Facebook Twitter
తెలుగు కథకు గర్వకారణం – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

 

తెలుగు కథకు గర్వకారణం – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

 

 

గురజాడ, వీరేశలింగం తర్వాత తెలుగు కథను భుజానికెత్తుకున్న వ్యక్తిగా శ్రీపాదను విమర్శకులు వర్ణిస్తారు. తెలుగు కథలను చదవాలంటే వాటిలో తప్పనిసరిగా శ్రీపాదవారి కథలు కూడా ఉండాలని సాహితీవేత్తలు చెబుతారు. ఆయన రచనలు చదివినవారు... ఇలాంటి మాటలతో ఏకీభవించి తీరాల్సిందే!  ఈ నెల 23న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సందర్భంగా ఒకసారి ఆయనను మననం చేసుకునే ప్రయత్నం ఇది.

ఏప్రిల్ 23 1891 తూర్పుగోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించారు శ్రీపాద. పండిత వంశం కావడంతో ధర్మశాస్త్రాలూ, కావ్యాలూ నేర్చుకున్నారు. శ్రీపాద యవ్వనంలోకి అడుగుపెట్టేసరికి ప్రపంచంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వాతంత్ర్య ఉద్యమం మంచి ఊపు మీద ఉంది. పాశ్చాత్య నాగరికత ప్రభావం రోజువారీ జీవితంలో కనిపిస్తోంది. వేషభాషలు మారుతున్నాయి, ఆంగ్లభాష ప్రాధాన్యత పెరుగుతోంది, మతమార్పిడులు చోటు చేసుకుంటున్నాయి, అణగారిన వర్గాలు ప్రశ్నించడం నేర్చుకుంటున్నాయి. ఇలా ఒకటీ రెండూ కాదు, సవాలక్ష ద్వంద్వాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటికీ సాక్షిగా నిలిచిన శ్రీపాద... తన అనుభవాలకు, ఆ అనుభవాలు రేపుతున్న ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వసాగారు.

 

 

శ్రీపాద దాదాపు 75 కథలను రాశారని చెబుతారు. వీటిలో ఎక్కువభాగం అప్పటి అగ్రవర్ణాల అంతర్మధనంగానే కనిపిస్తాయి. శ్రీపాద ఒక వర్గానికే వ్యతిరేకంగా తన కలాన్ని ఎక్కుపెట్టినట్లు కనిపించినప్పటికీ... ఆయన ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు అవే కావడం చేత, అవే ఇతివృత్తాలను కథాంశంగా తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆయన బలం కూడా అదేనని తోస్తుంది. తను విన్న మాండలికాలు, పడికట్టు పదాలు, వాక్య నిర్మాణాలను యధాతథంగా సంభాషణల్లోకి చొప్పించడంతో సదరు కథలు సహజంగా తోస్తాయి. అందుకే తెలుగు భాష మీద పట్టు సాధించాలన్నా, ఒకప్పటి తెలుగు సమాజం మీద అవగాహన ఏర్పరుచుకోవాలన్నా తప్పకుండా శ్రీపాద కథలని చదవమని పెద్దలు చెబుతుంటారు.

శ్రీపాద కథలకి ఒక పరిమితి అంటూ కనిపించదు. ఇలా రాయాలని ఆయన మడిగట్టుకున్నట్లు తోచదు. ఒకసారి రాయడం అంటూ మొదలుపెడితే అది పది పేజీలలో ముగిసిపోవచ్చు. 60 పేజీలని దాటిపోవచ్చు. తను చెప్పదల్చుకున్న విషయాన్నంతా కాగితం మీద ఆవిష్కరించడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. అలాగని ఆయన కథలలో వర్ణనలు, కల్పనలూ కనిపించవు. సాదాసీదా సంభాషణలే కథని నడిపిస్తాయి. ఒకోసారైతే ఎలాంటి వివరణా లేకుండా పూర్తిగా సంభాషణలతోనే కథ నడుస్తుంది. అందుకు ‘బ్రాహ్మణాగ్రహారం’ అనే కథే గొప్ప ఉదాహరణ. పాఠకుడు ఇందులో కథని కేవలం సంభాషణల ద్వారానే వెతుక్కోవలసి ఉంటుంది.

 

 

శ్రీపాద సంప్రదాయవాది కాదు. అలాగని అప్పటి పరిస్థితుల మీద ఘాటైన వ్యాఖ్యానాలూ చేయలేదు. అప్పటి సమాజాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాఠకులకు చూపించే ప్రయత్నం చేశారు. ఆయనకు గాంధి అన్నా, ఖద్దరు అన్నా, హిందీ అన్నా ఇష్టం ఉండేది కాదని చెబుతుంటారు. ‘ఇలాంటి తువ్వాయి వస్తే’ కథ చదివితే అది నిజమే అనిపిస్తుంది. అందులో గాంధి, కాంగ్రెస్సు, హరిజనోద్ధరణ సంఘాలు, జాతీయ భాషగా హిందీని చేయడం, ఖద్దరు గురించి ప్రచారం... వంటి అంశాల మీద తన అసంతృప్తిని వెళ్లగక్కుతారు రచయిత.

శ్రీపాద రాసిన కథలలో చాలావరకు ప్రజాదరణ పొందినవే. గులాబి అత్తరు, షట్కర్మయుక్తా, వడ్లగింజలు, యావజ్జీవం హోష్యామి... ఇలా చెప్పుకొంటూ పోతే శ్రీపాద విశిష్ట రచనల జాబితా చాలా పెద్దగానే తేలుతుంది. ఇవే కాకుండా ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ పేరుతో ఆయన స్వీయానుభవాలు కూడా అప్పటి సమాజం గురించీ, దాని పట్ల ఆయన దృక్పథం గురించీ అవగాహన కలిగిస్తాయి.

మొత్తంగా చూస్తే- సరళమైన సంభాషణలు, కథలో స్పష్టత, కథనంలో నిబద్ధత... వెరసి శ్రీపాద కథలు ప్రతి ఒక్కరూ చదివితీరాల్సిన స్థాయిలో నిలుస్తాయి. ఆ కథలు ఉన్నంతవరకూ శ్రీపాద తెలుగువారికి అమరుడే!

- నిర్జర.