Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?తారాబాయి షిండే (1850-1910)

 

తారాబాయి షిండే (1850-1910)

సూరత్ లో జరిగిన ఒక సంఘటన కలకలం రేపింది. బ్రాహ్మణ కులంలో ఒక విధవరాలు గర్భంతోటుందని ఊరంతా, రచ్చబండల దగ్గరా, నీళ్ళ బావుల దగ్గరా ఆడా మగా అంతా గుస గుసలు. ఇది విన్న ఒక పోలీసు వాళ్ళింటికి అసలు విషయం కనుక్కోవడానికి వెళ్తాడు. మొదటనిపించింది, పోలీసుకేం సంబంధం, అవసరం అని. కానీ చూడండి ఇతను వెళ్ళి విషయం కనుక్కుంటే అది నిజమని తేలుతుంది. ఆమె ఒక 24 ఏళ్ళ విజయలక్ష్మి అనే విధవరాలు. రహస్యం బట్టబయలవుతుంది. కొన్నాళ్ళ తరవాత చెత్త కుప్పలో గొంతు కోసి చంపేసిన శిశువు. మళ్ళీ పోలీసు విచారణ మొదలవుతుంది. కేసు పెట్టి విజయలక్ష్మిని కోర్ట్ లో హాజరు పరుస్తారు. ఆమె తన నేరం ఒప్పుకుంటుంది. సమాజానికి భయపడి విధవ అయిన తను బిడ్డని సాకలేదు కాబట్టి పనిమనిషి సాయంతో బిడ్డను చంపేసానని. మొదట ఆమెకి మరణ శిక్ష విధించినా, తరవాత ఆజన్మ కారాగార శిక్షగా మారుస్తారు. న్యాయం పేరిట ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందో చూడండి. తమకు పెళ్ళి జరిగిందని, భర్త చనిపోయాడనీ కూడా తీలియని వయసులో జరిగిన విషయాలు, తల్లో, తండ్రో నువ్విప్పుడు విధవవి అని చెప్తే గాని తెలియని పసిపిల్లలకి గుండు చేసి, తెల్ల చీర కట్టి, వారిని ఇళ్ళనే జైళ్ళలో బంధించి, చప్పిడి కూడు పెట్టి, గాడిద చాకిరి చేయించిన సమాజంలో, వీరికి పురుషుల సానుభూతే కాదు పునిస్త్రీల సానుభూతి కూడా లేదు. వీరికి పిల్లలు కూడా పుట్టి ఉంటే వాళ్ళు కూడా సెకండ్ క్లాస్ సిటిజన్సే ఆ ఇంట్లో. ఎంతో సంచలనం సృష్టించిన విజయలక్ష్మి కేసులో సమాజం కేవలం శిశు హత్య గురించి మాత్రమే బాధ పడుతున్నట్లు తోస్తుంది. ఆమె గర్భానికి కారణమైన వాడి మీద కేసులేదు, నింద లేదు, అపవాదులేదు. ఒక యుక్తవయసులో ఉన్న విధవ ఇంట్లో ఎప్పటికీ ఒక థ్రెట్ కుటుంబ పరువు ప్రతిష్టలకి. పూర్తిగా తనది కాని తప్పుకి ఆడది శిక్షింపబడుతుంది. మగాడూ, సమాజం ఎటువంటి బాధ్యతా లేకుండా తప్పించుకుంటాయి ఎప్పటిలాగే. ఏకపక్ష పురుష పక్షపాత నిబంధనల్లో స్త్రీల వ్యక్తిత్వాన్నీ, జీవితాల్నీ, నిలువునా పాతిపెట్టే పురుష స్వామ్య సమాజంలో ఒక స్త్రీ తన సహజ లైంగిక వాంఛలని అణిచివేసుకుని, తనను, తనమీద కన్నేసే వెధవల బారినుండి, ఇంట్లోనూ బయటా అనుక్షణం తన శీలాన్ని కాపాడుకోవాల్సిందే. కేవలం చాకిరీ లోనూ, బానిస బ్రతుకులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ చచ్చేవరకూ తనను తాను బ్రతికించుకోవాల్సిందే. సమాజ ఆరోగ్యం మొత్తం ఆడవారి భుజస్కంధాలపైన పడేసి, తను మాత్రం బాధ్యతారహితంగా తప్పించుకుని తిరిగాడు మగాడు.

