Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? చంద్రబతి - బెంగాలి


మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? చంద్రబతి - బెంగాలి


కొన్ని శతాబ్దాల వెనకటి రచయిత్రుల కోసం నేను వెతుకుతుంటే చంద్రబతి అనే అద్భుత రచయిత్రి గురించి నాకు తెలిసింది. ఆమె 16 వ శతాబ్దపు మొట్ట మొదటి బెంగాలి రచయిత్రి. ఆమె జీవితమూ రచనలూ రెండూ కూడా తెలుసుకోవటానికి చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి.

చంద్రబతి రాసింది అషామాషీ రచన కాదు 'రామాయణం'. చాలా కొద్ది మందికి ఈ విషయం తెలుసు ఎందుకంటే, ఈమె రాసిన రామాయణాన్ని విశ్లేషకులు అసలు రామాయణం కిందే పరిగణించలేదు. ఎందుకంటే అది రామాయణం కాదుట, నిజమే సీతాయణం అనొచ్చేమో. ఈమె రామాయణం కేవలం సీత బాల్యంతో మొదలయి, యుద్ధ కాండను విస్మరించి, ఉత్తరకాండతో ముగుస్తుంది. మొత్తం రామాయణంలో సీత పుట్టినప్పట్నుంచి పడ్డ కష్టాలతో మొదలయి చివరికి ఆమె ఆత్మాహుతి చేసుకునేవరకు నడుస్తుంది. ఈమె రామాయణంలో రాముడు హీరో కాదు, దేముడూ కాదు, తన తల్లులకీ, రాజ్య క్షేమానికీ, ప్రజల మాటలకు మాత్రమే విలువిచ్చి, అర్ధాంగి పట్ల తన బాధ్యతలను విస్మరించిన బలహీన మనస్తత్వం కలవాడు.

రాముడు దేముడనీ, సాక్షాత్తూ విష్ణు మూర్తి అవతారమని నమ్మించి రాముడి పితృవాక్య పరిపాలనని, రావణ సం హారం ద్వారా ధర్మ సంస్థాపననీ, వీరత్వాన్నీ, ఏకపత్నీవ్రతాన్నీ ఆదర్శవంతంగా చూపెట్టి ప్రజల్ని నమ్మించి అప్పటి సామాజిక నీతుల్ని, సమాజంపై రుద్ది పురుషస్వామ్యాన్ని బలపరుచుకోడానికి వాడుకున్న సప్పోర్ట్ సిస్టం సీత. అందుకే సీత ఓర్పు గల తల్లి, త్యాగశీలి, ఎప్పుడూ ఏడ్వటం తప్పించి దేన్నీ ఎదురు తిరిగి ప్రశ్నించదు. గర్భవతిగా ఉన్న సీతని రెండోసారి అడవుల్లోకి పంపినప్పుడైనా సీతను పుట్టింటివారు తీస్కెళ్ళరు. అంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టింట్లో కాదుకదా, సంఘంలోనే ఎక్కడా ఇంత తలదాచుకునే చోటు ఎవరూ ఇవ్వరు. అందులోనూ సీత మహా రాణి పేరుకే అనుకోండి, ఇక ఎవరు సాహసం చేస్తారు?

లెస్లీ ఉడ్విన్ తీసిన డాక్యుమెంటరీ లో న్యాయవాదులు చేసిన అన్యాయమైన ఉద్ఘాటనలు " భారతీయ సంస్కృతి చాలా గొప్పది, అందులో స్త్రీలకి చోటు లేదు" వినడానికి బాగోలేకపోయినా నూటికి నూరు శాతం నిజం. మన Epics లో స్త్రీలకి ఎటువంటి స్థానం లేదు. అన్యాయాలకి, మానభంగాలకి, అపహరణలకి, వస్త్రాపహరణలకీ గురవటం, వాళ్ళ ప్రమేయం, ప్రస్తావన ఉన్న చోటల్లా ఏడవటం, శృంగారం కోసం, శృంగార సన్నివేశ వర్ణనల కోసం ఉపయుక్తంగా ఉండటం తప్పించి. అందుకే దేనికీ ఎదురు తిరగని సీత పురుష ధృక్కోణంతో రాసిన రామాయణాల్లో మహా సాధ్వి ఆయింది, దేవత అయ్యింది, పూజింపబడింది. మరి సీత కష్టాలని ఎత్తి చూపుతూ ఆమె ధృక్పధంతో రామయణం రాస్తే సగం జనాభా అయిన స్త్రీలు తిరగబడితే, పురుషాధిక్య సమాజపు పునాదులు కదలే అవకాశం ఉంది.? అన్నీ భరించిన సీతని సాధ్విగా చూపక పోతే స్త్రీలంతా ఒదిగి ఒదిగి ఎలా ఉంటారు?

