Facebook Twitter
జీవితాన్ని పాడుచేసే పుస్తకం - The Anarchist Cookbook

 

జీవితాన్ని పాడుచేసే పుస్తకం - The Anarchist Cookbook

 

 

ఆయుధాన్ని ఉపయోగించడం చేతకాకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అక్షరాన్ని ఉపయోగించడం చేతకాకపోతే పనికిరాని పుస్తకం తయారవుతుంది. దాంతో సమాజమే ప్రమాదంలో పడిపోతుంది. అందుకు ఓ గొప్ప ఉదాహరణ The Anarchist Cookbook.

 

అది 1969. వియత్నాం యుద్ధంలో అమెరికా తలమునకలైపోయి ఉన్న సమయం. అప్పటికి ఆ యుద్ధం మొదలై 15 ఏళ్లు కావస్తోంది. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం మధ్య మొదలైన గొడవ ఇంచుమించు ఓ ప్రపంచయుద్ధంగా మారిపోయింది. చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాలన్నీ ఉత్తర వియత్నాంకు మద్దతు ఇవ్వగా... అమెరికా, ఆస్ట్రేలియా వంటి కమ్యూనిస్టేతర దేశాలన్నీ దక్షిణ వియత్నాంకు మద్దతునిచ్చాయి. కేవలం అమెరికా పట్టుదల కోసం సాగుతున్న ఈ పోరులో వేలాదిమంది అమెరికన్ పౌరుల పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాది మంది నిష్కారణంగా వికలాంగులవుతున్నారు.
వియత్నాంలో తాము ఓడిపోతున్నామని అమెరికాకు తెలుసు. కానీ వెనకడుగు వేస్తే తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందో అన్న అహంకారంతో గుడ్డిగా యుద్ధభూమిలోనే నిలిచి ఉంది. దాంతో అమెరికా ప్రభుత్వం పట్ల అక్కడి పౌరులలోనే చెప్పలేని ఆగ్రహం మొదలైంది. తమ ఆగ్రహాన్ని వెలగక్కేందుకు ఏం చేయాలో వారికి పాలుపోలేదు. చిత్రవిచిత్రమైన అలవాట్లు, పద్ధతులను అనుసరిస్తూ... రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామనే భ్రమలో బతకసాగారు. దీనినే COUNTER CULTURE ERA అంటారు. మరోవైపు ప్రభుత్వం మీద నరనరాన విద్వేషాన్ని పెంచుకునే అరాచకవాదులకూ (ANARCHISTS) లోటు లేకుండా పోయింది.

 

ఆ కాలంలో అమెరికా ప్రజలందరిలోనూ ఉన్న దుగ్థ ‘విలియం పావెల్’ అనే వ్యక్తిలోనూ ఉంది. ఆ ఆగ్రహానికి అక్షరరూపం ఇచ్చేందుకు ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఒక పుస్తకం రాయడం మొదలుపెట్టాడు. The Anarchist Cookbook పేరుతో 1971లో ఆ పుస్తకం ప్రచురింపబడింది. సవాలక్ష పుస్తకాలలో ఇది కూడా ఒకటి కాబోసు అనుకుని దాన్ని చేతిలోకి తీసుకున్నవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. కారణం! ఆ పుస్తకం అంతటా అరాచకం ఎలా చేయాలో తెలియచేసే సూచనలే ఉన్నాయి.

 

గంజాయి మొక్కలని పెంచడం ఎలా, మాదక ద్రవ్యాలని తయారుచేయడం ఎలా, అందుబాటులో ఉండే మందులతో నషాని పొందడం ఎలా... లాంటి ఉపాయాలతో ఈ పుస్తకం మొదలవుతుంది. ఇక రెండో అధ్యాయంలో సమాచార వ్యవస్థను నాశనం చేయడం, ఇతరుల సంభాషణల మీద నిఘా పెట్టడంలాంటి వివరాలు ఉంటాయి. మూడో అధ్యాయంలో కత్తుల దగ్గర నుంచీ తుపాకీల దాకా రకరకాల ఆయుధాలను ఉపయోగించడంలో మెలకువలు కనిపిస్తాయి. నాలుగో అధ్యాయంలో సులువుగా దొరికే వస్తువులతో బాంబులు తయారుచేయడం, వాటితో విధ్వంసం సృష్టించడం కనిపిస్తుంది.

 

The Anarchist Cookbook పుస్తకం అమెరికా అంతటా ప్రకంపనలు సృష్టించింది. చాలా ప్రదేశాలలో ఆ పుస్తకాన్ని నిషేదించారు. ఆ పుస్తకం ఎంత ప్రమాదకరమో పేర్కొంటూ FBI ఒక నివేదిక రూపొందించింది. అందులో బాంబుల తయారీ విధానాలలో చాలా లోటుపాట్లు ఉన్నాయనీ... వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తే, తయారుచేసేవారే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందనీ హెచ్చరికలు వినిపించాయి.

 

మరోవైపు ఆ పుస్తక రచయిత మనసు కూడా మారింది. తాను ఏదో కోపంలో రాశాననీ ఆ పుస్తకాన్ని ప్రచురించడం ఆపివేయమనీ ప్రచురణకర్తలను కోరాడు. కానీ ఏం లాభం! పుస్తకం మీద కాపీరైట్ ప్రచురణకర్త వద్దే ఉండటంతో... లాభాలు తెచ్చిపెడుతున్న ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేందుకు ఒప్పుకోలేదు. ఆ కాపీరైట్ వేరొకరి చేతికి వెళ్లిన తర్వాత కానీ అందులోని వివాదాస్పద విషయాలను తొలగించలేదు. కానీ ఈలోగా ఇంటర్నెట్ ప్రభంజనం వచ్చేసింది. The Anarchist Cookbook పీడీఎఫ్ కాపీ విచ్చలవిడిగా ఆనలైన్లో దొరకడం మొదలైంది.

 

ఎవరికన్నా జీవితంలో అసంతృప్తి, సమాజం మీద కోపం ఉన్నప్పుడు... దాన్ని ఎలా వెళ్లగక్కాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటివారి చేతికి The Anarchist Cookbook దొరికితే ఇంకేమన్నా ఉందా! అందుకనే చాలా సందర్భాలలో విచక్షణారహితంగా అమాయకుల మీద కాల్పులు జరిపేవారి దగ్గరా, బాంబులు తయారుచేసే వారిదగ్గరా ఈ పుస్తకం కనిపిస్తోంది. నోరు జారిన మాటలాగానే, చేయి జారిన అక్షరాన్ని కూడా వెనక్కి తీసుకోలేమని నిరూపిస్తోంది.

- నిర్జర.