Facebook Twitter
బీ యూ (కవిత)

 

బీ యూ

 

తెల్లకాగితం మీద ఇంకుచుక్కలా
పరిపూర్ణత కోసం పరితపిస్తూ
ఎన్నో ఆశల్ని లిఖిస్తూ
పెన్నులో ఆఖరి చుక్కలా విలవిల్లాడినా
వెంటవచ్చే ఆనందాలేమీ ఉండవు
ఒక 'నా' అనుకునే వారి గుండెల్లో
గురుతులై మిగిలిపోతాయేమో

కాపుచినో నురగల్లా
ఊదేంత వరకే వేడి సెగల అందం
కానీ నువ్వు ఆ కప్పు కాఫీని
ఎంతగా ఆస్వాదిస్తే
ఆ రుచి అంతగా మనసులో
చెరిగిపోని ముద్రవుతుంది
జీవితముా అంతే..
ఏదీ ఆస్వాదించలేకపోతే
ఊదిబత్తి ఊదేస్తే పొగ గాలిలో కలిసినట్టు
నిస్సత్తువగా నిర్జీవి అయిపోవటం తప్ప
నీకంటూ చెప్పుకోవటానికి ఏమీ మిగలవు

చీర చెరగులో దాచిన కన్నీటిమంటలు
నిన్నే దహించివేస్తాయేమో
ఆ వేదనకు కారణమైన వారి కోసం
ఓసారి హనుమంతుని తోకవవ్వు

నువ్వు పాలల్లో కలిసిపోవటానికి
పంచధారవైనా, ఉప్పైనా, పెరుగువైనా
నీ అస్థిత్వం కోల్పోయానని బాధపడక
నీకంటూ ఓ ప్రత్యేకత ఉందని గమనించు

బతకాలంటే నటించాలేమో
కానీ ఆనందంగా బతకాలంటే ??
నువ్వు నువ్వుగా బతకాలి

 

 

 

 

...సరిత భూపతి