అసలు సీత కూడా ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించింది? మూడు కారణాలు కనిపిస్తాయి. ఒకటి బంగారు జింక మీద ఆశ పడటం, అది రాక్షస మాయ అని రాముడు చెప్పినా వినకపోవటం. రెండు కాపలా పెట్టిన లక్ష్మణుడిని అనుమానించి రాముని ఆజ్ఞకి వ్యతిరేకంగా అతన్ని వెతకటం కోసం పంపడం. మూడు లక్ష్మణ రేఖ దాటడం. ఇన్ని తప్పులు చేసాకా సీతకి కష్టాలు ఎలా తప్పుతాయి. ఇంత విన్నాకా మగవాడి నోటినుంచి, ఏ ఆడదయినా ఇంక నోరెందుకు ఎత్తుతుంది? ఈ ప్రశ్నలన్నీ చంద్రబతి రామాయణం లేవెనెత్తుతుంది పాఠకుల మదిలో

అందుకే చంద్రబతి రామాయణాన్ని బయటికి రానివ్వలేదు అప్పటి పండిత పురుషులు. అదసలు రామాయణమే కాదన్నారు. అదొక అసంబద్ధమైన, అసంపూర్ణమైన వ్యర్ధ ప్రయత్నం అన్నారు. భారతంలో ద్రౌపది కూడా పతివ్రతే, కానీ చాలా సందర్భాలలో ద్రౌపది ఎదురు తిరుగుతుంది. ధర్మరాజు తనను జూదంలో ఓడిపోతే, "తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా"? ముందు ఆ విషయం చెప్తే కాని నేను సభకి రాను అని తిరగబడుతుంది. ధర్మరాజుకి తన మీద ఉన్న హక్కుని ప్రశ్నిస్తుంది. వస్త్రాపహరణం తరవాత తన పతుల వీరత్వాన్ని ఈసడించి, దుర్యోధనుడి మీద తన పగ తీర్చే వరకు జుట్టు ముడి వేయనంటుంది. ఆరోజుల్లో జుట్టు అల్ల కుండా వదిలేయటం తప్పు మరి. మయసభలో దుర్యోధనుడు కాలు జారి పడితే ఫక్కుమని నవ్వుతుంది. చివరగా యుద్ధంలో తన భర్తలు గెలిచినా తన అయిదుగురు కొడుకుల్నీ పోగొట్టుకుంటుంది. ఇది ద్రౌపది తిరబడినందుకు శిక్ష అంతే కాదు. ద్రౌపది ఆ కాలం నుంచి, ఈ కాలం వరకూ ఆడవారికి ఎప్పుడూ ఆదర్శమయిన దాఖలాలు లేవు. కానీ సీత జీవితం కష్టాలనీ, దుఖాన్ని భరించడానికి ఒక గౌరవాన్ని, ఆదర్శాన్ని ఆపాదిస్తుంది. అంతులేని సహనాన్నీ, ఓర్పునీ ప్రదర్శించండం ఒక కావ్య నాయిక లక్షణంగా ఎత్తి చూపుతుంది.

తెలుగులో రామాయణాన్ని మొల్ల రాసింది. ఈమె కుండలు చేసే ఒక కుమ్మరి కూతురు, అపురూప సౌందర్యవతి క్రిష్నదేవరాయలకి ఉంపుడు కత్తెగా ఉందని ఒకచోట రాసారు. రాయల ఆస్థానంలోని కవులతో సవాలు చేసి ఈమె రామాయణాన్ని కేవలం అయిదంటే ఐదు రోజుల్లో సంస్కృతం వచ్చి కూడా, తెలుగులో రాసిందట. అయితే ఈమె రామాయణం ఒక అద్భుత రచన అన్న విషయం కాదనలేక కవులంతా ఏకమై ఈమె స్త్రీ , ఇంకా శూద్రురాలు, అందువలన ఈమెకి సభలో ప్రవేశం లేదు, సభలో ఆమె రాసిన రామాయణం చదవటానికీ వీలు లేదని పట్టుబట్టీ నెగ్గారట. మొల్ల రామాయణంలో, సీత పట్ల ఎటువంటి సానుభూతీ లేదు. రాముడు దేముడు, వీరుడు. ఆమె తన రచనను రాముడికి "మహా గుణశాలి, దయావాన్, ప్రీతి కలిగించిన వారందరిని రక్షించువాడు, శ్రీరామచంద్రుదడికి" అంకితం చేస్తున్నట్టు రాసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొల్ల, చంద్రబతి ఇద్దరూ కూడా శివ భక్తులు.

