Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కాశీబాయి కనిట్కర్ - మరాఠీ



మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కాశీబాయి కనిట్కర్ - మరాఠీ

కాశీబాయి కనిట్కర్ ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తుంది. 9 ఏళ్ళకే పెళ్ళి ఆమె కంటే 7 ఏళ్ళు పెద్ద అయిన గోవింద్ వాసుదేవ్ కనిట్కర్ తో. ఈమెకు విద్యాభ్యాసం లేదు. కాని భర్త అభ్యుదయ భావాలున్న వాడవటం వల్ల ఈమెకు కూడా తనతో పాటు ఇంట్లో చదువు నేర్పిస్తాడు. మరాఠీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలు నేర్పిస్తాడు. స్వతహాగా స్పురదౄపి అయిన కాశీబాయి ఈ మూడు భాషలూ క్షుణ్ణంగా నేర్చుకుంటుంది. 15 వ శతాబ్దంలోని కణో పాత్ర అభంగ్లు పండరి నాధుడి మీద రాసింది. ఆమె తరవాత మరాఠీలో, నవల్లూ, కధలు రాసి ఒక రచయిత్రిగా పేరు తెచ్చుకుంది కాశీబాయి.

ఆమె స్త్రీ విద్య కోసం చాలా పాటు బడింది. స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆశ పడింది. ఆమె ఉన్న రోజుల్లో సామాజిక పరిస్తితులను ఒకసారి చూద్దాం. ఈమె రోడ్డు మీద షూస్ వేసుకుని గొడుగు పట్టుకుని నడుస్తూ వెళ్ళిందని రాళ్ళేసి కొట్టే వారట జనం, మగ రాయుడిలా వెళ్తోందని. అలాగే ఈమె చుట్టాల్లో విధవ అయిన ఒక స్త్రీ మామగారు అభ్యుదయ భావాలున్న వ్యక్తి అయి కోడలికి శిరోముండనం చెయ్యనివ్వకుండా అడ్డుపడితే, ఆయన ఊరి నుంచి బయటికెళ్ళినపుడు, అత్తగారు కోడలి శిరొముండనానికి చక చకా ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయం కోడలు తన మామగారికి తెలిపినప్పుడు ఆయన ఇంకెవరినో పంపి ఆ ప్రయత్నం ఆపిస్తాడు. ఇది అత్తగారికి కోడలి మీద అయిష్టం కన్నా సమాజ వత్తిడి తట్టుకోలేని అశక్తతగా భావించవచ్చేమో. సమాజ భీతి అలాంటిది మరి. అటువంటి రోజుల్లో ఈమె స్త్రీలకి సాయంత్రం వేళల్లో కలుసుకుని వారి బాగోగుల గురించి చర్చించుకునేందుకు ఒక క్లబ్ పెడుతుంది. అయితే సహజంగానే అందులోకి వచ్చే స్త్రీలందరు హైక్లాస్ వారే.

జాన్ స్టువర్ట్ మిల్ రాసిన Subjugation of Women అనే వ్యాసం ఈమెనెంతో ప్రభావితం చేసింది. ఆ ప్రభావమే ఆమె రచనలన్నింటిలోనూ కనిపిస్తుందట. ఆమె రచనలనిండా స్త్రీ అభ్యున్నతికి సంబంధించిన అంశాలే.

ఆమె రెండు నవల్లు, "రంగా రావ్" "పాలకిచ గొండ" మరాఠీలో రాసింది. అలాగే రెండు కధా సంకలనాలు అచ్చయ్యాయి. ఆమె నవల "రంగారావ్" చాలా మంది పాఠకుల్ని సంపాదించుకుంది. అలాగే ఆమె ఇంకొక ముఖ్య రచన బయొగ్రఫి, డాక్టర్ ఆనందీ బాయ్ జోషీ ది ఇంటర్ నేషనల్గా కూడా చాలా పేరు తెచ్చుకుంది.
డాక్టర్ ఆనందీ బాయ్ జోషీ ఆమె సమకాలీనురాలు. మొట్టమొదటి లేడీ డాక్టర్ భారత దేశంలో. అమెరికా లోని పెన్సిల్వేనియా లో ఉన్న స్త్రీ వైద్య విశ్వ విద్యాలయంలో ఈమె మెడిసిన్ చేసింది.

