Facebook Twitter
అతడు-ఆమె-ఆకాశం

అతడు-ఆమె-ఆకాశం  

 

ఆమె కళ్ళ మెరుపు వల్లే వెన్నెల మెరుస్తుందా అన్నట్లుగా, నిర్మలంగా ఆకాశం వైపు చూస్తోంది ఎప్పట్లాగే. 
"ప్రేమంటే ఏమిటో తెలుసా?" అడిగింది.
"అదో బ్రహ్మ పదార్థం" చెప్పాడు.
"పుట్టుక, చావుల మధ్య జీవితం ఓ చిన్న గీత. అందులో ప్రేమెంత? ఓ చుక్కంత."
" ఆ మాత్రం చుక్కకి అల్లాడుతారు మనుషులు"
ఆమె నవ్విందో, లేదో ఓ వెలుగురేఖ పడి మోము మెరిసినట్టైంది " ఎన్నో చుక్కలు కలిస్తేనే కదూ ఈ సరళరేఖ.. ఈ జీవితం! "
సరళరేఖలు, వృత్తాలు, త్రికోణాలు విరక్తేమో, అతను చూపు మళ్ళించాడు. ఒంటరి పక్షి ఒకటి, గోధూళి దాటినా రాని తన జంట పక్షి కోసం చూస్తూ, ఏదో చెప్తున్నట్టుంది. బహుషా " ప్రేమంటే భరోసా" అని అంటున్నట్టుంది.
అతనికి అర్థమయివుండదు. పరదా మూసివేశాడు. ఆమె వినీ, విననట్టుందేమో లేదా వినాలనుకోవడంలేదేమో..
ఈ సారి రేడియోతో పాటూ, ఆమె గొంతు శృతి చేసుకుంది 
" ఆద్యంతమూ లేని అమరనాదమే ప్రేమ 
ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ "

 

- సరిత భూపతి