Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? కుర్రతుల్ ఐన్ హైదర్



మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?


కుర్రతుల్ ఐన్ హైదర్

 

 


కుర్రతుల్ ఐన్ హైదర్ అలీగర్ సాహిత్య అకాడమీ ఇంకా జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత, ఉత్తర్ ప్రదేశ్ లో పుట్టింది. తల్లి తంద్రులిద్దరూ కూడా రచయితలే. ఆమె ఒక నవలా రచయిత్రి, జర్నలిస్ట్. ఆమె ముప్ఫై దాకా నవలలు, కధా సంకలనాలు, ఇంకా ఇతర రచనలూ చేసారు. విషయం ఏంటంటే ఉర్దూలో ఇంకా కవిత్వమే రాజ్యం చేస్తున్నపుడు ఆమె, కధలూ, నవలా సాహిత్యం రాసింది. ఆమెను "Grand Dame of Urdu Literature” అంటారట. ఈమె పార్టిషన్ టైములో పాకిస్తాన్ వెళ్ళింది కాని తరవాత అక్కడ్నుంచి, ఇంగ్లాండ్ కి ఆతరవాత తిరిగి ఇండియాలో స్థిరపడింది. ఇక ఆమె కొచ్చిన ఎవార్డ్స్ విషయానికొస్తే చాలా పెద్ద లిస్టే.

Sahitya Academy Award in 1967
Soviet Land Nehru Award 1969
Ghalib Award in 1985
JnanpeeTh Award in 1989 for Akire Shah ke hamsafar
Saahitya Academy Fellowship in 1994
Bahadur Shah Zafar Award in 2000
Padmasree by Goverment in 1984
Padma Bhushan in 2005


ఆమె Managing Editor గా Imprint Magazine, Bombay లోనూ, Member of Editorial Staff గా Illustrated Weekly of India లోనూ పనిచేసారు. ఆమె రచనలు ఎన్నో ఇంగ్లీష్ లోకీ, ఇతర భాషల్లోకీ అనువదించపడ్డాయి.
Guest Lecturer to University of California, Wisconcin, Arizona ఇంకా Visiting Professor, Urdu, Aligarh Muslim University లోనూ పనిచేసారు.

హైదర్ రాసిన నవలల్లో మాగ్నం ఓపస్ గా భావించబడే నవల ఆగ్ కా దరియా (The River of Fire in English) అనేది అతి పెద్ద నవల. ఈ నవల రెండు వేల ఏళ్ళ చరిత్రలో జరిగిన సాంస్కృతిక, విప్లవాత్మక మార్పుల నేపధ్యంలో తిరిగి తిరిగి ఇంచు మించు అవే పేర్లతో పుట్టే తన ముఖ్య పాత్రల జీవితాల్లోని, మనసుల్లోని సంఘర్షణల్నీ, దైనందిన జీవితాల్నీ , సమాజంలోని మార్పుల్నీ అనుసంధానం చేసుకుంటూ సాగుతుంది. ముందు నుంచీ ఉన్న హిందుత్వం, బయటనించీ వచ్చిన ఇస్లామ్నీ, కొత్తగా పుట్టిన బౌద్ధాన్నీ, ఇంకా ఎప్పటికప్పుడు మారుతూ వస్తూన్న భక్తి తత్వాల్నీ, సూఫీ తత్వాన్నీ ఆకళింపు చేసుకుంటూ, తమ తమ ఆచార వ్యవహారాల్లో ప్రజలు ఎలా వాటిని కలుపుకుంటూ భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధించారో, ఇన్ని విభిన్న సంస్కృతుల్లో, సముద్రంలో నీటి చుక్కల్లా ఎలా కలిసిపోయారో చెబుతుంది. తమవి కాని ఆచార వ్యవహారాలు, జీవన విధానాల పట్ల ఇక్కడి ప్రజలు అతి సహజంగా ఒక టాలరెన్స్, సహనం కలిగి ఉన్నారు. ఈ టాలరెన్స్ మాత్రమే దేశాన్ని ఛిన్నా భిన్నం కాకుండా కాపాడుతూ వస్తున్న ఒక మౌలిక ప్రాతిపదిక. ఆమె మాట్లాడుతున్నది, ఇప్పటి పాకిస్తాను, బంగ్లాదేశ్ కొంత ఆఫ్గనిస్తాను వరకూ విస్తరించి ఉన్న భారత దేశం. అయితే ఈ మౌలిక ప్రాతిపదికకు భంగం కలిగించే విధంగా దేశాన్ని, మతం పేరిట, భాష పేరిట ముక్కలు చేసారు.