ఈ విషయం మనల్ని బాధించినట్లే తారాబాయి షిండేని కూడా బాధిస్తుంది. ఈ సంఘటన, కేసు విచారణ జరిగిన తీరుకి స్పందిస్తూ తారబాయి రాసిన "స్త్రీ పురుష్ తులనా" మరాఠీ, "A comparison between men and women" english లో సుమారు 50 పేజీల వ్యాసం 19th Centuryలో India లో మొట్టమొదటి సంపూర్ణ స్త్రీవాద రచనగా పేరు పడ్డది. 500 కాపీలతో ముద్రించబడిన ఈ రచనకి సహజంగానే ఎటువంటి స్పందనా రాలేదు. ఆ తరవాతెప్పుడో తవ్వకాల్లో బయటపడిన ఈ రచన మళ్ళీ వందేళ్ళ తరవాత వెలుగులోకి వచ్చింది.

ఈమె రాసిన వ్యాసం గురించి చదివే ముందు ఆమె జీవిత విశేశాలు తెలుసుకుందాము. తండ్రి బాపూజీ హరి షిండే చదువుకున్నవాడు, అభ్యుదయ భావాలున్నవాడు. తారాబాయికి, మరాఠీ, ఇంగ్లీష్, సంస్కృతం నేర్పిస్తాడు. జ్యొతీ రావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఫౌండింగ్ మెంబర్గా చురుకైన పాత్ర పోషించిన వాడు. అంటరానితనానికి, కులవ్యవస్థకీ, ఉన్నతకులాల దోపిడీకి వ్యతిరేకంగానూ, స్త్రీ విద్య, వితంతు వివాహాల కోసం పనిచేసినవాడు. తారాబాయి కూడా, జ్యోతీ రావు ఫూలే, సావిత్రీ బాయి ఫూలేలతో బాటుగా సమాజోద్ధరణకి పని చేసింది. జ్యోతీ రావు ఫూలే మొట్ట మోదటగా 1848 లో కేవలం ఆడపిల్లల కోసం స్థాపించిన స్కూల్ నడపటానికి సాయం చేస్తుంది.

ఆడవారి దుస్తితిని వివరిస్తూ, ఓపికగా తన పుస్తకం చదవమని, సానుభూతితో ఆడవాళ్ళ దుఖాల్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్తుంది. తను కులాల గురించి కానీ, ధనిక పేద వర్గాల గురించి కానీ ప్రస్తావించట్లేదనీ, కేవలం స్త్రీ పురుషుల మధ్య సమాజం చూపే భేద భావాల్ని మాత్రమే ఎత్తి చూపుతున్నానని చెప్తుంది. ఆమె రచనలో ఆడవారి వెనుకబాటుతనానికి కారణమైన పురుషాధిక్య భావాల్నీ, పితృస్వామ్య సమాజ రీతుల్నీ, స్త్రీల జీవితాల్ని కట్టిపడేసే పురాణాల్నీ, శాస్త్రాల్నీ, వాటిని రాసిన వారి హక్కుల్నీ ప్రశ్నిస్తుంది. మూలాల్నన్నిటినీ శోధించి, అన్వేషించి, కారణాలు ఎత్తి చూపుతుంది. 18వ శతాబ్దం వరకూ ముక్తాబాయి, బహినా బాయి, జానాబాయి, కన్ హోపాత్రా లాంటి స్త్రీలు కేవలం భక్తి మార్గంలోనే వారికి జరుగుతున్న అన్యాయాలకీ, కష్టాలకీ, దుఖానికీ సాంత్వన వెతుక్కున్నారు. కానీ ఈమె చేసింది అసలైన స్త్రీవాద ఉద్యమం. ఈనాటి భావాలకీ అద్దం పట్టే తిరుగుబాటు.

