Facebook Twitter
నైనం ఛిన్దన్తి శస్త్రాణి

నైనం ఛిన్దన్తి శస్త్రాణి

 

 

తెల్లకాగితాల్లో ఇంకు.. ఉండలు చుట్టిన జీవితాన్ని 
రోజొకింత ఒంపుకోవటం చూశావా? 
ఏముందా రాతల్లో!? 
తలగడల సాక్ష్యాలైన తడి ఆరని గాథలో 
ఫాంటస్సీలై మెరిసిన విబ్జియార్ రంగుల కలలో

కటిక చీకట్లేనాడు కలగనని గతపు పొదలో 
ఒక నవ్వు భళ్ళున పగిలిన శబ్ధం 
హయ్యో! ఒట్టి పనికిమాలిన ఘోష ఇది అని 
ఎన్నెన్ని నిశీధులు వెర్రిగా చూసెళ్ళిపోయాయో మరి!

గగనవియత్శూన్యాలకు పయనించే ఓ మనిషీ! 
ఎన్నెన్ని చూస్తావో ఈ లోకంలో 
కానీ నువ్వివాళ పోతే రేపటికి రెండట! 

ఎంతెంత వేదాంతం.. 
నువ్వు విరబూసినా విలపించినా చీలిపోని ఆత్మకి 
ఏ సంఖ్యాశాస్త్రాలతో లెక్కలు అప్పజెప్పగలవు మరి! 
ఒట్టి వృథాప్రయాసే కదూ! 
ఆత్మను ఏ ఆయుధం చీల్చలేదు.. అవును 
నైనం ఛిన్దన్తి శస్త్రాణి 
నైనం దహతి పావకః

 

- సరిత భూపతి