Facebook Twitter
తెలుగులో తొలి శతకం ఏమిటో తెలుసా!

తెలుగులో తొలి శతకం ఏమిటో తెలుసా!

 

శతకం అనే ప్రక్రియ కేవలం తెలుగువారికి మాత్రమే ప్రత్యేకం కాదు. కానీ మిగతా సాహితీప్రక్రియలతో పోల్చుకుంటే.... తెలుగువారికి శతక సాహిత్యం అంటే మక్కువ ఎక్కువేమో అనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా వెలువడుతూ వస్తున్న వేలకొద్దీ శతకాలే ఇందుకు సాక్ష్యం. అంతేనా! మూఢాచారాలను ఎదిరించడంలోనూ, మనసుని వైరాగ్యంలో ముంచేయడంలోనూ మన శతకాలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. అందుకు వేమన శతకమే గొప్ప ఉదాహరణ. ఇప్పటికీ వేమన సాహిత్యాన్ని విప్లవ సాహిత్యానికి దీటుగా భావిస్తుంటారు. ఇంతకీ తెలుగునాట ఈ శతకాలకి నాంది పలికింది ఎవరో!
తెలుగులో మొదటి శతకం ఏమిటన్న విషయం మీద కొన్ని వాదోపవాదాలు లేకపోలేదు. అయితే సాంకేతికంగా శతకానికి ఉండాల్సిన అన్ని లక్షణాలతో వెలువడిన మొదటి శతకం ‘వృషాధిప శతకం’ అంటారు. దీని రచయిత పరమ శివభక్తుడైన పాల్కురికి సోమనాథుడు. ఈయన 12వ శతాబ్దంలో వరంగల్లుకి సమీపంలోని పాల్కురికి అనే గ్రామంలో జన్మించారన్నది కొందరి వాదన.


పాల్కురికి జీవించే సమయంలో వీరశైవం ఉధృతి మీద ఉంది. సహజంగానే అది సోమనాథుని మీద ప్రభావం చూపింది. దాంతో పాల్కురికి, వీరశైవునిగా మారి సాహిత్యం ద్వారా తన మతాన్ని ప్రచారం చేయడంలో మునిగిపోయాడు. తెలుగుతో పాటుగా ఇటు కన్నడము, అటు సంస్కృతంలోనూ శివభక్తిని ప్రచారం చేసే రచనలు చేశాడు. ముఖ్యంగా శివభక్తుల చరిత్రను వర్ణిస్తూ ఆయన రాసిన ‘బసవపురాణం’ చాలా ప్రసిద్ధచెందింది. అలాగే పండితారాధ్యడనే భక్తుని జీవితం గురించి రాసిన ‘పండితారాధ్య చరిత్ర’కి కూడా తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం ఉంది. ఈ రెండు కావ్యాలూ సామాన్యులకి సైతం అర్థమయ్యేలా ద్విపదలో (రెండే పాదాలు ఉండే పద్యం) రాయడం విశేషం. ఈ రెండూ భక్తి ప్రధానమైన కావ్యాలే అయినప్పటికీ వీటిలో ఆనాటి ప్రజల జీవనశైలి, సంస్కృతి గురించి చాలా విస్తృతమైన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ రెండు కావ్యాలనూ చదివితే 12వ శతాబ్దంలో తెలుగు ప్రజల జీవితం ఎలా ఉండేదో తెలిసిపోతుందని అంటారు చరిత్రకారులు.


సోమనాథుడు శివుని స్తుతిస్తూ రాసిన ‘వృషాధిప శతకం’ మిగతా రచనలకు ఏమాత్రం తీసిపోకుండా కనిపిస్తుంది. ఇందులో శివుని కీర్తించే వేలాది పదాలు ఆశువుగా దొర్లిపోతుంటాయి. కావాలంటే ఒకటి చదివి చూడండి..


భక్తిరసాభిషిక్త! భవపాశవితాన విముక్త! జంగమా
సక్త! దయాభిషిక్త! తనుసంగతసౌఖ్యవిరక్త! సంతతో
ద్యుక్త గుణానురక్త! పరితోషితభక్త! శివైక్యయుక్త! ప్ర
వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
ఒక్కసారి ఈ వృషాధిప శతకాన్ని చివరి వరకూ చదివామంటే... ఎంతటివారికైనా భాష మీదా, భావం మీదా పట్టు వచ్చేయడం ఖాయం.