Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? స్వర్ణకుమారీ దేవి బెంగాలీ

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? స్వర్ణకుమారీ దేవి బెంగాలీ

 

స్వర్ణకుమారీ దేవి దేబేంద్రనాథ్ కూతురు, రబీంద్రనాథ్ ఠాగూర్ కన్నా అయిదేళ్ళు ముందు పుట్టింది. ఆమె రాయని ప్రక్రియ లేదు. నవల (13 నవలలు), నాటకం, వ్యాసం, పాట, కవిత్వం, కధలు ఇలా. అంతే కాదు పాత్రికేయురాలు, సంగీతంలో ప్రతిభ, సమాజ సేవకురాలు. ఎన్నో మొదటిసారి రాసిన ఘనత ఆమెది. విశ్వం, భూమి, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలూ, వాటి పుట్టు పూర్వోత్తరాలు, తేలికగా ఆడవారికి అర్ధమయ్యే భాషలో, చాలా ఆసక్తికరంగా రాసేదట. దీని కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివేదట. మొదటిసారి సంగీత రూపకం రాసిన ఘనత, మొదటిసారి నవల రాసిన ఘనత కూడా ఆమెదే బెంగాలీలో. ఈమెకు కూడా విద్యాభ్యాసం ఇంట్లోనే. అదింకా ఆడపిల్లల చదువు సంధ్యలు, బయటికి వెళ్ళడం మీద ఆంక్షలున్న రోజులు కదా. దేబేంద్రనాథ్ కుటుంబం దీనికి భిన్నమేమీ కాదు. అప్పుడప్పుడే వదులవుతున్న సంకెళ్ళని వాడుకుంటూ ఎదిగిన పిల్లే స్వర్ణకుమారి కూడా. పధెనిమిది ఏళ్ళ వయసులో అన్న ద్విజేంద్రనాథ్ స్థాపించిన భారతి పత్రికకు జ్యోతిరింద్రనాథ్ తో పాటుగా సంపాదకీయం నిర్వహించింది ఆమె. ఆమె రాసే సైన్సు వ్యాసాలన్నీ అందులోనే అచ్చయ్యేవి. భారతి ఆరోజుల్లో మేధావుల మేగజిన్. ప్రాధమిక విద్యాభ్యాసం కూడా లేకుండా ఆమె రాసిన అద్భుతమైన సైన్స్ ఎస్సేస్ అన్నీ కలిపి భూగర్భ్ అనే సంకలనంగా తీస్కొచ్చారు. అవి ఆమె ఉన్న కాలానికి ఎంతో ముందైనవి, సరళమైన భాషలో, ఆరోజుల్లో సైన్స్ జోలికి కూడా పోని ఆడవారికి తేలికగా అర్ధమయ్యే బెంగాలీ భాషలో రాయడం ఎంతో గొప్ప విషయం. ఈ వ్యాసాలు రాసే క్రమంలో బెంగాలీ లో కొత్త సైంటిఫిక్ పదాలు, ఇంగ్లీష్లో వాడే పదాలకు సమాంతరంగా ఆమె వాడిందట. ఈరోజున మార్స్ గ్రహం మీద లైఫ్ ఉందా అని పరిశోధనలు జరగడం మనకు తెలుసు. కానీ ఆరోజుల్లోనే లైఫ్ ఆన్ మార్స్ గురించి ఆమె వ్యాసాలు రాసింది. అలాగే భూమి మనుగడకి వచ్చిన ముప్పుని గురించి మనం ఇంకా సీరియస్గా ఆలోచించలేకపోతున్నాము. కాని అప్పుడే ఆమె ఏం రాసిందో చూడండి.


“The earth is apprehensive as to who will bring its dooms day. If it dies once and for all, the problem ends. The earth is dying every minute like a coward fearing death at every step, for it, life seems to depend on the word of the people and words do not cost”.


భౌతిక శాస్త్రాధ్యయనంకి స్త్రీల ఉన్నతికి సంబంధం ఉందని ఆమె విశ్వసించింది. ఇది పురుషులు మాత్రమే అధ్యయనం చెయ్యగలిగిన, చెయాల్సిన శాస్త్రం అన్న భావన తొలగించడంలోనే ఆమె విజయం. అధ్యయనం చెయ్యగలమన్న భావనతో వచ్చే విశ్వాశం యొక్క శక్తిని ఆమె నమ్మింది. ఆ శక్తి ఇవ్వడానికి ఆమె కృషి చేసింది.
ఆమెకు జానకీనాథ్ ఘోషాల్ తో వివాహం జరుగుతుంది. జానకీనాథ్ ఘోషాల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ కారణంగా స్వర్ణకుమారి కూడా అప్పటి రాజకీయాల్లో చురుగ్గా ఉంది. స్వదేశీ ఉద్యమంలో పాలు పంచుకుంటుంది. అయితే ఎవరో కొందరికి తప్ప అప్పటి ఉద్యమంలో స్త్రీల పాత్ర గాంధీ గారి చరఖాతో ఇంట్లోనే ఉండి మిగతా బాధ్యతలు నిర్వర్తిస్తూ నూలు వడకటానికే పరిమితమయ్యింది చాలావరకూ. స్వర్ణకుమారి పరిస్తితి కూడా ఇందుకు భిన్నమైనది కాదు. ఆమె కృషి అంతా ఇల్లు కేంద్రంగానే జరిగింది.
ఆమె శక్తి సమితి అనే సంస్థని స్థాపించి, దాని ద్వారా అమ్మాయిలకి, భర్త పోయిన స్త్రీలకి విద్య నేర్పించింది. అనాధ విధవ స్త్రీల కోసం కూడా ఒక షెల్టర్ పెట్టింది. ఈ సంస్థని నడపటం కోసం, ధనం సేకరించడం కోసం ఆమె బంగ్లా సిల్క్, ధాక సిల్క్ చీరల ప్రదర్శనలేర్పాటు చేసేది. Handicrafts fairs organise చేసేది. నాటకాలు రాసి వాటిని ప్రదర్శించేదట. విధవల పునర్వివాహానికి ఆమె తండ్రి వ్యతిరేకి. రబీంద్రనాథ్ కూడా ఈ విషయంలో తన అభిప్రాయం వ్యక్తపరచకుండా తన ఒక నవలలో కేరక్టర్ చివరికి భక్తి, అధ్యాత్మికతలో మునిగి, రాజకీయం మగవారికి వదిలేసినట్టుగా చూపిస్తాడు. కాని స్వర్ణకుమారీ దేవి ఈ విషయంలో వారిద్దరికన్నా ఒకడుగు ముందుకేసి వివాహమొకటే కాకుండా, వారు స్వతంత్రంగా స్వేఛ్చగా బ్రతకాలంటే విద్యావకాశాలు, ఆర్ధిక స్వతoత్రతా అవసరమని భావిస్తుంది. నిజానికి ఒకసారి పెళ్ళి అనే వ్యవస్థకి బలయినవారే కాబట్టి వారిని మళ్ళీ అందులోకే నెట్టడం, మిగతా పరిస్తితులలో ఏ మార్పూ లేకుండా అనేది ప్రయోజనం లేనిదే కదా.
ఆమె రాసిన నవలలన్నీ కూడా బంకిం చంద్ర చట్టర్జీ నవలలంత పాపులర్. ఆమె రాసిన ఒక కధల సంకలనం (ఆంగ్లంలోకి తర్జుమా చేసింది) వెనక పేజీ మీద రాసిన రెవ్యూ లో ఈ విధంగా రాస్తారు.
“Mrs.Ghoshal is a sister of Rabindranath Tagore to whom the Noble Prize was recently awarded. If the poet's merits are great, those of his sister are scarcely less, and both East and West will agree that it is a charming revelation of the workings of a woman's heart. In its sweet simplicity and delicacy of tough, faded readers will experience a new sensation.”
రబీంద్రనాథ్ ఠాగోర్ కన్నా ఏమాత్రం తీసిపోదని ఒక పక్క పొగుడుతూనే, ఇంకో పక్క స్వీట్ అండ్ చార్మింగ్ అని అభిప్రాయాన్ని వ్యక్తపరచడం, సిగ్గువిడిచిన సామ్రాజ్యవాదానికీ, నిస్సంకోచ పురుషాధిక్య మనస్తత్వానికి చిహ్నమని అనిపిస్తుంది. పైగా అప్పటి సాహిత్యాకాశంలో వెలుగుతున్న కొద్దిమంది పురుషుల్లో ఆమె సోదరుడు కూడా ఒకరు. ఆమె ఆంగ్ల వనితకాదు, పురుషుడూ కాదు, రబీంద్రనాథ్ ఠాగూరూ కాదు. ఇన్ని రకాల వివిక్షలతో ఆమె ఆంగ్ల రచనలని స్వీకరించింది అప్పటి బ్రిటిష్ పురుష ప్రపంచం. ఎందుకంటే బ్రిటిష్ వారికి వారిది చాలా గొప్ప సంస్కృతని, స్త్రీలని వారి సంస్కృతిలో గొప్పగా చూస్తారని ఒక దురభిప్రాయం. ఇది కొంచం బలపడటానికి కారణం అప్పుడు భారతదేశంలో ఉన్న సతి అనే ఆచారం. పురుషుల్ని, వీరులనుకున్న వారిని ఎలాగూ వారణిచి వేసి వారి సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక స్త్రీలని చూస్తే దయనీయమైన స్తితి. ఈ రెండు అంశాలూ బ్రిటిష్ వారి చిన్న చూపుకి కారణం భారతదేశం మీదా, భారతదేశ సంస్కృతి మీదా. ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైనికులకు సాయంగా వెళ్ళిన భారత సైనికుల పోరాట పటిమ ఈ పరిస్తితిని కొద్దిగా మార్చి కాంగ్రెస్ అభిలషిస్తున్న స్వయం పరిపాలన సాధ్య పడొచ్చని ఆశ పడ్డ మాట నిజం, కానీ అలా జరగలేదు. సిగ్గులేని బ్రిటిష్ పాలకులు మొండిచేయి చూపెట్టారు. స్వర్ణకుమారి రాసిన 'ఎ మ్యుటినీ' అనే కధలో ఈ విషయాలన్నీ చర్చిస్తుంది. సతి అనే ఆచారం ప్రకారం భర్త చితిలో తాను కాలి చనిపోవడానికి కావల్సిన గుండె నిబ్బరం, ఆత్మ స్థైర్యం చూపెట్టే స్త్రీ, వీరులైన పురుషులకి, యుద్ధంలో ఒక ఆశయం కోసం, పర పరిపాలన పీడనుండి స్వదేశీ విముక్తి కోసం, ఆత్మ త్యాగానికి సిద్ధపడే వారికి ఆమె ధైర్యం, ఒక స్పూర్తి, ఆదర్శం కాదా అని ఒక వైపైతే . ఆ రకంగా భర్త చితితో పాటు కాలిపోవడానికి ఇష్ట పడని స్త్రీలను బంధువులంతా కలిసి బలవంతంగా చితిపై కాల్చి చంపేసే ఆచారం ఎంత కౄరమైనది, భర్త తరవాత గౌరవంగా జీవించ లేని పరిస్తితి ఉన్న సమాజం ఎంత వెనకబడ్డది? ఎ మ్యుటినీ అనే కధలో జరిగే చర్చ ఇది. ఈ చర్చ చెయ్యడానికి స్త్రీగా ఆమె జీవితంలో ఆమెకు ఎంత్ర స్వతంత్రం ఉంది, ఎంత సమానత్వం ఉంది తనదైన సమాజంలో పురుషులతో బాటు తనకు అని ఆమె సందేహిస్తుంది. అలా చర్చించేటప్పుడు తన సమాజంలో ఆడదానిగా తనకున్న తక్కువ స్థానం గురించి ఆమె బాధ పడుతుంది.
అసలు చూస్తే, తారాబాయి షిండే (పోయిన వారం మనం తెలుసుకున్న రచయిత్రి) స్వర్ణకుమారి ఇద్దరు సమకాలీకులే. కాని ఈమె తారాబాయి షిండే లాగా పురుషాధిక్యతని ప్రశ్నించలేదు. ఒక ధనిక, ఉన్నత కుటుంబంలో పుట్టడం, ఎన్నో ఆంక్షల మధ్య, ఆచారాలు, పరవు, ప్రతిష్టల బరువుతో పెరగడం ఈమె కున్న ప్రతిబంధకాలు ఒక రకంగా. నిజానికి ఠాగూర్ కుటుంబంలో ఇంకొక వ్యక్తికి, వారి ప్రతిభకు సమానంగా గుర్తింపు రాలేదు. ఎవరూ కూడా ఆయన నీడ నుండి బయట పడలేదు, ఎంతో ప్రతిభావంతులైయుండి కూడా. ఆమె రాసిన ఒక బెంగాలీ నవల (“An unfinished song” in English) అచ్చయినప్పుడు ఆమె సోదరుడు (supposed to be రబీంద్రనాథ్ ఠాగూర్) తన ఒక ఇంగ్లీష్ స్నేహితుడికి ఈ రకంగా రాసారట.
“She is one of those unfortunate beings who has more ambition than ability. But just enough talent to keep her alive for a short period. Her weakness has been taken advantage of by some unscrupulous literary agents in London and she has had her stories translated and published. I have given her no encouragement but have not been successful in making her see things in the proper light.”
(Source: Teresa Hubel's essay “ A mutiny of silence: Swarna Kumari Devi's Sati, a review of international english literature)
ఇలాంటి నిజాలు బయటికి రావు, వచ్చినా నమ్మశక్యంగా ఉండవు. స్త్రీలు ప్రగతి పధంలో అడుగులేస్తే ప్రతిఘటన ఇంట్లోనే ఉంటుందనటానికి ఇంతకంటే క్లాసిక్ ఎక్సాంపుల్ ఇంకేముంటుంది? అయితే ఆమె మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికీ భారత దేశంలోని పితృవాద పురుషాధిక్యతకూ మధ్య ఆనాటి అభ్యుదయ మహిళల ప్రతిభ అనేక సందర్భాలలో నిస్సందేహాత్మకంగా మరుగున పడిపోయిందని గమనించింది. ఇలాంటి ఫిర్యాదులని అప్పటి సమాజానికి అర్ధమయ్యే రీతిలో మహిళలు చెప్ప గల్గటానికి ఆమె రచనల ద్వారా కృషి చేసింది. ఆమె చెయ్యడమే కాకుండా మిగతా స్త్రీలు కూడా ఆ దశకి చేరుకోడానికి కావల్సిన స్పూర్తినీ, విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసింది.

....Sivapurapu Sharada