Facebook Twitter
అలుపెరుగని పిచ్చి మనసు (కవిత)

 

అలుపెరుగని పిచ్చి మనసు


రాత్రి వెన్నెలల నవ్వుల్లోకి చూస్తూ
మౌనంగా చీకటితోపాటు కరిగిపోతూ నేను..

నిశిరాకాసి నిశ్శబ్ధంలో చేస్తున్న భయంకర శబ్ధాన్ని పట్టనట్టు
కర్టెన్ సందుల్లోంచి వచ్చే గాలిని జోలపాటగా ఆస్వాదించి నిదరోతూ నువ్వు..

ఆ రాత్రంటే నీకు కళ్ళు మూసి తెరచేంతలో
జరిగిన ఒక ఆరేడు గంటల సుషుప్తావస్థేనేమో..

కానీ నాకు కన్నీటిని కావ్యాలుగా ఒంపుకున్న
మౌనాల్లో నిండిన అనిర్వచిత క్షణాలు..

ఆ రాత్రంటే ఎప్పటికీ తడి ఆరని గాథలను
గుండె దండంపై విఫలయత్నంగా ఆరేస్తూ
పొద్దునకల్లా పచ్చివాసనేసే భావాలను
కళ్ళల్లోనే కుక్కుకొని మరిన్ని కొత్త ఆశలను, దిగుళ్ళనూ నింపుకుంటూ

మరో రాత్రి కోసం సిద్ధపడే ఓ అలుపెరుగని పిచ్చి మనసు

 

 

 

 

...సరిత భూపతి