అయితే మనకాలంలో కూడా రామాయణాన్ని రాసిన ప్రముఖ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ గారు. ఈమె రామాయణాన్ని మార్క్సిస్ట్ ధృక్పధంతో విశ్లేషించారు. ఇందులోనూ రాముడు హీరో కాదు, పైగా ఎంత బలహీనమైన వ్యక్తో, తన అవసరాలకు కూడ లక్ష్మణుడిమీదా, యుద్ధం చేసి సీతను తిరిగి తెచ్చుకోవడానికి వానరుల మీదా ఎలా ఆధారపడతాడో, అసలు రామ రాజ్యంలో ప్రజలకి జరిగే మంచి ఎంటో వివరించారు. అసలు "రామాయణ విషవృక్షం" అని పుస్తకం పేరు చెప్పటానికి, అనడానికి కూడా భయపడాల్సిన పరిస్తితి కొన్ని ఇళ్ళల్లో. ఇది రాసి రంగనాయకమ్మ గారు ఎంత విమర్శ ఎదుర్కొన్నారో తెలిసిన విషయమే.

ఇంతకీ తేలిన విషయం ఏంటంటే, రామాయణం రాసిన స్త్రీలెవరికీ కూడా, స్త్రీలైన కారణంగా వారి కృషికి గుర్తింపు ఇవ్వకుండా, వేరు వేరు కారణాలు, సాకులూ చెప్పి నిరాదరణకి గురి చేసారన్నది రూఢి అయింది అని.

చంద్రబతి రామాయణాన్ని పండితులూ, కవులూ గుర్తించకపోయినా, ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, విశేషంగా ఆదరించి, వారి కష్టాలన్నిటినీ సీత కష్టాలుగా అభివర్ణించుకుని, పొలంలో నాట్లు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, కోతల సమయంలో, ధాన్యం దంచుకుంటూ పాడూకునే వారట. అప్పుడే కాదు ఇప్పటికీ కొన్ని చోట్ల అంటే బెంగాలులో, బంగ్లాదేష్లో, ఉత్తరప్రదేష్ లో, బిహార్లో, మహారాష్త్ర, ఆంధ్ర ప్రదేష్ లలో పాడుకుంటారు. బెంగాలు, బంగ్లాదేశ్ లలో అయితే రాముడిని "పాషండ, పాపిష్టి, నీకు హృదయం చచ్చిపోయిందా" అని ప్రశ్నిస్తూ పాడతారట.