ఆనంది కూడా ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుడుతుంది. కానీ ఆస్తులన్నీ పోయిన నేప్ధ్యంలో ఆమెను 9 ఏళ్ళకే ఒక భార్య చనిపోయిన రెండో పెళ్ళివాడైన, ఇరవై ఏళ్ళ పెద్దయిన గోపాల్ రావ్ జోషి కిచ్చి పెళ్ళి చేస్తారు. ఇతను పోస్టల్ డెపార్టుమెంట్లో క్లర్క్. పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి ఆనంది ఒక బిడ్డకి జన్మనిస్తుంది కానీ పుట్టిన పది రోజులకి బిడ్డ చనిపోతుంది సరయిన వైద్యం లేక. అప్పుడు ఆనంది డాక్టరవ్వాలని నిర్ణయించుకుంటుంది. భర్త కూడా ప్రోత్సహిస్తాడు. మొదట ఇద్దరూ అమెరికా వెళ్ళడానికి నిశ్చయించుకుని ఒక మిషనరీ ని సహాయం అర్ధిస్తారు. కాని క్రిస్టియానిటీ పుచ్చుకుంటేనే సహాయం చేస్తామంటే ఆ ప్రయత్నం విరమించుకుంటారు. కానీ ఆ మిషనరీ ఈ విషయాన్ని ఒక అమెరికన్ మేగజిన్ లో అచ్చేస్తాడు. అది చదివిన అమెరికా లోని ఒకామె ఆనందికి సాయం చెయ్యడానికి ముందుకొస్తుంది. అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో వీరిద్దరూ హిందూఇజంకి సంబంధించి ఎన్నో విషయాలను చర్చిస్తారు. మొత్తానికి ఆనంది ఒక్కర్తే అమెరికాకి షిప్ లో వెడుతుంది. అది 19 ఏళ్ళ వయసులో. కానీ ఈలోపల ఆమె స్త్రీ అయుండి చదువుకొడానికి అమెరికా వెళ్ళడాన్ని తప్పు పడుతుంది హిందూ సమాజం. అప్పుడు ఆమె ఇచ్చిన ఒక ప్రసంగంలో తను ఎందుకు వెడుతున్నదీ, దాని వల్ల జరిగే మేలేంటి అన్నీ వివరిస్తుంది. అర్ధం చేసుకున్న్న కొంత మంది ఆమెకు ఆర్ధికంగా సహాయ పడతారు. అలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా మెడిసిన్ చెయ్యాలని నిర్ణయించుకుని, ఒంటరిగా ప్రయాణించి ఆమె పెన్సిల్వేనియా వైద్య విద్యాలయంలో చేరుతుంది. మూడేళ్ళలో మెడిసిన్ పట్టా పుచ్చుకుంటుంది. కాకపోతే, వెళ్ళకముందునుంచే బాగోలేని ఆరోగ్యం అక్కడకు వెళ్ళాకా ఇంకా క్షీణిస్తుంది అక్కడ చలికి సరయిన తిండి లేకపోవటం వలన. భారత దేశం తిరివచ్చి కొల్హాపూర్లో Lady డాక్టర్గా నియమితురాలైన కొద్ది నెలల్లోనే అరోగ్యం క్షీణించి, క్షయ రోగంతో ఆమె మరణిస్తుంది. ఆమెతొ పాటుగా వైద్య విద్య నభ్యసించి మరో ఇద్దరు స్త్రీలు ఒకరు జపాన్ నుంచి ఇంకొకరు సిరియా నుంచి. జపాన్ మహిళ డాక్టర్గా ఒక హాస్పిటల్లో నియమించబడ్డా అప్పటి జాపాన్ రాజుకి ఒక స్త్రీ పనిచేయడం నచ్చక పోవటం వలన ఆమె ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటుంది. సిరియన్ స్త్రీ సంగతి వివరాలు లభ్యమవవు. మనం ఊహించుకోవచ్చు. మన దేశంలోనే కాక, ఇతర దేశల్లోనూ ఇంచుమించు అవే పరిస్తితులు స్త్రీలకి.

