Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గుల్ బదన్ బేగం

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? గుల్ బదన్ బేగం

 


బాబర్ చక్రవర్తి కుమార్తె, పెర్షియన్, తుర్క్ యువరాణి, హుమాయూన్ కి సవతి సోదరి. తన సోదరుడు, చక్రవర్తి హుమాయూన్ జీవిత చరిత్ర హుమాయూన్ నామా రాసిన రచయిత్రిగా పేరు. మేనల్లుడు జలాలుద్దీన్ అక్బర్ కి చాలా ప్రియమైన అత్త. అక్బర్ మహారాణి రుకయ్యా బేగం కి కూడా తండ్రి తరపు అత్త. ఆమె పేరు గుల్ బదన్ అంటే గులాబీ వంటి మేను, అంతే కాదు గులాబీ వంటి మనసుకూడా ఆమెది. అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామా నిండా ఈమె గురించిన ప్రస్తావనలుంటాయట. పంథొమ్మిది ఏళ్ళు కాబూల్ని పరిపాలించాకా బాబర్ కన్ను ఇండియా మీద పడింది. మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీ ని ఓడించి బాబర్ మొట్టమొదటి సారిగా ఇండియాలో జెండా ఎగరేసాడు మొగల్ సామ్రాజ్యానిది. అలా ఆరేళ్ళ వయసులో గుల్బదన్ బేగం ఇండియా వచ్చింది. పదిహేడేళ్ళకు పెళ్ళయింది. సొంత సోదరులు, సోదరిలు ఉన్నా గుల్ బదన్ తన సవతి సోదరుడు హుమాయూన్ని కూడా సమానంగానే ప్రేమించింది.

గుల్ బదన్ అసలు అన్న తన భర్తతో చేరి హుమాయూన్ మీద కుట్ర చెయ్యడానికి ప్రయత్నిస్తే వారిస్తుంది. అసలు అన్నకు కూడా ఆమె సహకరించదు. కానీ చివరికి అన్న, భర్త కుట్ర చేసి, భర్త,కొడుకు బహిష్కరించబడినా చివరి దాకా ఆమె హుమాయూన్కి తరవాత అతని కొడుకు అక్బర్ కి విశ్వాశపాత్రురాలిగా ఉంటుంది. చివిరికి ఆమె భర్త ఆమె సమాధి పక్కన సమాధి చెయ్య బడటానికి కూడా నోచుకోక ఒక మూలగా సమాధి చేయ బడతాడు. తన కొడుకునీ భర్తనీ కూడా తను నమ్మిన, ఇష్ట పడిన వారి కోసం వదిలేసింది.

హుమాయూన్ 1531 లో రాజ్యానికి వచ్చి 1536 లో పోగుట్టుకుని అజ్ఞాతవాసం చేసి సుమారు 15 ఏళ్ళ తరవాత షేర్షాసూరి ని ఓడించి తిరిగి మొగల్ సామ్రజ్యాన్ని నిలబెడతాడు. ఈ మధ్య కాలంలో కాబూల్ లో ఉండి పోయిన గుల్ బదన్ తరవాత రెండేళ్ళకు అక్బరు బలవంతం మీద కొంతమంది ఆడవాళ్ళతో కలిసి ఆగ్రా వస్తుంది. అక్బర్ ఆమెను హుమాయూన్ జీవిత చరిత్ర రాయమని అంటాడు. మొదట సందేహపడినా తన తండ్రి బాబరు రాసిన బాబర్ నామాలో లాగానే తేలికైన తుర్కిష్ భాషలో ఎటువంటి అలంకారాలు, ఆర్భాటాలు లేకుండా రాస్తుంది. ఆమెకు ఎనిమిదేళ్ళ వయసులో బాబరు చనిపోతాడు కాబట్టి తండ్రి గురించి ఆమెకు జ్ఞాపకమున్నంతవరకూ ఇంకా విన్న విషయాలు మాత్రం రాస్తుంది.