చంద్రబతి ప్రాముఖ్యం ఇచ్చినదంతా సీత పుట్టినప్పట్నుంచి పడ్డ కష్టాలకే. జనకుడికి, భూమి దున్నుతుంటే దొరికిందని తెచ్చిస్తారు రైతులు. అసలు ఆడపిల్ల పుట్టగానే పాతిపెట్టేసే ఆచారం అప్పుడే మొదలయ్యిందేమో. తల్లి తండ్రులెవరో తెలియదు, బాల్య వివాహం, అత్తవారింట ఒక్కరు కాదు ముగ్గురు అత్తగార్లు, అరణ్యవాసం, అపహరణం, అవమానం, వియోగం, ఒంటరితనం, అగ్నిప్రవేశం, గర్భంతోటుండగా మళ్ళీ అరణ్యవాసం , అష్ట కష్టాలు, ఆఖరిగా ఆత్మాహుతి. అసలు సీత జీవితంలో సుఖపడిన దాఖలా ఎక్కడా లేదు. ఒక మహారాణి అయిన సీత ఇంత అసాధారణమైన కష్టాలు పడితే, సాధారణ స్త్రీల పరిస్తితి ఏంటో ఆరోజుల్లో ఊహించుకోవచ్చు. ఇలా సీత జీవితంలో ప్రతి స్టేజ్ లో పడ్డ కష్టాలను వర్ణిస్తూ రాసిన ఆమె పద్యాలను స్త్రీలు తమ జీవితంలోని కష్టాలను ఒకరికొకరు చెప్పటానికి వాడుకుంటూ పాడుకునే వారట. ఒక మహా సాధ్వి, దేవత అయిన సీత జీవితంలోని కష్టాల్ని, ఆ రోజుల్లో సాధారణ స్త్రీల జీవితంలోని కష్టాలతో అనుసంధానించి, ఒక సారూప్యత నిర్మించి, స్త్రీల జీవితాలకి దర్పణంగా తన రామాయణాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది కాబట్టే, మగవారంతా తృణీకరించినా, ఆమె రచన స్త్రీల రోజువారీ జీవితంలో భాగమయ్యింది, వారి పాటల్లోని ప్రాణమయ్యింది. దేముడయిన రాముడిని బలహీనమైన వ్యక్తి లా చిత్రీకరించడమే , చెప్పాలంటే ఒక రకంగా తిరుగుబాటు. ఐతే ఇంతచేసినా ఇది ఆడవాళ్ళు తమ తమ కష్టాలని పంచుకోవడానికి ఉపయోగపడిందే కాని, కష్టాలకి కారణమయిన వారిమీద తిరగబడటానికి ఉపయోగపడలేదు.

చంద్రబతి రాసిన ఇతర రెండు రచనలు చాలా అద్భుతమైన కావ్యాలని ,మాణిక్యాలవంటివని పేరు పొందాయి. ఇవి " సుందరి మోల్వా ఇంకా, దాస్య కేనరం". వీటిని బెంగాల్, బంగ్లాదేశ్ లలో పాఠ్యాంశాలుగా ఇప్పటికీ చెప్తారట. అయితే అన్నిటికన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమెకు ఆమె రచనల కన్నా కూడా, ఆమె ప్రేమ కధకే ఎక్కువ గుర్తింపు వచ్చిందని. అదేంటో, ఎందుకో తెలుసుకుందాం.

చంద్రబతి అపురూప సౌందర్యవతి. ఆమె జయానందుడనే యువకుడితో ప్రేమలో పడుతుంది. ఇద్దరికి పెళ్ళికూడా నిశ్చయమవుతుంది. అయితే పెళ్ళిరోజున చంద్రబతికి, జయానందుడు, ముస్లిం మతం పుచ్చుకుని కాజీ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడని తెలుస్తుంది. విరక్తితో ఆమె తన తండ్రిని ఇక తన పెళ్ళి తలపెట్టవద్దని కోరి, ఒక గుడి కట్టుకుని అందులో శివ ధ్యానంలో మునిగిపోతుంది. అయితే తండ్రి ఆమె కోరికను కాదనక, ఆమెను రామాయణం రాయమని ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహ ఫలితమే ఆమె రాసిన రామాయణం ఇంకా ఇతర రచనలూనూ.
అయితే, తన తప్పు తెలుసుకున్న జయానందుడు తిరిగి ఆమెను కలవడానికి వస్తాడు. కాని ఆమె తన గుడిలో తలుపు వేసుకుని ధ్యానంలో ఉంటుంది. అదే సమయంలో బయట, తుఫాను, గాలి వాన. పిలిచి పిలిచి వేసారిన జయానంద, ఆ గుడి తలుపు మీద 'చివరి సారి నీకు వీడ్కోలు చెప్పటానికి వచ్చాను' అని రాసి వెళ్ళిపోయి పక్కనే పారుతున్న నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. మరుసటిరోజు తలుపు తెరిచిన చంద్రబతి, తలుపు మీద రాతలు చూసి నది వేపు పరిగెడుతుంది. అయితే అక్కడ ఆమెకు, కొట్టుకువచ్చిన తన ప్రియిడి శవం కనపడుతుంది. మరొక్కసారి విధి చేత భంగపడిన చంద్రబతి తాను కూడా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఎంత రొమాంటిక్ గా, సినిమాటిక్ గా ఉంది ఈ స్టోరీ! అందుకే ఆమె రచనల కన్నా ఆమె వ్యక్తిగత జీవితం మీద ఎక్కువ జాలి, ఆదరణ ప్రజలకు.

 

 

 

 

- Sivapurapu Sharada