నిజానికి ఆమె రచనా శైలి అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ ఆమె మాటల్లో ఆమె రచన ఎంత కూలంకషంగా ఆడవాళ్ళ ప్రతి చిన్న సమస్యకూ ఎలా స్పందిస్తుందో చూడండి. అలాగే ఆరోజుల్లో సమాజాన్ని ధిక్కరిస్తూ సాగే ఆమె రచన చాలా పదునుగా, నిర్వివాదంగా, మగవారు సమాధానం లేక ఏ కొంగు చాటునో దాక్కొనే పరిస్తితిని ఆమె కల్పిస్తుంది. విజయలక్ష్మి లాంటి విధవలకి అసలు ఆ నిస్సహాయ స్తితి ఎందుకు కలిగిందో కారణాలను వివరిస్తుంది. భారత దేశంలో విగ్రహ రూపంలో దేవతగా పూజింపబడే స్త్రీకి, రక్షించే దేవతకి, వరాలిచ్చి కాపాడే దేవతకి, ప్రాణంతో, శరీరంతో ఉంటే, పుట్టినప్పట్నుంచి మగవాడి వల్ల దుర్భరమయ్యే బ్రతుకు, మగవాడినుంచి కాపాడాల్సి ఉండే పరిస్తితి, ఎందుకని ప్రశ్నిస్తుంది. పాలకులుగా, న్యాయ వ్యవస్థలోను, పత్రికా ప్రపంచంలోనూ, విద్యావేత్తలుగాను, పండితులుగానూ, సమాజాన్ని సద్గతిలో నడిపించే శాశనాల్ని రాసే వారిగానూ పురుషులు ఆదినుంచి సగభాగమైన స్త్రీని ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నిస్తుంది.

ఆమె మాటల్లోనే చెప్పాలంటే :

“ఓ మూర్ఖులారా, ఆడవాళ్ళు సుకుమారులు, బిడియస్తులు, సహజంగా చంచల స్వభావులు. మీరు ధీరులు, తెలివైవ వారు, పండితులు. అందుకేనా ఇంకా పుట్టి అమ్మ పాలైనా కుడవక ముందే ఆడవాళ్ళని రకరకాలుగా ఈసడిస్తున్నారు. మీరు బలవంతులైనంత మాత్రాన, ఆడవారిని అడ్డమైన పేర్లతో అవమానించడం ఒప్పవుతుందా? మీరు మాత్రం పేరుకు ముందు శ్రీ,, శ్రీమాన్, సర్ అని చేర్చుకుంటున్నారే. చిన్నప్పట్నుంచి, ఆడవారి మీద సర్వ హక్కుల్నీ మీ చతుల్లో పెట్టుకుంటారే. ఆడవారిని పరదాలోనో, నోరు మూయించో ఇంట్లో చీకటి కొట్లల్లో బంధించి, భయపెట్టి, బానిసల్లా చూస్తున్నారే. చదువు ఆడవారికి కాదు. వారు మీలాగా, స్వేఛ్చగా తిరుగలేరు. తిరిగినా వారు కలిసే స్త్రీలనుంచి వారు పొందే జ్ఞానం ఏముంది? జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు, వారికి జ్ఞానం ఎలా పెరుగుతుంది?

