Facebook Twitter
జ్ఞానం-పాండిత్యం

జ్ఞానం-పాండిత్యం 

 


అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది. మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు. వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా.

ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమైందని అనుకున్నారు త్యాగయ్యగారు. కొద్ది సేపు అవీ-ఇవీ మాట్లాడిన తర్వాత వాళ్ళలో మొదటి పండితుడు స్నానాల గదిలోకి వెళ్ళాడు, స్నానం చేసేందుకు.

అంతలో రెండవ పండితుడు రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి త్యాగయ్యతో ఇలా అన్నాడు: "ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు చూశారా, పైకి పండితుడు! కానీ నిజానికి వీడు ఒక దున్నపోతు. ఆధ్యాత్మిక జ్ఞానం ఏమాత్రం లేదు వీడికి. వట్టి అహంకారి. ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప, జ్ఞానం అంటే ఏంటో తెలీదు వీడికి. నా సరసన వీడు ప్రసంగించడం కూడా ఇష్టం లేదు నాకు!" అని.

అంతలో మొదటి పండితుడు స్నానం ముగించుకొని వచ్చాడు. రెండోపండితుడు లేచి స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇప్పుడు మొదటి పండితుడి వంతు వచ్చింది. అతను త్యాగయ్యతో గుసగుసగా అన్నాడు: "ఈ గాడిదను ఎందుకు పిలిపించారు? వీడికి ఏ జ్ఞానం ఉందని మీరు భావించారు? వీడికి "అహం జాస్తి, సంస్కారం నాస్తి". ఎన్ని జన్మలు ఎత్తినా నాతో వీడు సమం కాజాలడు" అని.

ఇద్దరి మాటల్నీ మౌనంగా విన్నారు త్యాగయ్యగారు. కొంతసేపటికి పండితులిద్దర్నీ భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరికీ ఎత్తైన పీటలు వేసి, ప్రత్యేకంగా తెప్పించిన మంచి అరటి ఆకులు వేసి కూర్చోబెట్టారు. ఇద్దరూ భోజన ప్రియులు కావటంతో ఎట్లాంటి వంటకాలు రానున్నాయో అని ఊహించుకుంటూ‌ కూర్చున్నారు. అంతలో వడ్డించేవాళ్ళు వచ్చి హడావిడి చేస్తూ ఇద్దరి అరిటాకులలోనూ గడ్డి, చిత్తు కాగితాలు, ఆకులు, అలములు వడ్డించారు. "మీకు ఇష్టమైనవేవో కనుక్కొని మరీ ప్రత్యేకంగా చేయించాను. తినండి తినండి" అన్నారు త్యాగయ్యగారు దగ్గర కూర్చొని. పండితులిద్దరు ఆశ్చర్యపోయారు. ఆగ్రహించారు. చటుక్కున లేచి నిల్చున్నారు- "ఏంటిది?! మమ్మల్ని ఇలా అవమానించడానికా, మీ ఊరికి పిలిపించింది?" అని గట్టిగా అరిచారు.

 

త్యాగయ్యగారు చిరునవ్వు నవ్వుతూ అన్నారు: "అయ్యా! తమరు ఇద్దరూ ఒకరికొకరు మిత్రులని లోక ప్రసిద్ధం. వారు మాతో ముచ్చటిస్తూ తమరిని 'దున్నపోతు' అన్నారు. తమరేమో 'వారు గాడిద' అని శలవిచ్చారు. 'సర్వజ్ఞులైన పండితులు కదా, తమరు; తమరి నిజ స్వభావాలకు తగిన భోజనమే చేస్తారేమో, మనుష్యులు తినే ఆహారం పెడితే తినరేమో' అనుకొని, ఎవరేది తింటారో కనుక్కొని, ఎంతో శ్రమపడి మరీ తెప్పించాను. తినండి తినండి" అని.

పండితులిద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. తమలోని అహంకారాన్ని గుర్తించి ఇద్దరూ త్యాగయ్యగారికి క్షమాపణలు చెప్పారు. త్యాగయ్యగారు వారిని మన్నిస్తూ "విజ్ఞులు, పెద్దలు- తమరే నన్ను మన్నించాలి. చిన్నతనంకొద్దీ చొరవ తీసుకున్నాను తప్ప, మరోలా అనుకోకండి" అని వాళ్లను తగిన విధంగా సత్కరించి పంపారు.ఆరోజు సాయంత్రం పండితులిద్దరూ ఔదార్యం గురించీ, జ్ఞానం గురించీ జనరంజకంగా ఉపన్యసించారు!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో