Home » పిల్లల కోసం » మారిన నైజంFacebook Twitter Google
మారిన నైజం

మారిన నైజం

 


పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది. రోజంతా ఆహారం కోసం వెతుక్కుంటూ తిరిగేదది. ఒక్కోసారి, ఊళ్ళో ఏ హోటల్లోంచో మంచి భోజనం వాసన గుప్పున తగిలేది. ప్రతిసారీ ఆశతో అటువైపుకు పరుగు పెట్టేది పాపం. ప్రతిసారీ విస్తరాకులు కనబడటం, గబగబా విస్తర్లలో‌ మూతి పెట్టటం, మరుక్షణాన ఓ పెద్ద కుక్క వచ్చి మీద పడటం, ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపలే అది ఎక్కడో దూరంగా పోయి పడటం. "కుయ్, కుయ్" మని వణుక్కుంటూ అట్లా దూరంగా నిలబడేదది. ఆ వచ్చిన పెద్ద కుక్క తినేసాక, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే టామీ అదృష్టం, అంతే. చాలా సార్లు పెద్ద కుక్క ముగించే లోపలే మధ్య రకం కుక్కలు కొన్ని వచ్చి పడేవి. అవి వచ్చాయంటే ఇక టామీకి ఒక్క మెతుకు కూడా‌ దక్కేది కాదు.


చిన్న కుక్కలు దొంగగానే తినాలి. ఒకసారి టామీకి అకస్మాత్తుగా ఓ మాంసం ముక్క దొరికింది. చటుక్కున అది అటూ ఇటూ చూసింది- వేరే పెద్ద కుక్కలేవీ దగ్గర్లో లేవు. దాంతో అది చటుక్కున ఆ ముక్కను నోట కరుచుకొని పరుగెత్తి, ఒక మూలగా ఆగి, దాన్ని గబగబా తినేసింది. బ్రతుకు మెళకువలు అట్లా నేర్చుకున్నది టామీ. ఆటంకాల్ని అధిగమిస్తూ, ఓటమిని భరిస్తూ, మెల్లగా పెద్దదైంది. ఇప్పుడు దానికి కండలు తిరిగాయి. అనుచరులు కూడా ఏర్పడ్డారు. ఎట్లాంటి యుద్ధంలో అయినా ఇప్పుడు దానిదే పైచేయి. మొదట్లో‌ ఉండిన పెద్ద కుక్కలన్నీ‌ ఇప్పుడు ముసలివైనాయి. చిన్న కుక్కలకు ఎట్లాగూ బలం‌ ఉండదు! అట్లా అది తిరిగే పరిసరాల్లోని హోటళ్ళు, చెత్తకుండీలు అన్నీ ఇప్పుడు దాని సొంతం అయిపోయాయి.


సాధారణంగా దాని వయసు కుక్కలు ఏవీ పిల్ల కుక్కల్ని, ముసలి కుక్కల్ని తిననివ్వవు; ప్రశాంతంగా ఒక చోట ఉండనివ్వవు. తరిమి తరిమి సంతోషపడతాయి. కానీ టామీ మనసు మాత్రం అట్లా కరకుబారలేదు. చిన్నతనంలో తను ఎదుర్కున్న కష్టాలు దానికి గుర్తున్నాయి- అయినా ఆ అనుభవాలకుగాను 'ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి' అని దానికి అనిపించలేదు. చిన్న కుక్కల్ని చూసినప్పుడల్లా దానికి చిన్నప్పటి తనే గుర్తుకొచ్చేది. ముసలి కుక్కల్ని చూసినప్పుడల్లా దానికి "తర్వాత ఎప్పుడో నేనూ వీటిలాగానే అయిపోతాను" అనిపించేది. తన ఆ ఆలోచనల కారణంగా అది చిన్నపిల్లలతోటి, ముసలి కుక్కలతోటీ పోట్లాడటం మానేసింది. తనకు దొరికిన ఆహారంలోనే కొంత భాగాన్ని వాటికోసం వదలసాగింది. మెల్లగా ముసలి కుక్కలు, చిన్న కుక్కలు టామీని ఇష్టపడటం మొదలెట్టాయి.


ఒక్కోసారి దాని మంచితనాన్ని బలహీనత అనుకొని చిన్నచూపు చూసే కుర్ర కుక్కలు ఎదురయ్యేవి దానికి. అలాంటివాటితో మటుకు అది ప్రాణాలకు తెగించి పోరాడేది. వాటి మీద తన బలాన్ని నిరూపించుకునేది. రాను రాను టామీకి తన పద్ధతి మంచిది అన్న నమ్మకం కలిగింది. ఇప్పుడు అది తనకు ఎక్కడ ఆహారం దొరికినా, మిగతా కుక్కలన్నిటినీ పిలవటం, కలిసి తినటం మొదలుపెట్టింది. బలం ఉన్న కుక్కలు బలహీనుల్ని కరవబోతే కూడా తను అడ్డుకొనసాగింది. ఆ క్రమంలో దాని అనుచరులు కూడా అదే పని చేయసాగాయి. అలా ఉన్నదాన్ని తోటి కుక్కలతో పంచుకొని తింటూ పెద్దయిన క్రొత్త తరం కుక్కలకు అట్లా పంచుకొని తినటమే అలవాటయింది! ఇప్పుడు ఆ ఊరి కుక్కలు ఆహారం కోసం అసలు కొట్లాడుకోవు! దొరికిన ఆహారాన్ని అన్నీ‌ కలిసి తింటాయి! వాటి నైజమే మారిపోయింది!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


నేనూ, మా అన్న ఉండేవాళ్ళం, మా యింటికల్లా పిల్లలం. మా ఇంటికెవరేనా పిల్లలొస్తే మాకెంతో సంతోషంగా ఉండేది. ఎవరూ లేనప్పుడు, మేం చదవనప్పుడూ మేమిద్దరం ఆడుకునేవాళ్లం....
Mar 2, 2020
పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. ...
Dec 18, 2019
తీరిన కష్టం
Aug 8, 2019
నన్ను కాపాడిన పిల్లి
Aug 27, 2019
అంతరంగ ఆలోచన..!!
Aug 8, 2020
అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు.
Apr 29, 2019
"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
May 13, 2019
పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట
Apr 8, 2019
రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు..
Feb 23, 2019
పట్టువదలని విక్రం తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి, బేతాళాన్ని భుజంపైన వేసుకొని...
Feb 18, 2019
TeluguOne For Your Business
About TeluguOne