మీ పెద్దల పెద్దలు ఎవరైనా, ఏమైనా ౠజువు తేగలరా, దేముడు వారికి భర్తకంటే ముందే చనిపోవడం మంచిదని చెప్పినట్టు? ఎవరు ఎంత కాలం బ్రతకాలో, ఎంత కాలం బ్రతుకుతారో ఎవరి చేతుల్లో ఉంది? ఆ నారాయణుడి చేతుల్లో తప్ప. రాజైనా యముడి పిలుపు రాగానే అన్నీ అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నా, రాజ్య భారాన్ని మోస్తూ బాధ పడుతున్నా, వెళ్ళవలసిందే కదా. ఒక అబల అయిన ఆడదాని మాట యముడు వింటాడా? బ్రహ్మ రాతని ఆడది మార్చగలదా? ఏ ఆడదీ రెండో సారి పెళ్ళి చేసుకోడానికి వీలు లేదు కదా ఒక సారి భర్త పోతే. ఒక్క సావిత్రి తప్ప ఎవరూ యముడితో పోరాడి భర్తని తిరిగి పొందలేదు. భార్యగా తన అయిదవతనాన్ని నిలుపుకోలేదు. ఎవరూ పొగిడే వారు లేకపోతే, నన్ను నేనే పొగుడు కుంటానన్న సామెతలాగా, మీరెప్పుడూ వీరులే, తిని కూర్చోవడంలో. పురుషులంతా పండితులో, విద్వత్తు కల్గిన వారో అయితే, మీలో ప్రేమా కరుణా ఎందుకు లేవు, సాటి మనుషులైన స్త్రీల మీద. అడవిలోని పులులకీ సిమ్హాలకీ మీరు అప్పించుంటారు మీ కరుణంతా. మీ ప్రాణం మీకు తీపయినట్టు, స్త్రీకి మాత్రం తన ప్రాణం తీపి కాదా? ఆమె జీవితం మీకు ఈగలాగా, దోమలాగా కనిపిస్తుందా? మొగుడు పోయిన ఆడదాన్ని మట్టితో తుప్పుతో తయారు చేస్తే మిమ్మల్ని స్వఛ్చమైన బంగారంతో తయారు చేసాడా? మొగుడు పోగానే ఆమె అందమైన శిరోజాల్ని, ఆభరణాల్ని తీసేస్తారు మీ కళ్ళు చల్లబడటంకోసం. అంతే అప్పట్నుంచి ఆమె ఎవరిదీ కాదు. మూలన ఒక పనికిరాని పాత కుండ మాత్రమే. ఆమె ఇక ఏ శుభకార్యాలకూ వెళ్ళకూడదు. ఆమె ముఖం చూడటమే ఒక అపశకునం పాపం. ఆమె ఏమైనా చంపిందా మొగుణ్ణి? దేముణ్ణి ప్రార్ధించిందా మొగుణ్ణి తీస్కుపొమ్మని? నిజంగా మొగుడు పెట్టే నరకం భరించలేకపోయినా ఆమె ఆ పని చెయ్యలేదు, ఎందుకంటే, ఇది ఇంకా ఘోరమైన నరకం.

మగాడెందుకు వెంటనే పెళ్ళి చేసుకుని ఆనందంగా జీవితం గడుపుతాడు? శాస్త్రాలు రాసిన వాళ్ళు వాళ్ళ ఆగ్రహాన్నంతా ఆడవారిమీదే ఎందుకు చూపెట్టారు? ఏ స్త్రీ అయినా వారిని పీడించినట్లయితే, మొత్తం స్త్రీ జాతిమీదే కక్ష కడతారా? ఇవే నిబంధనలు మగవారికి కూడా ఉన్నట్లయితే అది వేరు. భార్య పోయిన మగాడిని కూడా సంఘం వెలివేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటివి మగాళ్ళకి పెట్టకపోవడం వల్ల పురుషులు వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకున్నట్టవలేదా?

మగవాడిగా పుట్టడమే అదృష్టం. డబ్బు కూడా ఉంటే ఇంక వాడి సుఖానికి ఢోకా ఉండదు. ఎనభై ఏళ్ళొచ్చినా, మీసాలకి రంగేసుకుని, పెట్టుడు పళ్ళు పెట్టుకుని, నిటారుగా నిలబడ్డానికి కర్ర పట్టుకుని కోటు వేసుకుని పైపంచ వేసుకుని పెళ్ళికి సిద్ధ పడి, ఒక చిన్న పిల్లని పెళ్ళిచేసుకున్నాక చావు వస్తే, ఆ పిల్ల మళ్ళీ విధవగా జీవితాంతం బతకాల్సిందే కదా? మగాడిలాగా ఆమె చెయ్యగలదా? జీవితాంతం మొగుడి గుణ గణాలను మెచ్చుకుంటూ ఇంట్లో మిగిలిన వారందరికీ బానిసగా చచ్చే వరకూ బతకాల్సిందే.

మొగుడు చావు బతుకుల్లో ఉంటే అతడిని బతికించుకోడానికి ఎంతో తపనపడి, సేవలు చేసి బ్రతికించుకోవాలని చూస్తుంది. అదే ఆమె మంచం పడితే మొగుడు ఎప్పుడు పోతుంది అని చూస్తాడు. ఆమె బాధ్యతని చచ్చే వరకూ వదలటానికి లేదు. అదే మగాడికి జీవితం విసుగనిపిస్తే, శాస్త్రోక్తంగా ముహూర్తం చూసుకుని మరీ సన్యాసం పుచ్చుకోవచ్చు.”

