Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మహలఖా బాయి చందా




మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?

మహలఖా బాయి చందా

 

 



మొఘల్ వంశంలోని ఆసఫ్ జాహీ సుల్తానుల చరిత్రలో ఎంతో ఒడిదుడుకులతో నడుస్తున్న కాలమది. ఔరంగాబాదులో పుట్టింది మహలఖా బాయి చందా. ఆమె రాజ్ కున్వర్ అనే రాజ్ పుటాని స్త్రీకి మొగల్ సామ్రాట్టు మొహమ్మద్ షా దగ్గర సైన్యంలో పనిచేసే బహదుర్ ఖాన్ కి పుట్టింది. అయితే ఈమె పిన తల్లికి పిల్లలు లేక ఈమెను పెంచుకుంది. పినతల్లి భర్త నవాబ్ రుకుండ్ దౌలా దక్కన్ నిజాం వద్ద Prime Minister. ఈయన చందా బీబీ పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పధ్నాలుగేళ్ళకల్లా ఆమెకు గుర్రపు స్వారీ, శస్ట్ర విద్య నేర్పించాడు. అంతే కాదు ఈమె నిజాం 2 తో పాటుగా యుద్ధాల్లో పాల్గొనేదట. మంచి పేరు, బాణాలు సంధించటంలో. చిన్నప్పుడుఎప్పుడూ మగవేషంలోనే ఉండేదట. యుద్ధ విద్యలే కాకుండా చక్కటి విద్యాభ్యాసం చెప్పించాడు. ఆమె అరబ్బీ, ఉర్దూ, బోజ్ పూరి భాషల్లో సిద్ధహస్తురాలు.

ఉత్తరాదిన ముఖ్యంగా లక్నవ్ లో వేశ్యలకు మంచి గౌరవమే ఉండేదట సమాజంలో. వేశ్యల్లో మూడు రకాలు ఉన్నారు. ఒకటి, డబ్బు తీసుకొని ఒకరితో ఉండిపోయి, కొన్ని కొన్ని సార్లు వారినే వివాహం కూడా చేసుకుని జీవించేవారు. రెండు, ఒకే చోట ఉండి వృత్తి చేసుకునేవారు. మూడు, వేరే వేరే ఊళ్ళకి మకాంలు మారుస్తూ వృత్తి చేసుకునే వారు. మహలఖా బాయి ఏ కోవకు చెందినదో తెలియదు. అసలు వేశ్య అవునో కాదో కూడా కరెక్ట్ గా తెలియదు. ఒక చోట వేశ్య అని రాసినా ఇంకో చోట అటువంటి ప్రస్తావన కూడా లేదు. అయితే వేశ్యలకు గౌరవనీయ స్థానం ఎందుకు వచ్చిందంటే, వారి వద్దకు వచ్చే విటులకు సమాజంలో ఉన్న స్థానం వల్ల ఒకటయితే , రెండు, సాధారణ గృహిణుల్లా కాకుండా, వీరికి విద్యాభ్యాసం, సంగీతం, నృత్యం లాంటి కళల్లో శిక్షణ, ప్రవేశం, నైపుణ్యం ఉండటం, వారి వద్దకు వచ్చే విటులతో సమంగా కవిత్వాన్ని ఆస్వాదించడం, రాయటం రావటం వల్ల. ధనికులు, ఉన్నత వర్గాలు తమ ఇళ్ళల్లోని మగ పిల్లల్ని వీరి వద్దకు కొన్ని సభ్యతా, సంస్కారాలు నేర్చుకోవటానికి పంపే వారంటే చూడండి సమాజంలో వీరికున్న ఆదరణ.