మౌర్యుల పాలననుంచి, మొఘల్ పాలన, తరవాత ఆంగ్లేయుల పాలన, స్వతంత్రం అనంతరం పాలకుల నుంచి సాధారణ ప్రజలుగా మారి ముస్లింలు దేశ విభజన తరవాత మైనారిటీగా మిగిలి తమ అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న పరిస్తితులను వివరిస్తూ ఈ నవల సాగుతుంది. శతాబ్దాలుగా భిన్న సంస్కృతుల ప్రజలు అత్యంత శాంతియుతంగా సంస్కృతుల్లో పరస్పరంగా మార్పులు చేసుకుంటూ వస్తూ, కొన్ని కొన్ని ఆచారాలు ప్రధమంగా ఎవరు పాటించినవో తెలియనంతగా మారి సహజీవనం చేసిన దేశం ఇది. ఇక్కడ ఏ వొక్క మతం అన్ని ప్రశ్నలకీ సమాధానం ఇవ్వలేదు. మతం ఇచ్చిన అస్తిత్వాన్నీ, గుర్తింపునూ ఎవ్వరూ వదులుకోరు. నిజానికి ఎవరి మతం ఎవ్వరూ వదులుకోవక్కరలేదు. నిజంగా దేవుడే ఉన్నట్లయితే, ఇన్ని మతాలకు వేరు వేరుగా అయితే ఉండడు. కేవలం ఆ విశ్వాశాన్ని ప్రకటించే పద్ధతులే భిన్నమైనవి. ఈ భిన్నత్వాన్ని అర్ధం చేసుకుని గౌరవిస్తూ శాంతియుత సహజీవనం చెయ్యడమొకటే మార్గం.

కులాతీత సమాజాన్ని కోరుతున్నామనే వారెవరూ కూడా వారికి కులం ఇచ్చిన గుర్తింపును వదులుకోడానికి సిద్ధంగా లేరు. కులమేదైనా మతమేదైనా, మానవత్వం, వేరే కులం, మతం పట్ల టాలరెన్స్, గౌరవం ఉన్న నేపధ్యంలో ఇన్ని గొడవలు జరిగే అవకాశం లేదు. తేనె పట్టులో తేనెటీగలు విడి విడిగా తమ తమ గదుల్లో ఉంటూ తేనె సేకరించి ఎలా దాస్తాయో అలా తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూనే కలిసి బ్రతకాలంటుంది. భేద భావాలు లేకుండా అన్ని మతాల్లోంచీ, అన్ని తత్వాల్లోంచీ కావల్సిన సమాధానాలు వెతుక్కోవాల్సిందే. హిందూ వేదాంతం లోంచి, బౌద్ధ మత సిద్ధాంతం నుంచి, సూఫీ తత్వం, భక్తి తత్వాలన్నిటినీ కలిపి చూసినపుడు మాత్రమే శాంతియుత సహజీవనానికి అవసరమైన టాలరెన్స్ ఎలా రావాలో అర్ధమౌతుంది.

మతప్రాదిపదిక మీద దేశాన్ని విభజించి (మొదట అంగ్లేయులు చేస్తే, తరవాత భాషా ప్రాతిపదిక మీద మనమే రాష్త్రాల విభజన చేసుకున్నాం) , సరిహద్దులు గీసి వీరు వేరు, వారు వేరు అని చెప్పాకా, అన్ని మతాలనీ సమానంగానే చూసే రాజ్యాంగంకి Secularism అని పేరు పెట్టడం ఎంత వరకూ సబబు? ఈ రకమైన Nationalism (with borders defined and with belief in separatism) ఇంతవరకూ అందర్నీ కట్టి ఉంచిన Pluralism అనే సూత్రానికి వ్యతిరేకం కాదా అని ఆవిడ వాదన.

