Home » కథలు » తెలివైన కోతి!Facebook Twitter Google
తెలివైన కోతి!

తెలివైన కోతి!

 


అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ, మనుమడు ఉండేవాళ్ళు. ఒకరోజున అవ్వ సంతకు పోతుంటే, మనుమడు 'నేను కూడా వస్తా' అని ఏడ్చాడు. 'సరే, రా' అని, అవ్వ వాడిని వెంటబెట్టుకొని పోయింది. అక్కడ, సంతలో అవ్వ కూరలు బేరం చేస్తుంటే, మనుమడు అక్కడే ఉన్న కోతులను చూస్తూ నిలబడ్డాడు. ఆ కోతుల్లో ఒక పిల్లకోతి ఉన్నది. దానికి ఒక కాలుబాగా లేదు, పాపం. మిగిలిన కోతులన్నీ దాన్ని భయపెడుతుంటే, అది చెట్టు క్రిందికి దిగి, అక్కడే ముడుచుకొని కూర్చున్నది. మనుమడు దాన్ని చూసి జాలిపడి, అవ్వ తనకిచ్చిన అరటిపండును దాని చేతిలో పెట్టాడు. అది దాన్ని గబగబా తిని, ఇక వాడిని వదిలిపెట్టలేదు. అవ్వ, మనుమడు ఇంటికి వెళ్లినప్పుడు అదికూడా వాళ్ల వెంటే వచ్చింది. ఆపైన ఇక అది వాళ్ళ కుటుంబంలో భాగం అయిపోయింది.


ఒక ఆదివారంనాడు, అవ్వ మనుమడితో "ఒరే, ఈరోజు బడికి సెలవు. నువ్వు అడవికి వెళ్లి, పేడ పెటకలు పట్టుకురా, పో" అన్నది. వాడికి వెళ్లటం ఇష్టంలేక ఏడుస్తుంటే, కోతి ఒక గంప పట్టుకొని, తనొక్కతే అడవికి బయలుదేరింది. అక్కడ దానికి ఒక పాడుపడిన మిద్దె కనిపించింది. 'అందులో ఏముందో' అని, చూసేందుకని, అది మెద్దెపైకి ఎక్కింది. మిద్దెపైన చూస్తే చాలా బంగారం! వెంటనే అది ఆ బంగారాన్ని తన దగ్గరున్న గంపలో వేసుకొని, దానిమీద పేడ పెటకలు పెట్టుకుని, ఇంటికి పోయింది. నేరుగా ఇంటి లోపలికి పోయి, 'దించుకుందువు రా, అవ్వా' అని పిలిచింది అవ్వని. అవ్వా, కోతీ కలిసి గంపను కుమ్మరించి చూస్తే, ఏముంది?- గదినిండా బంగారమే! 'ఇంత బంగారం ఎక్కడినుంచి తెచ్చావే?' అని అడిగింది అవ్వ ఆశ్చర్యంగా. అప్పుడు కోతి అవ్వకు విషయం అంతా చెప్పింది. "అయ్యో, అది దొంగ ఉండే మిద్దే, నువ్వు బంగారం తెచ్చిన సంగతి తెలిసిందంటే దొంగ ఇక మనల్ని బతకనివ్వడు" అని భయపడింది అవ్వ. "నీకేం భయంలేదులే, అవ్వా! నేనున్నానుగా!" అని భరోసా ఇచ్చింది కోతి.

 