అంటరాని కులాల ఆడపిల్లల స్కూల్ ఆమె నడిపింది. ఉన్నత కులాల అనాధ విధవ స్త్రీల కోసం ఒక ఆశ్రమం నడిపింది. మొత్తానికి తను కూడా ఒక విధవ అయి ఉండి, సాటివారిని కష్టాల్లో ఆదుకోడానికి, వారిలో వారి పరిస్తితుల పట్ల సరైన అవగాహన ఏర్పడటానికి కృషిచేసింది. ఆమెకి ఎటువంటి ఎవార్డ్సూ రాలేదు. ఆమె చేసిన కృషికి ఎవార్డ్సిచ్చి సత్కరించే సమాజం కాదు అప్పటి పురుషాధిక్య సమాజం. అలాగే ఆమె ఏ ఇతర రచనలూ చేయలేదు. కేవలం తండ్రి అభ్యుదయ భావాల కారణంగా ఆమెకు ఆమాత్రం వెసులుబాటు కలిగింది. ఏమైనా ఒక రచయిత్రినే కాదు, ఒక గొప్ప ఆదర్శానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని పరిచయం చేసినందుకు సంతోషంగా ఉంది.

పితృస్వామ్య సమాజం స్త్రీకి తయారు చేసిన ఒక ఆదర్శ పతివ్రతా ధర్మం, పతివ్రతా లక్షణాలు, ఏంటంటే, పరిమితి లేని సహనం, ఓర్పూ, క్షమా, దయా, సేవా భావం అనడం కన్న బానిస మనస్తత్వం అంటే బాగుంటుంది, ఎదురుతిరగకూడని బలహీనతను ఓర్పుగా చిత్రించి ఈ లక్షణాలు ఉన్న ఆడవాళ్ళే పతివ్రతలని నమ్మించి, అలాంటి స్త్రీలను పురాణ గాధల్లో సృష్టించి, వారిని పూజనీయులుగా చేసి, యుగ యుగాలుగా మోసం చేస్తూ వచ్చింది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీలకు వోటు హక్కు, ఉన్నత విద్యావకాశాలు 19వ శతాబ్దంలోనే వచ్చాయంటే, మతంతో, సంస్కృతి తో సంబంధం లేకుండా మగవాడెప్పుడూ ఆడదాన్ని డోర్మాట్ లాగే వాడుకున్నాడన్న విషయం ఋజువవుతుంది. ఏవో కొన్ని సంస్కారవంతమైన కుటుంబాల్లో తప్పించి, ధనిక పేద తేడాల్లేకుండా, కుటుంబంలోనే ఆడవారికి వివక్ష, పోరాటం తప్పట్లేదు.

ఈ సందర్భంలో ఇంకొక విషయం మీతో పంచుకోవాలనిపిస్తోంది. వాటర్ సినిమా తీసిన దీపా మెహ్తా ఇదే ఇతివృత్తాన్ని చూపెట్టే ప్రయత్నం చేసింది. అందులో హీరో ఒక విధవతో (పెళ్ళయినట్టుగా కూడా గుర్తులేని ఎనిమిదేళ్ళ బాలిక ఇంట్లోంచి పారిపోయి వారణాసిలోని ఒక విధవాశ్రమంలో చేరుతుంది. అక్కడ జరిగిన కధే ఈ సినిమా) ప్రేమలో పడతాడు. ఈ సినిమా తీస్తున్నందుకు వచ్చిన వ్యతిరేకతకి, ఆమె ప్రాణానికి వచ్చిన బెదిరింపుల వల్ల ఆమె లొకేషన్ శ్రీ,లంకకు మార్చి సినిమా తీసింది. దీనికి పదిహేను ఎవార్డ్సూ పదకొండు నామినేషన్సూ వచ్చాయి.

అదే సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఇంకొక నటి, రాజ్యసభ సభ్యురాలు, హేమ మాలిని ఈ రకంగా మధురలో తమ జీవితం దుర్భర పరిస్తితుల్లో గడుపుతున్న విధవ స్త్రీల గురించి నిరసనగా మాట్లాడి వివాదంలో పడింది.

వచ్చే వారం ఇంకొక రచయిత్రి పరిచయంతో కలుద్దాం.


Sivapurapu Sharada