేర్పిస్తోందిట. ఇది భారతి... చదువురాని స్త్రీలకోసం రాత్రి బడి పెట్టిందిట... వీడు రాఘవరావు... భారతి మొగుడు... సారీ ‘వీడు’ అని ఎందుకన్నానంటే, చిన్నప్పుడు మంచి దోస్త్ నాకు... వీడే నాకు ఈత నేర్పించాడు. వీళ్లిద్దరూ గవర్నమెంటు బడిలో పంతులమ్మ, పంతుళ్ళుగా ఉద్యోగాలు వెలగబెట్టి రిటైర్ అయారట!” అంబుజ చకచకా పరిచయాలు చేసేసింది. ఆమె గొంతులో సిరిమువ్వల నాదంలా చిందులేస్తున్న సంతోష తరంగాలు.
మళ్ళీ అందరూ కలిసి ఎవరినీ పట్టించుకోకుండా కబుర్లూ, నవ్వులూ...
విజయ వచ్చి అందరికీ బజ్జీలు, పకోడీలు ఉన్న ప్లేట్స్ ఇచ్చి, వెళ్ళింది.
“అక్కయ్యా, నాకూ ఏమైనా పనులు చెప్పండి...” వంటింట్లోకి వెళ్ళాడు శ్రీకర్.
“సరే శ్రీ, ఇంద... ఈ మంచినీళ్ళు అందరికీ ఇచ్చిరా... ఈలోగా నేను టీ తయారు చేస్తాను...” అంది విజయ.
“అమ్మా, ఒక గంటలో బయలుదేరుదామా?” పదినిమిషాల తరువాత అడిగాడు శ్రీకర్.
“అప్పుడేనా?” ముఖం నిరాశగా పెట్టింది అంబుజమ్మ.
“శ్రీ బాబూ, మీ అమ్మని మాకు అచ్చంగా ఇచ్చేయరా...” అంది సరోజిని.
“అవునురా బాబూ, మీ అమ్మ మా దగ్గరికి వస్తే మళ్ళీ మా జీవితాల్లోకి వసంతం వచ్చినట్టే అనిపిస్తోంది...” అన్నాడు రాఘవరావు.
“మేము పువ్వులా చూసుకుంటామురా మీ అమ్మని...” చెప్పింది భారతి.
“అవునురా సిరీ... నాకూ ఇక్కడే ఉండిపోవాలని ఉందిరా... శారద స్కూల్లో నేను పిల్లలకి ఇంచక్కా అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తా... భారతీ వాళ్ళతో కలిసి చదువు చెబుతాను... సరోజినత్త తో కలిసి గుడి సేవా కార్యకలాపాల్లో పాల్గొంటాను...” ఆశగా అంది అంబుజమ్మ.
అయోమయంగా చూసాడు, శ్రీకర్... “అమ్మా, మరి నీ ఆరోగ్యం?”
“అన్నీ చక్కబడతాయి నాన్నా... మీ అమ్మకి ఎటువంటి అనారోగ్యమూ లేదు... ఒక వేళ ఉన్నా, ఇక్కడ మాతో కలిసి ఉంటే, ఈ కాలుష్యము లేని గాలికీ, స్వచ్ఛమైన నీటికీ అన్నీ పోతాయి... ఆలోచించరా సిరీ... మేమంతా అమ్మని ఇక్కడ ఉంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాము...” చెప్పింది శారద.
“సరే... ముందు ఊరికెళ్ళి, ఆలోచించుకుని అక్కడి పనులు చూసుకుని, అమ్మను తీసుకొస్తాను అత్తా...” చెప్పాడు శ్రీకర్.
***
తిరుగు ప్రయాణంలో కొడుకుతో ఆపకుండా గలగలా మాట్లాడుతూనే ఉంది అంబుజమ్మ.
“అరేయ్ సిరీ, నీకో విషయం తెలుసా కన్నా? సరోజత్త మేము చిన్నప్పుడు ఆడుకున్న వామన గుంటల పీట, గవ్వలు, గచ్చకాయలు, బొంగరాలు దాచి ఉంచింది తెలుసా? అవన్నీ చూపించింది నాకు... సిరీ, ఎందుకురా నా నేస్తాలతో గడపనీయకుండా అప్పుడే తీసుకువెళ్ళి పోతున్నావ్?” తల్లి గొంతులో మారానికి శ్రీకర్ కి నవ్వొచ్చింది.
అవును... తన దగ్గరున్న తల్లికి ఎలాంటి ఆనందమూ లేదు... ప్రశాంతత అంతకన్నా లేదు... పలకరించే మనిషి లేడు. అమ్మని చూడాలనిపించినపుడు, తానే వారం వారం ఇక్కడికి రావచ్చు, అత్తయ్యా వాళ్ళతో కలిసి గడపవచ్చు... పిల్లల్ని, ఇష్టపడితే పల్లవినీ ఇక్కడికి తీసుకురావచ్చు. ఒక నిర్ణయానికి వచ్చాడు, శ్రీకర్.
“అవునురా, శ్రీ, మన దీపు గాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడట... పెద్ద ఆస్పత్రి కట్టించాడుట. నేను ఇక్కడికి వచ్చేసినా వాడి దగ్గరికి వెళ్ళనురా... వాడికి ఇష్టమైతే ఎప్పుడో వాడే వస్తాడు... అయినా నాకు మణిపూసలాంటి నువ్వుండగా వాడి మీద అనవసరమైన భ్రాంతి ఎందుకూ? సారీరా... నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను కదూ?” అంది అంబుజమ్మ పశ్చాత్తాపంతో.
ఆమె కళ్ళలోని కాంతులు, అవ్యాజమైన అనురాగధార చూస్తుంటే, ఆమె తనకు తల్లిలా కాక, కూతురిలా అనిపించింది శ్రీకర్ కి. ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ మరో చేత్తో తల్లి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు, శ్రీకర్.

***
(సమాప్తం)

 

--- నండూరి సుందరీ నాగమణి