Facebook Twitter
తిట్టు కవిత్వం

తిట్టు కవిత్వం

 


మనసులో ఉన్న భావాలను కాస్త సృజనాత్మకంగా వెలువరించే ప్రయత్నమే కవిత్వం. అందుకనే కవిత్వ వస్తువుకి కానీ, కవిత్వ భాషకి కానీ పరిధులు ఉండవు. కాదేదీ కవితకనర్హం అంటూ శ్రీశ్రీ సెలవిచ్చినా, జంధ్యాల తన సినిమాలో తిట్లతోనే ఓ పాటని పెట్టినా చెల్లిపోయింది. అలా వైవిధ్యభరితంగా సాగే కవిత్వంలో ‘తిట్టు కవిత్వం’ కూడా ఓ భాగమే. దాని చరిత్రా పురాతనమే!

తెలుగులో తిట్టు కవిత్వానికి వేములవాడ భీమకవి నాంది వేశాడని చెబుతారు. ఇతను ఆదికవి నన్నయ్య సమకాలీకుడు కాబట్టి, తెలుగు కవిత్వం మొదలైనప్పటి నుంచే అందులో తిట్లు కూడా వచ్చేశాయని చెప్పుకోవచ్చు. భీమకవి తర్వాత వచ్చిన శ్రీనాధుడు తిట్టిన తిట్లు మనకి తెలిసినవే! ఒకానొక సందర్భంలో తనకి తాగేందుకు నీరు దొరకకపోవడంతో ఏకంగా ఆ శివుడినే తిట్టిపోశాడు శ్రీనాధుడు. బైరాగివైన నీకు ఇద్దరు భార్యలు ఎందుకు, నీ తలపై ఉన్న గంగను నాకు విడువు అంటూ ఆడిపోశాడు (సిరిగల వానికి జెల్లును/ దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్/ దిరిపెమున కిద్ద రాండ్రా/ పరమేశా గంగ విడుము పార్వతి చాలున్).

కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పేరొందిన కందుకూరి రుద్రకవి కూడా తిట్టు కవిత్వంలో ప్రసిద్ధుడే. కందుకూరి రుద్రకవి రాయలవారిని కలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదట. మంత్రులెవ్వరూ కూడా ఆయనకు సాయపడలేదయ్యే! చివరికి కొండోజి అనే క్షురకుని సాయంతో ఆయన రాయలవారి సమక్షానికి చేరుకున్నాడు. ఆ సందర్భంగా రుద్దరకవి- ‘ఎంగిలి ముచ్చు గులాములు/ సంగతిగా గులము జెరుప జనుదెంచిరయా/ ఇంగిత మెరిగిన ఘనడీ/ మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్’ అంటూ మంత్రులను నానాతిట్లూ తిట్టాడు.

రాయలవారి ఆస్థానంలో ఉన్న మరో మహాకవి తెనాలి రామకృష్ణుని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిందే! హాస్యానికి మారుపేరుగా, ఆ హాస్యం పండించే హడావుడిలో ఒకోసారి అపహాస్యాన్ని కూడా పండించేవాడుగా రామకృష్ణునికి పెట్టింది పేరు. అతన్ని అభాసుపాలు చేయాలని కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్’ అనే పూరణాన్ని అందిస్తారు. దానికి బదులుగా రామకృష్ణ కవి తిట్టిన తిట్లు వెండితెర మీద కూడా వినవచ్చు.

ఏదో నోటి నుంచి ఆశువుగా వెలువడిన కవిత్వంలో తిట్లు కలిశాయంటే అనుకోవచ్చు. మన శతకాలలో కూడా కావల్సినన్ని తిట్లు కనిపిస్తాయి. కొరగాని కొడుకుల దగ్గర నుంచీ, అక్కరకు రాని చుట్టాల వరకూ ఈ శతకాలలో అందరికీ తలాకాస్త వడ్డనా ఉన్నట్లు తోస్తుంది. ఇక తిట్లూ బూతులే వస్తువులతోనే కవితలు రాసిన చౌడప్ప వంటి వారల గురించైతే చెప్పనే అక్కర్లేదు.

మెచ్చుకోలైనా, తిట్టయినా అది ఒక హద్దు దాటనంతవరకూ... ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ప్రయోగించవచ్చు. అందుకే ‘నిందాస్తుతి’ పేరుతో కీర్తనలలో సైతం ఈ తిట్లు కనిపిస్తాయి. ఎవరో దాకా ఎందుకు దీనికి మన రామదాసు కీర్తనలే ఉదాహరణ. ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా/ ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా’ అని తన ఖర్చుల జాబితాని చదివి ‘నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా’ అంటూ ఆడిపోసుకుంటాడు. జీవితం పెట్టే బాధల్ని ఓర్చుకోలేక ఒకోసారి దేవుడిని కూడా తిట్టాల్సి వస్తుంది మరి! ఇక మామూలు కవిత్వంలో తిట్లు ఉండకూడదంటే ఎలా సాధ్యం!

- నిర్జర.