Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? జహనారా ఇమామ్

 

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?

 

జహనారా ఇమామ్

 


 

హనారా ఇమామ్ గురించి చదివాకా శతాబ్దాల వెనకటి రచయిత్రులని వెతికే పని పక్కనబెట్టి ఈమె గురించి తెలుసుకోవాలి అందరూ అని అనిపించింది. అసలు ఈమె గొప్పదనం ఏంటో కూడా తెలుసుకుందాం. ముషిదాబాద్ వెస్ట్ బెంగాల్లో ఈమె పుట్టింది. పార్టిషన్ తరవాత ఈస్ట్ పాకిస్తాన్ లోకి వచ్చింది వీళ్ళు ఉన్న చోటు. ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లా culture influence ఎక్కువ. అది పాకిస్తాన్ కు నచ్చని విషయం. అందువల్ల తన ప్రజలమీదే అణిచివేత చర్యలు. స్వతంత్రం వచ్చిన తరవాతి పరిస్తితి ఇది ఈస్ట్ పాకిస్తాన్ లో. ఈ రాజకీయ నేపధ్యంలోనే ఈమె వైవాహిక జీవితం , ఇద్దరు మగపిల్లలు వారి యుక్త వయసు వచ్చే వరకూ నడుస్తూ వచ్చింది.

ఈమె ఒక well-to-do middle class అమ్మాయి. తండ్రి సివిల్ సర్వెంట్. చదువులో ఈమె చురుకుదనం చూసిన తండ్రి ఆమె చదువుకు ఎట్టి ఆటంకాలనూ లెక్క చేయలేదు. ఆ రోజుల్లో ముస్లిం అమ్మాయిలు చదువుకోవటం సమాజం అంతగా హర్షించే విషయం కాదు. చదువు తరవాత టీచర్ గా ఉద్యొగంలో చేరింది. పెళ్ళి తరవాత ధాకా లో స్థిరపడింది. అక్కడ మళ్ళా సిద్ధేశ్వరి గల్స్ స్కూల్ లో హెడ్ మిస్ట్రెస్ గా చేరింది. అక్కడ ఆమె కార్యశీలత ఆ స్కూల్ని ధాకాలో ఉన్న ఉత్తమ పాఠశాలల్లో ఒకటిగా నిలబెట్టింది. విద్యారంగంలోనే ఆమె కృషి అంతానూ. తను చదువుకు ఎదుర్కొన్న సమాజ వ్యతిరేకత ఆమెకి ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో తెలుసుకునేలా చేసింది. ఆమె ఎన్నో రచనలు బెంగాలిలో చేసింది. ఎన్నొ పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి బెంగాలిలోకి అనువదించింది. ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసింది.

1971 లో బంగ్లా ఉద్యమం ఊపందుకుంది. పాకిస్తాన్ నుంచి బంగ్లా ప్రజలు విడిపోదల్చుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించి తిరిగుబాటు జెండా ఎగరేసారు ప్రజలు. ఆ సమయంలో జహనార ఇంటిపై కూడా నల్ల జెండా ఎగురుతూ ఉండేదట. ఆమె కుటుంబ సభ్యులందరికీ పాకిస్తాన్ నుంచి విడిపోవాలి, బంగ్లాదేష్ కి స్వేఛ్చ కావాలన్న విషయంపై ఏకాభిప్రాయం. పధెనిమిదేళ్ళ పెద్ద కొడుకు రూమి ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించాడు. పాక్ ఆర్మీ పై తిరిగుబాటు దాడులు గొరిల్లా వార్ పద్ధతిలో చేసే వాడు. అతనికి ఇంట్లో వాళ్ళ పూర్తి మద్దతు ఉండేది. కొడుకుని పాక్ ఆర్మి కళ్ళ నుంచి దాచడానికి రహస్యంగా ఇంట్లో దాక్కున్నపుడు ఆమె చాలా అవస్థ పడేదట, ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం. కానీ అక్కడ ఈమె కుటుంబం ఒకటే కాదు, అన్ని కుటుంబాల్లోని యువకులూ ఉద్యమంలో పాల్గొనేవాళ్ళే. కర్ఫ్యూ విధించినపుడు వీధుల్లో ప్రజలు వేలకు వేలు తిరుగుబాటు జెండాలతో marches చేస్తుంటే, స్వాతంత్రం కావాలన్న నినాదాలతో ఆ ప్రాంతాలన్నీ మార్మోగిపోయేవట. ఆర్మీ కాల్పుల్నీ, పోతున్న ప్రాణాల్నీ కూడా లెక్క చేయకుండా ప్రజలు కర్ఫ్యూ ప్రాంతాల్లో పాక్ ధిక్కార నినాదాలు చేసేవారట.

ఉద్యమంలో జరిగే రోజువారీ సంఘటనలను, ఆమె తన డైరీలో రాసేది. అయితే దీని అందం ఏంటంటే ఇంట్లో మంచం పట్టిన మామగారికి సమయానికి టీ, టిఫిన్ ఏర్పాట్లు చేయడం నుంచి బయట కర్ఫ్యూ లో ప్రజల ఇక్కట్ట్లు, జరిగే సమావేశాలు వాటి సమాచారాలతో సహా, తన కొడుకు సమయానికి ఇంటికి రానప్పుడు ఆమె పడే వేదన, బయట పరిస్తితి తెలుసుకోవటానికి ఆమె తన స్నేహితులకు ఫోన్ చేస్తే వచ్చిన జవాబులు, వారి పిల్లలు, అన్నా, తమ్ముళ్ళ గురించి వారు పడే అందొళనలతో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది జరుగుతున్నట్టుగా తెలుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఎన్నో ఇతర భాషలలోకి తర్జుమా అయ్యింది.
 

Ekattorer Dingulee (Days of 1971), బంగ్లా దేశ్లో బెస్ట్ సెల్లర్ బుక్ ఇది. Englishలో Of Blood and Fire పేరుతొ అనువదింపబడింది. ఇది చదువుతుంటే, Anne Frank రాసిన డైరీ, The Diary of a Young girlగుర్తుకువచ్చి తీరుతుంది ఎవరికైనా.

1971 లో పాక్ సైన్యం విరుచుకు పడ్డంలో ఆమె తన కొడుకునీ భర్తనీ కోల్పోతుంది. ఎవరో ఇచ్చిన సమాచారం మేరకు ఇంటికి వచ్చిన పాక్ సైన్యం ఆమె భర్తనూ ఇద్దరు కొడుకులనూ తీస్కెల్తారు. భర్త చిన్న కొడుకూ తిరిగి వస్తారు కానీ సైన్యం చిత్రహింసలకు గురయిన భర్త కు గాయాల బాధ తట్టుకోలేక గుండె నొప్పి వస్తుంది. ఆసుపత్రిలో బంగ్లా మొత్తం బ్లాకౌట్ అవటంతో, కరెంటు లేక, వైద్య సహాయం అందక చనిపోతాడు. పెద్ద కొడుకు ఎప్పటికీ తిరిగి రాలేదు. మిగిలిన చిన్న కొడుకు తనూ. అతనిని కూడా స్వతంత్రం వచ్చిన తరవాతి కొత్త ప్రభుత్వ సేవకి పంపించేస్తుంది. ఒకత్తీ మిగులుతుంది. ఆమె రాసిన డైరీ తప్పించి ఆమె అసలు సాహితీ ప్రస్థానం, బంగ్లాదేశ్ కి స్వాత్రంత్ర్యం (16/12/1971) వచ్చినప్పట్నుంచే మొదలవుతుంది.