ఈమె రాసిన ఈ గ్రంధం స్త్రీల రచనల ప్రత్యేకతలన్నీ సంతరించుకుని ఉంటుంది. మగవాళ్ళు యుద్ధాలని ఏళ్ళ కేళ్ళు బయటికి వెళ్ళినపుడు ఈ మహల్స్ లోని ఆడవాళ్ళ జీవితం ఎంత అందోళనతో, భయంతో కూడుకున్నదో, గర్భవతులైన ఆడవాళ్ళు, పిల్లలతో వారు పడే వేదన ఎంత దుర్భరంగా ఉంటుందో ఆమె రాస్తుంది. అందమైన రాజమహళ్ళలో విలాసాలే కాకుండా ఎటువంటి హఠాత్పరిమాణానికైనా సిద్ధంగా ఉండటం ఎన్నో కష్టాలకోర్చి అడవుల్లో పర్వతాల్లో, పిల్లలతో, కొద్దిమంది స్నేహితులు, అనుయాయులతో రోజులు సంవత్సరాలు ఎలా గడిపేవారో, ప్రాణభయంతో పారిపోయే పరిస్తితుల గురించి కూడా ఆమె రాస్తుంది. అధికారం, రాజరికం, విలాసం, అలాగే అధికారం కోల్పోయినప్పుడుండే దుర్భర దారిద్ర్యం, స్వంత వారినుంచే అధికారం కోసం ప్రాణఘాత దాడులు, ఇవన్నీ కూడా సహజమే కదా.
అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామాకి గుల్ బదన్ రాసిన హుమాయూన్ నామాకి తేడా ఇక్కడే ఉంటుంది. రాజుల చరిత్రలన్నీ వారి పోరాటాల గురించి, రాజ్య సరిహద్దులూ వాటి విస్తరణ, వారి గొప్ప తనాలు, పరిపాలనా వ్యవహారాల గురించి రాసే రొటీన్ చరిత్రలే. కానీ ఈమెది అలా కాదు. హుమాయూన్ నామా వారి వ్యక్తిగత జీవితాల్లోని మామాలు మనుషుల అంతరంగాల్నీ అవేదనలనీ ఒక కుటుంబంలో మామూలుగా ఉండే ప్రేమల్లాగే, మామూలు కుటుంబాల్లో ఉండే గొడవలూ, అన్నదమ్ముల మధ్య జరిగే పోట్లాటలూ, రాజ కుటుంబాల్లోనూ ఉంటాయని చెబుతుంది. రాజకుటుంబీకుల్ని గొప్పగా చూపెట్టే ప్రయత్నం చెయ్యదు. అయితే ఈ గ్రంధం అసంపూర్తిగా మిగిలిపోయింది ఎందుకనో. ఒకచోట వాక్యం పూర్తవకుండానే ఉండిపోయిందట. కారణాలు తెలియవు.

Annette S.Beveridge హుమాయూన్ నామా అనువాదం చేసింది. అయితే ఈ మేన్యుస్క్రిప్ట్ G.W.Hamilton అనే Colonel personal collection నుంచి అతని తరవాత అతని భార్య బ్రిటిష్ మ్యూసియం కి అమ్మేసింది.

చరిత్ర కారులు మామూలుగా రాయని విషయాలని ఆమె రాసింది. ఒకసారి ఇరవై రెండేళ్ళ హుమాయూన్ అనారోగ్యంతో మంచంపడితే, బాబరు చూళ్ళేక తన కొడుకు బదులు తనను తీస్కెళ్ళమని ప్రతి రోజూ హుమాయూన్ మంచం వద్ద అల్లాకి ప్రార్ధన చేసే వాడట. చిత్రంగా హుమాయూన్ కోలుకుని 47 ఏళ్ళ వయసులో బాబరు అకాలమృతు వాత పడ్డాడట. అలాగే బాబరు చేసిన ఒక చిత్రమైన పనిని ఆమె రాస్తుంది. ఏంటంటే బాబర్ ఒక బంగారు మొహరు కొన్ని కిలోలది ముద్రించి అదే పనిగా కాబూలు పంపించి అక్కడే ఉండిపోయిన ఆసస్ అనే ఒక కోర్ట్ జోకర్ మెళ్ళో కళ్ళకు గంతలు కట్టి వేయిస్తాడు. అంత బరువుకలది మెడలో ఎంటో అని మొదట భయపడి తరవాత బంగారు మొహరు చూసి ఆనందంతో గెంతులేస్తాడట. మధ్యవయస్కుడైన హుమాయూన్ ఒక సారి పదమూడేళ్ళ హమిదా బానుని చూసి ప్రేమలో పడతాడు. మొదట హమిదా వయసు కారణంగా తిరస్కరిస్తుంది. నేను చెయ్యెత్తితే అతని భుజం తగలాలి గాని అతని షేర్వాని అంచు కాదు అంటూ. తిరిగి ఎన్నిమార్లు చక్రవర్తి కబురు పెట్టినా చూడటానికి రాదు. ఆమెకు కోరినంత ఆస్తిని మనోవర్తిని ఇవ్వటానికి సిద్ధ పడితే హమిదా తల్లి ఆమెను చక్రవర్తి కన్న మంచి మొగుడు ఎలా వస్తాడు అని ఆమెను బలవంతంగా ఒప్పిస్తుంది. ఆమెకు పుట్టిన కొడుకే అక్బరు చక్రవర్తి. ఇలా చరిత్రకారులు, రాజుల చరితలు రాసే వారు రాయని విషయాలు ఎన్నో ఆమె హుమాయూన్ నామా లో కనిపిస్తాయి. గుల్ బదన్ పొయెట్రీ కూడా రాసిందట కాని, రికార్డ్ లేదు.

1603 లో గుల్ బదన్ చనిపోయింది. కొడుకు దగ్గర లేనందున అక్బరే దగ్గరుండి అన్నీ జరిపించాడు ఆమె శవాన్ని మొయ్యడం నుంచి. 1605 లో అక్బర్ కూడా చనిపోయాడు. అయితే అప్పటి వరకూ కూడా అక్బరు తన ప్రియమైన అత్తను గుర్తు చేసుకుని బాధ పడుతూనే ఉండేవాడట. పోయెట్రీ తో పాటు అతి విలక్షణంగా హుమాయూన్ నామా రాసిన గుల్ బదన్ బేగం గురించి చెప్పుకోపోతే ఆమెకు అన్యాయం చేసినట్టే అనిపించింది.

 

 

 

 

- Sivapurapu Sharada