Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 21 వ భాగం

 

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు" 21 వ భాగం

అలంకరించిన ఏనుగుమీద అంబారీలో రామాయణకావ్యాన్నుంచి, ప్రక్కన నడిచి వెళ్ళారు, ఎర్రన, సూరనలు. ఆడవారు, తెరలు కట్టిన బళ్ల మీద కూర్చుని పయనమయ్యారు.

వీరు చేరే సరికే కొలువులో అందరూ వారి వారి ఆసనములలో కూర్చుని వేచి ఉన్నారు.
   పోతమాంబ కోడలిని తీసుకుని లోనికి.. రాణీగారున్న చోటికి నడిచింది.
   ఫణిహారులు దండములు ధరించి, అందందు నిలిచి, వచ్చిన వారిని ఉచితాసనములలో కూర్చుండ బెడుతున్నారు.
   అంతలో ప్రభువు, ప్రోలయ వేమారెడ్డి అరుదెంచారు. వారి వెంట మల్లా రెడ్డి కూడా ఉన్నారు. వారు అంతకు ముందురోజే కొండవీటి నుండి వచ్చారు. అక్కడి కోట పూర్తి అయిపోయింది. మంచి ముహుర్తం చూసి రాజధానిని మార్చడమే మిగిలింది.
   ఎర్రన ఎదురేగి, కావ్యకన్యను సమర్పించబోయే రాజును సగౌరవంగా తోడ్కొని వచ్చి, సింహాసనం మీద అలంకరింపజేశాడు.
   ప్రభువునకు ఉచితోపచారాలు చేసి కావ్యకన్యను సమర్పించారు ఎర్రనగారు.
   ప్రోలయ వేమారెడ్డి పరమానంద భరితుడైపోయాడు.
   "చదలవాడలో రామాలయ ప్రతిష్ఠనాడు నే కోరిన కోరిక.. ఈ నాడు నెర వేరింది. ఈ రామాయణం చెప్పించి నందువలనే నేను అత్యుత్తమ ఖ్యాతిని పొందుతాను. నా కొలునందు ప్రబంధ పరమేశ్వరుడు ఉండుట నాకెంతయో గర్వకారణము." వేమారెడ్డి సగర్వంగా నిండు పేరోలగంలో ప్రకటించాడు.
   అంతే కాదు..
   మహాకవిని కాళ్లు కడిగ సవినయంగా పూజించాడు. పన్నీరు చల్లాడు.
   ఆ నిండుసభలో వినమ్రుడై ఒక కోరిక కోరాడు.
   "కవివర్యా! నీవు సకల భాషా కవిత్వ విశారదుడవు. భవ్యుడవు. సౌమ్యుడవు. నువ్వంటే నాకు మెండు గౌరవం. హరివంశం భరత పరాంశమని పెద్దలు చెప్తారు. ఆ రమ్యమైన కథను తెలుగులో రచించి మాకు తెలుపు" అని అడిగాడు.
   అప్పుడు ఎర్రయగారు పులకించి ప్రోలయవిభుని విన్నపమును అంగీకరించారు.
   "నన్నయభట్టతిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం
    బెన్న బరాశరాత్మజమునీంద్రుని వాఙ్మయమాది దేవుడౌ
    వెన్నుని వృత్తమీవు కడు వేడుకతో విను నాయకుండ ని
    ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా.
   నా అభీష్టం కూడా నదే. కళ్యాణయుతమగు మహనీయ రచన హరివంశాన్ని తప్పక చెప్పెదను. అవధరింపుము."
   ఎర్రయగారి హరివంశ కావ్యావిర్భావానికి బీజం పడిందా విధంగా.
                           …………….
                               17
   "హరివంశం.."
   తన రచనలలో నాల్గవది.
   అరణ్యపర్వ భాగము రచించినప్పటి సందేహ సంకోచాలేమీ లేవు. వరుస కావ్య రచనలతో బాగుగా పరిణతి సాధించారు ఎర్రయప్రగడ.
   మూలకావ్య పఠనము, అనువాదము ఒకే సారి జరిగిపోయినవి. ఆలయమునకు వెళ్లి దర్శనము చేసికొనుట తప్ప, ఇతర కార్యములనుండి విశ్రాంతి తీసుకుంటున్న సూరన ఈ కావ్య రచనమున పూర్తిగా సహకరించారు.
   నకలు ప్రతిని కూడా వెనువెంటనే సిద్ధం చేసేశారు ఇరువురూ.
   సూరన పండితుని సహకారం ఉండుటతో  కావ్యం అనూహ్య వేగముగా సమాప్తి చేసి పరిపూర్ణులయ్యారు ఎర్రాప్రగడ..
   సూరనార్యుని ఆనందమునకు అవధిలేదు.
   ప్రోలయ వేమారెడ్డి కోరి వ్రాయించుకున్న ఈ కావ్యాన్ని తన పండిత సభలో విశ్లేషించవలసిదిగా తన ఆస్థాన కవిని వేడుకున్నారు.
 సూరనార్యుడు పుత్రోత్సాహముతో వేమయ ప్రభువును ఒక కోరిక కోరారు.
   "ఈ కావ్యాన్ని నేను వివరిస్తాను.. మీరు అనుమతిస్తే.."
   "ఆచార్యా! మహా ప్రసాదము. మాకు అంతకన్ననూ కావలసినది ఏమున్నది?"