సెక్యులరిజం ముసుగులో జరిగే ఈ విభజన విద్వేషాలను రెచ్చగొట్టడంలోనే సఫలీకృతమయ్యింది. దేశం బాబ్రి మసీదు కూలగొట్టడాన్నీ, గుజరాత్ అల్లర్లనూ ఎన్నింటినో చూసింది, తట్టుకుని నిలబడింది. గజనీ దండయాత్రల్నీ, ధ్వంసమైన ఆలయాల్నీ, దోచుకోబడిన సంపదనీ తట్టుకుంది సహించింది. అయితే ప్రజల్లో ఉన్న సంఘీ భావం కుటిల రాజకీయానికి లేదు. అందుకనే, ఇంకా విభజించి పాలించడమనే నీతి సూత్రాన్ని పాటిస్తోంది.

ఒరిజినల్ గా ఉర్దూలో రాసిన ఈ నవల, కంటెంట్ కే కాదు, భాషకు కూడా అంతే పేరు తెచ్చుకుంది. అంత చక్కటి ఉర్దూ ఆమె ఉన్న రోజుల్లో రాయడం విశేషమేనట. ఈ నవలని One Hundred Years of Solitude by Gabriel Garcia Marquez, Columbian author తో కంపేర్ చేస్తారు. ఎందుకంటే రెండూ కూడా ద పాస్ట్ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అన్న మెయిన్ థీం మీదే సాగుతాయి. రెండిటిలోనూ ఎప్పటికీ పారుతున్న నది అవిచ్చిన్నంగా సాగే జీవన సరళికి సింబాలిక్ గా ఉంటుంది. మనుషులు మళ్ళీ మళ్ళీ పుట్టడం, మారుతున్న పరిస్తితులతో నిరంతరంగా మార్పు చెందుతున్నా కూడా అంతర్గతంగా అన్నిటినీ బంధించి ఉంచే మారని ఒకటేదో నవ లల్లో ముఖ్య అంశంగా ఉంటుంది.

అయితే సాధారణ ప్రజా జీవితాలు భిన్న సిద్ధాంతాల వల్ల ఎలా ప్రభావితమయ్యాయన్నదాన్నీ, ఈ సాధారణ ప్రజల దృష్టి కోణం నుంచి నిరు పేదల జీవితాలెలా ప్రభావితమౌతూ వచ్చాయన్నదాన్ని ఎంతో నిశితంగా ఈ నవల చర్చించిన విధానం దీన్ని One Hundred Years of Solitude కన్నా గొప్ప నవల చేసిందని పాఠకుల అభిప్రాయం. వ్యక్తిగతానుభవాలనుంచి స్త్రీల పరిస్తితుల పట్ల అవేదనతో రాయడం కాకుండా, రెండు వేల ఏళ్ళ చరిత్రలో జరుగుతూ వస్తున్న దాన్ని దేశ ప్రజల జీవితాల్నీ సమాంతరంగా వర్ణిస్తూ ఈ నవలని రాయడం ఆమె అసాధారణ ప్రజ్ఞనీ, మేధస్సు నీ సూచిస్తుంది. ఏరకంగా చూసినా ఇది చరిత్ర అంటే కొంత ఇష్టం, అవగాహన ఉన్న ప్రతి పాఠకుడూ చదవాల్సిన ఒక గొప్ప నవలగా అభివర్ణింపబడింది.

నిషేధాల, నిరోధాల పరదాలనుంచి బయటికి వస్తే ఆడవాళ్ళు తమ ప్రతిభను, అలోచనా విధానాన్నీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలా మలుచుకోగలరో చూపటానికి హైదర్ జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. వచ్చే వారం ఇంకొక గొప్ప రచయిత్రి పరిచయంతో కలుద్దాం.

 

 

 

 

 

 

......Sivapurapu Sharada