Facebook Twitter
నాక్కావాలిప్పుడు

నాక్కావాలిప్పుడు

 

 

కనురెప్పలు పడే శబ్దం నుంచి
మది ఎదురీతల సందడి నుంచి
చీకటి అంతమయ్యే చిక్కదనం నుంచి
ఒకటి కావాలి నాకిప్పుడు


రాలే శిశిరాల శిఖలు
వాలే హేమంతపు జల్లులు
గుచ్చి గుచ్చే గ్రీష్మపు తాపాల నుంచి
ఒకటి కావాలి నాకిప్పుడు
నాకు నేను గా,


గావు కేక పెట్టినా
చావు పుట్టుకలు లేని
రాత కోతలుండని
రేయి పగలెరుగని
నిశ్శబ్దమొకటి కావాలిప్పుడు నాకు


నువ్వు వెతకలేని
నేను సైతం బయట పడలేని
లేదని నన్ను భ్రమింపచేసి
అశాశ్వత భ్రమల్లో నుంచి నన్ను 
శాశ్వత రాగాన్ని వినిపించే
నిశ్శబ్దమొకటి నాక్కావలిప్పుడు


నాక్కావాలి
నాకే కావాలి
నాకై వాలాలి
హక్కై కురవాలి
ఆ నిశ్శబ్దమిప్పుడు
నా నిశ్శబ్దమెప్పుడూ

 

-రఘు ఆళ్ల