Facebook Twitter
ఉత్తరాంధ్ర తెలుగు కథకు చిరునామా అట్టాడ అప్పల్నాయుడు

 

ఉత్తరాంధ్ర తెలుగు కథకు చిరునామా అట్టాడ అప్పల్నాయుడు


          ఉత్తరాంధ్ర తెలుగు కథకు చిరునామా చెప్పాల్సి వస్తే అప్పల్నాయుడు పేరు తప్పక చెప్పాల్సిందే. శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో, గిరిజన జాతుల జీవన సంస్కృతిని అవలోకనం చేసిన రచయిత ఆయన. జననాట్య మండలితో సంబంధాలు, మొదటి కథ కూడా అచ్చుకాక ముందే అరెస్టు. ప్రభుత్వ దోపిడీకి, గిరిజనలు అమాయకత్వానికి ప్రత్యక్ష సాక్షి... ఇలాంటివి ఎన్నో అప్పల్నాయుడిని రచయితను చేశాయి. అంతేకాదు నాగావళి అందాలు, తూరుపు కొండల మీద నుంచి వచ్చే గాలి, ఉత్తరాంధ్ర ప్రకృతి శోభ కూడా అతడ్ని రనచవైపు ప్రేరేపించాయనే చెప్పాలి.
       అట్టాడ అప్పల్నాయుడు విజయనగరం జిల్లా కొమరాడ దగ్గరున్న గుమడ గ్రామంలో ఆగస్టు23, 1953న జన్మించారు. తండ్రి సూరినాయుడు, తల్లి నారాయణమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. కోటిపాం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు, ఆ తర్వాత పార్వతీపురంలో ఇంటర్మీడియట్ చేరారు. అప్పుడే శ్రీకాకుళపోరాటం, ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితులయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుమానేశాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలిగా పనిచేశాడు. కొంతకాలం నాగావళి పత్రికలో కూడా పనిచేశారు. చివరకు బ్యాంకు ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా 30 సంవత్సరాలు పనిచేశారు. అటు బ్యాంకు ఉద్యోగిగా జీవిస్తూనే రచనా వ్యాసంగాన్ని కూడా  సమర్థవంతంగా నిర్వహించారు.
        1979లో రచనలు చేయడం మొదలు పెట్టిన అప్పల్నాయుడు మొత్తంగా వంద కథల వరకు రచించారు. నాలుగు నవలలు రాశారు. కొన్ని నాటికలు కూడా రాశారు. వీరి మొదటి కథ "పువ్వుల కొరడా". విప్లవ కథకుడుగా సాహిత్యంలోకి అడుగుపెట్టి మారుతున్న సామాజిక చిత్రాన్ని చిత్రికపట్టి సామాజిక వాస్తవికతతో అందించారు. నేటి అంతర్జాతీయ వాణిజ్యం ఉత్తరాంధ్ర పల్లెల వరకు ఎలా విస్తరించి దోచుకుంటుందో కూడా వివరించారు. వీరి కథలన్నీ ఐదు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి ఒక పొట్టివాడు - కొందరు పొడుగువాళ్లు, క్షతగాత్రగానం,  పోడు - పోరు, ప్రత్యామ్నాయం, బీలు. అలానే వీరి నవలలు పునరావాసం, ఉత్కళం, అనగనగా ఒక ద్రోహం, నూకలిస్తాను. వీరు రాసిన 3 నాటకాలు, 5 నాటికలు విుశాఖఫట్నం ఆకాశవాణిలో ప్రచారం అయ్యాయి. వీరి "మడిసెక్క" నాటకానికి ఆలిండియా రేడియోవారి జాతీయ నాటికల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. సూర్య దినపత్రికలో సంవంత్సరకాలం పాటు "నేస్తం ఊసులు" పేరిట శీర్షిక నిర్వహించారు. ఇటీవల వీరి సమగ్ర సాహిత్యం కూడా ముద్రితమయింది.