కాకపోతే మొట్టమొదట 1850 ల్లో స్త్రీల కోసం స్థాపించిన వైద్య విశ్వ విద్యాలంలో అమెరికా వెళ్ళిన మొదట్రి హిందూ స్త్రీ, మొదటి స్త్రీ డాక్టరుగా ఆనంది పేరు తెచ్చుకుంది.

అయితే ఏడెనిమిది ఏళ్ళలో ఆనంది జీవితంలో జరిగిన విషయాల్ని, తిరిగిన మలుపుల్ని ఎందరో రాసారు. శ్రీ క్రిష్ణ జనార్ధన్ జోషి ఆనందీ గోపాల్ అనే నవలగా ఆనంది జీవితాన్ని గురించి రాశారు. ఈ నవలని ఆషా దాంలే ఇంగ్లీష్ లోకి అనువదించారు. Carolene Wells Haley Dall, 1888 లో ఆనందీ బాయ్ బయొగ్రఫి రాసింది.
1889 లో కాశీ బాయి రాసిన వందేళ్ళకి అంజలీ కీర్తనె అనే ఆమె రిసెర్చ్ స్టూడెంట్ కూడ ఆనందీ బాయి బయొగ్రఫీ రాసింది.

అయితే ఎస్ జె జోషీ రాసిన బయొగ్రఫి మీద విమర్శ ఏంటంటే, ఆయన గోపాల్రావ్ ని ముఖ్య పాత్రగా చిత్రిస్తూ ఆనందీ ని కేవలం గోపాల్రావ్ తర్ఫీదిచ్చిన రేసు గుర్రం లాగే చూపెట్టే ప్రయత్నం చేసాడని. ఇది చాలా మంది ఫెమినిస్ట్ ల విమర్శకు లోనయింది.

ఇక కేరొలిన్ దాల్ రాసిన బయిగ్రఫి కొస్తే, ఆమె ఆనందీ తోటీ, గోపాల్రావ్ తోటీ పరిచయం ఉన్న వ్యక్తి. గోపాల్రావ్ వ్యక్తిత్వాన్ని స్వయంగా పరీక్షించిన వ్యక్తి. ఆనందీ లేకపోతే భారత దేశంలో ఉండటం కష్టంగా ఉందని చైనా నుంచి అమెరికా షిప్ లో వెళ్ళి, తీర అక్కడ తన భార్యని చూసి ఓర్వలేక కొంత, పురుషాధిక్య ధోరణితో కొంత ఆమెను వేధించి, అప్రస్తుత ప్రసంగాల్లో వెస్టర్న్ రేసిజ్మ్ గురించి లెక్చర్స్ దంచి, క్రిస్టియానిటీని దుయ్యబడితే, అక్కడ తన చదువుకోగల్గడానికి వారి సహాయాన్నే అర్ధించి కాలం గడుపుతున్న ఆనందికి ఇది చాలా ఇబ్బందికరంగా మారి, ఆ ఇమోషనల్ స్ట్రెస్ తోటే మరణించి ఉండవచ్చని తేల్చింది. ఆమెది గోపాల్రావ్ మీద కోపం. వీరిద్దరు అమెరికన్ ధాతృత్వాన్ని ప్రప్రంచానికి చూపే మస్కొట్స్ లాగా పనిచేయాలనే వారి ఎక్స్పెక్టేషన్ తీర్చలేదని ఆమె బాధ. అంతే కాకుండా ఆమె ఆనంది చదువుకి, ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు కోసం ఇచ్చిన డబ్బుని దుర్వినియోగం చేసినట్టు కూడా చూపింది.

