Facebook Twitter
పిచ్చుక జ్ఞాపకం

పిచ్చుక జ్ఞాపకం

 

 

బాగా గుర్తు, బాగా చిన్నపుడు
ఇంట్లోనే కాపురముండే పిచ్చుక జంటలు
చెడుగాలి పోయేందుకు పెట్టుకున్న
కన్నాల వెంటిలేటర్లలో గూళ్ళు కట్టుకునేవి
మాకింకా తెల్లవారకుండానే కిచకిచమనేవి


రోజంతా ఏ తెరిచి ఉన్న కిటికీ లోంచో తలుపులోంచో
వాళ్ళింట్లోకీ బయటకీ యధేఛ్చగా ఎగిరేవి
చలికాలమైనా సరే ఓకిటికీ వాటికోసం
తెరిచి ఉండేది, తెరచి ఉంచిన మనసుల్లా.
ఒకటా రెండా, మూడో నాలుగో జంటలు.


బియ్యంలో బెడ్డలు ఏరుతూ అమ్మ వేసే
వడ్ల గింజలు చక చకా తింటూ
నిముషాల్లో చుట్టూ మూగి టకటకా
బుజ్జి బుజ్జి అడుగుల్తో సంతోషానికి చిహ్నంలా ఉండేవి.

ఎంత ఆనందంగా ఉండేదో
ఇసుకలో అవిచేసే పొడి స్నానాలు
ఏ స్వఛ్చమైన చెరువులోనో
అల్లరిగా ఈత కొడుతూ చేసే సాయంకాలపు
తడి స్నేహాల స్నానాలను తలపిస్తూ.


నూనెలో వేగుతున్న జంతికల కోసం
పళ్ళేలు పట్టుకుని లొట్టలు వేస్తూ
నాకు ఫస్టంటే నాకు ఫస్టంటూ
అమ్మని తొందర పెట్టే మా అల్లరిలా
విచ్చుకున్న త్రిభుజాల్లా తెరుచుకున్న నోళ్ళతో
తల్లి పిచ్చుక మీదకెగిరే కూనలెంత ముద్దొచ్చేవని.


చందమామ కధల్లోని భేతాళుడి ప్రశ్నకి
ఎవరికి తోచిన జవాబు వాళ్ళు
గందరగోళంగా చర్చిస్తుంటే
వాటికేదో తెలిసినట్లు ఒకటే రొద పెట్టేవి.


మాలో మేము గొడవపడి ఒకళ్ళనొకరు
పిడిగుద్దులతో కుమ్ములాడుకుంటుంటే
అవి మాత్రం వాటి ముక్కులతో సుతారంగా
ఒకదాన్నొకటి ప్రేమగా ముద్దులు పెట్టుకుంటూ
తప్పర్రా...! అలా కొట్టుకోకూడదంటూండేవి.


కొత్తగా వచ్చిన రెక్కలతో
ఆ పసిపిట్టలు ఎగిరే సాధన అంతా
ఇంట్లో మా పర్యవేక్షణలోనే జరిగేది
ఎగరటం వచ్చాకా ఇంక అంతే
మరి కనిపించేవే కావు, యూ ఎస్ కెళ్ళిన పిల్లల్లా.


ఏ రెండు పిచ్చుకలో మరి కొన్నాళ్ళు
నిరాసక్తంగా, అయిష్టంగా ఎగిరేవి
మళ్ళీ జోడు కట్టి కొత్త సంసారం మొదలెట్టేవరకూ.


గూడు కోసం ఏరుకొచ్చే పుల్లా పుడకా
పొరపాటున జారిపడి నీచు కంపుకొట్టే గుడ్లు
మధ్యాహ్నం నిద్రపోనీకుండా అవి చేసే అల్లరి
ఎందుకో మరి ఎప్పుడూ చికాకనిపించేలేదు.


ఎంత మొద్దు నిద్దర పోయామో తెలియదు
ఓరోజు మెలకువ వచ్చేసరికి
ఓ బుల్లి పిచ్చుక ప్రేమగా నన్ను
చుట్టుకోవాలనుకుందేమో మరి
నేనటూ ఇటూ మత్తుగా దొర్లినపుడు
నా శరీరం కింద నలిగి నిర్జీవంగా పడుంది....


అంతే అదే ఆఖరుసారి నే పిచ్చుకని చూడటం.
ఆ పిచ్చుకకి పెట్టిన దినమట
ఈరోజు పేపర్లో ఫొటోతో సహా చూస్తే
గుర్తొచ్చిన పిచ్చుక జ్ఞాపకాలు .....
ఎందుకు విచారం నేచూపిస్తానీ పిచ్చుకని అంటూ
అరచేతిలో వాలింది ఓ బుల్లి అస్త్రం
అదే పిచ్చుక మీద మనుష ప్రపంచం వేసిన బ్రహ్మాస్త్రం.

 

పిచ్చుక జ్ఞాపకం ..... వర్ధిల్లాలి.


 

- శారద శివపురపు