   మంచి ముహుర్తము చూసి హరివంశ పఠనం.. విశ్లేషముతో కూడిన వివరణ ప్రారంభించారు.. ప్రోలయ వేమారెడ్డి సాహిత్య సభలో సూరనార్యుడు.
   ఆ సంగతి కర్ణాకర్ణిగా విన్న పండితులందరూ.. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి యే కాక, ప్రక్క రాజ్యముల నుండి కూడా అద్దంకికి విచ్చేశారు. వచ్చిన విద్యా వేద విశారదులందరికీ అనుకూలమైన విడిదులు, భోజన వసతి ఏర్పాటు చేశారు వేమయ ప్రభువు.
   అనేక సంవత్సరముల బోధనానుభవము, అనేకానేక కావ్యములు తన విద్యార్ధులకు, అరటిపండి వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల సామర్ధ్యము..  సూరనార్యునికీ పఠనము మంచినీరు త్రావినంత సులువు.
   వయసు మీరిననూ కంఠంలోని ఝుంకారము తగ్గలేదు ఆచార్యునికి.
   కంచు కంఠంతో.. వినాయక ప్రార్ధన చేసి ప్రారంభించారు సూరనార్యుడు.. ఎర్రాప్రగడ విరచిత హరివంశ ప్రబంధములోని కొన్ని ఘట్టములను మాత్రమే చెప్పదలచారు.
   "అన్ని ఘట్టములనూ వివరిస్తే మరి కావ్యము చదివే వారు ఉండరు. ఈ కావ్యమునకు అనేక నకళ్లు తయారవాలి.. తెలుగు వచ్చిన వారందరునూ ఒక ప్రతిని స్వంతం చేసుకోవాలి.. యుగయుగములకూ ఈ కావ్యము ప్రయాణము చేసి చిర స్థాయిగా నిలవాలి.
   అందువలననే కొద్దిగా రుచి మాత్రమే చూపుతాము.. ఆ అమృత ధారని ఆస్వాదించుట మొదలిడితే ఆగుటయే ఉండదు. అందరూ తలకొక ప్రతినీ తీసుకుని వెళతారు. నా ఆశయము నెరవేరినట్లె.."
   ప్రోలయ వేమారెడ్డి ప్రభువు నిండు పేరోలగములో చేసిన ప్రకటనకి సభ అంతయూ నవ్వులతో నిండి పోయింది.
   ఆ ఆహ్లాద వాతావరణంలో, సూది కింద పడితే వినిపించేటంతటి నిశ్శబ్దముగా నున్న ఆ సభలో కంఠం సవరించుకున్నారు సూరనార్యుడు.