ఇక అక్కడ దొంగ తన బంగారం పోయిన సంగతిని గుర్తించి, "ఎవరబ్బా నా బంగారం ఎత్తుకెళ్ళారు, ఈసారి రానీ వాళ్ళ పని చెబుతాను" అని కాచుకు కూర్చున్నాడు. కొన్ని రోజుల తర్వాత, ఇదివరకులాగానే ఇంకొంచెం బంగారం ఏమన్నా దొరుకుతుందేమోనని, కోతి బయలుదేరి, మిద్దె పైకి ఎక్కింది. అక్కడ కాచుకు కూర్చున్న దొంగ వెంటనే దాన్ని పట్టుకున్నాడు - "నువ్వేనా, నా బంగారం తీసుకుపోయిన కోతివి! " అంటూ. అప్పుడు కోతి కిచకిచలాడుతూ "నన్నేం చెయ్యకు, నన్నేం చెయ్యకు! నీకు నా చెల్లినిచ్చి పెళ్ళి చేస్తాను" అన్నది. "ఇదేదో మంచి కోతులాట, బాగానే ఉందే, చూద్దాం, ఏమౌతుందో" అని, ఒప్పుకున్నాడు దొంగ. అప్పుడు కోతి ఇంటికెళ్లి, సంగతంతా అవ్వకు చెప్పింది. అందరూ కలిసి రెండు కేజీల గోధుమ పిండితో ఒక అమ్మాయి బొమ్మను చేశారు. కోతి ఆ బొమ్మను తీసుకొని, దొంగ దగ్గరకు వెళ్ళి "ఇదే, నా చెల్లి. ఈమెను ఈ గదిలో దింపి వెళ్తాను. మూడు రోజుల వరకూ ఈమెను ముట్టుకోవద్దు. రోజూ ఈమెకు అన్నం పెట్టి, గది తలుపులు మూసి వెళ్తూండు. మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తాను. ఆలోగా ఈమెకు ఏమైనా అయ్యిందో, నీ పని చెబుతాను" అని, వెళ్ళిపోయింది.


దొంగవాడు కోతి చేష్ఠలకు నవ్వుకున్నాడు. "ఈ పిండి బొమ్మకు రోజూ అన్నం పెట్టాలట!" అని, వాడు మూడురోజుల తర్వాత ఏం వినోదం జరుగుతుందో చూద్దామనుకున్నాడు. అయితే మూడో రోజున ఇంకా కోతి రాకుండానే వాడు వెళ్లి, పిండిబొమ్మ చెయ్యిముట్టుకుంటే- చెయ్యి విరిగిపోయింది. తలను ముట్టుకుంటే తల విరిగిపోయింది. అంతలో అక్కడికి వచ్చిన కోతి "అయ్యో! నా చెల్లిని చంపేశాడు! నా చెల్లిని చంపేశాడు! నన్ను అన్యాయం చేశాడు- దేవుడో! అవ్వో! రండి! రండి!‌ అందరూ రండి!" అని మొత్తుకున్నది. సిద్ధంగా ఉన్న అవ్వ, పోలీసుల్ని వెంటబెట్టుకొని పరుగెత్తుకొని వచ్చింది. పోలీసుల్ని చూసిన దొంగ కాలికి బుద్ధి చెప్పాడు, కానీ వెంటబడి పోలీసులు వాడిని పట్టుకుపోయారు. తమ పథకం పారినందుకు అవ్వ, కోతి చాలా సంతోషపడ్డారు. ఆపైన అందరూ హాయిగా జీవించారు.

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 


అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు, చేపలు ఉండేవి...
Jan 11, 2019
బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస...
Dec 31, 2018
ఏసుక్రీస్తు పుట్టటానికి ఆరువందల సంవత్సరాల ముందు గ్రీసు దేశంలో...
Dec 20, 2018
నల్లమల అడవుల్లో వీరసముద్రం చెరువు చుట్టుప్రక్కల పెద్ద పెద్ద ఏనుగుల గుంపులు...
Dec 17, 2018
అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఫకీర్‌ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు...
Dec 12, 2018
నక్క పాట
Dec 11, 2018
కొత్తపల్లిలో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి పక్షులన్నా, జంతువులన్నా...
Nov 24, 2018
అనగనగా పెద్ద కొండ ఒకటి ఉండేది. ఆ కొండ మీద అనేక రకాల వృక్షజాతులు జీవనం..
Nov 22, 2018
అనగనగా ఒక రాజు. ఆయన ఏ కొరత రానివ్వక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక బానిస ఉన్నాడు.
Nov 16, 2018
రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకడు హనుమంతుడు...
Nov 9, 2018
TeluguOne For Your Business
About TeluguOne