Facebook Twitter
దసరా పద్యం వెనుక కథ

దసరా పద్యం వెనుక కథ!

 


ఇప్పుడంటే గురువులకి తగినంత జీతం దక్కుతోంది. పీఆర్‌సీలు, యూజీసీ స్కేళ్ల పేరుతో పస్తులుండే బాధలు తప్పుతున్నాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఉపాధ్యాయులు పని చేయడానికి వీధిబడులే ఎక్కువగా కనిపించేవి. ఆ వీధిబడిలో చేరిన పిల్లల తల్లిదండ్రులు ఏదో మొక్కుబడిగా ఫీజులు చెల్లించుకునేవారు. తల్లిదండ్రులు జాలితలిస్తేనే పూట గడిచేది. ‘డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లవాడికి చదువు చెప్పను’ అంటూ గట్టిగా గదమాయించలేని పరిస్థితి. అందుకే ‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడి వినిపించేది.

 

ఇలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయులు కాస్త డబ్బుని ఆర్జించడానికి దసరా ఓ సందర్భాన్ని కల్పించేది. ఈ సమయంలో తమ బడిలోని పిల్లలందరినీ వెంటబెట్టుకొని ఇంటింటికీ తిరిగి కానుకలను తీసుకునేవారు గురువులు. పిల్లలు గిలకల పేరుతో పూల బాణాలను తీసుకుని గురువుగారి వెంబడి బయల్దేరేవారు. ఇన్ని పండుగలు ఉండగా దసరాలోనే ఇలా ఎందుకు అనేదానికి కూడా ఒక కారణం కనిపిస్తుంది. యుద్ధకౌశలానికైనా, జ్ఞానసముపార్జనకైనా అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నది పెద్దల నమ్మకం. ఆ నమ్మకంతోనే దసరా సందర్భంలో యుద్ధవిద్యలను ప్రదర్శించేవారు. అలా విద్యలను ప్రదర్శించే కాలం కాస్తా చందాలు సేకరించే సమయంగా మారిపోయి ఉండవచ్చు.

 

ఊళ్లో గురువుగారి వెంట వెళ్లే పిల్లలు తమ ఉపాధ్యాయుడికి తగిన కానుకలు ఇమ్మంటూ రకరకాలుగా అర్ధించేవారు. వాటిలోని ‘అయ్య వారికి చాలు ఐదు వరహాలు/ పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు’ అన్న చరణం అందరికీ తెలిసిందే! ఇక మిగతా పంక్తులు చిన్నా చితకా మార్పులతో ఇలా సాగేవి.

 

‘ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టు పచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు’
ఇదే పద్యం మరో రూపంలో...
‘ఏ దయా మీ దయా మా మీద లేదు,
ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,
ముప్పావలా అయితే ముట్టేది లేదు,
హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు’
ఇంతే కాదు! టక్కున డబ్బు ఇవ్వని వారి దగ్గర ఒక రకమైన పద్యాలూ, అర్ధించేవారిని చులకనగా కసురుకునేవారికి ఒకరకమైన పద్యాలు... ఇలా పిల్లు పాడే దసరా పద్యాలలో చాలా సాహిత్యమే కనిపిస్తుంది. నయానో భయానో ఎలాగొలా దక్షిణను అందుకున్న తర్వాత ‘జయీభవా...దిగ్విజయీభవా’ అని దీవిస్తూ ముందుకు సాగిపోతారు.

 

ఈ దసరా వేడుకలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. గురువుల స్థితి మెరుగుపడింది, విద్యార్థుల నామోషీ పెరిగిపోయింది. కానీ దసరా మామూలు పేరుతో ఈ సంప్రదాయాన్ని ఇతరులు మాత్రం బాగానే ఉపయోగించుకుంటున్నారు. పాలవాడు దగ్గర నుంచి పనిమనిషి దాకా ఇస్తారా చస్తారా అంటూ ‘మామూళ్ల’ని దర్జాగా పుచ్చేసుకుంటున్నారు.

- నిర్జర.