ఆమెకు ఎన్నో ఎవార్డ్స్ వచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనవి :


1.Award by Bangla Writers Assocaition in 1988.
2.Bangla Academy Literary Award 1991 for Bangla Literature.
3.Greatest Freedom Fighter of 14th century (as per Bangla Calender).
4.Independence Award and Rokeya Award 1997 and 1998 posthumously.


అన్నిటికన్నా గొప్ప బిరుదు, ప్రజలంతా ఆమెను ప్రేమతో పిలుచుకునేది "షహీద్ జనని" Mother of martyrs అని. ఆమెను సుచిత్రా సేన్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా అంటారట. ఆమె చాలా అందమైనది.

స్వతంత్రం వచ్చాకా ఆమె ఘటక్-దలాల్ నిర్మూల్ కమిటీ ఒకటి స్థాపించి, యుద్ధ నేరాలకి బాధ్యులైన వారిని విచారించి శిక్షలు ప్రజా కోర్ట్ ల తీరులో అమలు జరుపుతుంది. అయితే దీనితో ఇబ్బంది పడ్డ ప్రభుత్వం ఆమెపై దేశద్రోహ నేరం మోపుతుంది. ఆమె మరణించాక, ఆమెపై కేసులన్నీ కొట్టేసారు. జమాత్-ఈ-ఇస్లాం అనే ప్రో పాకిస్తాని సంస్థ సైన్యంతో కలిసి బంగ్లా స్వాతంత్ర ఉద్యమాన్ని దెబ్బ తీసే విధంగా పని చేస్తుంది. అయితే ముస్లింస్ ను ఆకర్షించటం కోసం వారిపై నిషేధాన్ని ఎత్తివేస్తుంది ప్రభుత్వం. జహనారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజా కోర్టుల్లో ఆమె తీర్పులకి ప్రజల మద్దతు బాగా ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనుంచి కనీసం ఒక వ్యక్తి అయినా స్వతంత్రం కోసం ప్రాణాలు కోల్పోయిన వారే. పాక్ సైన్యం చిత్రహింసలకు గురయి మరణించినవారే. చనిపోయిన వారి సంఖ్య 3 లక్షలనుంచి 3 మిల్లియన్ అని అంచనా అంటే ఎంత మారణకాండే జరిగిందో ఊహించవచ్చు. ఎంత కౄరమైన అణిచివేత. అసలెంత మాత్రం ఆశ్చర్యం లేదు ప్రజా కోర్టులు తీర్పులిచ్చాయంటే. దీనిని అతి దారుణ మారణ కాండగా వర్ణించవచ్చేమో.

త్రోట్ కేన్సర్ వచ్చిన పదమూడేళ్ళకి 1994 లో ఆమె చనిపోయింది. అయితే ఆమె సాహితీ ప్రస్థానానికి కేన్సర్ ఏమాత్రం అడ్డు రాలేదు. తన కొడుకునీ భర్తనీ త్యాగం చేసి, బంగ్లా ఆడవారి ఉన్నతికై పాటుపడి, తన చిన్న కొడుకుని కూడా దేశ సేవకే అర్పించి తాను కూడ ప్రజా సంక్షేమంకోసం ప్రత్యక్షంగా, సాహిత్య పరంగా ఎంతో సేవ చేసిన జహనారా అమెరికా లోని డెట్రాయిట్లో మరణిస్తే, ఆమె కోరిక మేరకు ఆమెను ధాకా లో సమాధి చేసారు. ఆమె అంత్యక్రియలకు రెండున్నర లక్షలమంది ప్రజలు తరలి వచ్చారట. ఇప్పటికీ ఆమె వర్ధంతిని బంగ్లా దేశ్ ప్రధాని, చీఫ్ జుస్టిస్లతో సహా హాజరయి ఘనంగా జరుపుతారు.

మళ్ళీ కలుసుకుందాం ఒక వారంలో ఇంకొక అద్భుత రచయిత్రి పరిచయంతో. 

 

 

 

 

 

Sivapurapu Sharada