        అప్పల్నాయుడు కథలు సృజన, అరుణతార, అంకిత, విపుల, నవ్య, ఆహ్వానం, ప్రజాశక్తి, చినుకు... ఇలా అన్ని పత్రికల్లోనూ ముద్రితమయ్యాయి. ఇంగ్లిషు, హిందీ, తమిళం, కన్నడం, బెంగాళీ, భాషల్లోకి అనువాదమయ్యాయి. "పువ్వల కొరడా" కథలో గ్రామల్లో చాకలి ఊరుమ్మడి మనిషి. పెళ్లిళ్లప్పుడు చాకిలిచేత కావిళ్లు పంపిస్తారు. కానీ చాకలి ఆకలేసి ఆ సారెల్లోని అరిసెలు తింటాడు. అరిసెలు తక్కువయ్యాయి కనుక అసిరిసెట్టి కొరడా దెబ్బలు తినాలి. కానీ కథలో చాకలి ఎదురుతిరుగుతాడు. పంట, ప్రజాకోర్టు, ఖండగుత్త కథలు పోలీసులు, ప్రజానేతలు, అధికారులు, పై వర్గాలు సవరలు, కోదుల వంటి గిరిజనులను ఎలా దోచుకుంటున్నారో తెలియజేస్తాయి. "జీవనస్రవంతి" కథలో అరెస్టు చేసిన నక్సలైట్ ను వదిలెయ్యాలా, చంపాలా అనేదే ఇతివృత్తం. మంత్రి జనజీవన స్రవంతిలోకి రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ అరెస్టు చేసిన పోలీసుకు లక్షరూపాయలు పోతుందన్న బాధ. విలేకర్ల దగ్గర నిజం దాస్తారు. చివరకు నెక్సలైట్లు మండలాధ్యక్షుడ్ని కిడ్నాప్ చేయడంతో నెక్సలైట్ ను విడుదల చేస్తారు పోలీసులు. "బంధాలు - అనుబంధాలు", "ప్రత్యామ్నాయం" కథల్లో తల్లీ, కొడుకుల మధ్య, అన్నాదమ్ముల మధ్య ప్రేమాప్యాయతలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మారుతున్న సామాజిక పరిణామంలోని అవసరాలే అని చెప్పారు.  
          అరణ్య పర్వం, ఆకాశ హర్మ్యాలు, ప్రయాణం, బతికి చెడిన దేశం, యుద్ధం, పందెపుతోట, షా, వెదుకులాట, సాహసం సేయరా, రివాజు, రెండు ప్రశ్నలే, బల్లెం, భద్రయ్య, భోషాణం... ఇలా ఏ కథ తీసుకున్నా అన్నీ ఆణిముత్యాలే. మొదట్లో శిల్పం కన్నా వస్తువుకే ప్రాధాన్యత ఇచ్చే కథలు రాసిన అప్పల్నాయుడు తర్వాత తర్వాత కథనానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కారా గారి "కధా కథనం", ఇంకా "రచయితా - శిల్పమూ" వంటి పుస్తకాలను చదివారు. "ఓ తోట కథ"లో తోట చేతే మాట్లాడించారు. ఇంకా శ్రీకాకుళం మాండలికంపై అప్పల్నాయుడికి అపారమైన పట్టు ఉంది. ఆ నుడికారం కథల్లో ఆరుద్ర పురుగులా మెరుస్తూ మనకు కనపడుతుంది. వీరి కథా శీర్షకలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అప్పల్నాడికి రావిశాస్త్రి పురస్కారం, కథా కోకిల పురస్కారం, విశాల సాహితీ పురస్కారం, కేతు విశ్వనాథరెడ్డి పురస్కారం, అజోవిభో కందాళం ఫోండేషన్ అవార్డు వచ్చాయి. 
     ఇప్పటికీ నిరంతరం తన సాహితీ ప్రస్తానాన్ని సాగిస్తూ, పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి రచయితగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు అట్టాడ అప్పాల్నాయుడు. నాలుగు దశాబ్దాల ఉత్తరాంధ్ర సాహిత్య చరిత్రనే కాదు, సామాజిక చరిత్రను తెలుసుకోవాలన్నా వీరి కథలు, నవలలు చదవాల్సిందే.     
         

.....డా. ఎ.రవీంద్రబాబు