ఇక అంజలీ కీర్తనే బయొగ్రఫీ కొస్తే, ఆమెకు ఒక విద్యావంతురాలు, ధనిక అర్బన్ బేక్గ్రౌండ్ నుంచి వచ్చే సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఆమె కూడా దాల్ రాసిన బయొగ్రఫి లోంచి గోపాల్రావ్ కేరక్టర్ మలిచిన తీరునే అధారంగా చేసుకుని, ఆనందిని తన ఆశలని ఆశయాలని, ఒక అమెరికన్ ప్రపంచం ఇచ్చే స్వేఛ్చ్ తో రెఫైన్ అయిన వ్యక్తిత్వాన్నీ, నిస్సహాయంగా, తనకంటే ఎంతొ పెద్ద వాడైన భర్త ఆధిక్యతకి బలిచేసుకున్న స్త్రీగా చూపెట్టింది. ఇది ఒక అతిగా ఫెమినిస్ట్ కోణంలో రాసినదిగా విమర్శకి లోనయ్యింది.

అయితే కాశీబాయి రాసిన బయొగ్రఫి మాత్రం కొన్ని వాస్తవాల్ని తప్పుగా ఇచ్చినా, అమెరికా లోని ఆనంది జీవిత వివరాలు, ఆమె జీవితం గురించిన వివరాలు ఇవ్వకపోయినా, ఆమె నిజాయితీ తో నిబద్ధతతో రాసిందని పేరు. ఆనంది గోపాలరావ్ల వైవాహిక జీవితాన్ని వివరించినప్పుడు, గోపాల్రావ్ వ్యక్తిత్వాన్ని మరీ మసి పూసి చూపెట్టకుండా, ఇంత అసాధారణ జీవితాన్ని వారిద్దరూ ఎదుర్కొన్నపుడు సహజంగా వచ్చే మార్పుల్లా, జరిగే పర్యవసానాలకింద చిత్రించింది. గోపాల్రావ్ ప్రవర్తనలో అమెరికా వెళ్ళాకా మార్పు వచ్చినా, ఆనంది జీవితాన్ని తీర్చి దిద్దటంలో, ఆమెకు కావాల్సిన ఆర్ధిక సహాయం కోసం ప్రతి మిషనరీకీ తిరిగి, వివరించి చివరికి సక్సెస్ సాధించటంలోని పట్టుదల ఆమె కెంతో సహాయం చేసాయి. ఆ విషయాన్నైతే విస్మరించలేం కదా అని ఆమె అభిప్రాయం. ఏమైనా ఒక గృహిణిగా ఆమెకున్న పరిమితుల్లో, పైగా కేవలం స్వయంకృషితోనే చదువుకుని ఇన్ని భాషలూనూ, వాటన్నిటినీ అంటే తన పరిమితుల్ని వివరిస్తూ, ఇంకెవరూ ఆనంది జీవితాన్ని పుస్తకీకరించడానికి ముందుకు రాకపోవటం వల్లే తను ఆ పని చెయ్యల్సి వచ్చిందని ముందు మాటలో చెప్పి మరీ రాయటం, గోపాల్రావ్ రాసిన ఉత్తరాల్ని మార్చకుండా ఉన్నవున్నట్లు జతపర్చడంలో ఆమె నిజాయితీ కనిపిస్తాయి. కాశీబాయి ఆనందిని ఒక అభ్యుదయ, ఆర్య హిందూ స్త్రీగా ప్రొజెక్ట్ చేసింది.

ఇందరు రాసినా అనంది బయొగ్రఫీ, అందరూ కూడా వివిధ కారణాలవల్ల వారి వ్యక్తిగత పక్షపాతాన్ని వారి రచనలో చొరబడకుండా రాయలేకపోయారు. ఆ కోణంలో పరిశీలించినపుడు కాశీబాయి మాత్రమే ఆనంది జీవితాన్ని కొంతయినా సరిగా పొర్ట్రె చెయ్యడంలో కృతకృత్యురాలాయినట్లు లెక్క.

 

-Sharada Sivapurapu