Facebook Twitter
శతకం రాసిన రాజు – భద్రభూపాలుడు

 

శతకం రాసిన రాజు – భద్రభూపాలుడు

 


తెలుగు సాహిత్యంలో శతకాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి లోకాన్ని తరచి చూసిన అనుభవాన్ని నాలుగంటే నాలుగు వాక్యాలలో పాఠకులకు అందించేదే శతక పద్యం. ఈ శతకాల గురించి ప్రస్తావన రాగానే ముందు వేమన శతకమే గుర్తుకువస్తుంది. కానీ వేమనకు ఓ మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రజలను ఉర్రూతలూగించిన శతకం సుమతీ శతకం!

నిజానికి సుమతీ శతకం ఎవరు రాశారన్న విషయం మీద ఏకాభిప్రాయం లేదు. వేమన, గువ్వల చెన్నా లాంటి శతకాలలోలాగా ఎక్కడా కూడా శతకకారుని ప్రస్తావనే కనిపించదు. కానీ చాలామంది అభిప్రాయం మేరకు ‘భద్ర భూపాలుడు’ అనే వ్యక్తి ఈ పద్యాలను రాసి ఉంటాడు. ఈయననే బద్దెన అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని అనువదించిన తిక్కన మహాకవికి ఈయన శిష్యుడని ఓ నమ్మకం.

బద్దెన 13 శతాబ్దంలో జీవించాడు. ఒకవేళ ఈయనే కనుక సుమతీ శతకాన్ని రాసి ఉంటే... తెలుగులో శతక సాహిత్యానికి నాంది పలికిన కవులలో ఈయన ఒకరై ఉంటారు. నలుగురికీ మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో బద్దెన ఈ శతకాన్ని రాసినట్లు అర్థమవుతుంది. అందుకే ఈ శతకంలోని ప్రతి పద్యంలోనూ ‘సుమతీ’ (మంచి బుద్ధి కలవాడా) అన్న మకుటం కనిపిస్తుంది.

భద్రభూపాలుని కాలం అటు రుద్రమదేవి కాలంతోనూ, ఇటు తిక్కన కాలంతోనూ సరిపోతోంది. కాబట్టి ఆయన తిక్కన శిష్యుడనీ, రుద్రమకు సామంత రాజు అనీ వినిపించే వాదనలు నిజమే కావచ్చు. 700 సంవత్సరాలకు పూర్వం ఈ శతకాన్ని రాసినా... అందులోని భాష కఠినంగా కనిపించదు. పైగా అందులోని అభిప్రాయాలు చాలా నిష్కర్షగా వెల్లడించినట్లు తోస్తుంది. కాబట్టి ఇది ఎవరో పండితుడు కాకుండా లోకరీతి తెలిసిన నాయకుడే రాసినట్లు అర్థమవుతుంది.

సుమతీ శతకం, వందల సంవత్సరాలుగా పిల్లలకు ఒక Moral Scienceలాగా ఉపయోగపడుతోంది. అసలు పద్యాలు అన్న ఊసే తెలియని వారికి కూడా తన కోపమె తన శత్రువు, ఉపకారికి నుపకారములాంటి పద్యాలు గుర్తుండే ఉంటాయి. ఇక అప్పిచ్చువాడు వైద్యుడు, కనకపు సింహాసనము లాంటి వాక్యాలైతే ఏకంగా జాతీయాలుగా మారిపోయాయి. 

అలాగని సుమతీ శతకంలో లోపాలూ లేవని కాదు. కొన్ని పద్యాలలో ఆడవాళ్ల పట్ల చాలా దురుసైన మాటలు కనిపిస్తాయి, మరికొన్ని పద్యాలలో కొన్ని కులాల పట్ల చాలా చులకన భావం వ్యక్తమవుతుంది. ఇంకొన్ని పద్యాలు పిల్లలు చదవదగ్గవిగా ఉండవు. ఇలాంటివి పక్కన పెడితే... తరతరాల పాటు తెలుగువారికి చెరిగిపోని నిధిలా సుమతీ శతకం కనిపిస్తుంది. భద్రభూపాలుడు కత్తితో ఏలిన రాజ్యం కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. కానీ ఆయన కలంతో ఏలిన సాహిత్య సామ్రాజ్యం సుస్థిరంగా నిలిచే ఉంటుంది.

 

- నిర్జర.