చిన్న పిల్లగా మహలఖా బాయి చందాకు సిరాజ్ అలహాబాదీ అనే కోర్ట్ పొయెట్ కవిత్వం అంటే చాలా ఇష్టమట. ఆమె స్వతహాగా మంచి గాయని. ఆమె పాటలు ఆమె రాసుకుని బాణీ కట్టి పాడేదట. మాటల్లో చతురత, హాస్యం, ఉత్సాహం, చక్కని అందం ఆమె సొంతం. ఆమె కవిత్వం నవాబ్ మీర్ ఆలం అనే కవి దగ్గర నేర్చుకుంది. దీవాన్ అంటే గజల్సు సంకలనం. 39 గజల్సు, ప్రతి గజలుకు 5 ద్విపదలు, 'దీవాన్ ఎ మహలఖా' అనే సంకలనం. ఆమె రాసి సంతకం చేసిన దివాన్ ఎ చందా 125 గజల్సు సంకలనం ఆమె ఎంతగానో అభిమానించిన కేప్టైన్ మాల్కం కి బహుమతిగా ఇచ్చింది మీర్ ఆలం ఇంట్లో జరిగిన ఒక నృత్య కార్యక్రమంలో. ఇప్పుడది బ్రిటిష్ మ్యూసియం లో భద్రంగా ఉంది. మహ్ లఖా అనేది ఒక బిరుదు. చంద్రుని పోలికలో ఉన్నది అని అర్ధమట. ఆమెకు కొన్ని సందర్భాలలో జాగీర్లుగా ఇప్పటి చందానగార్, అడిక్ మెట్, హైదర్ గూడా, సయ్యద్ పల్లి ప్రాంతాలు ఇచ్చారట. ఆమె ప్రేమించింది రాంభా రావ్ అనే ఒక మరాఠా సైన్యాధికారి. ఇతను రెండవ నిజాం తరపున మరాఠా రాజ్యంతో పోరాటం చేసాడు. Captain Sir John Malcolmఅంటే ఈమెకు చాలా అభిమానం. ఈమె ఎవరినీ పెళ్ళి చేసుకోలేదు. నిజాము Prime Ministersకు ఉంపుడుకత్తె గా ఉండిపోయింది. అందువల్లే ఈమెను వేశ్య అని కొన్ని చోట్ల పేర్కొనడం జరిగిందనుకుంటా. ఏమైతేనేం ఈమె నిజాం రెండు, మూడు దగ్గర కోర్ట్ లో ఉన్న ఏకైక స్త్రీ. చాలా powerful and influential lady. ఈమెను ముఖ్యమైన పాలనా వ్యవహారాల్లో కూడ పాలకులు సంప్రదించేవారంటేనే ఈమె ఎంత ప్రతిభాశాలో తెలుస్తుంది కదా. ఆమె ఉన్న ఇల్లు ఇప్పుడు Government Degree College for girls గా మార్చారట నాంపల్లి హైదరాబాదులో.

మహలఖాబాయి జీవిత చరిత్ర రాసిన సమీన షౌకత్ ప్రకారం మహలఖాబాయి జీవితంలో అత్యున్నత స్తితికి కవయిత్రిగా, గాయనిగా చేరుకుంది హైదరాబాదులోనే. రాచ కుటుంబీకులు, ఇతర ఉన్నత పదవుల్లోఉన్న వాళ్ళు, ముఖ్యులు ఇలా చాలా మంది ఆమె అభిమానులే. కళల పట్ల ఆమెకున్న అభిమానం వల్ల చాలా డబ్బు ఖర్చు చేసింది వాటి ఉన్నతికి. మహ లఖా ఒక గ్రంధాలయం స్థాపించి ఎన్నొ గ్రంధాలను, manuscripts పొందు పరిచింది. కవిత్వంతొ పాటు ఇతర కళాత్మక వస్తువుల్ని, శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన వాటిని సంగ్రహించి అందరికి అందుబాటులోకి తెచ్చింది. ఒక నృత్య, సంగీత పాఠశాల పెట్టి ఎంతొ మంది ఆడపిల్లలకి శిక్షణ ఇప్పించింది. తను ఇస్లాం నే నమ్మినా తల్లి హిందూ అయిన కారణంగా హిందూ వేదాంతం వల్ల కూడా ప్రభావితమైంది. రాజస్థానీ కట్టడాల శైలిలో తన అసలు తల్లికి ఇప్పటి మౌలా ఆలి లో సమాధి కట్టించింది. చాలా చక్కటి నిర్మాణమది. ఇప్పటికీ అందంగా maintain చెయ్యబడుతోంది. మరణించిన తరవాత ఆమెను కూడా అక్కడే సమాధి చేసారు. మీర్జా హాది రుసువా రాసిన ఉమ్రావ్ జాన్ అదా కి స్పూర్తి మహ్ లఖా అని చెప్తారు. ఎందుకంటే ఈమె కథక్ నృత్య రీతిలో నాట్యం చేస్తూ వివిధ రాగాలను మిళాయించి ఆలపించేదట. ఇప్పటికీ కొన్ని ప్రార్ధనా మందిరాలు ఆమె కట్టించినవి ఉన్నాయట ఆమె గుర్తుగా. ఆమె చనిపోయిన తరవాత ఆమె ధనం, ఆస్తులు, నగలు అన్నీ పేద స్త్రీలకు పంచి పెట్టారట.