   "హరివంశం భారతమునకు పరిశిష్టము.. అనగా శేషము.
   హరివంశము లేని భారతము అసంపూర్ణము.
   ఆదిపర్వమునుండీ స్వర్గారోహణ పర్వము వరకూ ఉన్నది భారతమైతే, హరివంశము కలిసినది మహాభారతము.
   అందుకే.. హరివంశం కూడా వివరిస్తేనే భారతాన్ని పూర్తిచేసిన ఫలితము దక్కుతుంది.
   ఈ గ్రంధం భారతమంతా ప్రాముఖ్యమైనది.. ప్రశస్తమైనది.
   ఎర్రయప్రగడ హరివంశాన్ని రెండు భాగములుగా రచించారు.. పర్వాలుగా విభజించ లేదు.
   పూర్వభాగము మొదటిది. ఉత్తరభాగము రెండవది.
   పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలలో రెండువేల నలభై నాలుగు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలలో రెండువేల ఆరువందల అరవై ఆరు గద్య పద్యాలున్నాయి.
   సంస్కృత హరివంశం మూల కావ్యంలో ఉన్న కథలన్నిటినీ వ్రాశారు. విస్తారంగా, వివరంగా, విపులంగా ఉంది ఎర్రన హరివంశం.


ఇది మరీమరీ వినాలనిపించే పురాణం.
   పూర్వభాగంలో నున్న కొన్ని కథలు మరలా ఉత్తరభాగంలో వ్రాశారు. కొన్ని విష్ణుమూర్తి అవతారాలు రెండు భాగాలలోనూ చెప్పారు.
   ఒక్క వామనావతారమే రెండువందల ఎనభైమూడు పద్యాలు ఉంది."
   సూరన కన్నకొడుకుని మన్ననతో సంబోధించుట కొందరు మామూలు ప్రేక్షకులకు విడ్డూరంగా అనిపించింది.
   సూక్ష్మగ్రాహి అయిన సూరన సభలో కలకలమునకు స్పందించి వివరణ ఇచ్చారు.
   "ఒకరి కావ్యమును.. రచనను గురించి చెప్పేటప్పుడు ఆ కవిని సరస్వతీ రూపుని వలే భావించాలి. అతడు కన్న కుమారుడైననూ సరే గౌరముగా చూడాలి."
   పండితులందరూ అవునన్నట్లు తలలనూపి సూరనార్యుని మెచ్చుకోలుగా చూశారు.
   "ఉత్తర భాగంలో ఎనిమిదవ ఆశ్వాసంతోనే హరివంశం అయిపోతుంది. ఉషా పరిణయం, వరుణుడితో రణం అయాక, శ్రీకృష్ణుడు ఇంద్రాది దేవతలతో ద్వారకకు రావడంతో కథ సమాప్తమవుతుంది. వైశంపాయనుడు ఫలశ్రుతి కూడా చెప్పేస్తాడు.
   మిగిలిన రెండు ఆశ్వాసాలు జనమేజయుని సంతానం గురించి చెప్తారు.
   వేదవ్యాసుడు, జనమే జయునికి భవిష్యత్తు గురించి చెప్పడం, జనమేజయుడు అశ్వమేధం చెయ్యడం ఉన్నాయి ఆ చివరి ఆశ్వాసాలలో.
   పూర్వ భాగంలో సంక్షిప్తంగా చెప్పిన అవతారాలని, వేదవ్యాసుడు జనమే జయుని కోరికపై, విస్తృతంగా చెప్తాడు.
   చివరగా మహా భారతాన్ని.. అంటే ఆదిపర్వం నుంచి హరివంశం దాక, నూరుపర్వాలని వింటే ఏ ఫలితాలు వస్తాయో వివరిస్తారు.
   హరివంశము భక్తితో విని, విన్నాక సరసఘృత శర్కరాయుత పరమాన్నములు, భక్ష్యపానములతో పరితుష్టులవాలని అంటారు ఎర్రన.
   కానీ హరివంశమే తేటతేట తియ్యని పదాలతో నోరుని అనుక్షణం తడుపుతూ ఉంటుంది. ఆ కావ్య పఠనమే లేదా శ్రవణమే చాలు.. నోరు తియ్యనగుటకు..
   ఇంక పంచభక్ష్య పరమాన్నములతో పని ఏమి?"
   సూరనార్యుని గంభీర కంఠస్వరమే వీనులలో అమృత ధారలొలికిస్తోంది. ఇంటిలోనికి అతిథులు రాగానే నోరు తియ్యన చేసిన ఇల్లాలి ఆదరణ పూర్వకమైన పలకరింపు తలపుకొచ్చింది సభాసదులకి ఆ ఉపోద్ఘాతము వినినంతనే.

                                       .....మంథా భానుమతి