Facebook Twitter
జీవితాన్ని మార్చేసే The Art of War పుస్తకం

 

జీవితాన్ని మార్చేసే The Art of War పుస్తకం

 

 

 

2,500 సంవత్సరాల క్రితం రాసిన ఒక పుస్తకం ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తోంది. చదివిన ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోంది. అవడానికి యుద్ధానికి సంబంధించిన పుస్తకమే అయినా... జీవితమనే యుద్ధంలో విజయం సాధించేందుకు సాయపడుతోంది. ఈపాటికి పాఠకులకి ఆ పుస్తకం పేరు గుర్తుకువచ్చే ఉంటుంది. ఒకవేళ మర్చిపోయి ఉంటే... తిరిగి గుర్తుచేసుకునే ప్రయత్నం చేద్దాం. చైనా వీరుడు సన్జు (sun tzu) రాసిన The Art of War ని మరోసారి తల్చుకుందాం.
రాసింది అతనేనా!

యుద్ధం చేయడం ఓ కళ (The Art of War) అనే పుస్తకాన్ని ఎప్పుడో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో రాశారని చెబుతారు. అప్పట్లో హెలూ అనే రాజు దగ్గర సన్జూ సైన్యాధ్యక్షునిగా ఉండేవాడట. ఆయనే ఈ పుస్తకాన్ని రచించారని ఓ నమ్మకం. అయితే ఈ పుస్తకం మరీ అంత పాతదేమీ కాదనీ, సన్జూ దీనిని రాయలేదనీ, అనాదిగా చైనా యుద్ధవీరులు ఆచరిస్తున్న సూత్రాలన్నీ కలిపి ఎవరో ఈ పుస్తకాన్ని సంకలనం చేశారనీ చాలారోజులు వాదించేవారు. కానీ సన్జు అనే వీరుడు నిజంగా ఉన్నాడనీ, ఆయనే ఈ పుస్తకాన్ని రాశాడని చెప్పేలా ఈ మధ్యకాలంలో కొన్ని తవ్వకాలు రుజువుచేస్తున్నాయి.
అంతగా ఏముంది?

The Art of War పుస్తకంలో మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్క అధ్యాయంలో యుద్ధానికి సంబంధించిన ఒకో తంత్రం గురించి రాసుకొచ్చారు. ఉదాహరణకు- యుద్ధానికి సిద్ధపడటం ఎలా అని మొదటి అధ్యాయంలో ఉంటే, శక్తిని వినియోగించుకోవడం ఎలా అని ఐదో అధ్యాయం చెప్పుకొస్తుంది. పరిస్థితులని బట్టి వ్యూహాలను మార్చుకోవడం ఎలా, గూఢచారులను ఎలా వినియోగించుకోవాలి, సైన్యాన్ని ఎలా వాడుకోవాలి... ఇలా ఒకటేమిటి! ప్రతి అధ్యాయమూ ఓ ఉపయుక్తమైన విషయంతో నడుస్తుంది.

అనుభవమే పుస్తకంగా

సన్జు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న తన రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడాడని ప్రతీతి. ఆఖరికి రాజసభలో నాట్యం చేసే నేట్యకత్తెలతో కూడా ఒక అద్భుతమైన సైన్యాన్ని నిర్మించాడట. ఆ ప్రతిభను గమనించిన రాజుగారు సన్జుని సర్వసైన్యాధ్యక్షునిగా నియమించాడని చెబుతారు. అలా యుద్ధతంత్రంలో తనకి ఉన్న అనుభవాన్నంతా రంగరించి సన్జు ఈ పుస్తకాన్ని రాశాడన్నమాట!

ఆసియా నుంచి అమెరికా వరకు

The Art of War పుస్తకం చైనాలో గొప్ప ప్రచారం పొందింది. రాజు దగ్గర నుంచి సైనికుడి దాకా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. క్రీ.శ ఎనిమిదో శతాబ్దం నాటికి ఈ పుస్తకం జపాన్, కొరియా వంటి ప్రాంతాలలో కూడా అద్భుతాలు చేయడం మొదలుపెట్టింది. క్రమేపీ ఈ పుస్తకం ఆసియాను దాటుకుని ఇతర దేశ భాషలలోకి అనువాదం కాసాగింది. దానిని చదివన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకునిగా మారింది. అలా నెపోలియన్ అద్భుతాలు సాధించేందుకు ఈ పుస్తకమే కారణం అని చెబుతారు. అంతదాకా ఎందుకు? ఈ మధ్యనే గల్ఫ్ యుద్ధంలో అమెరికా విజయం సాధించేందుకు కూడా అప్పటి అమెరికా సైన్యాధ్యక్షుడు కొలెన్ పావెల్ ఈ పుస్తకాన్ని అనుసరించడమే కారణమట! చైనా దేశస్తులు దేవుడిగా కొలుచుకునే మావోని ప్రభావితం చేసింది కూడా ఈ పుస్తకమే అని ఓ ప్రచారం ఉంది.

ప్రతి సందర్భంలోనూ!

20వ శతాబ్దంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత పెరగడంతో The Art of Warకి కూడా ప్రచారం పెరిగిపోయింది. ఆ పుస్తకాన్ని జీవితంలోని ప్రతి సందర్భంలోనూ వినియోగించే ప్రయత్నం మొదలైంది. లాయర్లు అద్భుతంగా వాదించడానికీ, వ్యాపారంలో ముందుకు దూసుకుపోవడానికీ, ఆటల్లో గెలవడానికీ... ఆఖరికి అమ్మాయిలను డేటింగ్కు పిలవడానికి కూడా ఈ పుస్తకంలోని సూక్తులను ఆచరిస్తున్నారు. అంతదాకా ఎందుకు? ఈ మధ్యనే ఒక సినిమాలో వినిపించిన ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు’ అన్న మాట The Art of Warలో కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన సందేశాలు ఆ పుస్తకంలో అడుగడుగునా పలకరిస్తాయి.

ఇంత గొప్ప పుస్తకం కేవలం 100 పేజీల లోపే ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. పైగా పెద్దగా ఖరీదు కూడా చేయదు. మరెందుకాలస్యం? వెంటనే ఈ పుస్తకాన్ని కొనేయండి. లేదంటే ఇంటర్నెట్లో అయినా ఈ పుస్తకం పీడీఎఫ్ ఉచితంగా లభిస్తుంది. ఓసారి చదివి చూడండి!!

- నిర్జర.