వేశ్యలకు కవిత్వం కొత్తేమీ కాదు అయితే అది ఎప్పుడూ, భద్ర పర్చడం జరగలేదు. అదృష్టవశాత్తూ మహలఖాబాయి రచనలు దాచడం జరిగింది. ఆమె రాసిన వన్నీ గజల్సు. సమీనా షౌకత్ ప్రకారం మహలఖా బాయి మొదటి ఉర్దూ కవయిత్రి.. దెక్కనీ ప్రాంతం (గోల్కొండ) హైదరాబాదు, బీదరు ప్రాంతాల్లో ఉర్దూ కవిత్వం గజల్ ప్రక్రియలో బాగా వృద్ధి చెందింది. ఈ ప్రభావంతోనే ఉత్తరాదిన కూడా తరవాత గజల్ ప్రక్రియ అభివృద్ధి చెందిందట.

మహలఖాబాయి రాసిన గజలు ఒకటి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించాను. ఎంతవరకూ దాని ఒరిజినల్ అందం మిగిలిందో తెలియదు కానీ, ప్రయత్నించాను చూడండి.

Hoping to blossom (one day) into a flower.

Hoping to blossom (one day) into a flower,
Every bud sits, holding its soul in its fist.

Between the fear of the fowler and (approaching) autumn,
The bulbul’s life hangs by a thread.

Thy sly glance is more murderous than arrow or sword;
It has shed the blood of many lover.

How can I liken a candle to thy (glowing) cheek?
The candle is blind with the fat in its eyes.

How can Chanda be dry lipped. O Saqi of the heavenly wine!
She has drained the cup of thy love.

పువ్వుగా వికసించాలని (ఒకరోజు) ఆశిస్తూ

ఏదో ఒకరోజు పువ్వుగా వికసించాలని ఆశిస్తూ
ఆత్మను గుప్పిట పట్టుకు కూర్చుంటుంది ప్రతి మొగ్గ

ఆకురాలు కాలం, వేటగాడి భయాల మధ్య,
పికిలిపిట్ట ప్రాణం ఒక తాడుకు వేలాడుతుంది.

కత్తికన్నా, బాణం కన్నా ప్రాణాంతకమైనది నీ ఓరచూపు;
ఎంతోమంది ప్రేమికుల రక్తం కార్పించింది.

వెలుగుతుందని కొవ్వొత్తిని నీ అధరాలతో ఎలా పోల్చను?
కళ్ళనిండా కొవ్వు నింపుకున్న గుడ్డిది కొవ్వొత్తి.

చందా ఎండిన పెదాలతో ఎలా ఉండగలదు, స్వర్గాన్నుంచి మధువు తెచ్చే ఓ సాఖీ!
మధు పాత్రలోని నీ ప్రేమనంతా ఆమె ఒంపేసింది.

 

 

....Sivapurapu Sharada