Facebook Twitter
పండుగలే పట్టుకొమ్మలు

పండుగలే పట్టుకొమ్మలు

పట్నం కోడలు పిల్లని
పండక్కి వెంటబెట్టుకు రమ్మని
ఉద్యోగం పేరుతో వలసబోయిన
కన్నబిడ్డకు పల్లెతల్లి కబురంపగానే
పక్షిరెక్కల విమానానికి పైకంగట్టి
పిల్లపాపలతోటి వచ్చి వాలిపోయె తనయుడు
ఉన్నపళంగా కొత్త ఉగాది ఉషస్సులా...!

కట్టుకోక తప్పదంటూ పతిదేవుడు
ప్రాధేయపడి ప్రేమతో పట్టుకొచ్చిన
పట్టుచీరను భారంగా చుట్టుకుని
ఆరురుచులకై ఎదురుచూస్తున్న
సపరివారాన్ని మెప్పించక తప్పక
ఉగాది పచ్చడిని నేర్పించమంటూ ఇల్లాలు
గూగుల్ తల్లిని అర్థించె పాట మరచిన శరత్ కోయిలలా...!

పళ్ళెంలోని చిల్లుగారెను ఆరగించ
అరచేతి వేళ్ళను విస్మరించి
ముళ్ళచెంచాలతో కుస్తీపడుతున్న
మనుమలను చూసి విస్తుపోయె
తరాలను తరచి చదివిన తాత !

తల్లిపాల తీపి ఎరుగని తరానికి
అంతర్జాలానికి అంకితమైన బాల్యానికి
వరసలు కలుపలేని వింత అజ్ఞానానికి
పండుగలే కదా సంస్కృతి పట్టుకొమ్మలు
ఉగాదులే కదా సాంప్రదాయపు సిరిమువ్వలు !

- లావణ్య లహారి